సాంస్కృతిక పునరుజ్జీవం: ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణలో సాంస్కృతిక పునరుజ్జీవం జరిగింది. వలస పాలకుల పాలనలో బతుకమ్మ నిమజ్జనాలు కూడా కొన్నిసార్లు కష్టతరమైపోయాయి. కానీ స్వపరిపాలనలో జిల్లాల్లో చెరువుల పునరుద్ధరణ, ట్యాంక్‌బండ్‌లో కూడా నిమజ్జనానికి అనుమతి లభించడంతో బతుకమ్మ పండుగ అత్యద్భుతంగా జరిగింది. బతుకమ్మ పండుగ, సమ్మక్క-సారలమ్మ జాతరకు ప్రభుత్వం నిధులు కూడా విడుదల చేయడంతో తెలంగాణ పండుగలు 1956 కంటే ముందు ఉన్నట్టుగా జరుపుకొన్నారు ప్రజలు.
ఈ పండుగలకు ఊర్లకు వెళ్లే ప్రజలకు బస్సు టికెట్ రేట్లు పెంచడం తప్ప, ఏమీ చేయలేదు వలస పాలకులు. కానీ, తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు సంతోషంగా వారి పండుగలు నిర్వహించుకున్నారు. మరి విభజన తర్వాత చంద్రబాబు తన మొదటి టర్మ్‌లో కూచిపూడికి ఇస్తానన్న రూ.100 కోట్ల రూపాయలు ఇచ్చారా? ఆ పల్లెటూరికి ఏమైనా మంచి జరిగిందా? ఈ పదేండ్లల్లో తమిళనాడు ప్రభుత్వం లాగా కనీసం వృద్ధులైన కూచిపూడి నాట్యాచార్యులకైనా కనీస పెన్షన్ ఇచ్చారా?
వివిధ వర్గాలకు ధన సహాయం: తెలంగాణలో కేసీఆర్ పాలనలో అన్ని వర్గాలకు మేలు జరిగింది. కేసీఆర్ సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జిల్లాలో కంటిచూపు తగ్గిపోయి బాధ పడుతున్న పెద్ద మనుషులను చూసి చలించిపోయారు. తన నియోజకవర్గానికి వచ్చిన నిధులతో ఒక పథకాన్ని రచించి, జిల్లా వాసులందరికీ కంటి పరీక్షలు జరిపించి, అవసరం ఉన్న వాళ్లకు కండ్లజోళ్లు అందించి, శస్త్ర చికిత్సలు కావాల్సిన వారికి చేయించారు. ఆ పథకం మొత్తం జిల్లా వాసులందరికీ ఉచితంగానే లభించింది. ముఖ్యమంత్రి అయ్యాక కేసీఆర్ కంటి వెలుగు పథకాన్ని రాష్ట్రమంతటా విస్తరించారు. దాంతో పేదవారికి చాలా మేలు జరిగింది. ఇటువంటి పథకాన్ని ఏ రాష్ట్రమూ అమలు చేయలేదు. ఢిల్లీని అద్భుతంగా అభివృద్ధి చేసిన కేజ్రీవాల్.. కంటి వెలుగు కార్యక్రమాన్ని మెచ్చుకున్నారు. అలాగే 60 ఏండ్లు దాటిన వారికి 2000 రూపాయల పెన్షన్, రిటైరైన బీడీ కార్మికులకు, భర్తలను కోల్పోయిన ఒంటరి మహిళలకు పెన్షన్లు అందించారు. పేదవారి ఇంట్లో ఆడ పిల్ల పెండ్లికి లక్ష రూపాయల నగదు అందించారు. అది వారిని అప్పుల్లో మునగకుండా కాపాడింది. అంతేకాదు, ఆ పెండ్లి కూతుళ్లు పదో తరగతి చేసి ఉండాలన్న నిబంధన పెట్టడంతో బాల్య వివాహాలు చాలావరకు తగ్గిపోయాయి. ఇటువంటివే కాక హైదరాబాద్‌లో రోడ్ల మీద తిరుగుతూ యాచించుకునే వారి కోసం షెల్టర్లు కట్టి భోజనాలు అందించారు.
