ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగరజూసిందన్నట్టు, తెలంగాణ ప్రజలకు అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో దారుణంగా విఫలమైన కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గత కొద్దిరోజులుగా మరిన్ని అలవిగాని హామీలనిస్తున్నారు. ఈ గురువారం నాడు హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ స్టేడియంలో రాహుల్‌గాంధీ తెలంగాణతో పాటు దేశ ప్రజలకు ఇచ్చిన హామీలను, ఈ నెల 3వ తేదీన తెలంగాణ కోసమంటూ విడుదల చేసిన ప్రత్యేక మ్యానిఫెస్టోను గమనించండి.
ఒకవైపు గ్రామాలకు, పట్టణాలకు చెందిన అన్నివర్గాల ప్రజలు కూడా అసెంబ్లీ ఎన్నికల హామీలు గాలికిపోయాయని హోరెత్తుతున్నారు. అది లెక్కచేయని రాహుల్, రేవంత్‌లు తమ హామీలలో ఇప్పటికే అత్యధిక భాగం అమలుచేశామని అబద్ధాలు చెప్తూ మీడియాలో అడ్వర్టయిజ్మెంట్లు కూడా ఇస్తున్నారు. అది చాలదన్నట్టు ఇప్పుడు మరికొన్ని హామీలివ్వడం, ప్రజలకు మసిబూసి మారేడు కాయ చేయడం కాదు సరికదా వారికి పుండు మీద కారం చల్లినట్టుగా ఉంది.
ఎట్లాగూ ఇన్నిన్ని అబద్ధాలు చెప్తున్నారు. పనిలో పనిగా మరొకటి రెండు అబద్ధాలు ఆడితే పోయే సొమ్మేమిటో అర్థం కాదు. రుణమాఫీకి ఆగస్టు 15 కొత్త తేదీ అన్నట్టు (అది అమలుకావడం, కాకపోవడం అట్లుంచి) 13 హామీలకు కూడా కొత్త తేదీలు ఏవైనా చెప్పవచ్చు గదా.
ముందుగా తెలంగాణ హామీలను చూసి, తర్వాత ఇతర విషయాలకు వెళదాం. రాహుల్‌గాంధీ చెప్పిన దాని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారెంటీలలో హామీ ఇచ్చిన విధంగా మహిళలకు నెలకు రూ.2500 ఇవ్వడం, ఆ సొమ్ము వారి ఖాతాల్లో జమకావడం ఇప్పటికే మొదలైపోయింది. ఆరింటిలో ఐదు అమలు చేశామని ముఖ్యమంత్రి అంటుండగా, రాహుల్‌గాంధీ మరొక అడుగు ముందుకువేసి మొత్తం ఆరింటినీ అమలుచేసినట్టు ప్రకటించారు. భర్తీ అయిన 30 వేల ఉద్యోగాలు కేసీఆర్ ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చినవని స్వయంగా నిరుద్యోగులు స్పష్టం చేస్తుండగా, కాదు కాదు తామే ఇచ్చామని ముఖ్యమంత్రి రెండు రోజులకొకసారి అంటున్నారు.
రాహుల్‌గాంధీ కూడా సరూర్‌నగర్ సభతో సహా పలు సందర్భాలలో తెలంగాణ యువతకు అదే మాట చెప్తున్నారు. ఇదేవిధంగా వంట గ్యాస్, విద్యుత్తు ప్రస్తావనలు చేశారు. కాంగ్రెస్ మాట ఇచ్చిన రైతుభరోసా ఎకరానికి రూ.7,500 కాగా, పాత లెక్క ప్రకారం రూ.5,000 మాత్రమే ఇవ్వడం, అదికూడా అందరికి చేరకపోవడం, కౌలురైతులు, వ్యవసాయ కూలీల జోలికి అసలు పోకనే పోవడం వంటివన్నీ రాహుల్‌గాంధీ సరూర్‌నగర్‌లో మరిచిపోయి, అందరికీ రైతుభరోసా ఇచ్చేశామన్నారు. డిసెంబర్లో తమ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రైతులకు ఒకే విడతలో రూ.2 లక్షల రుణమాఫీ తన భరోసా అని అప్పుడు నమ్మించిన రాహుల్, ఇప్పుడేమో ఆగస్టు 15 అంటూ రేవంత్ వలెనే కొత్త గడువు చెప్తున్నారు. తెలంగాణ ప్రజల కోసం ఢిల్లీలో సైనికుడిగా పనిచేసేందుకు సిద్ధమని, అసెంబ్లీ ఎన్నికల ప్రచార కాలంలో వలెనే సరూర్‌నగర్‌లో మరొకమారు ప్రతిజ్ఞలు చేశారు.
