తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత మొదటి దశలో కనిపించిన అభివృద్ధి నమూనా దేశవ్యాప్తంగా చర్చకు వచ్చింది. ‘సంపద పెంచుదాం ప్రజలకు పంచుదాం’ అనే నినాదంతో ప్రారంభమైన పాలన ప్రజా కేంద్రక ఆర్థిక విధానానికి ఒక కొత్త దిశను సూచించింది.
ఈ విధానంలో ముఖ్య లక్ష్యం- సంపద సృష్టి మాత్రమే కాకుండా, ఆ సంపదను సమాజంలోని వివిధ వర్గాల మధ్య పంచడం.
రాష్ట్రం ఏర్పడిన 2014 సమయంలో తెలంగాణ ఎదుర్కొన్న ప్రధాన సమస్యలు స్పష్టంగా కనిపించేవి. సాగునీటి కొరత, మౌలిక వసతుల లోపం, ఉపాధి అవకాశాల కొరత, వ్యవసాయ సంక్షోభం. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు ఆ సమస్యలకు పరిష్కారాలను చూపేలా రూపుదిద్దుకున్నాయి. చెరువుల పునరుద్ధరణ, సాగునీటి ప్రాజెక్టులు, గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధి, రైతులకు పెట్టుబడి సాయం, సామాజిక భద్రత వంటి పథకాలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో కొత్త చైతన్యాన్ని తీసుకువచ్చాయి. ఈ మార్పు ఆర్థిక గణాంకాల్లో కూడా ప్రతిఫలించింది. 2014లో సుమారు రూ.5 లక్షల కోట్లుగా ఉన్న తెలంగాణ స్థూల రాష్ట్ర ఉత్పత్తి (జీఎస్డీపీ) 2023-24 నాటికి రూ.15.2 లక్షల కోట్లకు పైగా పెరిగింది. రాష్ట్ర తలసరి ఆదాయం కూడా జాతీయ సగటును మించిపోయి సుమారు రూ.3.87 లక్షలకు చేరింది. దేశంలో వేగంగా ఎదిగిన రాష్ర్టాల్లో తెలంగాణ ఒకటిగా నిలిచింది.
వ్యవసాయ రంగంలో కూడా గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. వరి ఉత్పత్తి కొన్ని ఏండ్లలోనే గణనీయంగా పెరిగింది. భూగర్భ జలాల స్థాయులు మెరుగయ్యాయి. చెరువుల పునరుద్ధరణతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఒక స్థిరత్వం ఏర్పడింది. ఉపాధి విషయంలో కూడా ప్రభుత్వం సుమారు 1.61 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసింది. మరో దశలో 70 వేల సంఖ్యలో నియామక ప్రక్రియలు ప్రారంభమయ్యాయి.
ఈ పరిణామాల నేపథ్యంలో ఒకప్పుడు దేశవ్యాప్తంగా ప్రచారం పొందిన ‘గుజరాత్ మాడల్’ అనే నీటి బుడగను దాటి ‘తెలంగాణ మాడల్’ అనే అభివృద్ధి నమూనా చర్చకు వచ్చింది. ఈ నమూనాలో ముఖ్య లక్షణం ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధిని సాధించడం. ‘తెలంగాణ మాడల్’ లోని ముఖ్యమైన స్కీమ్ కేంద్రంతో పాటు ఇతర రాష్ర్టాలు ఆచరించే స్థాయిలో తెలంగాణ ప్రతిభను చూపింది కేసీఆర్ సారథ్యంలోనే. ఈ అభివృద్ధి విధానంలో మరో ముఖ్య అంశం ప్రభుత్వ రంగ సంస్థలకు ఇచ్చిన ప్రాధాన్యం. దేశవ్యాప్తంగా ప్రైవేటీకరణ పెరుగుతున్న సమయంలో కూడా తెలంగాణలో ప్రభుత్వ రంగ సంస్థలను అభివృద్ధి భాగస్వాములుగా ఉపయోగించే ప్రయత్నం జరిగింది. బీఎచ్ఈఎల్, నాబార్డ్, ఎల్ఐసీ, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, సింగరేణి వంటి సంస్థలు రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషించాయి.
ప్రభుత్వ రవాణా సంస్థ అయిన టీఎస్ఆర్టీసీని కూడా కొత్త రంగాల్లోకి విస్తరించారు. ప్రయత్నం జరిగింది. కార్గో సేవలు ప్రారంభించడం ద్వారా సంస్థకు కొత్త ఆదాయ మార్గాలను సృష్టించారు. అదే విధంగా దేశంలో పెరుగుతున్న వంటనూనె దిగుమతులను తగ్గించాలనే లక్ష్యంతో ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించడం, సిద్దిపేటలో ప్రభుత్వమే ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ పెట్టడం అది పూర్తయి ప్రారంభానికి సిద్దంగా ఉండటం మన ప్రత్యక్ష అనుభవాలు. అయితే ఇటీవల కాలంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రెండేండ్లుగా పరిపాలనలో స్పష్టత లేకపోవడం, నిర్ణయాల్లో సమన్వయం లోపించడం, ఆర్థిక వనరుల వినియోగంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అర్హతకు మించిన అప్పులు చేయడం, చేసిన అప్పులతో ఉత్పాదకత వైపు నడిచి రాష్ట్ర ఆదాయాన్ని మెరుగుపరచుకోలేకపోవటం. ప్రజల భాగస్వామ్యంతో ముందుకు సాగిన డిస్ట్రిబ్యూటివ్ ఎకానమీ క్రమంగా డిస్టర్బ్ ఎకానమీగా మారే ప్రమాదం ఉన్నదనే ఆందోళన వ్యక్తమవుతున్నది. గత దశాబ్దంలో ఏర్పడిన బలమైన ఆర్థిక పునాది కారణంగా వ్యవస్థ ఇప్పటికీ నిలబడుతున్నప్పటికీ, సరైన విధాన నిర్ణయాలు లేకపోతే దీని ప్రభావం భవిష్యత్తులో స్పష్టంగా కనిపించే అవకాశం ఉన్నదని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు.
