కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ తాను చిన్న పిల్లాడి మనస్తత్వం ఉన్న ‘పప్పూ’ను కాదని నిరూపించడానికి రొడ్డకొట్టుడు ప్రకటనలకు బ్రాండ్ అంబాసిడర్ అవుతున్నారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న ఏ రాజకీయ పార్టీ అయినా పాలకపక్షం పక్షపాత ధోరణులను నిరంతరం ఎండగట్టవచ్చు. కేంద్రంలో సంకీర్ణ సర్కార్‌ను నడుపుతున్న బీజేపీపై గత ఆరు నెలలుగా నేరుగా విమర్శలు ఆయన గుప్పించడం లేదు. దేశంలో సంపద విలువలో, తమ పరిశ్రమల ఆదాయం, లాభార్జనలో అగ్రస్థానాల్లో ఉన్న ముకేష్ అంబానీ, గౌతమ్ అదానీల పేర్లతోనే నరేంద్ర మోదీ సర్కార్‌ను ఎక్కువగా ఎండగట్టడం రాహుల్‌కు ఇష్టమైన వ్యాపకమని దినపత్రికలు చదివేవారికి అర్థమవుతున్నది. వారంలో కనీసం మూడుసార్లు అదానీ, అంబానీల ప్రస్తావన లేకుండా కాంగ్రెస్ పార్టీ సమావేశాల్లో, ఎన్నికల ప్రచార సభల్లో రాహుల్ ప్రసంగం సాగడం లేదు.
2014 నుంచి కాంగ్రెస్ ప్రతిపక్ష హోదా లేకుండా బతికింది. 2024 పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ 99 సీట్లు గెలుచుకోవడంతో రాహుల్‌కు లోక్‌సభలో ప్రతిపక్ష నేత అనే కొత్తహోదా వచ్చింది. అప్పటి నుంచీ ఈ ‘యువనేత’లో ఎనలేని తొందర ఎక్కువైంది. దేశాన్ని ఐదు దశాబ్దాలకు పైగా పరిపాలించిన ప్రభుత్వాలకు కాంగ్రెస్ నాయకత్వం వహించిందనే విషయం తెలియకుండా రాహుల్ మాట్లాడుతున్నారా? అనే అనుమానం వస్తున్నది. పదే పదే అంబానీ, అదానీల పేర్లు ప్రస్తావిస్తూ ప్రధాని మోదీని దుయ్యబట్టే ధోరణి చూస్తుంటే పాత తరం ప్రజలకు దేశంలో 1960లు, 70లు, 80ల చివరివరకూ సాగిన రోజులు గుర్తుకొస్తున్నాయి. దేశంలో మొదటిస్థానంలో ఉన్న పారిశ్రామిక కుటుంబంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూప్ స్థాపకుడు ధీరూభాయ్ అంబానీ పరివారం అవతరించకముందు దాదాపు 50 ఏండ్ల కిందట రెండు కమ్యూనిస్ట్ పార్టీలు, ఇతర ప్రతిపక్షాల నాయకులు ‘టాటాలు బిర్లాలు’ మాత్రమే దేశంలో ఆర్థికంగా బలపడుతున్నారని, సామాన్య ప్రజానీకం స్థితిగతులు మెరుగుపడడం లేదని తరచు నాటి పాలకపార్టీ కాంగ్రెస్‌పై విరుచుకుపడేవారు.
కొన్ని దశాబ్దాలపాటు వ్యాపార లావాదేవీలు, లాభార్జనలో ముందుండి సంపద విలువలో మొదటి పది స్థానాల్లో ఉన్న పారిశ్రామిక గ్రూపుల ఆదాయ వివరాలు అప్పట్లో పత్రికల్లో ప్రచురించినప్పుడు గోద్రెజ్‌లు, సింఘానియాలు, గోయెంకాలు, దాల్మియాలు, కిర్లోస్కర్లు, మోదీలు తదితర కుటుంబాల నియంత్రణలోని పారిశ్రామిక గ్రూపుల పైన మొదటి రెండు ర్యాంకుల్లో టాటాలు, బిర్లాలు ఉండేవారు. అప్పట్లో గుత్తాధిపత్యాన్ని నిరోధించే ఎంఆర్టీపీ చట్టం అమలులో ఉండేది. అయినా, టాటాలు, బిర్లాలు సంపదలో, వ్యాపార పరిమాణంలో ఎవరికీ అందనంత దూరంలో ఉన్నత స్థానాల్లో ఉండేవారు. వామపక్షాలు, ఇతర ప్రతిపక్షాలు పదే పదే తమ పేర్లు ప్రస్తావించినా ఈ రెండు గ్రూపులూ స్పందించేవి కావు. పాలకపక్షమైన కాంగ్రెస్ పార్టీ మాత్రం కేంద్రంలో, రాష్ర్టాల్లో తిరుగులేని ఆధిపత్యంతో పరిపాలన కొనసాగిస్తూ ఏకైక అతిపెద్ద పాలక జాతీయపార్టీగా వ్యాపారసంస్థల నుంచి విరాళాలు మొదలుకొని అన్నివిధాలా లబ్ధి పొందేది.
మాజీ ప్రధాని నెహ్రూ నాటి పరిస్థితులను తన దృక్పథంతో అంచనా వేసి ప్రవేశపెట్టిన ‘లైసెన్స్ కోటా రాజ్’ విధానాలు నిజంగానే కొన్ని పారిశ్రామిక గ్రూపులకే అవకాశాలు కల్పించేవి. ఎంఆర్టీపీ చట్టం దేశంలో గుత్తాధిపత్యాన్ని ఆశించిన రీతిలో కట్టడి చేయలేకపోయింది. అందుకే ఐదారు దశాబ్దాల కిందట కొన్ని పారిశ్రామిక గ్రూపులే అగ్రస్థానాల్లో కొనసాగాయి. 1991 నుంచీ ప్రధాని పీవీ, ఆర్థికమంత్రి మన్మోహన్సింగ్ ద్వయం ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు ప్రపంచీకరణ నేపథ్యంలో దేశంలో కొత్త కొత్త రంగాల్లో కొత్త పారిశ్రామికవేత్తల ఆవిర్భావానికి, అలాగే ఐటీరంగంలో ఇన్ఫోసిస్ ఎన్.ఆర్.నారాణయణ మూర్తి, విప్రో అజీమ్ ప్రేంజీ వంటి నూతన ఆంత్రపెన్యూర్లు అవతరించడానికి దోహదం చేశాయి.
టాటాలు, బిర్లాలు మాత్రమే అగ్రస్థానాల్లో కొనసాగడానికి కాంగ్రెస్ సర్కార్లు ఎంతవరకు కారణమో చెప్పడం కష్టం. అయితే, 1980లు, 90ల ఆరంభంలో అంబానీలకు కాంగ్రెస్ ప్రభుత్వాల అండదండలున్నాయని, 1990ల చివరినుంచి 2004 వరకూ కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని రెండు ఎన్డీయే సంకీర్ణ ప్రభుత్వాలు సానుకూలంగా వ్యవహరించాయనే మాటలు వినిపించేవి. వాటిలో నిజం లేదని ఆ తర్వాత ఈ గ్రూపు కంపెనీలు, పరిణామాలు నిరూపించాయి.
భారీ మొత్తాల్లో పెట్టుబడులు పెట్టగలిగే అనుభవం ఉన్న వ్యాపార గ్రూపులకు కొన్ని రంగాలు ఈ ‘గ్లోబలైజ్డ్ వెల్ కనెక్టెడ్’ ప్రపంచంలో ఎనలేని లాభావకాశాలు ఇస్తాయని మన అనుభవాలు చెప్తున్నాయి. 2024 ఆరంభం నుంచే ‘అదానీ, అంబానీ’ వ్యాఖ్యలతో బీజేపీ ప్రభుత్వంపై రాహుల్ విమర్శల జోరు పెంచారు. తోటి గుజరాతీలైన ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీలకు మోదీ సర్కార్ అడ్డగోలుగా ప్రయోజనాలు కల్పిస్తున్నదని కాంగ్రెస్ నేత విరుచుకుపడేవారు. కాంగ్రెస్, బీజేపీ మధ్య ఈ ‘అంబానీ, అదానీ’ ఆట ఎందాకా వెళ్లిందంటే కిందటి మే మొదటివారం పార్లమెంటు ఎన్నికల ప్రచారం సందర్భంగా ఒక సభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ.. ‘ఈ మధ్య అదానీ, అంబానీలపై రాహుల్ మౌనం పాటిస్తున్నారెందుకో మరి? సాధారణ ఎన్నికల షెడ్యూలు వచ్చినప్పటి నుంచీ ఆయన ఈ ఇద్దరి సంగతి ఎత్తడం లేదు. ఆటోల్లో కరెన్సీ కట్టలేమైనా అందుకున్నారా, కాంగ్రెస్ నేత?’ అంటూ వ్యంగ్య బాణాలు సంధించారు.
