తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం సుదీర్ఘకాలం పాటు సబ్బండ వర్ణాలు చేసిన పోరాటాలకు కేంద్రం తలొగ్గి, ప్రత్యేక తెలంగాణ రాష్ర్టాన్ని ప్రకటించక తప్పలేదు. స్వరాష్ట్రమై గెలిచి నిలిచిన తెలంగాణ.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రగతి కాంతులు వెదజల్లుతూ నేడు అభ్యుదయ పథాన ముందుకు సాగుతున్నది. ఎన్నో సవాళ్లు, సమస్యలను అధిగమిస్తూ ఒక్కో రంగాన్ని తీర్చిదిద్దుకుంటూ యావత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది. పలు ఆటంకాలను ఛేదించిన తెలంగాణ నేడు యావత్ భారతావనికే ఓ ప్రగతి జ్యోతిగా నిలుస్తున్నది.
తెలంగాణ రాష్ట్రం సాధించిన అభివృద్ధి, మా రాష్ర్టాల్లో ఎందుకు సాధ్యం కాదని ఇతర రాష్ర్టాల ప్రజలు ప్రశ్నిస్తున్నారు? ఈ దిశగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా పలు రాష్ర్టాల మేధావులతో చర్చిస్తున్నారు. ఆయా రాష్ర్టాల్లో తక్షణ సమస్యలేమిటి? వాటిని పరిష్కరించే కార్యాచరణపై స్పష్టమైన నిర్ణయానికి వచ్చారు. తెలంగాణ అభివృద్ధిని దేశవ్యాప్తం చేయడానికి ముందుకు వెళుతున్నారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ గురించి మాట్లాడకూడదనే నిర్బంధం నుంచి నేడు యావత్ దేశం తెలంగాణ గురించి మాట్లాడుకునే గొప్ప సందర్భానికి మనం చేరుకున్నాం. దశాబ్దాల కిందటే రాష్ర్టాలుగా స్థిరపడ్డ దేశంలోని అనేక రాష్ర్టాలతో తెలంగాణ రాష్ట్రం పోటీ పడుతున్నది. దశాబ్దాలుగా ఇంకా తీరని సమస్యలతో సతమతమవుతున్న భారతదేశ ప్రజానీకానికి తెలంగాణ రాష్ట్ర నాయకత్వం ఆశాకిరణమై నిలుస్తున్నది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే మొట్టమొదటగా అట్టడుగు వర్గాలకు, అసహాయులకు, అన్నార్తులకు కనీస జీవన భద్రత కల్పించాలని, ఇది సామాజిక బాధ్యత అని ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పించారు. ఈ సదాశయంతోనే తెలంగాణ ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేసింది. దేశంలో మరే రాష్ట్రంలోనూ అమలు చేయని విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.50 వేల కోట్లకు పైగా నిధులతో ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలను అమలుచేస్తున్నది. రైతుబంధు, రైతుబీమా పథకాలనైతే ఏకంగా ఐక్యరాజ్యసమితే ప్రశంసించింది. వ్యవసాయానికి సరిపడా సాగునీరు, దాదాపు 27 లక్షల కరెంటు మోటార్లకు 24 గంటలు నాణ్యమైన కరెంటు సరఫరా, కేంద్రం చేతులెత్తేసినా వెరవకుండా 7 వేలకు పైగా కేం ద్రాలు పెట్టి, పండిన ధాన్యం మొత్తం కొనుగోళ్లు చేయడం, తాజా గా యాసంగి జొన్న పంటకు కూడా మద్దతు ధర చెల్లించి రాష్ట్ర ప్రభుత్వమే సేకరించాలని తాజాగా సీఎం కేసీఆర్ నిర్ణయించడం, ఇట్లా ఎన్నో సంక్షేమ పథకాలు దేశానికే మార్గదర్శకంగా నిలిచాయి. తెలంగాణ ఏర్పాటైన ఎనిమిదిన్నరేండ్లలో ఆసరా పింఛన్లు సహా పలురకాల సంక్షేమ పథకాల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ.6 లక్షల కోట్లకు పైగా నిధులను కేటాయించింది. దేశ సంక్షేమరంగ చరిత్రలోనే.. తెలంగాణను అగ్రభాగాన నిలిపింది. బడ్జెట్లో సింహభాగం ప్రజా సంక్షేమానికి కేటాయించిన పేదల ప్రభుత్వంగా ప్రజల విశ్వాసం పొందింది. ఈ రోజు రాష్ట్రంలో సంక్షేమ ఫలాలు పొందని ఇల్లు లేదంటే అతిశయోక్తి కాదు. ‘ప్రతి ఇంటికీ సంక్షేమం, ప్రతి ముఖంలో సంతోషం’ అనే నినాదాన్ని అక్షరాలా నిజం చేసిచూపింది తెలంగాణ ప్రభుత్వం.
