కాళేశ్వరం అంటే.. ఒక్క మేడిగడ్డ మాత్రమే కాదు. కాళేశ్వరం అంటే.. 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు,19 సబ్స్టేషన్లు, 21 పంప్‌హౌస్‌లు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1,531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్,98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్, 141 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం, 530 మీటర్ల ఎత్తుకు నీటిని లిఫ్ట్ చేయడం, 240 టీఎంసీల నీటి వినియోగం. అంతటి మహత్తర ప్రాజెక్టు అయిన కాళేశ్వరం కూలిందని కాంగ్రెస్
గోబెల్స్ ప్రచారం చేస్తున్నది. కేవలం మేడిగడ్డలోని రెండు పియర్లలో వచ్చిన చిన్న, తేలికపాటి పగుళ్లను బూచిగా చూపి తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించింది.
కాళేశ్వరంపై దుష్ప్రచారం చేసి కాం గ్రెస్ అధికారంలోకి వచ్చింది. తర్వాత ఆ అబద్ధాన్ని నిజమని నిరూపించేందుకు ఓ కమిషన్‌ను నియమించింది. 17 నెలలపాటు ఏకపక్ష విచారణలతో, తప్పుడు సమాచారంతో ప్రభుత్వానికి జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక సమర్పించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ చేసిన ఆరోపణలు, రాజకీయ విమర్శలనే అధికారికంగా నివేదిక రూపంలో 650 పేజీల కాగితాలిస్తే, వాటిని తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీ ముందుంచి సభను తప్పుదోవ పట్టించింది.
అయితే, మన దేశంలో కమిషన్లు, విచారణలు తరచూ రాజకీయ ఆయుధాలుగా ఉపయోగపడుతున్నాయని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ద్వారా మరోసారి నిజం చేసింది. ‘పాడిందే పాడరా పాసు పండ్ల దాసరి’ అన్నట్టు కాంగ్రెస్ నేతలు ఆరేండ్లుగా చేస్తున్న విమర్శలు, ఆరోపణలకు జస్టిస్ ఘోష్ కమిషన్ అధికారిక ముద్రవేసి నివేదిక రూపంలో ఇచ్చింది. భారతదేశంలో విచారణ కమిషన్లు సిద్ధాంతపరంగా, నిష్పక్షపాతంతో, ప్రజాప్రయోజనాల కోసం పనిచేయాల్సి ఉన్నప్పటికీ, రాజకీయ ఒత్తిళ్లు, పారదర్శకత లోపం, అమల్లో జాప్యం వంటి పర్యవసానాలు వాటి విశ్వసనీయతను దెబ్బతీస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రాజకీయ కక్షసాధింపు ధోరణిలో రూపొందినదని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గతంలో ఇతర కమిషన్లపై వచ్చిన ఆరోపణలు, విమర్శలే అందుకు తార్కాణం.
దేశంలో వివిధ విచారణ కమిషన్లను 1952 కమిషన్ ఆఫ్ ఇంక్వైరీ యాక్ట్ ద్వారా నియమిస్తారు. కానీ, కాలక్రమేణా ప్రతీ కమిషన్ ప్రభుత్వాలకు రాజకీయ ఆయుధాలుగా మారుతున్నాయి. అందుకు అనేక ఉదాహరణలున్నాయి. ఎమర్జెన్సీ సమయంలో లైంగికదాడులపై విచారించేందుకు 1977లో జనతా పార్టీ ప్రభుత్వం నియమించిన షా కమిషన్.. ఇందిరాగాంధీ ప్రభుత్వంపై చర్యలకు రాజకీయ ఆయుధంగా ఉపయోగపడిందనే ఆరోపణలున్నాయి. రాజీవ్‌గాంధీ హత్యపై విచారణ చేసేందుకు నియమించిన జైన్ కమిషన్ (1991) రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకున్నట్టు పలు పార్టీలు ఆరోపించాయి. బాబ్రీ మసీదు కూల్చివేతపై విచారణ జరిపేందుకు ఏర్పాటు చేసిన లిబర్హాన్ కమిషన్ (1992-2009) విచారణ రాజకీయ ఒత్తిళ్ల కారణంగా ఆలస్యమైంది. చివరికి దాని నివేదిక రాజకీయ లబ్ధి కోసం ఉపయోగపడిందనే విమర్శలు వచ్చాయి. అలాగే సిట్, సీబీఐ విచారణలు కూడా రాజకీయ ప్రభావంతోనే కొనసాగుతున్నాయని, ప్రతిపక్ష నాయకులను లక్ష్యంగా చేసుకొని ఎడాపెడా కేసులు నమోదు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి.