దీనంతటిలో ఆసక్తికరమైన విషయాలు రెండున్నాయి. ఆరు గ్యారెంటీలలో ఐదు అమలు చేశామంటున్న ముఖ్యమంత్రి గాని, మొత్తం ఆరూ అమలైపోయాయంటున్న రాహుల్ గాని, సదరు ఆరింటిలో గల మొత్తం 13 అంశాలలో ఏదేది అమలైందో, ఎంతవరకో ఆడిటింగ్ తరహాలో లెక్కలను ప్రజల ముందు ఒక్కసారైనా, పొరపాటున అయినా ఉంచడం లేదు. ఆ పని ఇంతకాలం చేయలేదు. ఇప్పుడు లోక్‌సభ పోలింగ్ పూర్తిగా సమీపించిన తర్వాతనైనా చేయడం లేదు.
సరూర్‌నగర్ సభ ఆ విధంగా గడిచిపోయింది. ఆసక్తికరమైన రెండు విషయాలలో ఇది ఒకటి కాగా, 6 హామీల 13 అంశాలు భవిష్యత్తులోనైనా ఎప్పటివరకు అమలుచేస్తారో కనీసం అబద్ధపు మాటగానైనా చెప్పటం లేదన్నది రెండవది. ఎట్లాగూ ఇన్నిన్ని అబద్ధాలు చెప్తున్నారు. పనిలో పనిగా మరొకటి రెండు అబద్ధాలు ఆడితే పోయే సొమ్మేమిటో అర్థం కాదు. రుణమాఫీకి ఆగస్టు 15 కొత్త తేదీ అన్నట్టు (అది అమలుకావడం, కాకపోవడం అట్లుంచి) 13 హామీలకు కూడా కొత్త తేదీలు ఏవైనా చెప్పవచ్చు గదా. హామీల వైఫల్యంపై ప్రజల విమర్శల ఒత్తిడి తీవ్రతలో ఆ మాట తట్టడం లేదేమో తెలియదు. అది నిజమైతే వారి పట్ల సానుభూతి చూపాలి.
మొత్తానికి సరూర్‌నగర్ సభ వేదికపై రాహుల్, రేవంత్‌లలో ఎవరినుంచి కూడా, 13 హామీల భవిష్యత్తు ఏమిటో తెలంగాణ ప్రజలకు ఏమీ తెలియరాలేదు. అయితే, ఇందుకొక కొసమెరుపు ఉన్నది. వివిధ హామీలను కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ తరహాలోనే దేశమంతా అందించగలదని రాహుల్‌గాంధీ ఉద్ఘాటించారు. ఆ విధంగా మనకాయన ఎండాకాలపు ఉక్కపోతలో కొంత వినోదం కలిగించారు. అందుకు కృతజ్ఞతలు.
ఆరు గ్యారెంటీలు, 13 హామీల వివరాల్లోకి ఇక్కడ పోవడం లేదు. దానిపై మీడియాలో, ప్రజల్లో, రాజకీయ వర్గాలలో సాగుతున్న ఎడతెరపి లేని చర్చ ఇప్పటికే అందరికీ విసుగు కలిగిస్తుండవచ్చు. అందువల్ల కాంగ్రెస్ పార్టీ ఈ నెల 3న తెలంగాణ కోసం ‘పాంచ్ న్యాయ్’ పేరిట (ఐదు న్యాయాలని తెలుగులో ఎందుకు అనలేరో తెలియదు) ప్రకటించిన ప్రత్యేక మ్యానిఫెస్టోలోని అంశాలను చూద్దాం. హైదరాబాద్‌కు ఐటీఐఆర్, కాజీపేటకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ, ఆంధ్రకు పోయిన ఐదు గ్రామాలు తిరిగి తెలంగాణకు ఇవ్వడం, (సీలేరు విద్యుత్తు ప్రాజెక్టు ప్రస్తావన మాత్రం లేదు) పాలమూరు-రంగారెడ్డికి జాతీయహోదా, మేడారం జాతరకు జాతీయహోదా, హైదరాబాద్‌కు సుప్రీంకోర్టు బెంచ్ వంటివి వాటిలోని కొన్ని. ఇదిగాక యువత, రైతులు, మహిళలు, కార్మికుల వంటి వర్గాలకు రాయితీలు.
