హైదరాబాద్, జూన్ 7 (నమస్తే తెలంగాణ) : ‘హిట్లర్‌ను స్ఫూర్తిగా తీసుకొన్నట్టు సీఎం రేవంత్ చెప్పడాన్ని తెలంగాణ సమాజం అంగీకరించదు. నిజాం వ్యతిరేక పోరాటమే అందుకు నిదర్శనం. రేవంత్‌రెడ్డి చేప్పింది ముమ్మాటికీ తప్పుడు ఉదాహరణ’ అని మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ నాగేశ్వర్ చెప్పారు. తెలంగాణ ప్రజలు నిజాం నిరంకుశత్వాన్ని హిట్లర్‌తో పోలుస్తూ, దానికి వ్యతిరేకంగా పోరాడి విముక్తి పొందారని, అలాంటి ఈ నేలపై చారిత్రక ఆధారాలు లేని హైడ్రా(హిట్లర్సైన్యం) గురించి గొప్పగా చెప్పే క్రమంలో అన్యాయంగా మాట్లాడారని అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యంలో పాలకులు నీతి, న్యాయం, ధర్మం వంటి లక్షణాలను ఆచరించిన నేతలను, వ్యక్తులను స్ఫూర్తిగా తీసుకోవాలని, నియంతలు, ఫాసిస్టులను కాదని హితవు పలికారు.
సోమవారం ఒక ప్రైవేట్ చానల్లో జరిగిన చర్చ సందర్భంగా హిట్లర్ నాకు స్ఫూర్తి అన్న రేవంత్ వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. హిట్లర్ స్ఫూర్తితో హైడ్రాను ఏర్పాటు చేసినట్టు చెప్పిన పోలిక అన్యాయమైందని చెప్పారు. ప్రజాస్వామ్య పాలకుడు అత్యంత నిరంకుశుడైన హిట్లర్‌ను ఆదర్శంగా తీసుకోవడమేమిటని ప్రశ్నించారు. సీఎం రేవంత్‌రెడ్డికి ఇలాంటి సలహాలు ఎవరిస్తున్నారో? తెలియడం లేదని పేర్కొన్నారు. జాతి నేతలైన సర్దార్ వల్లభాయ్ పటేల్, ఇందిరాగాంధీ వంటి నేతలతో పోల్చుకోవచ్చని, ఒకవేళ భూములు ఆక్రమించుకొనే ఆక్రమణదారులపై కఠినంగా వ్యవహరించాలనుకొంటే పరశురాముడిని, గండ్ర గొడ్డలిని స్ఫూర్తిగా తీసుకుంటానని చెప్తే లాజిక్ కలిసేదని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యంత నిరంకుశవాది, నరహంతకుడు, చీకటి సైన్యంతో ప్రజలను హత్యచేసిన హిట్లర్‌ను స్ఫూర్తిగా తీసుకోవడం ఏమిటని ప్రొఫెసర్ నాగేశ్వర్ ప్రశ్నించారు.