భారత్, బంగ్లాదేశ్ మధ్య క్రికెట్ సంబంధాలు రోజురోజుకు దిగజారుతున్నాయి. బంగ్లాలో హిందువులపై కొనసాగుతున్న అమానుష దాడులకు వ్యతిరేకంగా ఐపీఎల్ నుంచి పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను తొలిగించడంతో మొదలైన రచ్చ.. రోజుకో మలుపు తిరుగుతున్నది. బాలీవుడ్ బాద్షా యాజమాన్యంలోని కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) ఇటీవల జరిగిన వేలంలో ముస్తాఫిజుర్‌ను రూ.9.20 కోట్లకు సొంతం చేసుకున్నది. షేక్ హసీనా నిష్క్రమణ తర్వాత బంగ్లాలో భద్రత ప్రమాణాలు ఘోరంగా దిగజారాయి. మైనారిటీ హిందువులను లక్ష్యంగా చేసుకుంటూ హత్యలు, లైంగికదాడులు, యథేచ్ఛగా దోపిడీలకు పాల్పడుతున్నారు. విద్యార్థి నాయకుడు ఉస్మాన్ హాదీ హత్య తర్వాత హిందువులపై దాడులు రెట్టింపయ్యాయి. ఓ వైపు బంగ్లాలో హిందువులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతుంటే ఆ దేశ పేసర్ ను ఐపీఎల్లో ఆడించడంపై హిందూ సంఘాలకు తోడు బీజేపీ లాంటి పార్టీలు తీవ్రస్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టాయి. హిందువుల ప్రాణాలకు లెక్కలేదా అంటూ కేకేఆర్ యజమాని అయిన షారుఖ్ ఖాన్‌ను లక్ష్యంగా చేసుకున్నారు.
ఐపీఎల్లో ముస్తాఫిజుర్‌ను కొనసాగిస్తే.. ఈడెన్‌గార్డెన్స్ పిచ్‌పై తవ్వేస్తామంటూ తీవ్ర హెచ్చరికలు చేశారు. ఇదంతా నిశితంగా గమనించిన భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ).. ముస్తాఫిజుర్‌ను తొలిగించమని కోల్‌కతాను ఆదేశించింది. అందుకనుగుణంగా ముస్తాఫిజుర్‌ను వదిలేస్తూ కేకేఆర్ నిర్ణయం తీసుకోగా, ఇదే అదనుగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) ప్రతిచర్యకు దిగింది. తమ దేశ పేసర్‌ను కేవలం మతం ఆధారంగా తీసేయడాన్ని జీర్ణించుకోలేని బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం, బీసీబీ.. రానున్న టీ-20 ప్రపంచకప్‌లో తాము భారత్‌లో మ్యాచ్‌లు ఆడేది లేదంటూ ప్రకటించింది. తమ దేశ ప్లేయర్లకు భారత్‌లో సరైన భద్రత దొరకడం కష్టంగా కనిపిస్తున్నదని, తమ మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలంటూ ఐసీసీకి విజ్ఞప్తి చేసింది. ఫిబ్రవరి 7 నుంచి మొదలయ్యే మెగాటోర్నీకి సంబంధించి ఇప్పటికే షెడ్యూల్ అధికారికంగా విడుదల కాగా, ప్లేయర్ల వసతి సౌకర్యాలు, ప్రయాణాలకు సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి.
ఒకరకంగా భారత్‌తో పాటు బీసీసీఐని ఇబ్బంది పెడుదామనుకుంటున్న బంగ్లా మేము ఆడమంటూ బెదిరించే ప్రయత్నాలకు దిగింది. అంతటితో ఆగకుండా మార్చి 26 నుంచి మొదలయ్యే ఐపీఎల్ ప్రసారాలపై తమ దేశంలో నిషేధం విధించింది. ఒక రకంగా బీసీసీఐ, బీసీబీ మధ్య క్రికెట్ యుద్ధం సాగుతున్నది. క్రికెట్ ప్రపంచాన్ని ఒంటిచేత్తో శాసిస్తున్న బీసీసీఐతో పెట్టుకుంటే ఏమవుతుందో దాయాది పాకిస్థాన్ పరిస్థితి చూస్తే బంగ్లాకు అర్థమవుతుంది. ప్రపంచంలోనే ధనిక క్రికెట్ బోర్డుగా వర్ధిల్లుతున్న బీసీసీఐ జోలికొస్తే ఎలా ఉంటుందో ఇప్పటికే పాక్‌కు అనుభవపూర్వకం. భారత్‌లో కనీసం ఒక రాష్ట్ర పరిమాణం అంత లేని బంగ్లాదేశ్ లేచి లేచి ఎగురుతున్నది. గతంలో ఇరు దేశాల మధ్య స్నేహపూర్వక రీతిలో సిరీస్‌లు జరుగగా, దౌత్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్న ప్రస్తుత తరుణంలో దాని తొలి ప్రభావం క్రికెట్‌పైనే పడుతుందని మరోమారు రుజువైంది. ఇప్పటికైనా వాస్తవ పరిస్థితిని గమనించి స్నేహ హస్తాన్ని చాటితే అది బంగ్లాకు లాభం లేకుంటే… బీసీసీఐతో పెట్టుకుంటే ఏమవుతుందో తెలియడానికి బీసీబీకి ఎక్కువ సమయం పట్టకపోవచ్చు. ఏదేమైనా క్రికెట్ సంబంధాలు తిరిగి పునరుద్ధరణకు నోచుకోవాలంటే రెండు దేశాల మధ్య సహృద్భావ వాతావరణం ఏర్పడాలని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు.