బీహార్ ఎన్నికల్లో విజయం సాధించాక బీజేపీ మరింత ధీమాగా కనిపిస్తున్నది. అందుకు అనుగుణంగానే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రతిపక్షాన్ని ఉద్దేశించి ప్రధాని మోదీ వ్యంగ్యంగా మాట్లాడారు. ‘డ్రామా చేయడానికి దేశంలో ఇతర ప్రదేశాలెన్నో ఉన్నాయి. ఇక్కడ చేయాల్సింది నినాదాలు కాదు, విధానాలపై చర్చ’ అని మోదీ గొప్పగా చెప్పారు.
మోదీ పన్నిన ఈ వాగ్దాటి వలలో ప్రతిపక్షం సులువుగా చిక్కుకుంది. మోదీ వ్యాఖ్యలపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ స్పందించే క్రమంలో ‘మోదీ ప్రసంగమే అసలైన డ్రామా’ అని కాంగ్రెస్ పేర్కొంది. దీంతో చర్చ మొత్తం ‘డ్రామా’ చుట్టూ తిరగసాగింది. ఈ నేపథ్యంలో మోదీ సర్కార్ విధానపరమైన వైఫల్యాలను ప్రశ్నించడంలో ప్రతిపక్షం పూర్తిగా విఫలమైంది. ప్రతి పార్లమెంట్ సమావేశానికి ముందు మోదీ ఇదే విధంగా ఉద్దేశపూర్వకంగా సృష్టించే ఏదో ఒక నెరేటివ్‌ను ఎలా ఛేదించాలో ప్రతిపక్షానికి ఇప్పటికీ తెలియడం లేదు.
కాంగ్రెస్‌తో పాటు ఇతర విపక్ష పార్టీలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఉద్యోగాల సృష్టి, రైతుల ఆదాయం రెట్టింపు, దేశంలో అసమానతలు వంటి అంశాల్లో మోదీ ప్రభుత్వ దారుణమైన వైఫల్యాలను ప్రశ్నించాల్సింది. కానీ, విపక్షాలు అలా చేయలేదు. పైగా నైతికంగా ఆధిపత్యం ప్రదర్శించే అవకాశాన్ని మోదీకి కల్పించాయి. ప్రతిపక్షాలు పార్లమెంట్ సమావేశాలను అడ్డుకునేవిగా, తమది మాత్రం విధానపరమైన చర్చ జరిగేందుకు కృషిచేసే ప్రభుత్వంగా చిత్రీకరించే ఆస్కారం ఇచ్చాయి.
జీఎస్టీ అమలు, మౌలిక సదుపాయాల కల్పన, సంక్షేమ పథకాల అమలు, విదేశాంగ విధానంలో అప్పుడప్పుడు చూపే దూకుడు వంటి అంశాల్లో తమ ప్రభుత్వం మంచి పనితీరు కనబరిచిందని మోదీ సర్కార్ చెప్తున్నది. కానీ, సాధారణ ప్రజల జీవితాలను మార్చే కీలక హామీల్లో చాలా ఇప్పటికీ అమలుకాలేదన్నది వాస్తవం. మేక్ ఇన్ ఇండి యా, నైపుణ్యాభివృద్ధి, పారిశ్రామికాభివృద్ధి ద్వా రా ఏటా రెండు కోట్ల ఉద్యోగాలను సృష్టిస్తానని 2014 ఎన్నికల ప్రచారంలో మోదీ హామీ ఇచ్చా రు. కానీ, ఆచరణలో మాత్రం ఆయన చేసిందల్లా రోజ్‌గార్ మేళాలు నిర్వహించడం, కొంతమందికి నియామక పత్రాలను పంపిణీ చేయడమే. వాగ్దానం చేసిన ఏటా రెండు కోట్ల ఉద్యోగాలతో పోలిస్తే అవి చాలా చాలా తక్కువని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దేశంలో నిరుద్యోగం చాలా ఎక్కువగా ఉన్నది. డిగ్రీ చదివినవారికీ ఉపాధి దొరకడం లేదు. వారు తాము చదువుకున్న చదువుల కంటే తక్కువ స్థాయి ఉద్యోగాలు చేయాల్సి వస్తున్నది. ‘మేక్ ఇన్ ఇండియా’ ఉద్యోగాల సృష్టి బ్రహ్మ పదార్థమే. జీడీపీలో తయారీరంగం వాటాను 25 శాతానికి పెంచాలన్న మేక్ ఇన్ ఇండియా లక్ష్యం ఇంకా చాలా దూరంలోనే నిలిచిపోయింది.
2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని 2016లో మోదీ మాటిచ్చారు. కానీ, ఆ గడువు నాటికి ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చలేకపోయారు. ఇంకా చెప్పాలంటే 2025 నాటికీ రైతుల ఆదాయం రెట్టింపు కాలేదు. వ్యవసాయరంగ సంక్షోభం కొనసాగుతూనే ఉన్నది. లక్షల మంది రైతులు అప్పుల్లో మునిగిపోయి ఉన్నారు. కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) కంటే తక్కువ ధరలకే అన్నదాతలు పంటలను విక్రయిస్తున్నారు. వ్యవసాయరంగంలో ఉన్న అదనపు కార్మికులను వ్యవసాయేతర రంగాల వైపు మళ్లించడంలో మోదీ సర్కార్ విఫలమైంది. కిసాన్ సమ్మాన్ నిధి లాంటి నగదు బదిలీలు తాత్కాలికంగా ఉపశమనం కలిగిస్తున్నప్పటికీ, అది శాశ్వత పరిష్కారం కాదు.
‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’ నినాదమిచ్చే ప్రధాని మోదీ.. తమ ప్రభుత్వం అసమానతలను తగ్గించిందని ప్రపంచ బ్యాంకు గణాంకాలను ఉదహరిస్తుంటారు. కానీ, వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉన్నది. గణాంకాలపరంగా పేదరికం కొంత తగ్గినట్టు కనిపిస్తున్నప్పటికీ, వృద్ధి ప్రయోజనాల పంపిణీలో అసమానతలు మరింతగా పెరుగుతున్నాయి. భారత్‌లో అత్యంత ధనవంతులైన 1 శాతం మంది దేశ సంపదలో 40 శాతాన్ని నియంత్రిస్తున్నారు. దిగువన ఉన్న 50 శాతం ప్రజలు మాత్రం 3 శాతం కంటే తక్కువ సంపద మాత్రమే కలిగి ఉన్నారు. పీఎం-కిసాన్, గృహ నిర్మాణ పథకాలు, ఎల్పీజీ, ఆయుష్మాన్ భారత్ వంటి సంక్షేమ పథకాలు తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇచ్చాయి. ఇవి విద్య, ఉద్యోగాలు, వైద్య సేవల్లో దీర్ఘకాలిక మార్పును తీసుకురాలేకపోయాయి. ఈ నేపథ్యంలో మోదీ ప్రభుత్వమిచ్చే ఆకర్షణీయమైన నినాదాల వెనుక ఉన్న వాస్తవ వైఫల్యాలను బలంగా ప్రశ్నించడంలో, ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ప్రతిపక్షం విఫలమైంది.
నినాదాలు కాదు, విధానాలపై మాట్లాడుదామని మోదీ చెప్తున్న మాట వెనుక ప్రజలను ప్రభావితం చేయాలన్న ఉద్దేశం మాత్రమే ఉందన్నది సుస్పష్టం. ప్రతిపక్షం వర్సెస్ ప్రభుత్వమనే నైతిక పోరాటంగా రాజకీయాలను మార్చి, తద్వారా విధానాలపై చర్చ జరగకుండా చేస్తున్నారు.
విధానాలు వర్సెస్ నాటకాలు, అభివృద్ధి వర్సెస్ అడ్డంకులు, అవినీతి వర్సెస్ నిజాయితీ, జాతీయత వర్సెస్ దేశద్రోహులు, వారసత్వ రాజకీయాలు వర్సెస్ వారసత్వం లేని రాజకీయాలు వంటి నినాదాల ద్వారా విధానపరమైన చర్చ లేకుండా చేయడమే కాకుండా రాజకీయాలను ఒక నైతిక పోరాటంగా మోదీ చిత్రీకరిస్తున్నారు.
