ఈ నెల మార్చి 26న అసెంబ్లీలో సాగునీటి శాఖ పద్దులపై చర్చ సందర్భంగా రెండు అంశాలు వాగ్వివాదాలకు దారితీశాయి. 1.తుమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత ఉన్నదని సీడబ్ల్యూసీ చెప్పినా కాంట్రాక్టుల కోసం, కమీషన్ల కోసం బ్యారేజీ స్థలాన్ని మేడిగడ్డకు మార్చారు. 2.ప్రభుత్వమే నియమించిన రిటైర్డ్ ఇంజినీర్ల కమిటీ మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మించవద్దని చెప్పినా వారి మాటను పెడచెవిన పెట్టి బ్యారేజీని నిర్మించారు. ఈ రెండు అంశాల మీద మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సాగునీటి శాఖ మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు మధ్య వాగ్వివాదం చెలరేగింది. ఈ నేపథ్యంలో పైన పేర్కొన్న రెండు అంశాల్లో వాస్తవాలను ప్రజల ముందుంచాలని ఈ వ్యాసం రాయవలసి వస్తున్నది.
152 మీటర్ల వద్ద తుమ్మిడిహట్టి బ్యారే జీ కోసం గత ప్రభుత్వం చేసిన కృషి: కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే తుమ్మిడిహట్టి వద్ద 152 ఎఫ్‌ఆర్‌ఎల్‌తో తుమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించడానికి చిత్తశుద్ధితో ప్రయత్నం చేసింది. రాష్ట్రం ఏర్పడగానే అప్పటి సాగునీటి మంత్రి హరీశ్‌రావు 2014 జూలైలో ముంబై వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వంలో సాగునీటి మంత్రిగా ఉన్న ముష్రిఫ్‌తో సమావేశమయ్యారు. హరీష్‌రావు వద్ద ఓఎస్డీగా పనిచేస్తున్న నేనూ ముంబై వెళ్లాను. ఆ సమావేశంలో మహారాష్ట్ర మంత్రి.. ‘కొద్ది నెలల్లోనే మా రాష్ట్రంలో ఎన్నికలు జరుగబోతున్నాయి. ఈ సమయంలో తుమ్మిడిహట్టిపై మేము ఏ నిర్ణయం తీసుకోలేం. ఎన్నికలైన తర్వాత ఏర్పడే కొత్త ప్రభుత్వాన్ని సంప్రదించండి’ అని సలహా ఇచ్చాడు. ఇక చేసేదేమీ లేక మహారాష్ట్రలో ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వం ఏర్పడేదాకా వేచిచూడక తప్పలేదు.
ఎన్నికల తర్వాత మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైంది. అప్పుడు అక్కడ మన తెలంగాణ బిడ్డ, బీజేపీ సీనియర్ నాయకులు చెన్నమనేని విద్యాసాగర్‌రావు గవర్నర్‌గా ఉన్నారు. తొలుత హరీశ్‌రావు మహారాష్ట్ర సాగునీటి మంత్రి గిరీశ్ మహాజన్‌తో చర్చించడానికి 2014 డిసెంబర్లో ముంబై, నాగ్‌పూర్‌కు వెళ్లారు. ఆయన వెంట నేనూ వెళ్లాను. అయితే.. ‘ఇది నా స్థాయిలో తీసుకునే నిర్ణయం కాదు, ముఖ్యమంత్రుల స్థాయిలో జరుగవలసిన నిర్ణయం’ అని గిరీశ్ మహాజన్ సెలవిచ్చారు. 2015, ఫిబ్రవరి 17న కేసీఆర్ తన పుట్టినరోజు వేడుకలను కూడా వదిలేసి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌తో చర్చల కోసం ముంబాయి వెళ్లారు. ఆ సమావేశం గవర్నర్ నివాసం రాజ్‌భవన్‌లో, ఆయన సమక్షంలోనే జరిగింది. ఆ సమావేశంలో పాల్గొనడానికి మంత్రి హరీశ్ రావుతో నేను కూడా ముంబాయి వెళ్లాను.
