డీలిమిటేషన్ నియోజకవర్గాల పునర్విభజన అనే అంశం మీద దేశవ్యాప్తంగా వాడీ, వేడి చర్చ జరుగుతున్న తరుణంలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ క్రియాశీలకంగా వ్యవహరించడం అందరి దృష్టిని ఆకర్షించింది. స్టాలిన్ ఆధ్వర్యంలో ఈ నెల 22న తలపెట్టిన దక్షిణ భారత రాజకీయ నేతల సమావేశం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అయితే డీలిమిటేషన్ చేసిన ప్రక్రియలో ఇమిడి ఉన్న అనేక అంశాల మీద విశ్లేషించి అవగాహన చేసుకోవలసిన సమయం వచ్చింది. ఇంతటి కీలకమైన రాజ్యాంగబద్ధమైన విషయం మీద పౌర సమాజం అవగాహన చేసుకోవడం కూడా చాలా అవసరం.
ఏ కోణంలో చూసినా నియోజకవర్గాల పెంపు రాజకీయ పార్టీలకు, రాజకీయ నేతలకు ఉపయోగం కానీ, ప్రజలకు మాత్రం కాదు. ఎక్కువ మంది ప్రజాప్రతినిధులు ఉన్నందు వల్ల ప్రజలకు కలిగే ప్రయోజనం ఏమిటి? ఎంపీలు ఎమ్మెల్యేలు పెరిగితే వారి జీతభత్యాలు, నివాస సౌకర్యాలు, పింఛన్ గట్రా ఖజానా మీద భారాన్ని పెంచుతాయి కానీ, ప్రజల జీవితం ఏ విధంగా మెరుగవుతుందనేది కూడా చాలామంది వేసే ప్రశ్న.
అసలు డీలిమిటేషన్ అంటే ఏమిటి?: పెరిగే జనాభాకు అనుగుణంగా చట్టసభల్లో ప్రజాప్రతినిధుల సంఖ్యను పెంచే ప్రక్రియనే డీలిమిటేషన్. ప్రతి పదేండ్లకోసారి మన దేశంలో జనాభాను లెక్కిస్తాం. దాన్నే సెన్సస్ అంటాం. సెన్సస్ ఆధారంగా చట్టసభల్లో సీట్లు పెరిగే ప్రక్రియనే డీలిమిటేషన్. ఇప్పటివరకు డీలిమిటేషన్ అనేది నాలుగు సార్లు జరిగింది. తొలిసారి 1951 సెన్సస్ ఆధారంగా 1952లో లోక్‌సభ సీట్లు 489గా నిర్ధారించారు. రెండోసారి 1961 సెన్సస్ ఆధారంగా 1963లో లోక్‌సభ సీట్ల సంఖ్యను 522కి పెంచారు. మూడోసారి 1971 సెన్సస్ ఆధారంగా 1973లో లోక్‌సభ సీట్లను 545కి పెంచారు. గత యాభై ఏండ్లుగా లోక్‌సభ సభ్యుల సంఖ్య 545 వద్దే నిలిచిపోయింది. నాలుగోసారి 2001 సెన్సస్ ఆధారంగా 2002లో సీట్లను పెంచకుండా నియోజకవర్గాలలో కొన్ని మార్పుచేర్పులు చేశారు.
కొన్ని నియోజకవర్గాలను ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ నుంచి తీసివేశారు. మరికొన్ని స్థానాలను రిజర్వేషన్ జాబితాలో చేర్చారు. అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్న గందరగోళం తొలగించారు. ఉదాహరణకు 2002కు ముందు ఏపీలో ఒక మండలం 4 అసెంబ్లీ నియోజకవర్గాలకు విస్తరించి ఉండేది. 2002లో మండల మొత్తాన్ని ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో ఉండేవిధంగా మార్పులు చేశారు. పరిపాలనా సౌలభ్యం పరంగా ఇది కొంత మెరుగైన నిర్ణయం. ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలను ప్రతి పదేండ్లకోసారి మార్చవలసిన అవసరం ఉన్నది. ఒక నియోజకవర్గాన్ని ఏండ్ల తరబడి ఎస్సీగా ఉంచడంలో అర్థం లేదు. మహిళా నియోజకవర్గాలకు కూడా ఇది వర్తింపజేయాలి. మన దేశంలో ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకునే చట్టసభలైన లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాలను పెరుగుతున్న జనాభా దృష్టిలో పెట్టుకొని పునర్వ్యవస్థీకరించడం రాజ్యాంగంలో మనం పొందుపరచుకున్న అంశం. అదే డీలిమిటేషన్. అయితే ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాల సంఖ్యను 2020 తర్వాత జరిగే జనగణనకు ముందు మార్చకూడదని చట్టం చేసుకున్నాం.