సిటీల్లో అన్నపూర్ణ క్యాంటీన్లు పెట్టి సామాన్యులకు రూ.5 లకే భోజనం పెట్టారు. అతి సామాన్యుల కోసం అందించే ఇటువంటి పథకాలు ఏ ఇతర రాష్ట్రంలోనూ అమలు కాలేదు. మరి 2014లో తన ఏపీ రాష్ర్టానికి ముఖ్యమంత్రి అయిన ప్రపంచ విజనరీ చంద్రబాబు ఏం చేశారు?
వాతావరణ రక్షణ: ఈ రోజున సాంకేతిక, రవాణా సౌలభ్యం పేరుతో నగరాల్లో వాతావరణ కాలుష్యం పెరిగిపోతున్నది. అవసరానికి మించిన వాహనాలు, నగరాల మధ్యలో పరిశ్రమలు, పెరుగుతున్న జనాభా అవసరాల కోసం ఇండ్లు, బహుళ అంతస్తుల భవనాలు- నగరాల్ని పూర్తి కాంక్రీటుతో నింపేస్తున్నాయి. వీటి కోసం చెట్లను నిరాటంకంగా కొట్టివేయడంతో గాలి, నీరు కలుషితమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ హయాంలో స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు మిషన్ భగీరథ వంటి బృహత్తర పథకం తీసుకొచ్చారు. అలాగే హరితహారం పథకంలో కోట్లాది మొక్కలు నాటారు. చెట్లు గాలిలోని కార్బన్ డై ఆక్సైడ్‌ను తీసుకొని, ప్రాణవాయువు (ఆక్సిజన్) ను గాలిలోకి విడుదల చేస్తాయని అందరికీ తెలుసు. వాహనాలు, ఇతర పరిశ్రమలు వెలువరించే చెడు గాలిని చెట్లు వెలువరించే ప్రాణవాయువు సంతులన పరుస్తుంది. గాలిలో ప్రాణవాయువు ఎంత ఎక్కువగా ఉంటే మనుషులకు అంత స్వచ్ఛమైన గాలి దొరికి కొన్ని రుగ్మతలను అరికట్టవచ్చు. హరితహారం ఫలితంగా నగరాల్లో వాయు కాలుష్యం తగ్గడమే కాకుండా, అటవీకరణ కూడా పెరిగింది.
నిజానికి హైదరాబాద్ రాష్ర్టాన్నిఒక దేశంగా పాలించిన నిజాంలకు ఈవిషయంలో చాలా శ్రద్ధ ఉండేది. 1400వ సంవత్సరంలో పాలన మొదలుపెట్టిన ముస్లిం పాలకులంతా నగరంలో తోటలు విస్తారంగా పెంచడంలో ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు హైదరాబాద్ నగరంలో వినిపించే కొన్ని పేర్లు బషీర్‌బాగ్, కంచన్‌బాగ్, గండిపేట గార్డెన్, పబ్లిక్ గార్డెన్, కిద్వాయ్ గార్డెన్ వంటివి కంటికి ఆహ్లాదంగా కనిపించే, స్వచ్ఛమైన ప్రాణవాయువును ఇచ్చే ప్రాంతాలుగా ఉండేవి.
53 ఏండ్ల విధ్వంస పాలనలో తెలంగాణను అన్ని విధాలుగా నాశనం చేసిన వలస పాలకుల ఏలుబడిలో చాలా తోటలు ఆంధ్రా ప్రాంత నాయకుల పేర్లు సంతరించుకున్నాయి. వాటి చుట్టుపక్కల కాలనీలు పెరిగాయి. తెలంగాణ ప్రాజెక్టులు ఆపేసి, ఈ ప్రాంతాన్ని ధ్వంసం చేసి, ప్రజలను పీడించిన సంజీవరెడ్డి పేరుతో కాలనీ, తెలంగాణ కోసం గొంతెత్తిన వందలాది మంది యువతను కాల్చి చంపిన కాసు బ్రహ్మానందరెడ్డి పేరుతో పార్క్, తెలంగాణ వేరు పడితే హైదరాబాద్‌ను తగులబెడుతానన్న జలగం వెంగళరావు పేరుతో పార్క్ వంటివి తెలంగాణకు ఇంకా అవసరమా? ప్రజలు ఆలోచించాలి. ఈ చరిత్రను పూర్తిగా ఔపోశన పట్టిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి తన పదేండ్ల పాలనలో కోట్లాది మొక్కలు నాటించడంతో దేశంలోని ఇతర నగరాల మాదిరిగా హైదరాబాద్ కాలుష్యంతో నిండలేదు. మిగతా రాష్ర్టాల్లోని చాలా నగరాల కంటే హైదరాబాద్ స్వచ్ఛంగానే ఉన్నది. గతంలో 53 ఏండ్ల వలస పాలకుల విధ్వంస పాలనను, 2023 నుంచి సాగుతున్న తెలంగాణ వ్యతిరేకత గల విధ్వంస పాలనను ఇంకా తట్టుకుని నిలబడే ఉన్నది హమారా షెహర్, హైదరాబాద్, తెలంగాణ సొంత నగరం!
