ధర్మపురి, జూన్ 8: బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో ధర్మపురి నియోజకవర్గం సత్తాచాటాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి జీవన్‌రెడ్డి పిలుపునిచ్చారు. సభ్యత్వ నమోదును డిజిటల్ పద్ధతిలో చేపడుతున్నామని, ముఖ్యనాయకులు, కార్యకర్తలు ఇల్లిల్లూ తిరుగుతూ ప్రజలందరినీ భాగస్వాములను చేసేందుకు కృషి చేయాలని కోరారు. ధర్మపురి ఎస్‌హెచ్ గార్డెన్స్‌లో సోమవారం మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, సభ్యత్వ నమోదు నియోజకవర్గ ఇన్చార్జి విజయారెడ్డితో కలిసి నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ సభ్యత్వ నమోదుపై శ్రేణులతో సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జీవన్‌రెడ్డి మాట్లాడారు. నాలుగు దశాబ్దాల అనుబంధం ఉన్న కాంగ్రెస్‌ను వీడడం బాధగా అనిపించినా.. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర పునర్నిర్మాణం కోసం పనిచేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. ప్రజలను ఊచకోత కోసిన హిట్లర్‌ను రేవంత్ రెడ్డి ఆదర్శంగా తీసుకోవడం, నియంత పాలన సాగించడం ఏంటని ధ్వజమెత్తారు. దీనిని ప్రజలు క్షమించరని, తగిన బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు. రాష్ట్రంలో ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపుతానని రేవంత్‌రెడ్డి ప్రకటనలు చేస్తున్నారని, కానీ, ధర్మపురిలో జోరుగా రవాణా సాగుతున్నా.. గోదావరి నదికి తూట్లు పొడుస్తూ ఆనవాళ్లు లేకుండా చేస్తున్నా పట్టించుకునే నాథుడేలేడని విమర్శించారు.
మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ కనుసన్నల్లోనే జిల్లాలో ఇసుక అక్రమరవాణా సాగుతున్నదని ఆరోపించారు. ఆయన ఇసుక బకాసురులను కాపాడడం పక్కనపెట్టి, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న అక్రమాలను ఆపాలని సూచించారు. కొనుగోళ్లలో దోపిడీ జరుగుతున్నదని, రైతులు క్వింటాల్‌కు 10 కిలోలు నష్టపోతున్నారని, బాధిత రైతుల్లో తాను కూడా ఒకరని వాపోయారు. ఇలా కోతపెట్టిన ధాన్యానికి సంబంధించి రాష్ట్రంలో రూ.2వేల కోట్లు, ఒక్క జగిత్యాల జిల్లాలోనే 107 కోట్లు దోచుకున్నారని, అవి ఎవరి ఖాతాల్లోకి వెళ్తున్నాయో చెప్పాలని అడ్లూరితోపాటు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
పనిచేసే నాయకులకే ప్రాధాన్యం : మాజీ మంత్రి కొప్పుల
పార్టీ కోసం నిలబడి పోరాడే నాయకులు, కార్యకర్తలే బీఆర్ఎస్కు అవసరమని, వారికే ప్రాధాన్యం ఇస్తామని, అధికారం కోసం వచ్చే వారికి ఇక్కడ స్థానం ఉండదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. పార్టీ శ్రేణులు ప్రతి గ్రామం, బూత్‌స్థాయిలో ఇంటింటికీ వెళ్లి బీఆర్ఎస్ సిద్ధాంతాలు, గత పాలనలో చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించి సభ్యత్వ నమోదు చేయించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపుతో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నదని, ఈ రెండేండ్ల కాలంలో ఒక్క ధర్మపురి నియోజకవర్గంలోనే 60 కేసులు నమోదు చేశారన్నారు. కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పార్టీ లీగల్ సెల్‌తో పాటు తాను అండగా ఉంటానని భరోసానిచ్చారు.
రాబోయే రెండున్నరేండ్లలో బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ సహకారంతో ధర్మపురి నియోజకవర్గాన్ని రూ.1600కోట్లతో అభివృద్ధి చేశామని గుర్తుచేశారు. కానీ, ఇప్పుడు ధర్మపురిలో ఎక్కడి అభివృద్ధి పనులు అక్కడే ఆగిపోయాయని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో రూ.9.5కోట్లతో నిర్మించిన మాతాశిశు దవాఖాన ఎందుకు వినియోగంలోకి తీసుకురావడం లేదని నిలదీశారు. పట్టణంలో నాలుగులైన్ల రహదారి విస్తరణ పనులు ఎందుకు సాగడం లేదని, కమలాపూర్ రోడ్డు నిర్మాణం ఎందుకు ఆగిందని, జైన, దొంతాపూర్ రోడ్డు ఎందుకు వేయడం లేదని ప్రశ్నించారు.
బుగ్గారం నుంచి రహదారి విస్తరణకు బీఆర్ఎస్ హయాంలోనే రూ.5.5 కోట్లు కేటాయించామని, ఆ పనులు కూడా ఆపేశారని మండిపడ్డారు. ధర్మపురి వరప్రదాయిని అక్కపెల్లి చెరువు ఆధునీకరణకు రూ.70 కోట్లు మంజూరు చేస్తే, వాటినీ అటకెక్కించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్మపురి నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణాపై మంత్రి అడ్లూరి స్పందించాలన్నారు. ఇక్కడ డీసీఎంఎస్ మాజీ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, నాయకుడు ఓరగంటి రమణారావు, జడ్పీ మాజీ వైస్ చైర్మన్ హరిచరణ్ రావు, మాధవరావు, బీఆర్ఎస్ మండల కన్వీనర్ అయ్యోరి రాజేశ్, పట్టణ కన్వీనర్ బండారి రంజిత్ ఉన్నారు.
కొప్పుల బాధ్యతగల నాయకుడు
కొప్పుల ఈశ్వర్ నిర్మాణాత్మకంగా వ్యవహరించే, అనుకున్న కార్యాచరణ బాధ్యతగా పూర్తి చేసే నాయకుడు. ఇన్నేండ్ల పాలనలో ధర్మపురి నియోజకవర్గాన్ని రా్రష్ట్రంలోనే ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు సౌమ్యుడిగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విశ్వరూపం చూపే నాయకుడిగా మెదులుతున్నారు. స్వరాష్ట్రంలో 2014లో తాను జగిత్యాల ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రాయికల్ మండలం బోర్నపల్లి వంతెన నిర్మాణం కోసం నిధులు ఇవ్వాలని కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశాను. అదే సమయంలో రోళ్లవాగు ప్రాజెక్టు ఆధునీకరణ కోసం రూ.70కోట్లు కావాలని కొప్పుల కోరారు. రైతాంగంపై ఈశ్వర్ ఆలోచన అప్పుడే తెలిసింది.
– జీవన్‌రెడ్డి
పార్టీ కోసం పనిచేసే వారికే సభ్యత్వం
పార్టీ కోసం పనిచేసేవారికే సభ్యత్వం ఇవ్వాలని అధినేత కేసీఆర్ ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు పనిచేస్తాం. పార్టీని మరింత పటిష్ట పరుస్తాం. అందుకు అవసరమైన ప్రక్షాళనను ఇప్పటి నుంచే ప్రారంభించాం. సభ్యత్వ నమోదు ధర్మపురి ఇన్చార్జిగా నన్ను నియమించినందుకు కేసీఆర్‌కు, ప్రతిపాదించిన మాజీ మంత్రి ఈశ్వర్‌కు నా కృతజ్ఞతలు.
– మూల విజయారెడ్డి, పార్టీ సభ్యత్వ నమోదు ధర్మపురి నియోజకవర్గ ఇన్చార్జి