తిరుగుబాటుతత్వం ఉగ్గుపాలతో పురుడు పోసుకున్న తెలంగాణ రాష్ట్రంలో సాంస్కృతిక బానిసత్వం ఇప్పుడు అడుగడుగునా కనిపిస్తున్నది. ఖమ్మం జిల్లా, వెలుగుమట్లలో పేదల ఇండ్లను నిర్దాక్షిణ్యంగా కూల్చివేసిన తర్వాత దీని స్వరూపం మరింత మారింది. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం గద్దర్‌కు ప్రాధాన్యత పేరుతో ఆయన ప్రాథమిక స్ఫూర్తినే చంపేసింది. ఆయన కుమార్తెకు పదవి ఇవ్వడమో.. ఆయన పేరుతో ఆంధ్ర సినీ కల్చర్‌ను మెప్పించడమో..గద్దర్ ఆశయాలను కాపాడడం కాదు? గద్దర్ ఆహార్యం, స్ఫూర్తి అంతా పేదల ఆర్తినే ప్రతిబింబించేది. ఎక్కడ పేదలకు అన్యాయం జరిగినా తన కలాన్ని, గళాన్ని విప్పి అండగా నిలిచారు. గజ్జకట్టి ఆడారు, పాడారు. అదే ఆయనను ప్రత్యేక ప్రజా సంస్కృతి స్మృతికర్తగా, తెలంగాణ సాంస్కృతిక ఐకాన్‌గా నిలబెట్టింది.
వెలుగుమట్లలో పేదల ఇండ్లు కూల్చిన ఆర్తనాదాలు తెలంగాణ కళాకారులకు పట్టలేదు, చెవులనూ తాకలేదు. ఒకరిద్దరు కళాకారులు, పాశం యాదగిరి లాంటి ఒకరిద్దరు జర్నలిస్టులు తప్ప ఎవరూ నోరు విప్పలేదు. తెలంగాణ ఉద్యమానికి తలమానికం, వెన్నెముక సాంస్కృతిక ఉద్యమం. ఈ ఉద్యమస్ఫూర్తిని కాంగ్రెస్ ప్రభుత్వం చంపేస్తున్నది. తెలంగాణ కవులు, కళాకారులను అవార్డులు పేరుతోనో, పదవులు పేరుతోనో, లేదా రూ.కోటి బహుమతుల పేరుతోనో నోరు మూయించింది. కట్టిపడేసింది. అందుకు తాజా ఉదాహరణ..చీమ చిటుక్కుమంటే పాట రాసిన కవులు, కళాకారులు వెలుగుమట్ల చీకటి కథలను పట్టించుకోలేదు. ప్రజల హాహాకారాలు, వారికి వినిపించలేదు. కనిపించలేదు.
రెండున్నరేండ్లుగా అధికార పార్టీ చేసిన వాగ్దానాలు ఎండబెట్టినా మౌనం దాల్చారు? తెలంగాణ సాంస్కృతిక సలహా మండలి అనేది ఒకటి కోదండరాం నేతృత్వంలో ఏర్పాటు చేశారు. తెలంగాణ భావజాలం వ్యాప్తి ప్రకటనలు, ఉద్దేశపూర్వకంగా అణచివేస్తున్నా నోరు విప్పడం లేదు. ఆంధ్రా సరిహద్దుల నుంచి వచ్చి తెలంగాణలో అధికారంలో తిష్టవేసి, ఇక్కడి ప్రజల కొంప, గోడు కూల్చినా కోదండరాంతో సహా, చాంతాడంత గల సలహా మండలి సభ్యులు ఎవరూ స్పందించిన దాఖలాలు లేవు. బాధితులను పరామర్శించిన పాపాన పోలేదు. ‘పదవులు పదిలం’ మాటున వారు కరుగలేదు. నోరు మెదపలేదు.
రాష్ట్రంలో ఒకటి కాదు, రెండు కాదు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని బలవంతంగానే రవీంద్రభారతిలో ఆవిష్కరించారు. తెలంగాణవాదుల అభ్యంతరాన్ని లెక్కచేయలేదు? ఒకరకమైన ఆధిపత్య సంస్కృతి రుద్దాలని చూస్తున్నా మౌనంగా ఉండడంతోపాటు, తెలంగాణ సాంస్కృతిక సలహా మండలి ప్రభుత్వానికి ఇచ్చే సలహాలు ఏమిటో అర్థం కాదు. వీటన్నింటికీ మించి గద్దర్ కుమార్తె వెన్నెల ఆంధ్రప్రదేశ్ వెళ్లి తన తండ్రి విగ్రహం కోసం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును అభ్యర్థించడం చూస్తే తెలంగాణ సాంస్కృతిక బానిసత్వం ఎక్కడి వరకు పయనించిందో అర్థమవుతున్నది. ఎక్కడైనా ఒక విగ్రహం పెట్టడం ద్వారా గద్దర్ స్ఫూర్తి నిలబడదు. ఆయనే ప్రజల గుండెల్లో పెద్ద సాంస్కృతిక రూపమై స్థిరమైన గూడుకట్టుకున్నవాడు.