మరి పొలాలను ధ్వంసం చేసి, రాజధాని కట్టే తెలివిలేక, ఆహార కొరతను సృష్టించే ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఎట్లా ఉన్నది? ఒలింపిక్స్ ఈతల పోటీలు నిర్వహించేందుకు అనువుగా 2 మీటర్ల వరకు నీరు నిలిచి ఉంటున్నది. నిపుణులు, పర్యావరణవేత్తలు, ఆర్థికవేత్తలు, ముఖ్యంగా శివరామకృష్ణ కమిటీ వద్దని చెప్పిన చోటే రాజధాని అంటూ కలల విజనరీ ఎంపిక చేసిన రాజధాని ఆంధ్ర రాష్ర్టానికి ఎప్పటికి సమకూరుతుంది? 1995 నుంచి సుదూర భవిష్యత్తును ఆశ చూపుతూ చంద్రబాబు ప్రకటిస్తున్న విజన్లు (విజన్ 2020, విజన్ 2047) నెరవేరుతాయా? అప్పటికి ఈ విజన్ల వల్ల నలిగిపోయిన సామాన్య ప్రజల్లో ఎందరు బతికి ఆ ఫలాలు అనుభవిస్తారు? ఆలోచించండి. ప్రతి వర్షాకాలంలోనూ వరదలతో పోటెత్తే కృష్ణానది, కొండవీటివాగు, కోటేళ్లవాగు, ఎర్రవాగు, పాలవాగు మొదలైన వాటి నీటిని ఆపేందుకు అంటూ అనవసర ఖర్చుతో నిర్మిస్తున్న చెక్‌డ్యామ్‌లు ఎప్పటికి పూర్తవుతాయి? ఒక అనువుగాని పథకానికి ఖర్చు పెట్టే బదులుగా, పోలవరం పూర్తి చేసి, వ్యవసాయం అభివృద్ధి చేయవచ్చు కదా ఈ దేశంలోనే సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు?
చంద్రబాబు పాలన (2014-2019)ను గమనించిన నరేంద్రమోదీయే అమరావతి పథకాన్ని చంద్రబాబుకు ఏటీఎంఅని వర్ణించాడు. అంతేకాదు స్కిల్ డెవలప్మెంట్ వంటి పథకాల్లో కూడాభారీ ఎత్తున అవినీతి జరిగిందన్నవార్తలు వచ్చాయి.