తుమ్మిడిహట్టి వద్ద 152 మీటర్ల ఎఫ్ఆర్ఎల్ వద్ద బ్యారేజీ నిర్మాణానికి ఆమోదం తెలుపమని కేసీఆర్ ప్రార్థించారు. మహారాష్ట్రలో ముంపునకు గురవుతున్న భూములకు మహారాష్ట్ర నిర్ధారించిన పరిహారాన్ని చెల్లిస్తామన్నారు. జవాబుగా ఫడ్నవీస్ స్పష్టంగా అన్నమాట ఏమంటే.. ‘కేంద్రంలో కాంగ్రెస్, మహారాష్ట్రలో కాంగ్రెస్, ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే మహారాష్ట్ర ప్రభుత్వం 152 మీటర్ల ఎత్తుకు బ్యారేజీ నిర్మాణానికి అనుమతించలేదు. ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఉద్యమించి అరెస్టయిన నేను అనుమతి ఎట్లా ఇస్తాను? బ్యారేజీ ఎత్తును 4 మీటర్లు తగ్గించి 148 మీటర్ల వద్ద కట్టుకోండి. గోదావరి అవార్డు ప్రకారం మీరు ఎన్ని నీళ్లు తీసుకుపోయినా మాకు అభ్యంతరం లేదు.’ ఇదీ గవర్నర్ సమక్షంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి అన్నమాటలు. ఇక వారితో సంప్రదింపులు అంటే కాలయాపన తప్ప మరేమీ ఉండదని కేసీఆర్ నిర్ధారణకు వచ్చారు.
ఇదిలా ఉంటే 2015, మార్చిలో సీడబ్ల్యూసీ తుమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యతపై ఒక లేఖ రాసింది. అందులో తుమ్మిడిహట్టి వద్ద 165 టీఎంసీల నీటి లభ్యత ఉన్నదని పేర్కొన్న మాట వాస్తవమే. వారు అక్కడితో ఆగిపోలేదు. అందులో 63 టీఎంసీలపై రాష్ర్టాల వాటా కలిసి ఉన్నదని కూడా పేర్కొనారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు అవసరాలకు తగినన్ని నీళ్లు విశ్వసనీయంగా భవిష్యత్తులో లభ్యం కాకపోవచ్చునని స్పష్టంగా చెప్తూ ప్రాజెక్టు నుంచి మళ్లించే నీటి పరిమాణాన్ని పునఃసమీక్షించుకోమని హెచ్చరించారు. 4.3.2015న సీడబ్ల్యూసీ వారు ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్‌కు రాసిన లేఖలో పేరా 3, Combined Yields Series అనే ఉప శీర్షిక కింద పేరా XIIలో రాసిన వాక్యాలను యథాథతంగా ఉల్లేఖిస్తున్నాను.
As evident from detailed water availability studies carried out by project authorities and this office in last few years , the net water availability at the barrage location is about 165 TMC at 75 % dependability which includes perceived surpluses from the share of u/s states (i.e assuming the utilization of u/s states limited to 75 % dependability of 63 TMC ).
పై మాటలు రాస్తూ ప్రాజెక్టు అవసరాలకు సరిపోయే నీరు భవిష్యత్తులో నికరంగా లభ్యం కాకపోవచ్చునని, నీటిని తరలించే పరిమాణాన్ని పునః పరిశీలించమని ప్రాజెక్ట్ అధికారులను హెచ్చరించింది. ఆ మాటలను కూడా యథాతథంగా ఉల్లేఖిస్తున్నాను.
As such the availability of surpluses from the u/s states as estimated at barrage site may not be reliably available in future. The project authorities are advised to review the quantum of divertible flows from Pranahita barrage site considering the overall availability at the location, requirement of environmental flows, capacity of pumping, storage of barrage, en-route and command area storages.