రామరాజ్యానికి రాముడిలా, జాతీయ ఐక్యతకు సర్దార్ పటేల్లా, తీవ్ర జాతీయవాదానికి సుభాష్ చంద్రబోస్‌లా తనను తానే చిత్రీకరించుకుంటూ, తానే ఏకైక నైతిక ప్రత్యామ్నాయమని మోదీ ప్రచారం చేసుకుంటారు. నైతికపరమైన విషయంలో నాయకత్వాన్ని చూపినప్పుడు ఇచ్చిన హామీలు నెరవేర్చారా లేదా అనే విషయమై తీర్పు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడుతుంది. క్లిష్టమైన విధాన సమస్యలను నైతికపరమైన అంశంగా మార్చివేసి పార్లమెంట్‌లోనూ, ప్రజాక్షేత్రంలోనూ జరిగే చర్చల ప్రాధాన్యాన్ని తగ్గిస్తున్నారు. ఇది పార్టీ కార్యకర్తలకు, ఇలాంటి సులభమైన భావనలపై ఆధారపడి వార్తలు రాసే ఒక వర్గం మీడియాకు అనుకూలంగా మారుతున్నది.
2014 ఎన్నికలకు ముందు మోదీని నిర్ణయాత్మకమైన, అవినీతిరహిత నైతిక ప్రత్యామ్నాయంగా చిత్రీకరించారు. అప్పటి యూపీఏను స్కాముల్లో మునిగిపోయిన ప్రభుత్వంగా చూపించారు. అయితే, గత 11 ఏండ్లలో కొన్ని కార్పొరేట్ సంస్థలకు సంపదను కట్టబెడ్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫలితంగా ఆయన ఇమేజ్ మసకబారింది. కాగా, బీహార్ ఎన్నికల్లో ‘జంగిల్ రాజ్’ ప్రచారం మూలంగానే తాము విజయం సాధించామని, రాజకీయాలను నైతిక పోరాటంగా చూపించే వ్యూహం ఇంకా పనిచేస్తుందనే భ్రమలో మోదీ, ఆయన సలహాదారులు ఉన్నారు. కానీ, వాస్తవానికి బీహార్ ఓటర్లు నైతికపరమైన రాజకీయాల వల్లనే కాదు, సంక్షేమ పథకాలు, నగదు పంపిణీ పథకాల కారణంగా ప్రభావితులయ్యారన్నది సుస్పష్టం. ఎన్నికల వేళ 75 లక్షల మంది మహిళలకు ఒక్కొక్కరికి రూ.10 వేలు చొప్పున ఇవ్వడం, ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన కింద కోటిన్నర మహిళలకు రూ.2 లక్షల వరకు ఇవ్వాలన్న హామీ కూడా ఓటర్లను ప్రభావితం చేసింది.
రాజకీయాలను మంచి-చెడు అనే చట్రంలోకి మార్చడం ప్రజాస్వామ్యానికి తీవ్ర విఘాతం కలిగిస్తుంది. అయితే, 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ పార్లమెంట్లో మెజార్టీ కోల్పోయినట్లే, ఓటర్లు కూడా హామీల అమల్లో లోపాలను గుర్తిస్తే బీజేపీ అనుసరిస్తున్న ఈ వ్యూహం కూడా విఫలమవుతుంది. అయితే, ఉద్యోగాల సృష్టి, అందుబాటులో వైద్యం, చౌకైన విద్య వంటి నిర్మాణాత్మక సమస్యలను నగదు బదిలీల ద్వారా కలిగే తాత్కాలిక ఉపశమనం ఎప్పటికీ పరిష్కరించదన్న నిజాన్ని ఓటర్లకు ప్రతిపక్షాలు వివరించాలి.
(‘డెక్కన్ హెరాల్డ్’ సౌజన్యంతో..)
-భరత్ భూషణ్