‘కర్మభూమి మీద కార్యదక్షులై వర్ధిల్లండి. కానీ, జన్మభూమి రుణం తీర్చుకోండి. తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి. రాష్ట్రంలో ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నదని చూడకండి. మీరు పుట్టిన గడ్డ తెలంగాణ అనే విషయాన్ని మర్చి పోకండి’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డాలస్లో తెలం గాణ ఎన్నారైలకు పిలుపునిచ్చారు. ఏ పార్టీ ఉన్నదని చూడకుండా పెట్టు బడులు పెట్టాలని పిలుపునివ్వడం ద్వారా ఆయన తన రాజనీతిజ్ఞతను, తెలంగాణ పట్ల తనకున్న ప్రేమను, బాధ్యతను చాటుకున్నారు.
2025, జూన్ 2 తెలంగాణ అవతరణ దినోత్సవం వేళ కేటీఆర్ అగ్ర రాజ్యం అమెరికాలోని డాలస్ వేదికగా రాష్ట్ర వైభవాన్ని యావత్ ప్రపం చానికి చాటిచెప్పారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డనాడు ఉన్న పరిస్థితి నుంచి రాష్ట్రం ఒక ఫీనిక్స్ పక్షి వలె ఎలా అభివృద్ధి దిశలో దూసుకువెళ్లిందో అన్ని గణాంకాలతో సహా కేటీఆర్ వివరించారు. ఎక్క డా ఆయన రాజకీయ విమర్శలకు దిగలేదు. ఆరోపణలు చేయలేదు. కేవలం తెలంగాణ అభివృద్ధే ఎజెండాగా ఆయన తన ప్రసంగాన్ని సాగిం చారు. ‘ఏ దేశమేగినా.. ఎందుకాలిడినా.. పొగడరా నీ తల్లి భూమి భారతిని అని’ ఓ కవి చెప్పినట్టుగా.. ఏ దేశమేగినా తెలంగాణ గడ్డను మర్చిపోవద్దని కేటీఆర్ ఎన్నారైలకు పిలుపునిచ్చారు. తెలంగాణ అభివృద్ధికి ఎన్నారైల అవసరం ఎంతో ఉన్నదని నొక్కిచెప్పారు.
భౌతికంగా వారు తెలంగాణకు రాలేకపోయినా.. వారి విజ్ఞానం, ఆలోచనలు, వారు పెట్టే పెట్టుబడులు తెలంగాణను దేశంలోనే అగ్ర రాష్ట్రంగా నిలబెడుతాయని వారి అవశ్యకతను చాటిచెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఎన్నారైలు పోషించిన పాత్ర మరువలేనిదని గుర్తుచేశారు. ఇక ముందు కూడా వారి పాత్ర అలాగే కొనసాగాలని కోరారు. ఎన్నారైలు అంటే నాన్ రెసిడెంట్ ఇండియన్స్ కాదని, ఎన్నారైలు అంటే ‘నెసెసరి రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా’ అనే కొత్త నిర్వచనం ఇచ్చారు. తెలంగాణ ఎన్నారైలంతా రత్నాలని, భరతమాత ముద్దుబిడ్డలని కొనియాడారు. రాష్ట్ర సరిహద్దుల్లో మనం ఉంటే తెలంగాణ ప్రజలమని, రాష్ట్ర సరిహద్దు దాటితే తెలుగువాళ్లమని, దేశ సరిహద్దులు దాటితే భారతీయులం అని చెప్పిన కేటీఆర్ తన విశాల దృక్పథాన్ని చాటుకున్నారు.
ఎన్నారైలను పెట్టుబడులు పెట్టాలని కోరడమే కాకుండా, వారు ఎదుర్కొంటున్న సమస్యలను కేటీఆర్ ప్రస్తావించారు. ముఖ్యంగా ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక అమెరికాలో భారతీయ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. విద్యార్థుల కోసం అవసరమైతే బీఆర్ఎస్ పార్టీ తరపున ప్రత్యేకంగా ఒక లీగల్ సెల్ ఏర్పాటు చేస్తామని, ఇది భారతీయ విద్యార్థులందరికీ సాయం చేస్తుందన్నారు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి తమ పిల్లలను చదువుల కోసం అమెరికాకు పంపించారని, దీన్ని విద్యార్థులంతా మర్చిపోవద్దని కోరారు. కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని, తను కూడా అవసరమైన సాయం చేస్తానని భరోసా ఇచ్చారు.
ఎంతో హుందాగా సాగిన కేసీఆర్ ప్రసంగానికి ఎన్నారైలంతా మంత్రముగ్ధులయ్యారు. ఆయన ప్రసంగం ఆసాంతం చప్పట్లు కొడుతూ తమ మద్దతు ప్రకటించారు. వాస్తవానికి కేటీఆర్ ఎక్కడా రాజకీయ కోణంలో ప్రసంగాన్ని సాగించకపోయినా అక్కడ ఎన్నారైలు మాత్రం కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారని కేటీఆర్ అన్న సమయంలో గట్టిగా అరుస్తూ, చప్పట్లు కొట్టారు. ఈలలు వేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఓట్ల సమయంలోనే ప్రజల వద్దకు వెళ్లే రాజకీయ నాయకులున్న ఈ కాలంలో ఎక్కడో సప్త సముద్రాల ఆవల ఉన్న తెలంగాణ ప్రజలను గుర్తు పెట్టుకొని మరీ వారి వద్దకు వెళ్లి, వారి సేవలను గుర్తించి, వారి సాయం కోరి, వారికి మేమున్నామనే భరోసా అందించడం అనేది వర్తమాన రాజకీయాల్లో నిజంగా కొత్త ఒరవడే.
– శ్రీధర్ ప్రసాద్, 95054 05950
(వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్టు)