రాజస్థాన్‌లో అశోక్ గెహ్లాట్ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఆ రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టడానికి ముఖ్యమంత్రి సమక్షంలోనే అదానీ గ్రూపు అంగీకారం తెలిపింది. అప్పటికే అదానీ గ్రూపుపై రాహుల్ ఆరోపణలు గుప్పిస్తున్నారు. న్యాయబద్ధమైన పోటీ మూలసూత్రంగా నడిచే పెట్టుబడిదారీ వ్యవస్థలో పాలకుల అడ్డగోలు అండదండలతో కొన్ని కంపెనీలు విశేష లబ్ధి పొందితే అలాంటి విషయాలను ఎండగట్టి, దిద్దుబాటు చర్యలకు దోహదం చేయడం ప్రతిపక్షాల బాధ్యత. ‘ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం’ అంటే అమెరికాలోనైనా ఐరోపా దేశాల్లోనైనా ప్రజాస్వామిక వాదులు, పౌరులు వ్యతిరేకించే విధానమే. అలాంటప్పుడు రెండు పారిశ్రామిక కుటుంబాల నిర్వహణలోని రెండు గ్రూపులు ఎలా ప్రభుత్వ తోడ్పాటుతో ఎక్కువ లాభాలు సంపాదించాయో సాక్ష్యాధారాలు చూపించకుండా రాహుల్‌గాంధీ ఇటీవల ఒక ఊళ్లో, చూడండి అదానీ బ్యాంకు ఖాతాల్లోకి నగదు సునామీలా వచ్చిపడుతున్నది. పేదలు, బడుగువర్గాల అకౌంట్ల నుంచి తుఫాన్ మాదిరిగా సొమ్ము ఎగిరిపోతోందని క్లుప్తంగా చెప్పడం వల్ల ఎలాంటి ప్రయోజనం చేకూరదు.
ఇలాంటి రాహుల్ గంభీర ప్రకటనల ద్వారా 1950లు, 60ల్లో పేదల పాలిట పెన్నిధులుగా ప్రజలు కొన్ని ప్రాంతాల్లోనైనా నమ్మిన కమ్యూనిస్టు నేతల తరహాలో మాట్లాడితే రాహుల్‌కు వచ్చే రాజకీయ ప్రయోజనం శూన్యమే. దశాబ్దం తర్వాత లోక్‌సభలో పదో వంతు సీట్లు సంపాదించి (543 సీట్లకు కనీసం 55 సీట్లు) కాంగ్రెస్ గుర్తింపు పొందిన ప్రతిపక్షంగా అవతరించి, రాహుల్‌కు ఆ పార్టీ నేతగా ఎల్ఓపీ హోదా వచ్చిన తర్వాత కూడా తాను ‘పప్పూ’ స్థాయి నుంచి ఎదగలేదని పదే పదే నిరూపించుకుంటున్నారు.
డా.లోహియా అంబేద్కర్ విచారధారతో నడిచే హిందీ రాష్ర్టాలకు చెందిన ‘జనతా పరివార్’ పార్టీల అరిగిపోయిన అజెండా అయిన ‘కులగణన’ను, మొత్తం కోటాలన్నీ కలిపి 50 శాతం దాటిపోయినా చట్టపరమైన ఇబ్బంది లేకుండా చూడాలనే తమిళనాడుకు చెందిన ద్రావిడ పార్టీల వాదనను తన సొంత ఐడియాలుగా చెప్పుకొంటున్న కాంగ్రెస్ నాయకుడి బాటనే ఈ పార్టీ ప్రాంతీయ నేతలు కూడా నడుస్తున్నారు. కులగణనపై కాంగ్రెస్‌కు పేటెంట్ హక్కు ఉన్నదని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు బి.మహేశ్‌కుమార్‌గౌడ్ ఇటీవల చెప్పడం ఈ జాతీయపక్షం దివాలాకోరుతనానికి పరాకాష్ఠ.
టాటా బిర్లాలు అనే నినాదం ఒక్కటే దేశంలో కాంగ్రెసేతర జాతీయ, ప్రాంతీయ పక్షాలకు కొన్ని దశాబ్దాలకు అధికారం సాధించిపెట్టలేదు. అలాగే, అదానీ అంబానీలు అనే అరిగిపోతున్న రాహుల్ మాటలు కాంగ్రెస్‌కు ‘బ్రహ్మాస్త్రం’ కాలేవని ప్రతి భారత పౌరుడు చెప్తాడు.
-నాంచారయ్య మెరుగుమాల