విజ్ఞులైన పాఠక మహోదయాలకు 77వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు. నేడు జెండా పండుగ సంబురాలు చేసుకుంటున్న మనం సంబురాలతోపాటు ఒక సమాలోచన చేయాలి. ఒక స్వతంత్ర జాతిగా మన బాధ్యతలను మననం చేసుకోవలసిన సందర్భం ఇది.
సంబురం అయ్యాక, మన గమ్యం ఎటు అనే ప్రశ్న వేసుకోవాల్సిన సమయం. అయితే, ఆలోచించేవారికి వేడుక ముగిశాక ఒక వేదన మిగులుతుంది. మనం ఎంతో జాగ్రత్తగా నిర్మించుకున్న రాజ్యాంగం రాజకీయాలకు బలైంది. దానికన్నా ముందు ఒక ముఖ్యమైన సంగతి ఉంది.
ఈ రోజు ప్రశ్నించటం ప్రతిపక్షాలకే పరిమితమైంది. అయితే. ప్రభుత్వం ఏం చేసినా వ్యతిరేకించాలన్న ధోరణిలో ఉంటుంది ప్రతిపక్షం ఈ మధ్య కాలంలో. ప్రజలు ఓటు వేసిన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ప్రజల విశ్వాసం పొందలేని పార్టీ ప్రతిపక్షమవుతుంది. ప్రజలు ఎన్నికల్లో గెలిపించిన పార్టీ పరిపాలన చేస్తుంది గనక పరిపాలనలో ఉన్న దోషాలను ఎత్తిచూపటం ప్రతిపక్షాల పని. పనికి అడ్డు తగలటం తప్పు.
మనతో పాటుగా మరికొన్ని శాసనసభలకు త్వరలో ఎన్నికలు జరుగనున్నాయి. ఇది విచ్చలవిడిగా డబ్బులు పంచే సీజన్. ‘హామీల పండుగ’ సీజన్ కూడా. నది లేకపోయినా బ్రిడ్జి నిర్మిస్తామని హామీలు గుప్పించే రోజులివి. ఎందుకంటే మనది ఎన్నికల ప్రజాస్వామ్యం! ధన బలానికి, కండ బలానికి గట్టిగా ‘నో’ చెప్పవలసిన సమయం ఇది. లేకపోతే వచ్చే ఐదేండ్లూ ఐదు వేళ్లతో నోటికి తాళం వేసుకోవాలి. అందుకే నేడు దేశస్థితిని గురించి కాస్త లోతుగా ఆలోచించవలసిన సందర్భం ఇది. భారతీయులందరూ నిశితంగా పరిశీలించవలసిన అంశాలు చాలా ఉన్న కీలక సమయం ఇది. స్వతంత్ర భారత దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పాటుచేసుకున్న ప్రభుత్వ వ్యవస్థ వల్ల అభివృద్ధి సాధించి, ప్రగతిపథంలో పయనించి ప్రపంచంలో భారతదేశానికి గౌరవప్రదమైన స్థానం సంపాదించటానికి మనం ఎన్నుకున్న ఆయుధం రాజ్యాంగం. ఇది కోట్లాదిమంది కలలకు రూపం ఇచ్చిన ఉత్కృష్టమైన దార్శనిక ఉపదేశం. అంతటి మహోన్నతమైన నేపథ్యం, చారిత్రక విశిష్టత గల మన రాజ్యాంగం స్వార్థపూరిత, సంకుచిత రాజకీయాలతో కలుషితమవుతున్నది. నేడు ఇది ప్రతి ఒక్కరూ సీరియస్‌గా సమాలోచన చేయవలసిన అంశం. మనది ఒకనాడు పార్లమెంటరీ ప్రజాస్వామ్యం.
