కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తన 665 పేజీల నివేదికలో ఎక్కడా ఫలానా వాళ్లు ఇంత లంచం ఇవ్వడం వల్ల ప్రాజెక్టు డిజైన్ మార్చేశారని గాని, ఇంత డబ్బు చేతులు మారడం వల్ల ప్రాజెక్టులో నాణ్యత లోపించిందని గాని, కాంగ్రెస్ ఆరోపిస్తున్నట్టుగా కేసీఆర్ రూ.లక్ష కోట్ల అవినీతికి పాల్పడి ప్రాజెక్టును నిర్వీర్యం చేశారని గాని ప్రస్తావించలేదు.
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు రీడిజైనింగ్‌లో బ్యారేజీల నిర్మాణ స్థలం మారిందని, ప్రాజెక్టు మెయింటెనెన్స్ లోపాలు ఉన్నాయని, ఫలితంగా మేడిగడ్డలో పిల్లర్ కుంగిందని, మరో రెండు బ్యారేజీల్లో సీపేజీలు వచ్చాయని తెలిపింది. అంతేతప్ప అవినీతికి సంబంధించిన ప్రస్తావన ఎక్కడా చేయలేదు. దీంతో కాళేశ్వరంలో లేని అవినీతిని చూపించాలనుకున్న కాంగ్రెస్ పని కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్లు అయింది. దీంతో కనీసం సీబీఐ అయినా ఆ లేని ఈకలు దొరకపట్టుద్దేమో అన్న ఆశతో రేవంత్‌రెడ్డి ఏకంగా తాను ఏర్పాటు చేసిన విచారణ కమిషన్ నివేదికను పక్కనపెట్టి మరీ సీబీఐకి దర్యాప్తును అప్పగించారు.
జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఏర్పడిందే కాళేశ్వరంలోని అవినీతి ఆరోపణల మీద. అలాంటి విచారణ కమిషన్ తన సుదీర్ఘ నివేదికలో ఎక్కడా అవినీతి ఆరోపణలకు ఆధారాలు చూపించలేకపోవడం ఇక్కడ ప్రధానమైన విషయం. వాస్తవానికి కమిషన్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి ముందు కాంగ్రెస్ నేతలంతా ‘నివేదిక సారాంశం’ అంటూ.. కేసీఆర్ అవినీతికి ఆధారాలు దొరికాయని, లక్ష కోట్ల అవినీతి జరిగినట్టు కమిషన్ తేల్చిందని నానా హంగామా చేశారు. తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. తీరా కమిషన్ నివేదిక వారి చేతికి వచ్చేసరికి అసలు విషయం తెలిసి ఉంటుంది. అందుకే నివేదికపై అసెంబ్లీలో అర్ధరాత్రి చర్చ చేపట్టారు. సీబీఐ దర్యాప్తు పేరుతో కమిషన్ నివేదికను చెత్తబుట్టలో పడేశారు. నివేదికలో అవినీతికి ఆధారాలు ఎక్కడ చూపించారని బీఆర్ఎస్ అడుగుతుందన్న భయంతో మరుసటి రోజే అసెంబ్లీని నిరవధిక వాయిదా వేశారు.
నీటిపారుదలరంగ నిపుణుడు వి.ప్రకాష్ ఇటీవల ‘తెలంగాణ టుడే’కి ఇంటర్వ్యూ ఇచ్చారు. కమిషన్ ఎదుట విచారణకు తాను కూడా హాజరయ్యానని, కానీ తన అభిప్రాయాలను నివేదికలో ఎక్కడా పేర్కొనలేదని, ప్రాజెక్టులో లోపాలను వెతికే క్రమంలో విచారణ కమిషన్ కాళేశ్వరం అసలు లక్ష్యాలను విస్మరించిందని, కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పక్షపాత వైఖరితో వ్యవహరించి నివేదికను రూపొందించినట్టు ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
కాళేశ్వరంలో అవినీతి జరిగిందని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఘోష్ కమిషన్‌ను నియమించలేదు. ఎలాగైనా, ఎక్కడో ఒక దగ్గర కాళేశ్వరంలో అవినీతి మూలాలు దొరకవచ్చేమో అన్న ఆశతో నియమించింది. 15 సార్లు దాని కాల పరిమితిని పొడిగించింది. అయినా కమిషన్ ఎక్కడా అవినీతి జరిగినట్టు ఆధారాలను పట్టుకోలేకపోయింది. లేని అవినీతిని జరిగిందని కుట్ర రాజకీయాలతో ప్రచారం చేసి ప్రజలను మోసం చేయాలని చూసిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ సమాజానికి కచ్చితంగా క్షమాపణ చెప్పాలి. కాదు.. అవినీతి జరిగినట్లు విచారణ కమిషన్ తేల్చిందని కాంగ్రెస్ నేతలు ఇంకా వాదిస్తే కమిషన్ నివేదికలో ఏ పేజీలో, ఏ పేరాలో కేసీఆర్ అవినీతికి పాల్పడ్డారని కమిషన్ పేర్కొందో చూపించాలి.