కుటుంబ నియంత్రణ విధానాన్ని అమలుపరచటంలో ఆటంకాలు రాకూడదని 1976లో చేసిన 42వ రాజ్యాంగ సవరణలో 2000 సంవత్సరం వరకు నియోజకవర్గాల సంఖ్యలో మార్పు చేయకూడదని చెప్తుంది. ఆ నిషేధం గడువును పార్లమెంటు 2002లో 84వ రాజ్యాంగ సవరణ ద్వారా 2026 వరకు పొడిగించింది. ఈ నిషేధం వచ్చే ఏడాది ముగుస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం చట్టసభల్లో సీట్ల పెంపు విషయం మీద దృష్టిపెట్టిన విషయం తెలిసిందే.
అంటే, 2029లో ఎన్నికలు 2021 జనాభా లెక్కల ప్రాతిపదికన పెరిగిన స్థానాలు ఉన్న చట్టసభలకు జరుగుతాయి. కానీ, 2021లో జరగవలసిన జనగణన ఇంతవరకు మొదలుకాలేదు. అందువల్ల ఏ ప్రాతిపదికన సీట్ల పెంపు ఉంటుంది. ఉన్నదల్లా 2011 సెన్సస్. దాని ఆధారంగా 2029 సీట్ల సంఖ్య పెంపు ఏం సమంజసంగా ఉంటుంది. లోక్‌సభకు పెరగబోయే స్థానాలకు సరిపోయేలా ఎక్కువ మంది సభ్యులు కూర్చోవడానికి వీలుగా కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మించుకున్నాం. కొత్త భవనం కొత్త సభ్యులతో నిండుకుండలా కలకళలాడుతూ ఉండాలని బీజేపీ ప్రభుత్వం తహతహలాడుతున్నది.
అయితే, ఇక్కడ వచ్చిన చిక్కల్లా ఏ ప్రాతిపదికన చట్టసభల్లో సీట్ల పెంపు జరగాలన్నది. నియోజకవర్గాల పెంపు అనేది జనాభా ప్రాతిపదిక మీద జరగడం సాధారణం. ఈ క్రమంలో జనాభా బాగా పెరిగిన రాష్ర్టాలు ఎక్కువ సీట్లు పొందుతాయి. జనాభా పెరుగుదలను బాగా నియంత్రించిన రాష్ర్టాలు లోక్‌సభ సీట్లను కోల్పోయే ప్రమాదం పొంచి ఉన్నది. ఈ విషయంలో సందేహం అవసరం లేదు. తద్వారా జాతీయ రాజకీయాల్లో తమ ప్రాబల్యం ఎంతో తగ్గిపోతుందని వివిధ అంశాల మీద తమ గళం వినిపించే అవకాశం కోల్పోతామని కొన్ని రాష్ర్టాలు ఆందోళన చెందుతున్నాయి. ముఖ్యంగా దక్షిణాది రాష్ర్టాలైన ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక. ఈ పరిణామం సమాఖ్య స్ఫూర్తికి కూడా విఘాతం కలిగించేదిగా ఉంది. కానీ, వివిధ రాజకీయ సమీకరణాల దృష్ట్యా ఈ రాష్ర్టాల నేతలందరూ ఒక తాటి మీదకు వచ్చి తమ వాదనలు కేంద్రానికి గట్టిగా వినిపించే అవకాశం లేదు.