తెలంగాణలో అత్యంత కీలకమైన,అతిపెద్ద నీటిపారుదల పథకమైన కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును కాంగ్రెస్ సర్కారు ఉద్దేశపూర్వకంగానే రాజకీయ సుడిగుండంలోకి నెట్టేసింది. జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ నేతృత్వంలోని కమిషన్ సమర్పించిన నివేదిక రాజకీయ కక్షసాధింపు
ధోరణిలో రూపొందినది.
కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఒక గొప్ప ఆలోచన. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చేపట్టిన అతిపెద్ద మౌలిక సదుపాయ పథకం అది. గోదావరిపై నిర్మితమైన ఈ ప్రాజెక్టు 45 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడంతోపాటు, 240 టీఎంసీల నీటిని ఎత్తిపోసే సామర్థ్యాన్ని కలిగి ఉన్నది. ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ-స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకంగా గుర్తింపు పొందిన ఈ ప్రాజెక్టు తెలంగాణలోని వెనుకబడిన ప్రాంతాలకు సాగునీటిని అందించి, వ్యవసాయ ఉత్పాదకతను పెంచడానికి రూపొందింది. 2016లో శంకుస్థాపన చేసిన ఈ ప్రాజెక్టు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర అభివృద్ధిలో కీలకభూమిక పోషించింది. కానీ, దురదృష్టవశాత్తూ 2023 అక్టోబర్‌లో మేడిగడ్డ బ్యారేజీలోని ఏడో బ్లాక్‌లో రెండు పియర్లు కుంగిపోయాయి. నాటి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ అనేక ఆరోపణలు చేసింది.
అయితే, పీసీ ఘోష్ నివేదికలో ప్రాజెక్టు అనుమతులు, డిజైన్ ప్రతిపాదనలు, ఆర్థికపరమైన వివరాలను కూడా పొందుపరిచారు. అయితే, కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ 1952లోని సెక్షన్ 8బీ, 8సీ ప్రకారం సమన్లు జారీచేయకుండా, వాదనలను వినకుండా నివేదికను రూపొందించారు. ఇది సహజ న్యాయ సూత్రాలను ఉల్లంఘించడమే. కమిషన్ ముందు హరీశ్‌రావు హాజరై, పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి, సాంకేతిక నిపుణుల సిఫారసుల ఆధారంగా ప్రాజెక్టు నిర్ణయాలు జరిగాయని స్పష్టం చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి నిజానిజాలు సమాజానికి తెలిసినప్పటికీ కక్ష సాధింపులో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నివేదికపై అసెంబ్లీలో తూతూమంత్రంగా చర్చించి, తదుపరి విచారణ కోసం సీబీఐకి అప్పగించారు.. బీఆర్ఎస్పై మరింత బురదజల్లాలని ప్రయత్నమే ఇది. కేసీఆర్‌ను అసెంబ్లీకి రప్పించాలని, నివేదికపై ఆయన వివరణ ఇవ్వాలని కాంగ్రెస్ శతవిధాలా ప్రయత్నించి భంగపడింది. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రైతులకు వరం. నివేదికలోని లోపాలను సవాలు చేస్తూ, న్యాయపోరాటానికి దిగాల్సిన అవసరం ఉన్నది. ఈ వివాదం తెలంగాణ రాజకీయాల్లో మరింత ఆసక్తికరమైన మలుపులకు దారితీసే అవకాశం ఉంది. నిజమేమిటో తేల్చడానికి, పారదర్శక విచారణ, సమగ్ర చర్చ అవసరం. అప్పుడే కాళేశ్వరం ప్రాజెక్టు నిజమైన లక్ష్యం, తెలంగాణ రైతుల సంక్షేమం సాకారమవుతుంది.
(వ్యాసకర్త: రాష్ట్ర శాసనమండలి సభ్యులు)
-పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి