ప్రజాపాలన తెస్తామని ఎన్నికలకు ముందు చెప్పిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటూ విద్యారంగాన్ని సంక్షోభంలోకి నెట్టివేస్తున్నది. రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న సుమారు 30 వేలకు పైగా పాఠశాలల్లో వసతులు కల్పించి, వాటిని అభివృద్ధి చేయకుండా నియోజకవర్గానికో ఇంటర్నేషనల్ స్కూల్ స్థాపిస్తామని, మండలానికో సమీకృత గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేస్తామంటూ కాలయాపన చేస్తున్నది. అంతేకాదు, రాష్ట్రంలోని 17 ప్రభుత్వ యూనివర్సిటీలను సమగ్రంగా అభివృద్ధి చేయకుండా స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ అంటూ విద్యా వ్యతిరేక ప్రచారార్భాటం చేస్తున్నది.
Telangana | కాంగ్రెస్ సర్కార్ చర్యల వల్ల అట్టడుగు కులాలు, వర్గాల విద్యార్థులు విద్యకు దూరమయ్యే ప్రమాదం పొంచి ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వ చర్యలు సర్కారీ విద్యను ఎంతవరకు బలోపేతం చేయగలదో పరిశీలించేముందు కేంద్ర ప్రభుత్వం విద్యా విధానాలు ఎలా ఉన్నాయో సంక్షిప్తంగా చూద్దాం. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రజాస్వామిక సెక్యులర్ రాజ్యం స్థానంలో హిందూ మతం పేరిట మతోన్మాద రాజ్యాన్ని స్థాపించడానికి జాతీయ విద్యా విధానాన్ని తీసుకొచ్చింది. అందులో భాగంగా ఎన్టీయే లాంటి కేంద్రీకృత పరీక్షలకు ఆమోదముద్ర వేసి, పేపర్లు లీకు చేయడం, అమ్ముకోవడాన్ని ప్రోత్సహిస్తున్నది. తద్వారా 24 లక్షలకు పైగా విద్యార్థులకు అన్యాయం జరిగింది. 2014 బడ్జెట్లో విద్యారంగానికి మోదీ సర్కార్ ఆరు శాతం నిధులను కేటాయించగా.. 2024 నాటికి అవి 2.5 శాతానికి పడిపోయాయి. పాఠ్యాంశాల నుంచి డార్విన్ జీవపరిణామ సిద్ధాంతం, పీరియాడిక్ టేబుల్, మొఘలుల చరిత్రను తొలగించడం, గాంధీజీని చంపిన గాడ్సే పాఠాన్ని వక్రీకరించడం లాంటి చర్యలు శాస్త్రీయ దృక్పథాన్ని, హేతుబద్ధతను తుదముట్టించడమే. పాఠశాల విద్యను 5+3+3+4 పద్ధతిలో వ్యవస్థీకరించి, పాఠశాల విద్యావ్యవస్థను, పాఠ్య ప్రణాళికను బీజేపీ సర్కార్ ధ్వంసం చేస్తున్నది. ఇటువంటి దుష్పరిణామాలకు దారితీసిన జాతీయ విద్యా విధానం పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఒక విధానమంటూ లేకపోవడం శోచనీయం.
ప్రజా పాలన పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం మూస ధోరణిని అవలంబిస్తున్నది. విద్యారంగానికి బడ్జెట్లో 15 శాతం నిధులు కేటాయిస్తామని మ్యానిఫెస్టోలో ప్రకటించి, ఇప్పుడు 7.3 శాతమే కేటాయించింది. విద్యారంగానికి తమిళనాడులో 13.4 శాతం, కర్ణాటకలో 12.9 శాతం, కేరళలో 14.8 శాతం, ఏపీలో 12.6 శాతం నిధులు కేటాయించారు.