హోం మంత్రి అమిత్ షా ‘దక్షిణాది రాష్ర్టాలకు డీలిమిటేషన్లో ఇప్పుడున్న సంఖ్య తగ్గదు’ అని చెప్పారు. కానీ, ఆ మాటలు విశ్వాసాన్ని నింపడం లేదు. ఇప్పుడున్న సంఖ్య తగ్గకపోయినా ఇతర రాష్ర్టాలకు పెరిగితే అవి తగ్గినట్టే కదా? 1952లో పార్లమెంట్‌కు జరిగిన ఎన్నికల్లో మొత్తం సీట్లు 489. ఇందులో దక్షిణాది వాటా 25.35గా ఉన్నది. కూర్గికి 1, హైదరాబాద్‌కు 25, మద్రాస్‌కు 75, మైసూరుకు 11, ట్రావెన్కోర్-కొచ్చిన్‌కు 12.. ఇలా మొత్తం 124 స్థానాలు. 1967లో జరిగిన ఎన్నికల నాటికి భాషా ప్రాతిపదికన రాష్ర్టాల పునర్విభజన జరిగింది. ఆ ఎన్నికల్లో మొత్తం సీట్లు 522కి గాను, దక్షిణాదికి 126 సీట్లు ఉంటే, (ఏపీకి 41, కేరళ 19, మద్రాస్ 39, మైసూర్ 27) సభలో సీట్ల శాతం 24.13 శాతానికి పడిపోయింది. ఇక 1977 ఎన్నికల్లో మొత్తం సీట్లు 545 కాగా, దక్షిణాదికి 130 ఉన్నవి. ఏపీకి 42, తమిళనాడుకు 39, కర్ణాటకకు 28, కేరళకు 20, పుదుచ్చేరికి 1 చొప్పున సభలో సీట్ల వాటా 23. 85 శాతానికి పడిపోయింది. సీట్లు పెరిగినా సీట్ల శాతం తగ్గింది. ఇది దక్షిణాది గళానికి బలం చేకూరినట్లా? బలహీనమైనట్లా? ఇది అంకెల గారడీ కాదు. ఇదీ వాస్తవ పరిస్థితి.
అసలు దక్షిణాది అనే కోణంలో చూడటం ఎందుకు అనే ప్రశ్న రావచ్చు. ఎవరు ఔనన్నా, ఎవరు కాదన్నా దక్షిణాది అనేది ఉత్తరాదికి భిన్నమైన వ్యవస్థ. ఇక్కడ ఉన్నది ద్రవిడ సంప్రదాయం. భాషలు వేరు. ఒకరిది మరొకరికి అర్థం గానంత భిన్నమైన భాషలు. కానీ, ఇక్కడ సంస్కృతి సంప్రదాయాలు ఉమ్మడి వారసత్వానికి ప్రతీకలు. ఆహారం, ఆహార్యం, సంగీతం, నృత్యం, పేర్లు, పండగలు, పెళ్లిళ్లు, గుళ్లు గోపురాలు అన్నింటిలోనూ ఉమ్మడి సంస్కృతీ సంప్రదాయం కనిపిస్తుంది. ఇది ఉత్తర భారతీయులు ఎప్పటికీ అర్థం చేసుకోలేని సత్యం.
ఉత్తర భారతీయ జనతా పార్టీకి ద్రావిడం అర్థం కాని విషయమే. అందుకే, ఎంత ప్రయత్నించినా ఇక్కడ పాదం మోపలేకపోయారు. దీనిని ఏ మేధావులు కాదనగలరు? భిన్నత్వంలో ఏకత్వం అనే స్ఫూర్తి దక్షిణంలోనే కనిపిస్తుంది. ప్రభుత్వ విధానం వల్ల ఒక ప్రాంతానికి అన్యాయం జరుగుతుందన్న భావన దేశ సమగ్రతకు మంచిది కాదు. ఈ విషయాన్ని ఢిల్లీ పాలకులు గుర్తించాలి.
