తెలంగాణలో ఉద్యోగులు, పెన్షనర్ల పరిస్థితి దారుణంగా తయారైంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పర్మనెంట్, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు, పెన్షనర్లకు అనేక హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రెండేండ్లు గడిచినా వాటిలో ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు. పైగా కొత్త విధానాలు తీసుకొస్తూ ఉద్యోగ వర్గాలను ఇబ్బందులకు గురిచేస్తున్నది.
నగదు రహిత వైద్య సేవలు అందించేందుకు గత ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. పాత జిల్లా కేంద్రాల్లో వెల్నెస్ సెంటర్లు ఏర్పాటు చేసి సేవలు కూడా అందించింది. కార్పొరేట్ ఆసుపత్రుల్లో మెరుగైన చికిత్స కోసం హెల్త్ కార్డులు మంజూరు చేసేందుకు కేసీఆర్ సర్కార్ కృషి చేసింది. నాటి ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్ని ఉద్యోగ సంఘాలతో సమావేశమయ్యారు . ఆరోగ్య ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి నగదు రహిత సేవలు అందించాలని ఆ సమావేశంలో నిర్ణయించారు. కానీ, ఎన్నికల వల్ల అది అమలు కాలేదు.
ఉద్యోగులందరూ ఆధార్ కార్డ్ లింక్ చేసి తమ వివరాలు సమర్పించాలని సెప్టెంబర్‌లో ప్రభుత్వం సర్క్యులర్ జారీచేసింది. అక్టోబర్ 25వ తేదీలోపు ఆధార్ లింక్ చేయాలని, వివరాలు ఇవ్వని పక్షంలో జీతాలు నిలిపివేస్తామని అందులో హెచ్చరించింది. రాష్ట్రంలో 5,21,692 పర్మనెంట్ ఉద్యోగులు; 4,93,820 అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులున్నారు. అయితే, ఇప్పటివరకు వారిలో 4,74,844 మంది ఉద్యోగులు మాత్రమే వివరాలు నమోదు చేశారని ప్రభుత్వం పేర్కొన్నది. ఇది 47 శాతం మాత్రమే. మిగతా 53 శాతం ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేవని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే, వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాల్సిన శాఖాధికారుల (హెచ్‌వోడీ) వేతనాలను నిలిపివేయకుండా, ఉద్యోగుల జీతాలు ఆపుతామనడం అన్యాయం.
ఉద్యోగులకు ఒకటవ తారీఖున వేతనాలు ఇస్తున్నామని ప్రభుత్వం గొప్పగా చెప్తున్నది. కానీ, వాస్తవానికి పర్మనెంటు ఉద్యోగులకు, పెన్షనర్లకు మాత్రమే చెల్లించి, మిగతా వారికి నెలల తరబడి జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నది. అక్టోబర్ నెలలో ప్రభుత్వ నిధులను ఇతర కార్యక్రమాలకు మళ్లించడంతో ఒకటవ తేదీన జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందని, అందువల్లనే సర్కార్ ఇటీవల సర్క్యులర్ విడుదల చేసిందని ఉద్యోగులు చెప్తున్నారు. వివరాలు ఇవ్వని ఉద్యోగులందరూ నకిలీ ఉద్యోగులని ప్రభుత్వం ప్రచారం చేస్తున్నదని, ఇది దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్ని శాఖల్లో విచారణ చేసి నకిలీ ఉద్యోగులను గుర్తించి చర్యలు తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ, ఎందుకు ముందుకువెళ్లడం లేదని ప్రశ్నిస్తున్నారు. దీనికితోడు కనీస వేతనం రూ.26 వేలకు పెంచుతామని హామీ ఇచ్చి, ఉన్న వేతనాన్ని కూడా ఇవ్వకపోవడం కాంగ్రెస్ చేసిన మోసం కాదా? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా రు. ఉద్యోగులకు ఇచ్చిన ప్రధాన హామీల్లో కరు వు భత్యం తక్షణ చెల్లింపు కూడా ఒకటి. కాం గ్రెస్ ప్రభుత్వం ఈ రెండేండ్లలో ఐదు విడతల కరువు భత్యం బాకీపడింది. అంటే దాదాపు 15 శాతం. ఈ లెక్కన ఒక్కో ఉద్యోగి రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు ప్రతి నెల నష్టపోతున్నారు. పే రివిజన్ కమిషన్‌ను 6 నెలల్లోపు అమలు చేస్తామని కాంగ్రెస్ పాలకులు చె ప్పారు. కానీ, కనీసం ఒక్కసారైనా పీఆర్సీ కమిషన్‌తో దీని గురించి చర్చించలేదు. పీఆర్సీ కమిషన్‌ను కేసీఆర్ సర్కార్ సకాలంలో వేసి 5 శాతం మధ్యంతర భృతిని విడుదల చేసింది. కానీ, రేవంత్ ప్రభుత్వం మాత్రం పీఆర్సీపై నోరు మెదపడం లేదు. దీని వల్ల ఉద్యోగులు, పెన్షనర్లు భారీగా నష్టపోతున్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకపాత్ర పోషించిన ఉద్యోగుల శ్రేయస్సు కోసం కేసీఆర్ ప్రభుత్వం ఎంతగానో పాటుపడింది. 2015 ఫిబ్రవరిలో 43 శాతం ఫిట్మెంట్తో పీఆర్సీని అమలు చేసింది. దాంతో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల జీతభత్యాలు గణనీయంగా పెరిగాయి. ఉద్యోగుల వేతనాలను పెంచడమే కాదు, వారికి ఆర్థికపరమైన ఇబ్బందులు లేకుండా కేసీఆర్ చర్యలు తీసుకున్నారు. ఉద్యమంలో పాల్గొన్న ఉద్యోగుల సేవలను గుర్తిస్తూ ప్రత్యేకంగా ఇంక్రిమెంట్ ఇవ్వడం ఒక చరిత్ర. అలాగే కరోనా మహమ్మారి కారణంగా ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైనప్పటికీ 2020లో 30 శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ అమలు చేశారు. తద్వారా ఉద్యోగుల పట్ల తనకున్న ప్రేమను చాటుకున్నారు. రెండు పీఆర్సీలు కలిపి 73 శాతం ఫిట్మెంట్ ఇవ్వడంతో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడింది.
ఉద్యోగుల కాంట్రిబ్యూషన్తో నగదు రహిత వైద్య సేవలను అందిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కానీ, ఇప్పటికీ హెల్త్ కార్డులు ఇవ్వడం లేదు. దీంతో చాలామంది వైద్య ఖర్చులకు డబ్బులులేక ఇబ్బందులు పడుతున్నారు. అదీగాక రిటైర్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో రిటైర్డ్ ఉద్యోగులు మానసికంగా కుంగిపోతున్నారు. ఆరోగ్యం క్షీణించి చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఉద్యోగులు దాచుకున్న డబ్బులను కూడా ఇవ్వకుండా ఇబ్బందిపెట్టటం దారుణం.
కాంట్రిబ్యూషన్ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి, ఓల్డ్ పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఇప్పటివరకు ఆ హామీని కనీసం పరిశీలించలేదు. అంతేకాదు, రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఉద్యోగుల కాంట్రిబ్యూషన్‌ను సైతం దారిమళ్లించి ఇతర పనులకు వాడుకోవడం దుర్గార్మం. మరోవైపు ప్రస్తుతమున్న పెన్షన్ విధానాన్ని సవరించి భవిష్యత్తులో ఎలాంటి హెచ్చింపు లేకుండా పెన్షనర్ల పొట్టకొట్టడానికి కేంద్రప్రభుత్వం సిద్ధమైంది.
