Gurukula Schools | తెలంగాణ తొలి ప్రభుత్వం గురుకుల విద్యాలయాలకు శ్రీకారం చుట్టి వాటిని దేశానికే ఆదర్శంగా నిలిపింది. గత ప్రభుత్వం చేసిన పనిని కొనసాగించేందుకు నిర్లక్ష్యం వహిస్తే అది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల నుంచి తీవ్ర నిరసనను ఎదుర్కోవాల్సి వస్తుంది. పరాయి పాలకులు తెలంగాణ రాష్ట్ర అవతరణకు ముందు ప్రభుత్వ స్కూళ్లను నిర్వీర్యం చేసి కార్పొరేట్ విద్యావ్యవస్థను పటిష్టం చేశారు. చదువును ఖరీదైన వస్తువుగా మార్చటంతో అది బహుజనవర్గాల బిడ్డలకు తీరని నష్టం చేసింది. ఆ నష్టాన్ని పూడ్చుతూ గత కేసీఆర్ ప్రభుత్వం 1,100 గురుకులాలు నెలకొల్పటంతో బహుజన వర్గాల బిడ్డలకు కార్పొరేట్ స్థాయి విద్య అందింది. తద్వారా బహుజన వర్గాల బిడ్డలు ర్యాంకులు కొట్టే దశకు వచ్చారు. 10వ తరగతి, ఇంటర్లలో గురుకుల విద్యార్థుల ఫలితాలు ఊహించని విధంగా పెరిగాయి.
కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన ప్రజోపకరమైన పనులను, సంక్షేమ పథకాల పేర్లను మార్చివేయాలనో లేదా రద్దు చేయాలనో చూడటం అప్రజాస్వామికం. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్యను పరిశీలిస్తే 95 శాతానికి పైగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులున్నారు. ఇందులో బీసీ విద్యార్థులు 60 శాతంగా ఉన్నారు. రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ తీసిన లెక్కల ఆధారంగా చూస్తే రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థులు అత్యధిక శాతం బహుజన, దళిత, మైనారిటీ, గిరిజన, ఆదివాసీ వర్గాలకు చెందినవారేనని ప్రభుత్వ గణాంకాలు చెప్తున్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల సంఖ్య 60,77, 070 కాగా, ఇందులో జనరల్ విద్యార్థులు 13,54,516 మంది, ఎస్సీ వర్గాల పిల్లలు 10,41,747 మంది, ఎస్టీ 6,74,618 మంది, బీసీలు 30,06,189 మంది ఉన్నారు. మొత్తం 60 లక్షల మందికి పైగా ఉన్న విద్యార్థులలో సగం మంది విద్యార్థులు బీసీలే అని సర్వశిక్షా అభియాన్ ఇచ్చిన లెక్కల ద్వారా తెలుస్తున్నది. 2022 లెక్కల ప్రకారం రాష్ట్రంలో మొత్తం ఉపాధ్యాయుల సంఖ్య 2,98,983 మంది ఉంటే, ఇందులో జనరల్ క్యాటగిరిలో మొత్తం 1,02,326 మంది, ఎస్సీ 39,645, ఎస్టీ 21,699, బీసీ(ఏ) 17,411, బీసీ (బీ) 56,838, బీసీ (సీ) 4,143, బీసీ (డీ) 41,951, బీసీ(ఈ) 14,970 మంది ఉన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన టీచర్లు మొత్తం 1,96,657 మంది ఉంటే జనరల్ క్యాటగిరీ కింద టీచర్లు 1,02,326 మంది ఉన్నారు. ఈ లెక్కన రాష్ట్రంలో 90 శాతంగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల టీచర్ల ప్రాతినిథ్యం పెరగవలసి ఉన్నది. బీసీలకు జనాభా దామాషా పద్ధతిలో రిజర్వేషన్లు కేటాయిస్తే బీసీ ఉపాధ్యాయుల సంఖ్య మరింతగా పెరుగుతుంది. ఇందులో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులంతా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల వాళ్లేనని ప్రభుత్వ లెక్కలు తేల్చిచెప్తున్నాయి.
గత కేసీఆర్ ప్రభుత్వం విదేశాల్లో చదివే బీసీ బిడ్డలకు రూ.20 లక్షలను మహాత్మా ఫూలే ఓవర్సీస్ స్కాలర్షిప్ ద్వారా అందించింది. ఇలా ఇంతకుముందు ఏ ప్రభుత్వమూ చేయలేదు. అలాగే దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఉన్నత విద్యనభ్యసిస్తున్న బీసీ విద్యార్థులకు ఎస్సీ, ఎస్టీ, విద్యార్థుల వలె పూర్తి ఫీజులు చెల్లించే పద్ధతికి కేసీఆర్ శ్రీకారం చుట్టారు. విద్యాహక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలుచేస్తూ ప్రైవేట్ విద్యాసంస్థల్లో 25 శాతం అడ్మిషన్లు ఉచితంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, విద్యార్థులకు కల్పించాలి. ఫీజుల నియంత్రణ చట్టం తీసుకువచ్చి కార్పొరేట్ విద్యాసంస్థల దోపిడీని అరికట్టేందుకు ప్రభుత్వం కృషిచేయాలి. కేసీఆర్ దార్శనిక ఆలోచనలతో నెలకొల్పిన బీసీ గురుకులాలకు శాశ్వత భవనాలను నిర్మించే పనిని యుద్ధ ప్రాతిపదికపై చేపట్టాలి.
-జూలూరు గౌరీశంకర్