కుటుంబ నియంత్రణ విధానాన్ని పకడ్బందీగా అమలుచేసి జనాభా పెరుగుదలను దక్షిణాది రాష్ర్టాలు బాగా అరికట్టగలిగాయి. ఒకనాడు కీలకమైన ప్రభుత్వ విధానాన్ని బాగా అమలు చేసినందుకుగాను దక్షిణాది రాష్ర్టాలు లోక్‌సభ సీట్లు కోల్పోయే ప్రమాదం ఏర్పడింది నేడు. ప్రభుత్వ విధానాన్ని ప్రతిష్ఠాత్మకంగా అమలు చేసినందుకు తగిన మూల్యం చెల్లించుకునే విపత్కర పరిస్థితి ఉత్పన్నమైంది. ఇది దక్షిణాది రాష్ర్టాలను ఆందోళనకు గురి చేస్తున్న విషయం. ఇదే స్టాలిన్‌ను కలవర పెడుతున్నది. కానీ, ఈ కలవరపాటు కేవలం స్టాలిన్‌కే ఎందుకు? మిగిలిన దక్షిణాది నేతలు నోరు విప్పలేదు. సీట్ల జనాభా ప్రాతిపదికగా కాకుండా మరేదైనా ప్రాతిపదిక మీద జరిగితే అది మరింత గందరగోళానికి దారి తీయొచ్చు. కానీ, ఎంతకాలం సీట్లు పెంచకుండా ఉన్న సీట్లనే సర్దుబాటు చేస్తారు? ఎన్నికలు వచ్చాయంటే టికెట్ ఆశించే ఆశావహులు చాలామంది ఉంటారు.
ఎక్కువ నియోజకవర్గాలుంటే ఎక్కువ మంది పార్టీ కార్యకర్తలకు టికెట్లు ఇవ్వవచ్చు అన్నది రాజకీయ కోణం. కానీ, ఏ విధంగా ఈ ఆలోచన దేశాభివృద్ధికి, సంక్షేమానికి మేలు చేస్తుంది. పరిపాలన సవ్యంగా సాగాలంటే జిల్లా విస్తీర్ణం, తాలూకా విస్తీర్ణం కుదించవచ్చు. అప్పుడు పరిపాలనా యంత్రాంగం ప్రజలకు చేరువవుతుంది. అభివృద్ధికి దోహదపడుతుంది. జిల్లా కేంద్రానికి ఏ గ్రామం కూడా 60 కిలోమీటర్ల మించి దూరం, తాలూకా కేంద్రానికి ఏ గ్రామం కూడా 30 కిలోమీటర్లకు మించి దూరం ఉండకూడదని ప్రతిపాదిస్తే ప్రజలకు, పరిపాలన యంత్రాంగానికి కూడా ఉపయోగంగా ఉంటుంది. ఏ కోణంలో చూసినా నియోజకవర్గాల పెంపు రాజకీయ పార్టీలకు, రాజకీయ నేతలకు ఉపయోగం కానీ, ప్రజలకు మాత్రం కాదు. ఎక్కువ మంది ప్రజాప్రతినిధులు ఉన్నందు వల్ల ప్రజలకు కలిగే ప్రయోజనం ఏమిటి? జనాభా పెరిగితే ఆ పెరుగుదలకు తగ్గట్టు ఆసుపత్రుల సంఖ్య పెరగాలి, ఆసుపత్రుల్లో బెడ్ల సంఖ్య కూడా పెరగాలి. డాక్టర్ల సంఖ్య పెరగాలి. ఆరోగ్య సహాయక సిబ్బంది పెరగాలి. పాఠశాలలు పెరగాలి. ఉపాధ్యాయులు పెరగాలి. అంతేకానీ, ఎంపీలు ఎమ్మెల్యేలు పెరిగితే వారి జీతభత్యాలు, నివాస సౌకర్యాలు, పింఛన్ గట్రా ఖజానా మీద భారాన్ని పెంచుతాయి కానీ, ప్రజల జీవితం ఏ విధంగా మెరుగవుతుందనేది కూడా చాలామంది వేసే ప్రశ్న.