అత్యల్ప కాలంలోనే ఇంత అభివృద్ధి ఎట్లా సాధ్యమైంది? అంటే.. సంపదను సృష్టించాలి, దాన్ని పేదలకు పంచాలనే సూత్రాన్ని నాటి ఉద్యమనేత, నేటి రాష్ట్ర సారథి అయిన ముఖ్యమంత్రి కేసీఆర్ అనుసరించడంతోనే అనూహ్య అభివృద్ధి సాధ్యమవుతున్నది. రాష్ట్రంలో పెద్ద ఎత్తున సంపదను సృష్టించి, దాన్ని పేదలకు పంచే పథకాలను రూపొందించిన పాలకుల దార్శనికతే దీనికి అద్దం పడుతున్నది. సంపదను క్షేత్రస్థాయికి చేరేలా ప్రణాళికలు రచించడంతోనే తెలంగాణలో నేడు మన కంటికి కనిపిస్తున్న సమగ్ర వికాసం సాధ్యమైంది.
అయితే, అభివృద్ధి అంటే సమగ్రాభివృద్ధి, సమ్మిళిత అభివృద్ధి. రాష్ర్టాలన్నింటి అభివృద్ధే ఈ దేశాభివృద్ధి అనే విషయాన్ని మనం మరవకూడదు. ఒక్క తెలంగాణ మాత్రమే అభివృద్ధి సాధించినంత మాత్రాన యావత్ దేశం అభివృద్ధి చెందినట్లు కాదు. అన్ని రాష్ర్టాలూ ఇదేవిధంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉన్నది. దేశానికి ఆర్థిక దన్నుగా నిలిచిన మొదటి నాలుగైదు రాష్ర్టాల్లో తెలంగాణ కూడా ఒకటి కావడం మనకు గర్వకారణం. సంక్షేమ పథకాలతో తెలంగాణ రాష్ట్రం ఎట్లయితే దేశానికి మార్గదర్శకంగా నిలుస్తున్నదో.. రేపటి రోజున ఇలాంటి సంక్షేమ ఫలాలన్నీ దేశ ప్రజలందరికీ అందాల్సిన అవసరం ఉన్నదనే ఆలోచన దేశంలోని అన్నివర్గాల ప్రజల్లో మొదలైంది. తెలంగాణలో జరిగిన అభివృద్ధి మా రాష్ర్టాల్లో కూడా ఎందుకు సాధ్యం కాదనే చర్చ ఈ రోజు దేశంలోని వివిధ రాష్ర్టాల్లో మొదలవుతున్నది. ఈ దిశగా దేశవ్యాప్తంగా ఏయే రంగాల్లో బీఆర్ఎస్ ఏమేం చేయనున్నదో తెలియజేస్తూ, పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రణాళికలు కూడా రూపొందుతున్నాయి. రాబోయే రోజుల్లో తెలంగాణ మాడల్ అభివృద్ధి, దేశమంతటా చర్చనీయాంశం కానున్నది. దేశవ్యాప్తంగా ఇలాంటి అభివృద్ధి జరగాలంటే చిత్తశుద్ధి లేని ఈ దేశ పాలకులతో జరగదు. కేవలం బీఆర్ఎస్ ఆధ్వర్యంలోనే తెలంగాణ లాంటి అభివృద్ధి దేశమంతా సాధ్యమవుతుందని ప్రజలు గుర్తించే రోజు కూడా దగ్గరలోనే ఉన్నది. ఇందుకోసం ప్రజలంతా బీఆర్ఎస్కు మద్దతు పలుకుతున్నారు.
(వ్యాసకర్త: బీఆర్ఎస్ సీనియర్ నాయకులు)
-పీఎల్ శ్రీనివాస్
73374 01177