అది నేడు ప్రధాన మంత్రిత్వ ప్రజాస్వామ్యంగా మారింది. ప్రధాన మంత్రిత్వ ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ వ్యవస్థ అంతా ఒక్క వ్యక్తి చుట్టూ పరిభ్రమిస్తుంది. ఆ వ్యక్తే శక్తిగా మారి యావత్తు దేశాన్ని ఇష్టానుసారంగా శాసించే పరిస్థితులు రావటం పరిపాటి అయింది. ముఖ్యంగా గత పదేండ్ల నుంచి. అయితే, ఇది నేటి పరిణామం కాదు, స్వాతం త్య్రం వచ్చినప్పటి నుంచి పురుడుపోసుకున్న సంప్రదాయం. ఇప్పుడు బాగా బలం పుంజుకున్నది. ఒకవిధంగా చెప్పాలంటే నెహ్రూ విశిష్టమైన నాయకత్వం వ్యవస్థలను ఎదగనీయకుండా చేసింది. ముఖ్యంగా మన రాజ్యాంగంలో పార్లమెంటుకు కల్పించిన విశిష్ట స్థానాన్ని మనం నిలబెట్టుకోలేకపోయాం. ఒక వ్యవస్థగా పార్లమెంటు మొదటినుంచీ ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మ అయింది. చట్టాలు చేయటంలో సభ్యులకు ఏం పాత్ర లేదు. ప్రభుత్వం ప్రతిపాదించే బిల్లులకు యస్/నో చెప్పి బల్లలు చరచటం తప్ప సభ్యులు బిల్లులను రూపొందించటం, అవి సభ ఆమోదం పొంది చట్టాలవటం మన వ్యవస్థలో లేదు. అయితే ప్రభుత్వ తీరును నిశితంగా గమనించుతూ, ప్రశ్నల రూపంలో ప్రభుత్వాన్ని జవాబుదారీ చెయ్యవలసిన బాధ్య త సభ్యులందరిదీ. ఈ బాధ్యత పార్టీలకతీతమైనది. కానీ, ప్రభుత్వ పనితీరును సునిశితంగా గమనించే పాత్రను సభ్యులు విస్మరించారు రాజకీయ కారణాలతో. రాజ్యాంగం నిర్దేశించిన పాత్రను ప్రజలచేత ఎన్నుకోబడిన ప్రతినిధులు పోషించకుండా రాజకీయం నిర్వీర్యం చేసింది.
ఈ రోజు ప్రశ్నించటం ప్రతిపక్షాలకే పరిమితమైంది. అయితే. ప్రభుత్వం ఏం చేసినా వ్యతిరేకించాలన్న ధోరణిలో ఉంటుంది ప్రతిపక్షం ఈ మధ్యకాలంలో. ప్రజలు ఓటు వేసిన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ప్రజల విశ్వాసం పొందలేని పార్టీ ప్రతిపక్షమవుతుంది. ప్రజలు ఎన్నికల్లో గెలిపించిన పార్టీ పరిపాలన చేస్తుంది గనక పరిపాలనలో ఉన్న దోషాలను ఎత్తిచూపటం ప్రతిపక్షాల పని. పనికి అడ్డు తగలటం తప్పు. తప్పు పని చేస్తే దాన్ని ఎత్తిచూపాలి. అధికార పక్షం కూడా గమనించాల్సిన విషయం ఏమిటంటే ప్రజలు ప్రతిపక్షానికి కూడా ఓట్లు వేశారు కనుక ప్రతిపక్షం వాదన కూడా వినాలి. ప్రతిపక్షం కూడా ప్రజల మనోభావాలను ప్రతిబింబించేలా వ్యవహరించాలి గానీ, ప్రతిపక్షం కాబట్టి ప్రభుత్వంతో అన్నివేళలా విభేదించాలనుకోవటం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. అది ప్రజల తీర్పును గౌరవించకపోవటమే అవుతుంది. పరిపాలన పార్టీలకతీతం. ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థి నియోజకవర్గంలో ప్రజలందరికీ ప్రాతినిధ్యం వహించాలి. కానీ, నియోజకవర్గం కన్నా వర్గం ముఖ్యం అనుకునే రోజులివి.
ఇది ఒక దురదృష్టకర పరిణామం. సభాధ్యక్షుడిగా పిలువబడే స్పీకర్ పదవిని కూడా రాజకీయం నిర్వీర్యం చేసింది. స్పీకర్‌కు పనిభారం తగ్గించటానికి రాజ్యాంగం డిప్యూటీ స్పీకర్ పదవిని కల్పించింది. అయితే, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి లోక్‌సభలో అధికారపక్షానికి తగినంత బలం ఉన్నా డిప్యూటీ స్పీకర్ పదవిని భర్తీచేయకుండా ఐదేండ్లు ఖాళీగా ఉంచిన ఘనత నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వానిది. దీన్నిబట్టి మన ప్రధానమంత్రికి రాజ్యాంగం మీద ఎంత గౌరవం ఉన్నదో తెలుస్తుంది. మన రాజ్యాంగంలో గవర్నర్ పదవిలో ఉన్నవారు రాజకీయాలకతీతంగా వ్యవహరించాలి. రాష్ర్టాల్లో ప్రభుత్వాలు గానీ, శాసనసభలుగానీ రాజ్యాంగానికి లోబడి వ్యవహరించేలా చూడవలసిన బాధ్యత గవర్నర్‌ది. కానీ, క్రియాశీలక రాజకీయాల్లో ఉన్న నేతలను గవర్నర్లుగా నియమించటం వల్ల రాజభవనాలు రాజకీయ కలాపాలకు వేదికలు అయినవి. ఈ విధంగా గవర్నర్ పాత్ర పూర్తిగా రాజకీయమయమై రాజ్యాంగపరంగా నిర్వీర్యమైంది. ముఖ్యంగా కేంద్రంలో అధికారపక్షానికి ప్రతికూలంగా ఉండే రాజకీయపక్షాలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో గవర్నర్లు చేసే రభస అంతా ఇంతా కాదు. కేరళ, తమిళనాడు, తెలంగాణ లాంటి రాష్ర్టాల్లో గవర్నర్లు రాజ్యాంగ పరిధిని దాటి వ్యవహరిస్తున్నారు. ప్రజలచేత ఎన్నుకోబడిన ప్రభుత్వానికి అడ్డంకులు సృష్టిస్తున్నారు.
మన వ్యవస్థలో ప్రధాన మంత్రిది అత్యంత కీలకమైన స్థానం. మన ప్రధాని రాజకీయనేతగా కాకుండా రాజనీతివేత్తగా జాతికి దిశ, దశ సూచించాలని ఆశిస్తుంది రాజ్యాంగం. మన ప్రధాని ఈ సువిశాలమైన భారత భూమిని పాలించే కేంద్ర ప్రభుత్వానికి నాయకుడు. భారతీయులందరిని ఏకతాటిమీద నడిపి ముఖ్యమైన అంశాల మీద ఏకాభిప్రాయాన్ని సాధించాల్సిన దార్శనికుడై ఉండాలి. అంత విశిష్టత గల స్థానం మన ప్రధానిది. గతంలో ప్రధానులు వారి వ్యక్తిత్వంతో ప్రజల మనసులో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. నేటి ప్రధానులకు వ్యక్తిత్వం కన్నా యుక్తిత్వమే ప్రధాన ఆయుధం. అందుకే నేడు అంతా రాజకీయ కోణమే. వారికి దేశ ప్రయోజనాలు, భవిష్యత్తు తరాల తలరాత ముఖ్యం కాదు. నేడు రాజ్యాంగపరంగా అత్యం త నిర్వీర్యమై పూర్తిగా రాజకీయమయమైన పదవి ప్రధానమంత్రి పదవి.
విపక్షాలు ఒక కూటమిగా ఏర్పడితే ప్రధాన మంత్రి ఆ కూటమిని ఈస్ట్ ఇండియా కంపెనీగా అభివర్ణించడం చాలా అమర్యాదకరంగా ఉన్నది. ఇప్పుడు రాజ్యమేలుతున్న వారిని వేస్ట్ ఇండియా కంపెనీ అని ఎందుకనగూడదు? విమర్శ అనేది అంశా లు, విలువల ఆధారంగా ఉండాలే గానీ ఎదుటివారి వ్యక్తిత్వాన్ని కించపరిచేవిధంగా ఉండకూడదు.
అసహనం రాజ్యమేలుతున్న రోజులివి. విమర్శ ప్రజాస్వామ్యానికి ఊపిరి. కానీ విమర్శను భరించే రోజులు కావివి. నువ్వు నాతో లేకపోతే నాకు విరోధివి అనేది ఒకనాటి అమెరికన్ నానుడి. ‘నువ్వు నన్ను పొగిడితే దేశభక్తుడివి లేదంటే దేశద్రోహివి’ అని ముద్రవేయటం నేటి మన సంప్రదాయం. రాజ్యాంగ వ్యవస్థలు నిర్వీర్యమైనాయి. సామాన్యుడు అవస్థలో ఉన్నప్పుడు ఆఖరి ఆశాకిరణంగా ఉండాల్సిన న్యాయవ్యవస్థ కూడా అవస్థలు పడుతున్నది. వర్తమాన ప్రపంచంలో జరుగుతున్నది జరుగుతున్నట్టు నిశితంగా గమనించి సునిశితంగా చెప్పవలసిన గురుతర బాధ్యత మీడియాపై ఉన్నది. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించటానికి స్వతంత్రంగా వ్యవహరించే మీడియా ఆఖరి ఆశాకిరణం. కానీ మనదేశంలో జాతీయ మీడియా కన్నా ప్రాంతీయ మీడియా పనితీరే మెరుగ్గా ఉన్నది.
గుమ్మడిదల రంగారావు