ప్రజా ప్రతినిధి బాధ్యత ఏమిటి? చట్టాలు చేయటం, పరిపాలనలో జరుగుతున్న లోటుపాట్లను ఎత్తిచూపటం, తద్వారా పాలనా ప్రక్రియ మెరుగుపడేలా చూడడం. ప్రభుత్వ విధానాల రూపకల్పన, పథకాల అమలుకు ఐఏఎస్ ఆధ్వర్యంలో పనిచేసే ప్రభుత్వ యంత్రాంగం ఉన్నది కదా! ప్రజాప్రతినిధులను పరిపాలనలో భాగస్వాములను చేయటం భావ్యం కాదు. వారు నిష్పక్షపాతంగా, రాగద్వేషాలకు అతీతంగా వ్యవహరించలేరు. రాజకీయ నేతలు తమ తమ వర్గానికి అండగా ఉంటారు. దీనికి కారణం ఏ పార్టీలోనూ అంతర్గత ప్రజాస్వామ్యం లేకపోవడం. నియోజకవర్గ అభివృద్ధి గురించి ఆలోచించే ప్రజాప్రతినిధులు ఎంతమంది ఉంటారు? చట్టసభల్లో ఇప్పుడున్న సంఖ్య సరిపోతుందా? నియోజకవర్గం అభివృద్ధి అనేది ప్రజా ప్రతినిధి బాధ్యత ఎలా అవుతుంది? అభివృద్ధి అనేది చేయవలసింది ప్రభు త్వం కదా? ప్రజా ప్రతినిధులు మహా అయితే నియోజకవర్గాల్లో ఉండే సమస్యలు ప్రస్తావిస్తారు. అంతకుమించి పరిపాలనలో వారికి ఏం ప్రమేయం ఉంటుంది? చట్టసభల్లో జరిగే చర్చలు రాజకీయ కోణంలో జరుగుతున్నాయి గానీ, అభివృద్ధి మీద ఏం చర్చ జరుగుతుంది? ఇన్నాళ్లు బాగా నడిచిన వ్యవస్థను సీట్ల పెంపు పేరుతో ఇప్పుడు అవస్థల పాలు చేయడం ఎందుకని ప్రశ్నించేవారు కూడా ఉన్నారు.
అమెరికా కాంగ్రెస్‌లో ప్రతినిధుల సంఖ్య 1913 నుంచి నేటివరకు కూడా 435గానే ఉన్నది. అక్కడ 1911లో జనాభా 9.4 కోట్లు. 2024లో రమారమి 34 కోట్లకు
పెరిగిందని ఒక అంచనా. అయినా, కాంగ్రెస్‌లో ఎగువసభ అయిన సెనేట్ సభ్యుల సంఖ్య రాష్ర్టానికి రెండు స్థానాల చొప్పున 50 రాష్ర్టాలకు కలిపి 100 సీట్లు. దిగువ సభ అయిన ప్రతినిధుల సభ బలం 435 వద్ద నిలిచిపోయింది. ఆ కారణంతో అక్కడ చట్టసభలు సమర్థవంతంగా పనిచేయడం లేదా? అని ప్రశ్నించే మేధావులూ లేకపోలేదు.
మన దేశంలో కూడా రాజ్యసభ సభ్యుల సంఖ్యను రాష్ర్టానికి రెండు చొప్పున నిర్ణయించి లోక్‌సభ స్థానాలను రాజ్యాంగంలో పేర్కొన్న విధంగా రాష్ర్టాలకు 530, కేంద్ర పాలిత ప్రాంతాలకు 20కి మించకుండా మూత బిగించాలి. దేశ రాజధాని అయిన ఢిల్లీలో ఎంపీలకు సరైన వస తి, సౌకర్యం లేదు. నార్త్ అవెన్యూ, సౌత్ అవెన్యూలలో ఎంపీల నివాసాలు చాలా పాతవి. కాబట్టి, కొత్తవి నిర్మించవలసిన అవసరం ఉన్నది. ప్రజా ప్రతినిధులకు తగిన సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. కానీ, మంది ఎక్కువైతే మజ్జిగ పలుచన కదా! కాదంటారా? మీరే చెప్పండి.
-గుమ్మడిదల రంగారావు