ఇవన్నీ బాగున్నాయి. కానీ, కాంగ్రెస్ నాయకత్వం తాము కేంద్రంలో అధికారానికి వచ్చి ఇవన్నీ చేసేముందు ఒక ప్రశ్నకు సమాధానం ఇవ్వాలి. ఈ అంశాలపై (సుప్రీంకోర్టు బెంచ్ మినహా) బీఆర్ఎస్ ఎంపీలు గత పదేండ్లుగా పార్లమెంట్లో గాని, బయట కేంద్రస్థాయిలో గాని కేంద్ర ప్రభుత్వాన్ని ఎన్నెన్నిసార్లు డిమాండ్ చేసినా కాంగ్రెస్ ఎంపీలు పెదవి విప్పనిది ఎందుకు? ఒకవేళ బీఆర్ఎస్తో కలిసి ప్రయత్నించటం తమకు రాజకీయంగా ఇబ్బందికరమైతే, ఆ పని రాష్ట్ర ప్రయోజనాల కోసం తమంతట తాముగా వేరుగా చేయవచ్చు గదా? దీన్నిబట్టి కలిగే అభిప్రాయం ఏమిటో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. కాంగ్రెస్‌కు ఈ లోక్‌సభ ఎన్నికలలో తెలంగాణ నుంచి వీలైనన్ని ఎక్కువ స్థానాలు కావాలి. అదీ రహస్యం. అందుకు తిరిగి మోసగించాలి. ఈ మాట మనం ఊహిస్తున్నది కాదు. ఆ ప్రత్యేక మ్యానిఫెస్టోలో వారు స్వయంగా లిఖితపూర్వకంగా అన్నదే. తెలంగాణలో గల 17 స్థానాలలో 15 గెలవడం ద్వారా తాము కేంద్రంలో అధికారానికి రాగలమనే ఆశాభావాన్ని వారు ప్రకటించారు. దీనిపై ఇంకా భాష్యాలు అక్కరలేదు.
చివరి అంశానికి వెళ్లేముందు ఒక విశేషాన్ని చెప్పుకోవాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 10వ తేదీన ఎన్నికల ప్రచారానికి వచ్చేరోజు తెలంగాణ ప్రభుత్వం ఒక పూర్తి పేజీ ప్రకటనను పత్రికలలో విడుదల చేసింది. అదే రోజు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా రాష్ర్టానికి వచ్చారు. ఆ ప్రకటన శీర్షిక ఆకర్షణీయంగా ఉంది. అది, ‘ఏం మొఖం పెట్టుకొని వచ్చినవ్?’ ఆ ప్రకటనలో మోదీకి 10 ప్రశ్నలున్నాయి. ప్రతి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తనంటివి, నల్లధనాన్ని మూడింతలు చేస్తివి; పదేండ్లలో 20 కోట్ల ఉద్యోగాలిస్తనంటివి 45 ఏండ్లలోనే అత్యధికంగా నిరుద్యోగాన్ని 42 శాతం పెంచితివి; రైతుల ఆదాయం డబుల్ చేస్తనంటివి రుణభారాన్ని రెట్టింపు చేసి లక్షల మంది రైతుల ఆత్మహత్యలకు కారణమైతివి; ధరలు తగ్గిస్తనంటివి, పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసరాలపై భారాన్ని మూడు రెట్లు పెంచితివి; మొదలైనవి మొత్తం 10 ప్రశ్నలున్నాయి. అవన్నీ ఎంతో విలువ గల ప్రశ్నలనటంలో సందేహం లేదు. అందుకు కాంగ్రెస్‌ను అభినందించాలి.
