రెండు రాష్ర్టాల్లో జరిగిన ఎన్నికల్లో తీర్పులు విభిన్నంగా వచ్చినట్టు కనిపిస్తున్నప్పటికీ వాస్తవం మాత్రం ఒకటే! కాంగ్రెస్ పరిస్థితి దిగజారిపోగా, బీజేపీ పరిస్థితి మెరుగుపడింది. హర్యానాలో దక్కుతుందనుకున్న విజయం చేజారడం కాంగ్రెస్కు చావుదెబ్బే. అందుకు ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తాయి. ఒకటి, గెలుపు మీద అలవిమాలిన ధీమా.. రెండు, సరైన వ్యూహం లోపించడం. పాడిందే పాట అన్నట్టుగా హామీలు, గ్యారెంటీలంటూ ఊదరగొట్టడం. హర్యానా ఓటర్ల ముందు ఈ గారడీలేవీ పని చేయలేదు. హిమాచల్, కర్ణాటక, తెలంగాణల్లో బురిడీ కొట్టించినట్టు హర్యానా ఓటర్లను మాయ చేయడం కాంగ్రెస్కు సాధ్యపడలేదు.
మూడు రాష్ర్టాల్లో హామీలకు ఏ గతి పట్టిందో ఓటర్లకు తెలిసిపోవడం అందుకు కారణం. అధికారం చేపట్టాక గత హామీలను పట్టించుకోని కాంగ్రెస్ పన్నాగాలను ముందుగానే పసిగట్టారు. బీసీ కులగణన మంత్రాన్ని ఎంతగా పఠించినా కాంగ్రెస్ గత చరిత్ర దృష్ట్యా అదీ పని చేయలేదు. పైగా ప్రీపోల్ సర్వేలు కాంగ్రెస్ విజయం ఖాయమని, ప్రభుత్వం ఏర్పాటుచేయడమే తరువాయి అని ఊదరగొట్టాయి. కానీ, తొందరపడి ముందే కూసినట్టుగా ‘జిలేబీ’లకు ఆర్డరిచ్చి బొక్కబోర్లా పడింది కాంగ్రెస్.
శివసేన వంటి మిత్రపక్షాలు ఇప్పుడు కాంగ్రెస్ చేతకానితనాన్ని నిలదీస్తున్నాయి. హర్యానాలో ఆ పార్టీ అనుసరించిన వ్యూహాలను, ఎత్తుగడలను ఎండగడుతున్నాయి. బీజేపీకి కాంగ్రెస్ గట్టి పోటీ ఇవ్వడం మాట అటుంచి అసలుకే ఎసరు వచ్చింది. ఇండియా కూటమితో దేశ రాజకీయాల దిశను మార్చాలని కలలు గన్న కాంగ్రెస్ అస్తిత్వమే ప్రమాదంలో పడింది. ‘కర్ణుడి చావుకు..’ అన్నట్టుగా కాంగ్రెస్ పరాభవానికి దారితీసిన అంశాలు ఎన్నో ఉన్నాయి. స్థానిక నాయకత్వంలో సమన్వయం లోపించడం, ‘నేనంటే నేన’ంటూ సీఎం అభ్యర్థులు పోటీపడటం వంటి కాంగ్రెస్ మార్కు రాజకీయాన్ని హర్యానా ఓటర్లు ఏవగించుకున్నారని ఫలితాలు వెల్లడించాయి. రాహుల్, ప్రియాంక కాలికి బలపం కట్టుకుని తిరిగినా సానుకూల ఫలితాలు సాధించలేకపోయారు. సామాజిక సమీకరణాలను వ్యూహాత్మకంగా ఉపయోగించుకున్న బీజేపీ.. కాంగ్రెస్ దూకుడుకు కళ్లెం వేయగలిగింది.
హర్యానా ఫలితాలు బీజేపీకి కొత్త ఊపును ఇవ్వగా కాంగ్రెస్ను మరింతగా కుంగదీశాయని చెప్పాలి. కురువృద్ధ రాజకీయ పార్టీ దేశం లో బలమైన రాజకీయ శక్తిగా మళ్లీ పుంజుకోవడం సాధ్యమేనా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇక కశ్మీర్లో పేరుకు ఇండియా కూటమి గెలిచినా సర్కారుపై పెత్తనం సాగించేంది నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) అనేది స్పష్టమైపోయింది. కాగా జాతీయ పార్టీనని చెప్పుకొని తిరిగే కాంగ్రెస్ అక్కడ జూనియర్ పార్ట్నర్ పాత్రతో సరిపెట్టుకోవాల్సిందే. ఒకప్పుడు లెక్కలేని తనంతో దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ ఇప్పుడు లెక్కకురాని పార్టీగా మిగిలిపోయింది. అటు లోక్సభ ఎన్నికల్లో దెబ్బతిన్న బీజేపీ కోల్పోయిన తన పలుకుబడిని కొంత తిరిగి దక్కించుకుంటే, కాంగ్రెస్ మాత్రం అందివచ్చిన అవకాశాన్ని చేజార్చుకుని మూలకు పడిపోయింది. మొత్తం మీద రెండు రాష్ర్టాల ఫలితాలు కాంగ్రెస్ మనుగడను ప్రశ్నార్థకం చేశాయని చెప్పవచ్చు.