జాతీయ హోదానిచ్చి, కేంద్రమే నిర్మిస్తానన్న పోలవరం ప్రాజెక్టు నుంచి వారిని తప్పించి, తన అక్రమ సంపాదన కోసం తనే చేస్తానని పొంకణాలు కొట్టిన చంద్రబాబు ఈ 18 నెలల కాలంలో ఆ ప్రాజెక్టును ఎంతవరకు పట్టించుకున్నాడు? రూ.23 లక్షల కోట్ల నిధులు ఈ ఏడాదిన్నరలోనే వస్తే మరి పథకాలు ఎందుకు పూర్తి కావడంలేదు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు గత అనుభవాల నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి. కాంగ్రెస్ టికెట్‌తో పోటీ చేసి, ఒడిపోయి, 1983లో తన మామ పెట్టిన తెలుగుదేశం పార్టీలో చేరిన చంద్రబాబు, చాలా త్వరగానే తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ఎమ్మెల్యేగా మొట్టమొదటిసారి గెలిచిన సొంత తమ్ముడు రామ్మూర్తినాయుడును ఇంట్లో, అప్పటి దాకా ఎన్టీఆర్‌కు వెన్నుదన్నుగా ఉన్న పెద్దల్లుడు వెంకటేశ్వరరావును పార్టీలో నియంత్రిస్తూ, తెరవెనుక నాటకాలు విజయవంతంగా ఆడాడు. మామ ఎన్టీఆర్ రెండో పెండ్లితో కంగుతిని, ఇంక తాత్సారం చేయకుండా త్వరగానే తన సొంత పథకం అమలు చేసి, మామను పదవీచ్యుతుడిని చేశాడు. సొంత అల్లుడి వెన్నుపోటు అమలయ్యే వరకు దాని గురించి తెలియని రామారావు కంగుతిని, తనకు జరిగిన మోసాన్ని ప్రజలకు తెలియజెప్పాలని విజయవాడలో బహిరంగ సభ పెట్టాలని అనుకున్నాడు. బ్యాంకులోని రూ.76 లక్షల పార్టీ ఫండ్ తీసుకుందామని వెళితే అప్పటికే ఆ మేనేజర్ సహాయంతో చంద్రబాబు ఆ ధనాన్ని తన అకౌంట్‌కు మార్చుకున్నాడని తెలిసింది. రామారావుకు అంగబలం, ఆర్థిక బలం లేకుండా చేసిన చంద్రబాబు మోసపూరిత పథకాలు ఎంత విజయవంతంగా పూర్తి చేయగలడో అర్థం చేసుకోవచ్చు.
అదే సామాన్య ప్రజలకు సహాయం చేసే పథకాలలో తన తెలివిని వృథాగా వాడడు. పీపీపీ, బంగారు కుటుంబాల వంటి కొత్త విజన్లు తెస్తాడు. అది ఏ విధమైనా దాని నిధులు ఆయన వ్యక్తిగత ఖాతాలోకి, బాధ్యతంతా ప్రజల మీదికి బదిలీ అయిపోతాయి. లేకపోతే దాదాపు 47 ఏండ్ల రాజకీయ ప్రస్థానంలో కేవలం పదిహేనున్నర ఏండ్లు మాత్రమే అధికారంలో ఉన్న చంద్రబాబు మిగతా 3 దశాబ్దాల కాలం తన పార్టీని ఎలా నిర్వహించుకుని వస్తున్నాడు? నోరు తెరిస్తే సొంత డబ్బా కొట్టుకోవడం, అబద్ధాలు మాట్లడం ఆయన నైజం. అక్రమాలు, అవినీతి- ఇదే ఆయన చేసే పాలనలో నిజం! దీనిని బట్టి ఒక్క విషయం స్పష్టంగా అర్థమవుతున్నది.
పకోడీలు చేసే వంటవాడు పకోడీలు మాత్రమే అద్భుతమైన రుచిగా చేస్తాడు.. ప్రసాదం, పులిహోర చేయలేడు! ఎమర్జెన్సీని పొగిడి, కాంగ్రెస్ టికెట్ సంపాదించి 30 ఏండ్లు కూడా లేకుండా ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన కాంగ్రెస్ ఇచ్చిన మంత్రి పదవిని అడ్డం పెట్టుకుని రామారావుకు సన్నిహితుడయ్యాడు. తెలుగుదేశం ప్రభంజనం చూసి కేవలం ఐదేండ్లకే కాంగ్రెస్‌ను వదిలేసి, మా మ పార్టీలో చేరాడు. అక్కడ పదేండ్లలోపే పార్టీలో తన బలం పెంచుకుని మామను దించి ముఖ్యమంత్రి అయ్యాడు. ఇంకా పెద్ద విజయం ఏమిటంటే, ఎన్టీఆర్ కన్న పిల్లలను, వారి కుటుంబాలను కూడా తన గుప్పిట్లో పెట్టుకుని, వారందరూ రామారావుకు సహాయం చేయకుండా అడ్డుపడ్డాడు. ఇక 9 ఏండ్లు నియంత పాలనతో, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని పట్టించుకోకుండా, తెలంగాణ ప్రజలను అణచివేతతో, నిరాటంకంగా స్వార్థ పాలన సాగించాడు. ఇప్పుడు కూడా ఏపీలో అదే మోసపూరిత విధానంతో అధికారం చెలాయిస్తున్నాడు. తెలంగాణ, ఆంధ్ర ప్రజలు, రాజకీయ నేతలు కూడా ఈ సత్యాన్ని గ్రహించాలి.
కనకదుర్గ దంటు