ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం భారత్. అయితే, ఈ గుర్తింపు భవిష్యత్తులోనూ ఉంటుందా? అనేది సందేహమే. జనాభా వృద్ధిరేటు క్రమంగా క్షీణిస్తుండటమే అందుకు కారణం. ప్రత్యేకించి, దక్షిణాది రాష్ర్టాల్లో ఈ క్షీణత ఎక్కువగా ఉండటం ఆందోళనకరం. ఇప్పటికే లోక్సభలో ప్రాతినిధ్యం, కేంద్ర నిధుల కేటాయింపులో జరుగుతున్న అన్యాయం నేపథ్యంలో ఈ ప్రభావం తమ పైనే ఎక్కువగా పడే అవకాశం ఉండటం ఇప్పుడు దక్షిణాది రాష్ర్టాలను కలచివేస్తున్నది.
రెండు మూడేండ్లుగా వాయిదా పడుతూ వస్తున్న జనగణన ప్రక్రియను చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో వెలుగులోకి వచ్చిన ఓ నివేదిక ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఎకనామిక్ రీసెర్చ్ డిపార్ట్మెంట్ నేతృత్వంలో జరిగిన అధ్యయన నివేదిక విస్తుగొలిపే వాస్తవాలను బయటపెట్టింది. ఆ నివేదిక ప్రకారం.. గత 2011-2024 మధ్యకాలంలో దేశ జనాభా భారీగా పెరిగినప్పటికీ, సగటు వార్షిక వృద్ధిరేటు మాత్రం క్షీణించినట్టు తెలిసింది. 2011లో 1.63 శాతంగా ఉన్న దేశ జనాభా సగటు వార్షిక వృద్ధిరేటు 2024 నాటికి 1.2 శాతానికి పడిపోవడం గమనార్హం. రాబోయే దశాబ్దకాలంలో దేశ జనాభా చాలా తక్కువ వేగంతో పెరుగుతుందని ఈ క్షీణతను బట్టి స్పష్టమవుతున్నది.
2011తో పోలిస్తే దక్షిణాదిలోని తమిళనాడు, ఏపీ, తెలంగాణ రాష్ర్టాల జనాభా వృద్ధిరేటు చాలా తక్కువగా ఉన్నట్టు నివేదిక తెలుపుతున్నది. అదే సమయంలో ఉత్తరాదిలోని యూపీ, బీహార్ రాష్ర్టాల జనాభా వృద్ధిరేటు గణనీయంగా పెరిగింది. గత దశాబ్దకాలంలో పెరిగిన దేశ జనాభాలో ఈ రెండు రాష్ర్టాల వాటా 33 శాతం కావడం ఆలోచించదగిన విషయం. ఉత్తర, పశ్చిమ భారత్లోని అన్ని రాష్ర్టాల వాటా 52 శాతంగా ఉన్నది. 2011లో ఈ రెండు ప్రాంతాల వాటా 51 శాతమే. 2001-11తో పోలిస్తే గత దశాబ్దిలో దేశంలోని దక్షిణాది, తూర్పు ప్రాంతాల్లో జనాభా వృద్ధిరేటులో క్షీణత కనిపించింది.
దేశంలో యువ జనాభా లేదా పనిచేసే జనాభా (15-59 ఏండ్లు) వృద్ధిరేటు పెరగడం శుభపరిణామం. 1971 నుంచి ఈ విభాగం జనాభా క్రమంగా పెరుగుతున్నది. 2021 నాటికి దేశంలోని మొత్తం జనాభాలో ఈ విభాగం వాటా 64.4 శాతానికి పెరిగి ఉండవచ్చని ఎస్బీఐ నివేదిక తెలిపింది. 2031 నాటికి అది 65.2 శాతానికి చేరుకుంటుందని అంచనా. అంతేకాదు, దేశ మధ్యస్థ వయస్సు కూడా పెరిగే అవకాశమున్నట్టు నివేదిక వెల్లడించింది. 2021లో 24 ఏండ్లుగా ఉన్న మధ్యస్థ వయస్సు.. 2023-24 నాటికి 28-29 ఏండ్లకు చేరుకుంటుందని ఎస్బీఐ అధ్యయనం అంచనా వేసింది. ఈ విషయంలో చైనాతో పోలిస్తే మన దేశం మెరుగైన స్థితిలో ఉండటం సానుకూలాంశం. 2011లో 34.5 ఏండ్లుగా ఉన్న చైనా మధ్యస్థ వయస్సు ప్రస్తుతం 39.5 ఏండ్లకు చేరుకున్నది. ఏదేమైనప్పటికీ రాబోయే రోజుల్లో దేశ ఆర్థికాభివృద్ధికి యువ జనాభా ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
(‘ఇండియా టుడే’ సౌజన్యంతో)
దేశ జనాభా సగటు వార్షిక వృద్ధిరేటు ఇలా..
-శుభమ్సింగ్