కక్ష, కార్పణ్యాలు చొరబడితే పగ, ప్రతీకారాలతో రాజకీయాలు రగిలిపోతాయని నడుస్తున్న చరిత్ర చెప్తున్నది. అధికారమిచ్చిన ప్రజల కోసం కాకుండా పాలానా కాలమంతా కేసులు, జైళ్లు, ప్రతీకారంపైనే దృష్టిసారించిన రాజ్యాలేవీ నాటి నుంచి నేటి వరకూ మనుగడ సాగించిన దాఖలాలు చరిత్రలో లేవు. రాజ్యాలు మారినా, రాజులు పోయినా నాటి రాజకీయాలే నడుస్తుండటం ప్రజాస్వామ్యానికి మాయని మచ్చలా పరిణమిస్తున్నది. ఇవాళ రాజకీయ పార్టీలు చట్టాలను దుర్వినియోగం చేస్తూ తమ రాజకీయ శత్రువులపై వాటిని ప్రయోగించడం దేశ రాజకీయాల్లో సాధారణ విషయంగా మారడం రాజ్యాంగానికి ప్రమాదకరం.
ఉద్యోగాల కోసం నిరుద్యోగులు, ఏక్ పోలీస్ విధానం అమలు చేయాలని పోలీసులు, పెండింగ్ బిల్లుల కోసం మాజీ సర్పంచ్‌లు, మంచి బువ్వ కోసం హాస్టళ్ల విద్యార్థులు, రైతుబంధు, రుణమాఫీ కోసం రైతన్నలు, వేతనాల కోసం ఆశావర్కర్లు, ఆటోడ్రైవర్లు, హైడ్రా, మూసీ బాధితులు, లగచర్ల, దిలావర్పూర్ రైతాంగం.. ఇలా చెప్పుకొంటూపోతే కాంగ్రెస్ ఏడాది పాలనలో రోడ్డెక్కని వర్గమే లేదు. నిరసన తెలపని బాధితులూ లేరు.
తెలంగాణలో ప్రజాపాలన కాస్త ప్రతీకార పాలనగా మారిందన్నది సుస్పష్టం. అధికారమే శాశ్వతమని, సింహాసనం తమ సొంతమని భావిస్తూ కాంగ్రెస్ సర్కారు, ముఖ్యంగా సీఎం రేవంత్‌రెడ్డి తీసుకుంటున్న ఆవేశపూరిత, ప్రతీకారేచ్ఛ నిర్ణయాలపై తెలంగాణ సమాజం లోతుగా అధ్యయనం చేస్తున్నది. అసాధ్యమనుకున్న స్వరాష్ట్రం కలను సుసాధ్యం చేసిన తెలంగాణ జాతిపిత, ఉద్యమ కెరటం కేసీఆర్‌పై, బీఆర్ఎస్ పార్టీపై, నాయకత్వంపై సాగుతున్న కుట్ర కోణం అంతా ఇంతా కాదు. బీఆర్ఎస్ అనే మొక్కనే మొలవనివ్వనని బహిరంగంగా తన కసిని, కోపాన్ని వెళ్లగక్కిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రతీకారేచ్ఛతో రగిలిపోతూ పాలన కంటే కేసులపైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించారు. 14 ఏండ్ల పాటు తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించి, పదేండ్లు ముఖ్యమంత్రిగా రాష్ర్టానికి సేవలందించిన కేసీఆర్‌ను కేసుల్లో ఇరికించి జైల్లో పెట్టాలన్నది ముఖ్యమంత్రి ఉవాచ అని స్పష్టమవుతున్నది. అంతెందుకు తన పేరు ఉచ్చరించలేదనే కారణంతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ను జైల్లో పెట్టి వికృతానందం పొందిన రేవంత్ ఆటిట్యూడ్‌ను ఇవాళ తెలంగాణ సమాజం నిశితంగా గమనిస్తున్నది.