తనను కోసుకుతిన్నా, వండుకుతిన్నా ఉద్యోగులకు, పెన్షనర్లకు ఇవ్వడానికి ప్రభుత్వం వద్ద నిధులు లేవని, ప్రజలకు ఎలాంటి సంక్షేమ, అభివృద్ధి పథకాలను ఆపాలో చెప్పాలని ఉద్యోగులను ముఖ్యమంత్రి అడగడం కాంగ్రెస్ సర్కార్ పలాయనవాదానికి నిదర్శనం. లంకె బిందెలు దొరుకుతాయని ఆశిస్తే వట్టి కుండలే ఉన్నాయని నిస్సిగ్గుగా ప్రకటిస్తూ ఇచ్చిన హామీలను ఎగ్గొట్టే కుట్రలకు తెరతీయడం హేయం. ఉద్యోగుల మీద కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరిత ధోరణిని అవలంబిస్తున్నది. చివరికి పండుగల సందర్భంగా ఇవ్వవలసిన పండుగ అడ్వాన్స్ బిల్లులు, టీఏ, లీవ్ శాలరీలను కూడా చెల్లించడం లేదు. ఉద్యోగులు ఏదడిగినా గత ప్రభుత్వం రూ.8 లక్షల కోట్ల అప్పు చేసిందని పచ్చి అబద్ధాలు చెప్తూ, బిల్లులను ఇవ్వలేమని బుకాయించడం కాంక్రెస్కు పరిపాటిగా మారిం ది. రెండేండ్ల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన రూ.2.80 లక్షల కోట్ల అప్పులను ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేస్తే, అప్పులు కట్టడానికే అప్పులు చేశామని అబద్ధాలాడుతూ కాలయాపన చేస్తున్నారు. కేసీఆర్ పదేండ్ల పాలనలో ఉద్యోగులు అనేక ఆర్థిక ఇబ్బందులను పరిష్కరించుకున్నారు. కానీ, నేడు కాంగ్రెస్ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్‌తో మన పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇలాంటి తరుణంలో జరుగుతున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటు ద్వారా ఝలక్ ఇవ్వవలసిన అవసరం ఉన్నది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఈ ఉప ఎన్నికల్లో గెలిస్తే పీఆర్సీ రాదు, డీఏలు ఉండవు. రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ ప్రయోజనాలు అందవు. సీపీఎస్ రద్దు ఊసే ఉండదు.
కేంద్రంలోని బీజేపీ కూడా పెన్షనర్ల హక్కులను కాలరాస్తూ చట్టాలు చేసింది. భవిష్యత్తులో పెన్షనర్లకు పీఆర్సీ బంద్ అవుతుందని, డీఏ సైతం ఇవ్వవలసిన అవసరం లేదని బీజేపీ అంటున్నది. బీహార్ ఎన్నికల్లో లబ్ధి పొందడానికే ఇప్పుడు 8వ వేతన సవరణ చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని గ్రహించాలి. తమ డిమాండ్లను నెరవేర్చాలని ఉద్యోగులు, పెన్షనర్లు కొంతకాలంగా కోరుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదు. ఈ నేపథ్యంలో తమ సమస్యల పరిష్కారం కోసం నవంబర్ 7న పలు కార్యక్రమాలు చేయాలని పెన్షనర్ల సంఘాలు పిలుపునిచ్చాయి. టీఎన్జీవో రాష్ట్ర సమావేశం సైతం ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తంచేసింది. ఉద్యోగులు, పెన్షనర్ల హక్కులకు మరణశాసనం రాస్తున్న ఈ రెండు పార్టీలకు బుద్ధి చెప్పి ఉద్యోగుల ఐక్యతను చాటుదాం. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవడం ద్వారా రేవంత్ ప్రభుత్వం పడిపోదు కానీ, ఇచ్చిన హామీలు అమలు చేయకుంటే ఓటు రూపంలో ప్రజా స్పందన విస్ఫోటనంగా మారుతుందనే సందేశం ఇచ్చినవారమవుతాం. తద్వారా హామీల అమలు కోసం ఇకనైనా కాంగ్రెస్ పాలకులు పని చేస్తారు.
(వ్యాసకర్త: ఉద్యోగ సంఘాల జాక్ పూర్వ చైర్మన్)
-దేవీప్రసాద్