ఒక్క పాఠశాలనూ మూసివేయమని ప్రకటించి, మూసివేతలను నిరాటంకంగా కొనసాగిస్తున్నది. సరిపడా తరగతి గదు లు, సబ్జెక్టుకో ఉపాధ్యాయుడు, మరుగుదొడ్లు నీటి సౌకర్యం లేక పాఠశాలలు నిర్వీర్యమైపోతున్నాయి. 2022-23 విద్యాసంవత్సరంలో దాదాపు 8,500 పాఠశాలల్లో 20 మంది కం టే తక్కువ విద్యార్థులున్నారు. 1864 పాఠశాలల్లో విద్యార్థులే లేరు. విద్యార్థుల సంఖ్య ఎందుకు తగ్గిపోతుందో అధ్యయనం చేయకుండా, సమస్యలకు పరిష్కారాలను కనుక్కోకుండా విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందని సాకు చెప్తూ పాఠశాలలను మూసివేస్తుండటం దారుణం. రాష్ట్రంలో ఒకే గది ఉన్న పాఠశాలలు 3,620, ఒకే టీచర్ ఉన్న పాఠశాలలు 4,984 ఉన్నట్టు తెలుస్తున్నది. జీవో నెంబర్ 25 ప్రకారం.. 60 మం ది విద్యార్థులకు ఇద్దరే ఉపాధ్యాయులను కేటాయిం చి పాఠశాలలను కాంగ్రెస్ సర్కార్ మూసివేస్తున్నది. రాష్ట్రంలో 523 మండలాల్లో మండల విద్యాశాఖాధికారులు లేరు. 64 డిప్యూ టీ జిల్లా విద్యా అధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 8 జిల్లా విద్యా శాఖాధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఉపాధ్యాయులను తయారుచేసే డైట్ కళాశాలల్లో 189 ఖాళీలున్నాయి. అకడమిక్ క్యాలెండర్, పాఠ్యాంశాలను తయారుచేసే ఎస్సీఈఆర్టీలో 94 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్న పాఠశాలల ను పటిష్ఠపరచకుండా నియోజకవర్గానికో ఇంటర్నేషనల్ స్కూ ల్ స్థాపిస్తామని పాలకులు అంటుండటం విడ్డూరం. ఐదు రకాల గురుకులాలతో పాటు, ఆదర్శ, కేజీబీవీ పాఠశాలలకు తోడు ఇంటర్నేషనల్ స్కూల్ మరొక అంతరాల దొంతర కాబోతున్న ది. అంతేకాకుండా, సమీకృత రెసిడెన్షియల్ పాఠశాలలను పట్టణాలకు తీసుకురావడం, ఒకే ప్రాంగణంలో కులాలవారీగా స్కూళ్లను నిర్మించడం, 1-3 తరగతులకు ప్రీ ప్రైమరీ శిక్షణ పొందిన ఉపాధ్యాయులను నియమించకుండా అంగన్వాడీలలో కలపడం, పాఠశాల యాజమాన్య కమిటీ(ఎస్ఎంసీ)ల స్థానంలో అమ్మ ఆదర్శ పాఠశాలలను తీసుకురావడం లాంటి చర్యలు కొత్త సమస్యలను తీసుకొస్తున్నాయే తప్ప ఉన్న సమస్యలను పరిష్కరించవు. నూతన విద్యా విధానం మీద ఎటువంటి అభిప్రాయాన్ని వెల్లడించకుండానే ఇంటర్మీడియట్ తరగతులను సెకండరీ విద్యలో, ప్రాథమిక తరగతులను అంగన్వాడీలో విలీనం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది.
అలాగే ఉన్నత విద్యలో ప్రభుత్వ రంగంలో ఉన్న 7 సంప్రదాయ, 10 ప్రత్యేక విశ్వవిద్యాలయాలతో కలిపి మొత్తం 17 స్టేట్ యూనివర్సిటీలను, 4,036 కాలేజీలను సమగ్రంగా అభివృద్ధి చేయకుండా భూకబ్జాదారులకు, విద్యా వ్యాపారులకు, కంపెనీలకు ప్రైవేటు యూనివర్సిటీలు ఏర్పాటు చేసుకోవడానికి అనుమతులు ఇచ్చారు. ప్రభుత్వ రంగంలో కాకుండా ప్రభుత్వ- ప్రైవేటు భాగస్వామ్యం పద్ధతిలో 50 ఎకరాల భూమిలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వ యూనివర్సిటీల్లో రెండు వేలకు పైగా ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. యూనివర్సిటీ వసతి గృహాలు అధ్వానంగా ఉన్నాయి. బాసర ట్రిపుల్ ఐటీ సంక్షోభంలో కూరుకుపోయింది. అధ్యాపకులు లేక విద్యాబోధన కునారిల్లింది. మారుతున్న సాంకేతిక పరిశోధనలకు అనుగుణంగా సిలబస్‌ను మార్చలేదు. ప్రభుత్వ కళాశాలలు, విశ్వవిద్యాలయాలను అభివృద్ధి చేయడంలో ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇది తార్కాణం.
ప్రస్తుతమున్న యూనివర్సిటీలు, పాలిటెక్నిక్ కళాశాలలు, ఐటీఐలను సమగ్రంగా అభివృద్ధి చేసి విద్యార్థులకు నైపుణ్యాలు నేర్పవచ్చు. అలా చేయకుండా కొత్తగా స్కిల్ యూనివర్సిటీ స్థాపించడమెందుకు? అక్కడ 30 వేల మందికి స్కిల్స్ నేర్పిస్తున్నట్టు చెప్తున్నారు. ముఖ్యమంత్రి విదేశీ పర్యటనలో భాగంగా 19 విదేశీ కంపెనీలు హైదరాబాద్‌కు రాబోతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఆయా బహుళ జాతి కంపెనీలకు నైపుణ్యం కలిగిన, తక్కువ జీతానికి పనిచేసే కార్మికులను తయారు చేయడానికే ఈ స్కిల్ యూనివర్సిటీని స్థాపించారా? అనే అనుమానం కలుగుతున్నది. ఈ యూనివర్సిటీలో సిబ్బంది నియామకం, అడ్మిషన్లలో రిజర్వేషన్లు పాటిస్తారా? ఫీజులు ఎంత ఉంటాయి? తదితర వివరాలు ఇంకా అధికారికంగా తెలియవలసి ఉన్నది.
జిల్లాకో వైద్య కళాశాలలను ఏర్పాటు చేసే కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే రాష్ట్రంలో 27 ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రారంభమయ్యాయి. వాటిలో సరిపడా అధ్యాపకులు లేకపోవడంతో ఏటా ఎన్ఎంసీ అనుమతులు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. 28 ప్రైవేటు వైద్య కళాశాలల్లో బోధకులు లేకపోవడంతో విద్యార్థులకు నాణ్యమైన వైద్యవిద్య అందడం లేదు. అంతేకాదు, డీమ్డ్ యూనివర్సిటీ పేరిట మెడికల్ కాలేజీల నిర్వహణ వల్ల పేద, వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు, కన్వీనర్ కోటా సీట్లు తగ్గిపోయి, పేద విద్యార్థులకు అన్యాయం జరిగే ప్రమాదం ఉంది. యూజీసీ నిర్వాకం వల్ల బలహీనవర్గాలకు చెందిన మెరిట్ విద్యార్థులకు తీరని అన్యాయం జరగనున్నది.
వాస్తవానికి, తెలంగాణలో 30 లక్షలకు పైగా ఉన్న నిరుద్యోగులు ఏయే స్థాయి వరకు చదువుకున్నారు? వారికి ఏయే నైపుణ్యాలు నేర్పగలం? అనే సమాచారం ఎక్కడా లేదు. ప్రభుత్వానికి గాని, కంపెనీలకు గాని ఈ నిరుద్యోగులకు ఏ రకమైన నైపుణ్యాలు అందించాలనే విషయంపై స్పష్టత లేదు. ఇటువంటి పరిస్థితుల్లో హైదరాబాద్‌కు వచ్చే దేశ, విదేశీ కంపెనీలకు కావలసిన ఉద్యోగుల కోసమే రాష్ట్రంతో సంబంధం లేకుండా అందరికీ నైపుణ్యాలు నేర్పించడానికే ఈ స్కిల్ యూనివర్సిటీ వస్తున్నట్టుగా తెలుస్తున్నది. నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెగించి కొట్లాడిన తెలంగాణ నిరుద్యోగ యువతీయువకుల కోసం కాదని, దాని పేరు ద్వారా తెలుస్తున్నది. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అన్నారే గాని, యంగ్ తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ అని పేరు పెట్టలేదు.
పాఠశాల స్థాయి నుంచి అన్ని వసతులతో కూడిన వ్యాయామ విద్య లేకుండా స్పోర్ట్స్ యూనివర్సిటీని స్థాపించడం అర్థరహితం. రాష్ట్రంలోని వేలాది ప్రభుత్వ పాఠశాలలకు ఆటస్థలాలు లేవు. క్రీడా సామాగ్రి అందుబాటులో లేదు. అన్ని పాఠశాలల్లో వ్యాయామ ఉపాధ్యాయుల పోస్టులు మంజూరు కాలేదు. అసలు చాలా ప్రైవేట్ పాఠశాలలకు ఆటస్థలాలే లేవు. అటువంటి పరిస్థితుల్లో స్పోర్ట్స్ యూనివర్సిటీని స్థాపిస్తామనడం పునాది లేకుండా భవనం నిర్మించడమే.
కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన నాటినుంచి గత తొమ్మిది నెలల్లో విద్యారంగంలో వచ్చిన, వస్తున్న మార్పులు ప్రభుత్వ విద్యను బలహీనపరిచేలా ఉన్నాయి. పేదలకు, మధ్యతరగతికే కాకుండా, ఎగువ మధ్య తరగతికి కూడా విద్యను దూరం చేసే విధంగా ఉన్నాయి. వీటి వల్ల అభ్యసన సంక్షోభం ఇంకా తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. విద్యారంగానికి పొంచిఉన్న ప్రమాదాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు గ్రహించాలి.
(విద్యారంగ సమస్యలపై తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ నేడు హైదరాబాద్‌లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్న సందర్భంగా)
(వ్యాసకర్త: పూర్వ అధ్యక్షులు, ఏపీటీఎఫ్)
-కె.వేణుగోపాల్
98665 14577