ఎనభయ్యవ దశకంలో ఇద్దరు నాయకుల పేర్లు అంతర్జాతీయంగా మార్మోగేవి. ఒకరు, అమెరికా అప్పటి అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్. రెండు, బ్రిటన్ ప్రధాని మార్గరెట్ థాచర్. ఇద్దరూ సోవియట్ మహా సామ్రాజ్యం పతనానికి అలుపు లేకుండా పనిచేశారు. వామపక్ష విధానాలకు వ్యతిరేకులు, వాణిజ్య వర్గాలకు అనుకూలురు. వారిద్దరి పేర్ల మీదనే రీగనామిక్స్, థాచరిజం అనే సైద్ధాంతిక ధోరణులు ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఇప్పుడు ఆ రెండింటి కలగలుపుగా ట్రంపిజం ముందుకువస్తున్నది. ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ నూతన ధోరణికి కారకుడని విడమరచి చెప్పాల్సిన పనిలేదు. ట్రంప్ మాటకారి. మంచి వ్యాపారి. రెండో విడత గెలిచి నెల రోజుల క్రితం అగ్రరాజ్యం పగ్గాలు చేపట్టిన తర్వాత ఆయన ప్రపంచ దేశాలకు చుక్కలు చూపిస్తున్నారు.
ట్రంప్ హయాంలో అంతర్జాతీయ నీతి సూత్రాలు, దౌత్య మర్యాదలు గాలిలో కలిసిపోయాయి. నిన్నటిదాకా ఒక ప్రభుత్వాధినేత, అందునా అమెరికా వంటి అగ్రరాజ్యాధినేత ఈ తరహాలో మాట్లాడగలరా? అంటే లేదనే సమాధానం వచ్చేది. కానీ, ఇప్పుడు సీన్ మారింది. అరమరికలు లేవు, దాపరికాలు అసలే లేవు. దేశాలకు ఉండే సార్వభౌమాధికారాలను ట్రంప్ తీసికట్టు అంటున్నారు. మెక్సికో సింధు శాఖ పేరు అమెరికా సింధు శాఖగా ఆయన ఒక్క కలం పోటుతో మార్చేశారు. కెనడా మా దేశంలో 51వ రాష్ట్రంగా చేరాలనడం ఆయనకే చెల్లింది. గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు అప్పగించాలని హాలండ్‌కు తాకీదు జారీచేయడం ఆయనకే చాతనైంది. కొన్నాళ్లు ఫర్మానాలు ఎడా పెడా జారీచేశారు. ఇప్పుడు సంతకాలు చేసే ఓపిక కూడా లేదేమో, నా మాటే శాసనం అంటున్నారు. తాజాగా ఆయన ఉక్రెయిన్ మీద పడ్డారు. అంతర్జాతీయ భద్రత, వనరులపై ఆధిపత్యం వంటి కీలక అంశాలు ముడిపడి ఉన్న ఈ విషయంపై తనదైన ధోరణిలోనే దూకుడుగా వెళ్తున్నారు. యుద్ధాన్ని ముగించాలనేది సదాశయమే కానీ, ఆ దిశగా ట్రంప్ వేస్తున్న అడుగులు ఆందోళన కలిగిస్తున్నాయి.
డోనాల్డ్ ట్రంప్ శాంతి ప్రతిపాదనల్లో నాలుగు ప్రధానాంశాలున్నాయి. మొదటిది, రష్యా 2014 నుంచి ఆక్రమించిన భూ భాగాలను ఉక్రెయిన్‌కు వదులుకోవడం. ప్రస్తుత యుద్ధంలో ఆక్రమించుకున్నవి కూడా ఇచ్చేయాలంటున్నారు. రెండోది, రష్యా-ఉక్రెయిన్ మధ్య నిస్త్రనిక మండలం ఏర్పాటు. దీని పర్యవేక్షణ బాధ్యత నాటోకు ఇవ్వకుండా యూరప్ దేశాలకు అప్పగించవచ్చు. మూడోది, నాటోలో చేరే ప్రయత్నాలను ఉక్రెయిన్ మానుకోవడం. నాలుగోది, అమెరికా-ఉక్రెయిన్ వాణిజ్య ఒప్పందంలో భాగంగా ఉక్రెయన్‌లోని లక్షల కోట్ల ఖనిజ సంపదను అమెరికాకు అప్పగించడం. జాతీయ ప్రభుత్వాలు భూ భాగాలను వదులుకొనేందుకు ఒప్పుకోవనేది తెలిసిందే. ఇక యుద్ధం మొదలైందే నాటోలో చేరికపై. ఆ ఒక్క కారణం మీదనే రష్యా దాడికి తెగబడటంతో ఉక్రెయిన్ మరుభూమిగా మారింది. లిథియం వంటి కీలక ఖనిజాలు ఉక్రెయిన్‌లో దండిగా ఉన్నాయి. ఇన్నాళ్లూ అందించిన సాయానికి బదులుగా ఆ సంపదనంతటినీ అమెరికాకు ధారాదత్తం చేయాలంటున్నారు ట్రంప్. ఇవన్నీ తాఖీదుల రూపంలోనే వెలువరించారాయన. పైగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని బహిరంగంగా అవమానించారు. ఆయన ఓ నాసిరకం కమేడియన్ అన్నట్టుగా మాడ్లాడారు. జెలెన్స్కీ యుద్ధం మొదలుపెట్టారన్నారు. ఎన్నికలు జరుపకుండా అధికారంలో కొనసాగుతున్న నియంత అని మండిపడ్డారు. జెలెన్ స్కీ పాపులారిటీ రేటింగ్‌లో అట్టడుగున ఉన్నారని ఎద్దేవా చేశారు.
యుద్ధసాయం పేరిట అమెరికాను పీల్చి పిప్పి చేశారని, అందుకు బదులుగానే ఖనిజ సంపదను అప్పగించాలని బేరం పెట్టారు. పైగా అమెరికా-రష్యా మధ్య జరిగిన శాంతి చర్చలకు యుద్ధబాధిత ఉక్రెయిన్ను పిలవకపోవడం కొట్టొచ్చినట్టు కనిపించే అంశమని చెప్పాలి. ఇక నాటో అనవసరమనే ధోరణిలో ట్రంప్ మాట్లాడటం యూరోపియన్ దేశాలకూ మింగుడు పడటం లేదు. అమెరికాతో ప్రమేయం లేకుండానే ఉక్రెయిన్‌కు సైనిక సాయం అందించాలని అవి తీర్మానించుకోవడం మరో మలుపు. ట్రంప్ మధ్యవర్తిత్వంలో ఉక్రెయిన్‌లో శాంతి ఎప్పుడు, ఎలా నెలకొంటుందనే విషయమై స్పష్టత ఏదీ లేదు. రష్యా ఎంతవరకు, ముఖ్యంగా వనరుల విషయంలో, కలసి వస్తుందనేది పెద్ద ప్రశ్న. ట్రంప్ వ్యాపారంలో దిట్ట కావచ్చు. కానీ, రియల్ ఎస్టేట్ డీల్స్ కుదుర్చుకున్నంత సులభంగా యుద్ధాలకు పరిష్కారం కనుగొని అమలుచేయడం సాధ్యం కాదని ఆయన తెలుసుకోవడం మంచిది.