విద్యావ్యవస్థను బాగు చేయాలనే ఉద్దేశం విద్యాశాఖకు ఉన్నట్టు ఎక్కడా, ఎట్టి పరిస్థితుల్లోనూ కనిపించడం లేదు. బోధనలో నాణ్యత పెంచి తద్వారా నాణ్యమైన విద్యను దిగుబడిగా సాధించడం విద్యాశాఖకు సుతరామూ ఇష్టం లేదు. అందుకే విద్యాహక్కు చట్టాన్ని, నియమాలను, విద్యా కమిషన్ సిఫారసులను తుంగలో తొక్కి బోధనా సమయాన్ని బోధనేతర పనులతో హరించివేస్తున్నారు.
విద్యా శాఖలో సాంకేతిక మాధ్యమం ఒక అంటురోగంలా తయారైంది. అది దినదినం గూగుల్ షీట్లు, అప్లికేషన్లు, జియో మ్యాపులు, ఫొటోలు, జూమ్ సమావేశాలు అంటూ ముదిరిపోతూనే ఉన్నది. గంటగంటకూ హాజరు, కులాలు, మతాలు, లింగాలవారీగా నమోదు, పుస్తకాలు, ఉచిత దుస్తులు, నోటు బుక్కులు, ఆధార్ ఉన్నవారు, లేనివారు, అంగన్వాడీ నుంచి వచ్చినవారు, రానివారు, ప్రైవేటు నుంచి వచ్చినవారు, రానివారు, చదవడం- రాయడం- గణిత భావనలు వచ్చినవారు, రానివారు, ఒక్కో పరీక్ష వివరాలు.. ఇలా పనికిరాని చెత్తనంతా అందులో పోగేయమంటూ హుకుం జారీ చేయడం, దాన్ని సీఆర్పీల నుంచి డీఈవోల వరకు ఫాలోఅప్ చేయడం, ఈ సమాచార నిమిత్తం పాఠశాల సమయాల్లో జూమ్ సమావేశాలు నిర్వహించడం, హాజరు ఫొటోల తాలూకు ఫోన్ కాల్స్ వగైరా సమాచార విప్లవం పాఠశాల ప్రగతిని తిరోగమింపజేస్తున్నది.
బడిలో ప్రధానోపాధ్యాయులు, కాంప్లెక్సు పరిధిలో హెచ్ఎం, మండల పరిధిలో నోడల్ అధికారి, మండల విద్యాధికారి, జిల్లా స్థాయిలో విద్యాధికారి, కలెక్టర్, ఎమ్మెల్యే, మంత్రి, రాష్ట్రస్థాయి మానిటరింగ్ బృందాలుండగా ప్రతీ నెలా నిర్ణీత నమూనాలో సమాచారం ఇస్తుండగా,ఎండీఎం అయితే ప్రతి 5 రోజులకు కాగితాల రూపంలో సమర్పిస్తుండగా, ఏ ఉద్దేశం కోసం వీరికి సమాచారం అవసరమవుతున్నదో అంతుచిక్కని మిస్టరీ.
క్లస్టర్ స్థాయిలో సీఆర్పీలు వారి పరిధిలోని ఐదారు పాఠశాలల సమాచారాన్ని సేకరించవలసి ఉండగా, వారిని ఒక సాఫ్ట్వేర్ కంపెనీ వ్యవహారాలు చూసే సీఈవోలుగా మార్చి, వారిని ఫోన్, కంప్యూటర్లకే పరిమితమయ్యేలా చేశారు. నిజంగా విద్యపై, విద్యార్థులపై శ్రద్ధ ఉంటే ఇలా నమోదు కాగానే అలా పాఠ్యపుస్తకాలు, నోటుపుస్తకాలు, ఉచిత దుస్తులు చిటికెలో అందించాలి. కానీ, బడి నుంచి కాగితం రాసి కార్యాలయానికి పంపితే, అది జిల్లా నుంచి రాష్ర్టానికి వెళ్లి, మంజూరై విద్యార్థికి చేరే వరకు మొదటి విడత సెలవులు ఖాయంగా వచ్చేస్తున్నాయి.
ఇక గతేడాది సంఖ్య మేరకు నేటి వరకు పుస్తకాలే రాలేదు. వర్క్ బుక్కులు 80 శాతం వరకు రాలేదు. అసలు వాటిపై శ్రద్ధ మరిచి అడిగిన సమాచారాన్నే పది స్థాయుల్లో, పది రకాలుగా అడిగి అడిగి ఉపాధ్యాయులను అలిసిపోయేలా చేస్తున్నారు.