ఇంకొక ఆసక్తికర అంశం- డబ్బుల్లేవు అనే వాదన. ప్రభుత్వ వర్గాల నుంచి తరచుగా ఈ మాట వినిపిస్తున్నప్పటికీ, అదే సమయంలో ప్రజలకు ఉపయోగకరం కాని భారీ స్థాయి సమ్మిట్లు, స్టార్ హోటళ్లలో జరిగే అధికారిక సమావేశాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రభుత్వానికి ఇప్పటికే అంతర్జాతీయ స్థాయి సమావేశ వేదికలు ఉండగా వాటిని వాడకుండా బయట ఖర్చులు చేయడం ఆర్థిక క్రమశిక్షణకు అనుగుణమా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దావత్‌లకు ఉపయోగపడే ప్రజా భవన్ ప్రభుత్వ కార్యక్రమాలకు ఉపయోగపడదా ?
నీటి వనరుల విషయంలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తున్నది. ఒకప్పుడు చెరువుల పునరుద్ధరణను విమర్శించినవారే ఇప్పుడు హైదరాబాద్‌లో నీటి కొరత గురించి మాట్లాడుతున్నారు. ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా పెరుగుతున్నదనే చర్చ జరుగుతున్నది. 2019 నుంచి 2023 మధ్య సమయానికి చెరువులు నింపడం వల్ల భూగర్భ జలాలు పెరిగి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడిన విషయం కూడా గుర్తు చేసుకోవాల్సిందే. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణ ఆరంభ సమయంలో మొదలైన ప్రజా భాగస్వామ్య ఆర్థిక విధానం రాష్ర్టాన్ని ముందుకు నడిపించింది. కానీ కాంగ్రెస్ పాలకుల అవగాహన లోపం, పరిపాలనలో గందరగోళం, ఆర్థిక దూరదృష్టి లేకపోవడం వల్ల అదే వ్యవస్థ దెబ్బతింటున్నది.
తెలంగాణ అభివృద్ధి ప్రయాణం కొనసాగాలంటే స్పష్టమైన విధానాలు, ఆర్థిక క్రమశిక్షణ, ప్రజల భాగస్వామ్యం అవసరం. లేకపోతే ఒకప్పుడు చర్చకు వచ్చిన అభివృద్ధి నమూనా క్రమంగా బలహీనపడే ప్రమాదం ఉన్నది, ఇప్పు డు జరుగుతున్నది అదే. గత రెండేండ్లలో రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకునే మార్గాల అన్వేషణ శూ న్యం. పైగా వ్యక్తిగత ద్వేషంతో ఫెయిల్యూర్ మాడల్స్‌ను ప్రజలపై రుద్దే ప్రయత్నం జరుగుతున్నది.
మానవ మనుగడకు కీలకమైన నీటి విషయంలో అసంధర్భ, అవాస్తవ విమర్శలతో ‘కాస్ట్ బెనిఫిట్ అనాలసిస్’ అనే తలతిక్క మాటలతో సమాజాన్ని తప్పుదోవ పట్టించిన వారే ఇప్పుడు హక్కుగా దక్కాల్సిన విద్యపై కూడా ‘కాస్ట్ బెనిఫిట్ అనాలసిస్‌లు’ మొదలు పెట్టారు. అదే మూసీ సుందరీకరణలో ఈ కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ అంశంపై నోర్లు మెదపడం లేదు.
ఇప్పటికైనా ఆలోచించాల్సింది ఒకటే.. తెలంగాణ ముందుకు వెళ్లాలా? లేక వెనక్కి వెళ్లే దిశలో అడుగులు వేస్తున్నట్టే సాగిపోవాలా? ప్రజలు అర్థం చేసుకోవాలి. ప్రజల అనుభవంలో నుంచి ఆలోచన రావాలి. ఉత్ప్రేరకపు మాటలు, దూషణలు, మనుషుల వ్యక్తిగత స్వార్థాల కోసం అల్లిన కట్టుకథలు, పిట్టకథలకు లొంగిపోతే ఇప్పుడు గురుకుల పాఠశాలల్లో విద్యార్థుల పట్ల, రైతుల పట్ల నిత్యం జరుగుతున్న నిర్లక్ష్యపు ఘటనలు ఇతర వర్గాలకు పాకే ప్రమాదం ఎంతో దూరంలో లేదు. తెలంగాణను డిస్టర్బ్ కానివ్వొద్దు. డిస్ట్రక్షన్‌ను ఎదిరిద్దాం. A distributive economy spreads prosperity a disturbed economy spreads uncertainty.
– జై తెలంగాణ
-పాశం రఘునందన్‌రెడ్డి