తుమ్మిడిహట్టి వద్ద లభ్యమయ్యే 75 శాతం విశ్వసనీయత కలిగిన 165 టీఎంసీలలో 3 రాష్ర్టాల నీటివాటాను తీసివేస్తే భవిష్యత్తులో తరలించే నీటి పరిమాణం 102 టీఎంసీలకు మించి కుదరదని తేలింది. ఇది బ్యారేజీని 152 మీటర్ల ఎఫ్ఆర్ఎల్ వద్ద నిర్మించినప్పుడే సాధ్యం. మహారాష్ట్ర తుమ్మిడిహట్టి బ్యారేజీ ఎఫ్ఆర్ఎల్ని 148 మీటర్లకు తగ్గించమని పట్టుబడుతున్నది. 148 మీ ఎత్తు వద్ద తరలించే నీటి పరిమాణం 44 టీఎంసీలకు మించే అవకాశం లేదు అని ప్రాజెక్టు సిమ్యులేషన్ స్టడీస్‌లో తేలింది. అవి ఆదిలాబాద్ జిల్లా అవసరాలకే సరిపోతాయి. కాబట్టి మిగతా జిల్లాల అవసరాల కోసం, ప్రాజెక్టు మొత్తం 160 టీఎంసీల నీటి తరలింపునకు రూపకల్పన చేసి పనులు ప్రారంభించినందున అంతే, లేదా అంతకంటే ఎక్కువ నీరు లభ్యమయ్యే చోట బ్యారేజీని నిర్మించవలసిన అవసరం ఏర్పడింది. అందుకే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును రీ ఇంజినీరింగ్ చేయాలని ప్రభుత్వం తలపోసింది.
నీటి లభ్యతపై గతానుభవాలు: ఈ సందర్భంగా నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్‌లో మన అనుభవాలను గుర్తుచేసుకోవాలి. ఆ ప్రాజెక్టులు కట్టినప్పుడు పుష్కలంగా నీరు వచ్చేది. 1980వ దశకం వరకు ఈ స్థితి ఉండేది. పై రాష్ర్టాలైన కర్ణాటక, మహారాష్ట్రలు తమ వాటాను వినియోగించుకోవడానికి ప్రాజెక్టులు కట్టుకున్నప్పటి నుంచి మన ప్రాజెక్టుల్లోకి ప్రవాహాలు గణనీయంగా తగ్గిపోయాయి. ఈ అనుభవాలను దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో నికరంగా నీరు లభ్యం కాకపోవచ్చునన్న సీడబ్ల్యూసీ హెచ్చరికను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకున్నది. వేల కోట్లు ఖర్చుచేసి నిర్మిస్తున్న ప్రాజెక్టుల సాఫల్యతను దృష్టిలో పెట్టుకోక తప్పదు. గతానుభవాల దృష్ట్యా ఇప్పుడు వస్తున్న నీళ్లను చూసి ప్రాజెక్టులపై ఖర్చుచేయలేం. వందేండ్ల పాటు ప్రాజెక్టు సాఫల్యతను దృష్టిలో పెట్టుకునే ప్రాజెక్టులను నిర్మిస్తారు. ఆ దృష్టితోనే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును 9 టీఎంసీల జూరాల జలాశయం నుంచి 215 టీఎంసీల శ్రీశైలం జలాశయానికి మార్చింది. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు రీ ఇంజినీరింగ్ చేసేటప్పుడు కూడా ఆ దృష్టికోణంతోనే ప్రత్యామ్నాయ స్థలం కోసం అన్వేషించాం. ఆ అన్వేషణలో మేడిగడ్డ అనువైనదని తేలింది. ప్రముఖ ఇంజినీర్ దివంగత టి.హనుమంతరావు కూడా గోదావరి జలాల వినియోగానికి తాను రూపొందించిన Step Ladder Technology లో ప్రతిపాదించిన 7 వరుస బ్యారేజీల్లో మేడిగడ్డ సమీపంలో ఉన్న సూరారం బ్యారేజీ ఒకటి. తుమ్మిడిహట్టి వద్ద భవిష్యత్తులో నికరంగా 165 టీఎంసీలు లభ్యం కాకపోవచ్చునని చెప్పిన సీడబ్ల్యూసీ మేడిగడ్డ వద్ద 284.3 టీఎంసీలు లభ్యమవుతాయని చెప్పడం గమనార్హం.
మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణాన్ని రిటైర్డ్ ఇంజినీర్ల కమిటీ వ్యతిరేకించిందా?: మేడిగడ్డ బ్యారేజీని రిటైర్డ్ ఇంజినీర్లు వ్యతిరేకించారని, వారు వద్దన్నా మేడిగడ్డ వద్ద బ్యారేజీని నిర్మించిందని నిన్న అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. మేడిగడ్డ బ్యారేజీపై రిటైర్డ్ ఇంజినీర్లు ఏం చెప్పారు? వారు వ్యతిరేకించిన అంశం ఏమిటన్నది వారి నివేదికలోని వాక్యాలను చదివితే అర్థం అవుతుంది. తొలుత రీ ఇంజినీరింగ్‌లో మేడిగడ్డ నుంచి నేరుగా మిడ్‌మానేరు జలాశయానికి గోదావరి నీటిని ఎత్తిపోయాలని ప్రతిపాదించింది. ఈ మార్గం సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయడానికి ప్రభుత్వం రిటైర్డ్ ఇంజినీర్ల కమిటీని ఏర్పాటుచేసింది. ఆ కమిటీ క్షేత్రస్థాయిలో పర్యటించి, సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్‌లను కూలంకషంగా పరిశీలించి బ్యారేజీ నిర్మాణానికి మేడిగడ్డ స్థలం అనువైనదని, అయితే, మేడిగడ్డ నుంచి నేరుగా మిడ్ మానేరు జలాశయానికి నీటిని తరలించడం మాత్రం వీలుకాదని పేర్కొన్నది. ఆ మార్గంలో తాడిచర్ల బొగ్గు గనులు, సింగరేణి ఓపెన్ కాస్ట్ గనులు అందుకు అవరోధంగా ఉన్నాయని రిటైర్డ్ ఇంజినీర్లు తమ నివేదికలో పేర్కొన్నారు. వారు తమ నివేదికలో పేజీ 7లో రాసిన వాక్యాలను యథాతథంగా ఉల్లేఖిస్తున్నాను.
The site of barrage was examined during the Aerial survey and proposed site for construction is feasible in view of less width of Godavari river. As per topo sheet study the FRL of the barrage can be fixed at about +105 m without submerging patta lands in Maharashtra state.
మేడిగడ్డ బ్యారేజీ నుంచి నేరుగా నీటిని తరలించే ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ వారి అభిప్రాయాన్ని పేజీ 8లో ఇట్లా వ్యక్తం చేశారు. The proposed alignments of tunnels and gravity canals are passing through the coal belt area i.e Tadicherla coal block and Singareni open cast mines. Due to the presence of coal belt area in the alignment, the execution of Tunnels and gravity canal may not be feasible.
నివేదిక చివరలో కూడా పేజీ 13లో కూడా ఇదే అంశాన్ని పొందుపరిచారు. అంతే తప్ప వారు మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మాణాన్ని వ్యతిరేకించలేదు. ఆ తర్వాత రిటైర్డ్ ఇంజినీర్ల సూచన మేరకు మేడిగడ్డ మిడ్ మానేరు మార్గాన్ని త్యజించి మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి బ్యారేజీకి నీటిని గోదావరి నదీమార్గం ద్వారానే తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు వీలుగా అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు, వాటి అనుబంధ పంప్‌హౌజ్‌లను, 13 కిలోమీటర్ల గ్రావిటీ కాలువను కూడా ప్రభుత్వం నిర్మించింది.
– (వ్యాసకర్త: విశ్రాంత సూపరింటెండెంట్ ఇంజినీర్, సాగునీటి శాఖ ) శ్రీధర్‌రావు దేశ్‌పాండే