విద్యార్థుల సంఖ్య ఇంత పెరిగింది, అంతమంది ప్రైవేటు నుంచి వచ్చారని పత్రికలకు గొప్పలు చెప్పుకోవడం, ప్రకటనలు ఇచ్చుకోవడం, రాజకీయ వేదికలపై ప్రగల్భాలు పలకడానికి తప్ప, నాణ్యమైన విద్య కోసం చేస్తున్న పనులా ఇవి? తరగతికో ఉపాధ్యాయుడు లేరు. వర్షాకాలంలో నీరు నిలిచే వ్యవస్థ, పొయ్యిలో కట్టెలు పెట్టే దీనావస్థ, శిశుసంరక్షణ, ప్రసూతి, మెడికల్ సెలవులు పెడితే వారి స్థానంలో సర్దుబాటు చేసే వెసులుబాటు లేదు. జెండా వందనం వరకు నిధులు రావు. ఇలా అనేకానేక సమస్యలుండగా ఈ సమాచార క్రోడీకరణ, సంగ్రహీకరణకు ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ ఎందుకు? ఇది పోలీసు వ్యవస్థ కాదు కదా! అన్నీ మొబైల్ అప్లికేషన్లలో, వెబ్సైట్లలో డాటా పొందుపరచినా మళ్లీ ఏ సమాచారం కావాలన్నా.. మోస్ట్ అర్జంట్ పేరిట అప్పటికప్పుడు కాగితాల్లో రాసివ్వాల్సిందే. ఏ స్థాయి దగ్గర సంపూర్ణ, సమగ్ర, విశ్వసనీయ సమాచారం ఉండదు. టెక్నాలజీ ఇంతగా పెరిగినా బదిలీలు, పదోన్నతు లు అనగానే తప్పుల తడకల లిస్టులు అ హోరాత్రులు, అర్ధరాత్రులు మళ్లీ టీచర్లను డిప్యుటేషన్ వేసి తయారు చేయాల్సిందే.
అధికారికి పైన ఉన్న అధికారి ఒక పనికిరాని ఉత్తర్వు జారీచేస్తే కిందిస్థాయి వరకు అధికారులు ఛలో అంటూ అమలు చేయడం, ఆదేశించడం మినహా వీటి అవసరం, ఆవశ్యకత ఏమిటి? తనిఖీ అధికారులు అంటూ నిబంధనలకు అతీతంగా, కోర్టులో నిలవని ఒక పనికిమాలిన జీవో ఇన్ని మెదళ్లను దాటుకొని ఎలా వచ్చిందో తెలియదు. అది విద్యాశాఖ నిర్వాకం. మేధావివర్గమైన శాఖలో నిరంతరం ఇదే ప్రహసనం, తప్పుల నుంచి నేర్చుకునే, సరిదిద్దుకునే సోయి లేని వ్యవస్థ. సమన్వయం లేని విభాగాలు, స్థాయులు, అంచెలు. నెల రోజులు కూడా దాటని విద్యా సంవత్సరంలో ఇప్పటికే సమాచారం కోసం ఆదేశాలు మాత్రం వంద దాటేశాయి.
గూగుల్ ఫారాలు, లింకులు, యూడైస్, ఎండీఎం పుస్తకాలు, యూనిఫాం, ప్రమోషన్ యాక్టివిటీ ఇలా రకరకాల హుకూంలు. ఇలాంటి వ్యవస్థలో, ఇన్ని పనుల మధ్య విద్యార్థులపై దృష్టి సారించేదెలా? ఇలా బడి ప్రారంభమైందో, లేదో పిల్లల తెలివిని బేస్ లైన్ పేరిట కొలిచి రాష్ట్ర విద్యాశాఖ వాకిట్లో కుమ్మరించాలని ఆదేశం. చివరకు అగ్వకు దొరికిన సార్లు సరిగ్గా పనిచేయడం లేదంటూ వారిపై తోసేసి, నిందించి అధికారులు, ప్రభుత్వం పబ్బం గడుపుకోవడం తప్ప నాణ్యమైన విద్య కోసం చిత్తశుద్ధి ఎక్కడ? ఇది మన విద్యాశాఖ తీరు.
-రావుల రాజేశం
77801 85674