కానీ, ఆ తర్వాత ఒక చిక్కు మొదలవుతుంది. ప్రకటన చివరన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రుల ఫొటోలు, వాటికింద ‘మార్పు మొదలైంది’ అనే వాక్యం కన్పిస్తాయి. చిక్కు ఏమంటే, ఆ వాక్యం ‘మార్పును మొదలుపెడుదామనుకుంటున్నాం’ అని రాస్తే సమంజసంగా ఉండేది. ఎందుకంటే ఇదే 10వ తేదీ వరకు గ్రామాలలో, పట్టణాలలో ఏ వర్గం ప్రజలను కాంగ్రెస్ వాగ్దానం చేసిన ‘మార్పు’ను గురించి ప్రశ్నించినా, వారి నుంచి సాధారణ విమర్శల నుంచి, రాయలేని దుర్భాషల వరకు వినవస్తున్నాయి. ఇదే ప్రకటనలో మరొకవైపు ఖర్గే, సోనియా, రాహుల్‌గాంధీల ఫొటోలున్నాయి.
వీరందరూ అసెంబ్లీ ఎన్నికల హామీలు 100 రోజులలో అమలవుతాయని తమ వైపు నుంచి కూడా ఎంతో గట్టిగా హామీ ఇచ్చినవారే. అమలుకానివాటిని అమలు చేయించకపోగా అమలైనాయంటూ తమ వంతు అబద్ధాలు తాము చెప్తున్నవారే. తాజాగా సదరు అబద్ధాలను రాహుల్ సరూర్‌నగర్‌లో గురువారం నాడు మరోసారి చెప్పగా, శుక్రవారం రోజు హైదరాబాద్ వచ్చిన ఖర్గే కూడా అదే చేశారు. నిజానికి ‘ఏ మొఖం పెట్టుకొని వచ్చినవ్?’ అని మోదీకి కాంగ్రెస్ వేసిన ప్రశ్నకు పక్క పేజీలో, ‘ఏ మొఖం పెట్టుకొని వచ్చిండ్రు’ అంటూ కాంగ్రెస్ వారికి తెలంగాణ ప్రజల ప్రశ్నలతో మరొక ప్రకటన రావలసింది. అప్పుడు రెండు విధాలైన ప్రశ్నలు కూడా సరైనవి అయ్యేవి.
పోతే, సరూర్‌నగర్ వేదికగా రాహుల్‌గాంధీ తెలంగాణకు, మొత్తం దేశ ప్రజలకు కూడా కొన్ని హామీలిచ్చారు. అందులో, తెలంగాణ వలె మొత్తం దేశంలో కూడా అన్నింటికన్న ముందు రైతులకు రుణమాఫీ చేస్తామన్నది ఒకటి! మోదీ ప్రభుత్వం ధనికులకు మాఫీ చేసిన 16 లక్షల కోట్లను తాము పేదల బ్యాంకు ఖాతాల్లో వేస్తామని, కేంద్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న 30 లక్షల ఉద్యోగాలను ఆగస్టు 15 నుంచి భర్తీ చేస్తామని, బడుగు, బలహీనవర్గాల వారి లెక్కలు తేల్చి వారిలో కోట్లాది మందిని లక్షాధికారులు చేయగలమని, పేద మహిళలకు ఏడాదికి లక్ష రూపాయలు, కోట్లాది పేద కుటుంబాల ఖాతాల్లో ప్రతి నెల రూ.8500 జమ చేయటంతో సహా అనేకం చెప్పారాయన.
ఈ చర్యలన్నింటితో తెలంగాణలో, మొత్తం భారతదేశంలో కూడా పేదరికమన్నది ‘ఒక్క దెబ్బతో’ మటుమాయమవుతుందని ప్రకటించారు రాహుల్‌గాంధీ. అయితే ఆయన ఒక తెలివైన పనిచేశారు. వీటన్నింటి అమలుకు తెలంగాణలో వలె గడువు ఏదీ పెట్టలేదు. అదేవిధంగా, వాటి అమలు బాధ్యత తనది అంటూ తెలంగాణ విషయంలో వలె ప్రకటించలేదు. అందుకు తెలంగాణ ప్రజలు, భారతదేశ ప్రజలు కూడా ఆయనకు కృతజ్ఞులై ఉండాలి.
టంకశాల అశోక్