కేసీఆర్‌పై రేవంత్ ప్రతీకారం వెనుక ఓటుకు నోటు కేసు ఉన్నదనే విషయం స్పష్టంగా తెలుస్తున్నది. కొత్తగా తెచ్చుకున్న రాష్ర్టాన్ని, ప్రజలెన్నుకున్న ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రల్లో భాగంగా చంద్రబాబుతో చేతులు కలిపి అడ్డంగా దొరకడంతో నాటి ప్రభుత్వం చట్టప్రకారం చర్యలు తీసుకున్నది. ఆ కారణంగానే ఇప్పుడు కేసీఆర్‌ను జైల్లో వేయాలని రేవంత్ ఉబలాటపడుతున్నారు. అందులో భాగంగానే కాళేశ్వరం కమిషన్, విద్యుత్ కొనుగోళ్ల నివేదిక తదితర అంశాల ఆధారంగా చర్యలుంటాయని లీకులిస్తున్నారు. కాళేశ్వరంతో తెలంగాణ ఎలా సస్యశ్యామలమైనదో ప్రపంచానికి తెలుసు. కారుచీకట్లో ఉన్న తెలంగాణను కరెంట్ వెలుగులతో దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా మార్చిన ఘనత కూడా కేసీఆర్‌దే. ఈ రాష్ట్ర రైతాంగానికి పొలం నిండా నీళ్లు.. కల్లం నిండా కరెంట్ ఇచ్చిన పాపానికి కేసీఆర్‌ను జైల్లో వేయాలని రేవంత్ ఆరాటపడుతున్నట్టు తాజా క్యాబినెట్ భేటీతో రూఢీ అయింది.
ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఇంటిపై డ్రోన్లు ఎగురవేసి, ఆయన ప్రైవసీకి భంగం కలిగించి, కుట్రకు పాల్పడిన రేవంత్‌పై నాటి సర్కారు చర్యలు తీసుకుంది. దాన్ని మనసులో పెట్టుకున్న ఆయన ప్రతీకారంతో అధికారంలోకి రాకముందే కేసీఆర్ కుటుంబాన్ని జైల్లో వేస్తానని, జైలులో డబుల్ బెడ్రూం కట్టిస్తానని పదే పదే చెప్పారు. రేవంత్ మాటలను బట్టి ఆయన గమనం ఎటుపోతున్నదో అవగతమవుతున్నది. అందుకోసమే ఈ- కార్ రేసింగ్, ఇతరత్రా అంశాలను కేటీఆర్ చుట్టూ తిప్పుతున్నారు.
ఏడాదిలోనే కేటీఆర్‌పై 10 కేసులను నమోదు చేశారు. ఈ నేపథ్యంలో సంబంధం లేని కేసుల్లో ఇరికించి జైలుకు పంపించాలన్నది రేవంత్ కుట్రగా అందరికీ తెలుస్తున్నది. ఇక ఎలాంటి ఆధారాలు లేని ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్‌రావును ఇరికించి, జైలుపాలు చేయాలని రేవంత్ ఉవ్విళ్లూరుతున్నారు. బీఆర్ఎస్, కేసీఆర్‌ను రాజకీయంగా ఖతం చేసేందుకు రెండు జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ చేయని ప్రయత్నమే లేదు.
కేసీఆర్‌ను, బీఆర్ఎస్ను కూకటివేళ్లతో పెకిలించే వ్యూహంతోనే రేవంత్ పాలన సాగుతున్నది. కేసీఆర్, కేటీఆర్‌ను అరెస్ట్ చేసి కట్టడి చేయడం ఎట్లనో ఇటీవల క్యాబినెట్లో భేటీలో మంత్రివర్గ సభ్యులకు సీఎం రేవంత్ హితబోధ చేసిన తీరు, త్వరలో పొలిటికల్ బాంబులు పేలుతాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పదేపదే పునరుద్ఘాటిస్తున్న వైనం, కోమటిరెడ్డి సహా మిగతా మంత్రులు వంతపాడుతుండటం మనం చూస్తూనే ఉన్నాం. ప్రజల్లోంచి పుట్టిన ఉద్యమ పార్టీని కేసులతో, జైళ్లతో బెదిరించగలరా? జన బాహుళ్యం నుంచి వచ్చే నిరసనలను చవిచూడగలరా? ఏడాదిలోనే నూరు శాతం వ్యతిరేకతను మూటగట్టుకున్న రేవంత్ సర్కారు ప్రతీ వర్గం నుంచి ఆందోళనలను ఎదుర్కొంటున్నది.
ప్రజల కోసం, ప్రజలచేత ఎన్నుకోబడిన ప్రభుత్వం ప్రజల గురించి ఆలోచించాల్సింది పోయి ఇవాళ ప్రతిపక్ష పార్టీని ఖతం చేయాలన్న దురుద్దేశంతో ముందుకు పోతున్నది. ఈ వైఖరి రేవంత్ సర్కార్‌కు పెనుశాపంలా మారు తుంది. అరచేతిని అడ్డుపెట్టుకొని సూర్యకాంతిని ఎవరూ ఆపలేరనే నగ్నసత్యాన్ని పాలకులు గ్రహించాలి. అలాగే ఉద్యమ దివిటీలను ముట్టుకుంటే మరో ఉప్పెన వస్తుందని తెలుసుకుని మసులుకుంటే మంచిది.
(వ్యాసకర్త: శాసనమండలి సభ్యులు)
-పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి