‘చెట్టొకటైతే.. విత్తొకటైతదా?’ అన్నట్టు.. సూట్‌కేసులు మోసిన ఘన చరిత్ర ఉన్న మన ముఖ్యమంత్రి పాలనలో అధికారులు (కొందరు మినహా) కూడా అలాగే ఉంటారు కానీ, ఆదర్శవంతంగా ఉంటారా? అందుకే వారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని అనుసరిస్తున్నారు. ఆయన బాటలో నడుస్తున్నారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకొని సంచులు మోస్తున్నారు.
గ్రామస్థాయిలో ఉండే చిన్న చిన్న ఉద్యోగులు మొదలుకొని జిల్లా యంత్రాంగాన్ని నడిపే కలెక్టర్ల వరకు అవినీతిలో జలకాలాడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే ఎంతోమంది అవినీతి అధికారులు ఏసీబీకి పట్టుపడగా.. తాజాగా హైదరాబాద్ సమీపంలో ఉండే ఓ జిల్లా కలెక్టర్ తన తండ్రిని అడ్డుపెట్టుకొని భూ దందాలు చేస్తున్నారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. రాష్ట్ర పాలనా యంత్రాంగంలో కీలకపాత్ర పోషించే జిల్లా స్థాయి ఉన్నతాధికారే అవినీతితో అంటకాగుతున్నారంటే రాష్ట్రంలోని మొత్తం పరిస్థితి ఎలా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. అయితే, అవినీతికి అడ్డుకట్ట వేయాల్సిన ప్రభుత్వమే అవినీతిని పెంచి పోషిస్తుండటంతోనే ఈ పరిస్థితి దాపురించిందని బల్లగుద్ది మరి చెప్పవచ్చు.
కాంగ్రెస్ అంటేనే అవినీతికి కేరాఫ్ అడ్రస్. స్కాములకు పర్మినెంట్ అడ్రస్. అందుకే ప్రజలు ఆ పార్టీని ‘స్కాంగ్రెస్’ అనే ముద్దుపేరుతో పిలుచుకుంటారు కూడా.ఏ ఫర్ ఆదర్శ్, బీ ఫర్ బోఫోర్స్, సీ ఫర్ కామన్వెల్త్ స్కాం.. ఇలా చెప్పుకొంటూ పోతే ఎన్నో స్కాములు చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. గాలిలో 2జీ స్పెక్ట్రం, భూమిపై ఎమ్మార్ ప్రాపర్టీస్ స్కాం, నీటిలో ఏలేశ్వరం, ప్రాణహిత- చేవెళ్ల మొబిలైజేషన్ అడ్వాన్స్‌లు, ఆకాశంలో వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ స్కాం.. ఇలా పంచభూతాలను సైతం వదలకుండా స్కాములు చేసిన ఘనాపాటీలు కాంగ్రెస్ పార్టీ నాయకులు. స్కాములు చేయడంలో పీహెచ్‌డీలు, ఎంఫిల్‌లు చేసిన కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో అవినీతికి పర్యాయపదం లాంటి రేవంత్‌రెడ్డి తోడయ్యారు. ఆయన అధికారం చేపట్టినప్పటి నుంచి రాష్ట్రంలో అవినీతిని ఆప వశం లేకుండాపోతున్నది.
ఒక సభలో ప్రసంగిస్తూ స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలెక్టర్లు తప్పులు చేస్తున్నారన్నారు. తాము ఒక తప్పు చేద్దామని చెప్తే కలెక్టర్లు రెండు మూడు చేద్దామని సూచిస్తున్నారని చెప్పారు. రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలే రాష్ట్రంలో అవినీతి వేళ్లూనుకొనిపోయిందనడానికి సాక్ష్యంగా చెప్పవచ్చు. పైసా ముట్టజెప్పనిదే రేవంత్‌రెడ్డి పాలనలో ఒక్క పని కూడా జరగడం లేదు.
కాంట్రాక్టర్ల నుంచి రిటైర్డ్ ఉద్యోగుల వరకు.. ప్రజాప్రతినిధులు, అధికారుల చేతులు తడపాల్సిందే. మంత్రులు ఒక్కో పనికి ఒక్కో విధంగా కమీషన్ వసూలు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ కమీషన్ అనే పదానికి బదులుగా ‘ఆర్ఆర్టీ’, ‘యూఆర్టీ’ ‘బీవీఆర్టీ’, ‘పీపీటీ’ అనే ముద్దుపేర్లు కూడా రాష్ట్రంలో చెలామణి అవుతున్నాయంటే అవినీతి ఏ రేంజ్లో తొడగొడుతున్నదో మనం అర్థం చేసుకోవచ్చు. మిల్లర్ల నుంచి ఒక రేటు, కాంట్రాక్టులు దక్కాలంటే మరో రేటు, చేసిన పనులకు బిల్లులు మంజూరు కావాలంటే ఇంకో రేటు.. ఆఖరికి హక్కుగా రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ పొందేందుకు కూడా కప్పం కట్టాల్సి వస్తున్నది. ఇక ఇసుక సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మొదట్లోనే చీకటి దందాలో ఇసుక రవాణా మొదలైపోయింది. ఆర్థిక వ్యవస్థపై అవగాహన లేని ముఖ్యమంత్రి పాలనలో అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థ అథమ స్థాయిలో కూరుకుపోయింది. దీంతో నిధులకు కటకట ఏర్పడుతున్నది.
ఇంకేం… పదేండ్లుగా పైసల మొహం చూడని చిన్నచితకా కాంగ్రెస్ నేతల నుంచి మంత్రివర్యుల వరకు ఇసుకను జల్లెడ పట్టారు. ఓ ఎమ్మెల్యే ఏకంగా తన నియోజవర్గం నుంచి వెళ్తున్న స్క్రాప్ లారీల నుంచి కమీషన్ దండుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. ఇలా చెప్పుకుంటూపోతే అధికార పార్టీ నేతల ఆగడాలకు అంతేలేదు.. ఒక్కొక్కరిది ఒక్కో అవినీతి కథ. అధికార పార్టీ నేతలను గాడిలో పెడతారని, అవినీతికి అడ్డుకట్ట వేస్తారని ప్రత్యేకంగా నియమించిన రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల మాజీ ఇంచార్జ్ అవినీతిలో వీళ్లను మించిపోయారని వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ వ్యాసం రాసే సమయానికి టీవీలో స్క్రోలింగ్ వస్తున్నది. ‘చేసిన పనులకు బిల్లులు చెల్లించమంటే.. సచివాలయం అధికారులు 20 శాతం కమిషన్ అడుగుతున్నారు’ అని చిన్న చిన్న కాంట్రాక్టర్లు ఆందోళన చేయడం గమనార్హం.
పాలకులే అవినీతికి అంటకాగుతుంటే.. రాజ్యాధినేతలే అవినీతిని పరాకాష్ఠకు తీసుకెళ్తుంటే పాపం ప్రభుత్వ అధికారులు మాత్రం బల్లల కింద చేతులు చాపకుండా ఉంటారా? ‘తిలాపాపం తలా పిడికెడు’ అన్నట్టు ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్లు పేద ప్రజల రక్తాన్ని జలగల్లా పీలుస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటినుంచి ప్రధాన మీడియాలో కానీ, సోషల్ మీడియాలో కానీ ‘ఏసీబీ వలలో చిక్కిన మరో అవినీతి చేప’ అనే వార్త లేకుండా పొద్దు గడవడం లేదు. వీళ్లంతా పట్టుబడ్డ అధికారులు మాత్రమే. పట్టుబడకుండా తప్పించుకు తిరుగుతున్న అవినీతి చేపలు, కాదు కాదు తిమింగలాలు ఇంకెన్నో…
-షేక్ పారేజ్ మొహియుద్దీన్
96661 74738