గద్దర్ అవార్డుల పేరిట ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సినీప్రముఖులు ప్రాపకం కోసం, వారితో అనుబంధం కోసం అర్రులు చాస్తుంటారు. కానీ, తమ సామాజిక వర్గానికే చెందిన తొలి సినీగేయ రచయిత, తెలంగాణ యాస, భాషను 1910 ప్రాంతంలోనే ‘కనక్తార’ అనే నాటకంలో వాడిన ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జక్కేపల్లికి చెందిన చందాల కేశవదాసు ఆయనకు గుర్తుకురారు.
కేశవదాసు రచనల్లోని తెలంగాణ స్ఫూర్తిని కాపాడాలనే ప్రయత్నం చేయడంగానీ, ఆయన పేరిట అవార్డులు ఇవ్వడంగానీ చేయరు? అందువల్ల వారికి ఒనగూడే ప్రయోజనం లేదు. గద్దర్ పేరుతో ఇచ్చే సినీ అవార్డులు కూడా ఆంధ్రా మూలాలు కలిగిన పరిశ్రమలో పాతుకుపోయిన ఒకటి, రెండు కుటుంబాలకు ధారాదత్తం చేశారు తప్ప తెలంగాణ కళలు, సాంస్కృతిక నేపథ్యాన్ని గద్దర్ స్ఫూర్తితో ప్రొత్సహించే పని అసలు ఎక్కడా రేఖామాత్రంగా అయినా చేపట్టడం లేదు.
తెలంగాణ సాహిత్యరంగాన్ని బలోపేతం చేసిన దాశరథి సోదరులు, వట్టికోట ఆళ్వారు స్వామి, వానమామలై వరదాచార్యులు, సి.నారాయణరెడ్డి, హీరాలాల్ మోరియా, ముగ్దుమ్ మొహియొద్దీన్ లాంటి వారు కనపడరు. పెట్టుబడులు, కట్టుకథలు, నేలవిడిచి సాము చేసి సమాజాన్ని తప్పుదోవ పట్టించే సినిమా కళాకారులకు గద్దర్ పేరుతో అవార్డు ఇవ్వడమే అసలు ఎబ్బెట్టుగా ఉన్నది. గద్దర్ నేపథ్యం, స్ఫూర్తిని ప్రభుత్వం అసలు అర్థం చేసుకున్నట్లు కనిపించడంలేదు. ఆయన పేరును వాడుకోవాలనే ఆర్భాటం, తపన తప్ప మరేమైనా ఉన్నదా?
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా తెలంగాణ సాహిత్య అకాడమీని యాక్టివేట్ చేశారు. ప్రపంచ తెలుగు మహాసభలు జరపడంతో పాటు మరుగునపడిన తెలంగాణ రచయితల జీవిత చరిత్రలను వెలికితీయించి పుస్తకాలు ప్రచురించారు. సాహిత్య, సాంస్కృతిక సంబురాలు జరిపించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సగం కాలం కావొస్తున్నా తెలంగాణ సాహిత్య అకాడమీకి చైర్మన్, కార్యవర్గాన్ని సైతం నియమించలేకపోయింది. ఈ విషయంలో ప్రభుత్వం ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నదో అర్థంకాదు?
కోయ, గోండు, దొర చుట్టం, కొండరెడ్డి, మోరియా, చెంచు, ఎరుకల, యానాది లాంటి గిరిజన జాతులకు నెలవైన నేల తెలంగాణ. మూలవాసీ ప్రజల సంస్కృతి, సంప్రదాయాలు కాపాడాల్సిన కనీస బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు, ఆయన అనుచర బృందం తమ జీవితకాలం వెచ్చించి గిరిజనుల కళా సాంస్కృతిక చిహ్నాలైన అనేక వస్తువులను సేకరించారు. దానినే ఆదికళ, ఆద్యకళ అంటారు. అన్నీ సేకరించి హైదరాబాద్ లాంటి పెద్ద నగరాల్లో వాటి ప్రదర్శన ఏర్పాటుతో పాటు, భవిష్యత్తు కాలానికి వాటిని అంతరించిపోయే ఓ సంస్కృతిని భవిష్యత్తుకు భద్రపరచాల్సి ఉన్నది. కనీసం ఈ ఆదికళను కాపాడే ప్రయత్నం కూడా ప్రభుత్వం చేయడంలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న భవనాల్లో ఈ ఆద్యకళా మ్యూజియం ఏర్పాటుకు అనుమతిచ్చారు. ఏమి జరిగిందో ఏమో ఆ ప్రయత్నం అర్ధంతరంగా ఆగిపోయింది. ఇలా తెలంగాణ సాహిత్య, సాంస్కృతిక ప్రాధాన్యతల్లో అపసవ్యత చోటుచేసుకుంటున్నది. భౌతిక తెలంగాణ సాధనలో సాహిత్య, సాంస్కృతిక వర్గాల పాత్ర అద్వితీయం. ప్రజల అస్తిత్వం, ఆచారాలు, జీవన విధానం సాంస్కృతిక సంబంధాలతో పెనవేసుకున్నాయి. తెలంగాణ కవులు, రచయితలు, కళాకారులు దేన్నైనా భరిస్తారు కానీ సాంస్కృతిక బానిసత్వాన్ని అసలు ఒప్పుకోరనే విషయం పాలకులు గుర్తించాలి.
(వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్టు, సామాజిక కార్యకర్త)
-ఎన్.తిర్మల్
9441864514