Telangana Martyrs | సాధారణంగా అత్యధిక ప్రేక్షకులకు పూర్తిస్థాయి కథాచిత్రాలంటే ఎక్కువ ఆసక్తి ఉంటుంది. ఆ సినిమాలకే పాపులారిటీ, క్రేజ్ ఎక్కువ. అయితే మన జీవితాన్ని, మన సామూహిక ఆకాంక్షలను ప్రతిబింబించిన కొన్ని నాన్‌ఫీచర్ ఫిల్మ్‌లు కూడా అంతే ఆసక్తిని రేకెత్తిస్తాయి. ఫీచర్ ఫిల్మ్‌లు, ప్రధానంగా కాల్పనికతకు, ఊహాశక్తికి, సౌందర్యాత్మకతకు అద్దం పడితే, నాన్ ఫీచర్ ఫిల్మ్లైన డాక్యుమెంటరీలు వాస్తవికతకు, నిజ జీవిత గాథలకు, గతించిన అంశాలకు సాక్షిగా నిలుస్తాయి.
రేపటి భవిష్యత్తుకు కర్తవ్య బోధ చేస్తాయి. అందుకే దూరదర్శన్, హిస్టరీ, నేషనల్ జాగ్రఫిక్, డిస్కవరీ, యానిమల్ ప్లానెట్ వంటి చానెళ్లకు కూడా ప్రధాన స్రవంతి ప్రేక్షకులకు సమానమైన సంఖ్యలో ప్రేక్షకులుంటున్నారు. 2022 ఆస్కార్‌ను గెల్చుకున్న ఎలిఫెంట్ విస్పరర్స్ డాక్యుమెంటరీ అందుకు తాజా ఉదాహరణ.
తెలంగాణ అనే మహోన్నత లక్ష్య సాధన కోసం తమ బతుకులకు ఫుల్స్టాప్ పెట్టి గమ్యాన్ని ముద్దాడేదాకా ఉద్యమాన్ని నాన్‌స్టాప్‌గా నడిపించారు. అలాంటి అమరవీరులపై అమరుల త్యాగాలపై తెలంగాణ ఉద్యమ ప్రస్థానం నేపథ్యంలో ‘అమరజ్యోతికి అభివందనం’ అనే టైటిల్‌తో ఒక డాక్యుమెంటరీని రూపొందించడం విశేషం.
నాలుగు కోట్ల మంది ప్రజల ఆకాంక్ష! ఆత్మగౌరవం కోసం, అస్తిత్వం కోసం సామాన్య ప్రజలంద రు చేసిన సామూహిక ఆక్రందన! హృదయమున్నా స్పందించని, చెవులున్నా వినపడని, కళ్లున్నా చూడలేని వ్యవస్థపై సామాన్య ప్రజల ధిక్కారస్వరం తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం!
నిజానికి ‘తెలంగాణ’ అనే పేరులోనే ఓ వైబ్రేషన్ ఉంది! ఒక ఉత్తేజం ఉంది! ఒక నిత్యజ్వలిత ఉద్వేగం, నిరంతర ఉల్లాసం ఈ నేల పొరల్లో నిక్షిప్తమై ఉంది! అవమానాలు, అసమానతలు, వివక్ష ఫలితంగా నిధులు, నీళ్లు, నియామకాల పరంగా వెనుకబాటుతనాన్ని, పూర్తి నిర్లక్ష్యాన్ని పొందిన నేలమీద పుట్టిన ప్రజల పొలికేక తెలంగాణ ఉద్యమ కాంక్ష గా పరిణమించింది. అలాంటి తెలంగాణ ఉద్యమం మిలియన్ మార్చ్‌గా, సకల జనుల సమ్మెగా ఎన్నెన్నో పోరాట రూపాలలో ప్రజాకాంక్షను వ్యక్తం చేసింది. రాజ్యాంగ పరిధిలో ప్రజా పోరాట వేదికలో, ఎన్నికల బరిలో నిలిచి గెలిచిన జెండాగా సైతం నిత్యం ప్రజలందరి ఆకాంక్షకు నిలువెత్తు నిదర్శనంగా కొనసాగింది.
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అమరవీరుల స్మారకం అమర జ్యోతి ప్రారంభించే క్రమంలో ప్రత్యేకంగా ఒక డాక్యుమెంటరీని రూపొందించాలని ఆదేశించారు. దానిని అనుసరిం చి దేశపతి శ్రీనివాస్ పర్యవేక్షణలో రూపొందిన ఈ డాక్యుమెంటరీ నిడివి 10.15 నిమిషాలు అయినప్పటికీ మొత్తం 25 ఏండ్ల ప్రస్థానాన్ని దృశ్యమానం చేసింది.
14 ఏండ్ల పోరాటం, ఆ పోరాటంలో అసువులు బాసిన అమరవీరుల త్యాగాలు, తెలంగాణేతరుల దాష్టీకాలు స్పృశిస్తూనే మరొకవైపున శ్రీకాంతాచారి, యాదగిరి లాంటి యువ వీరుల బలిదానాలను ఎంతో హృద్యంగా ఆవిష్కరించి కంటతడి పెట్టించింది. ఉద్యమ ప్రస్థానంలో అమరుల బలిదానాలు అన్నింటినీ చెబుతూ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ వికాస సంక్షేమాల కొనసాగింపు కోసం భవిష్యత్తులో మన భాధ్యతను మరింత గుర్తు చేసింది.
సహృదయ వ్యాఖ్యానంగా, సంవేదనతో కూడి న ఆత్మీయ స్పర్శగా మరొక్కసారి అమరవీరుల త్యాగాలని గుర్తు చేసుకొని, మనందరం పునరంకితం కావలసిన అవసరాన్ని గుర్తించేలా రూపొందించిన ఈ డాక్యుమెంటరీ అనుకున్న లక్ష్యాన్ని సాధించింది. ఒక సామూహిక స్వప్నం కోసం నెత్తురు ధారపోసిన నేల ఇది… అనే గంభీర స్వరంతో కూడిన వ్యాఖ్యానంతో, రక్తమోడుతున్న అమరవీరుల స్తూపం దృశ్యంతో, ఉరుములు, మెరుపులు మానవ నిస్సహాయ ఆక్రందనల బ్యాక్‌గ్రౌండ్ సంగీతంతో ఒక భావోద్విగ్న లోకంలోకి తీసుకెళ్లిన ఈ డాక్యుమెంటరీ, ఇది తెలంగాణం… చరిత్ర పుటలపై ఎగిసిపడిన ఆరు దశాబ్దాల అత్మ గౌరవ రణం అంటూ, 1969 తొలిదశ ఉద్యమ అనంతరం చరిత్ర చెమ్మగిల్లిన కన్నులతో మరో విస్ఫోటనం కోసం ఎదురు చూసింది అని మలిదశ ఉద్యమానికి కారణాన్ని చూపింది.
ఆద్యంతం ఎంతో ఉద్వేగభరితంగా కొనసాగి న ఈ డాక్యుమెంటరీలో తెలంగాణ ఉద్యమ ఘట్టాలలోని సందర్భోచితమైన విజువల్స్, జోహారులు… జోహారులు… అమరులకూ జోహార్ అనే నందిని సిధారెడ్డి పాటలోని భాగాలు గుండెల్లో ప్రకంపనలు పుట్టిస్తాయి. ‘ఓ అమరులారా… మీ కన్నుల కాంతులే స్వరాష్ట్ర ప్రగతిలో ప్రతిఫలిస్తున్నాయి… సంక్షేమంలో అభివృద్ధిలో సువర్ణాధ్యాయాన్ని లిఖిస్తున్నాయి’ అని నవశకానికి నాంది పలికిన తీరును ఆవిష్కరించింది. గోదారమ్మ హోరులో, కృష్ణమ్మ జోరులో అమరుల చిరునవ్వుల సవ్వడులను, మత్తడి దుంకుతున్న చెరువుల అలలలో అమరుల కలలను చూస్తున్నామని చెప్తూ, తెలంగాణా దశాబ్ది సందర్భంలో అమరవీరులు పంటచేలలో పసిపాపలుగా, తలెలో పాలబువ్వలుగా, బతుకమ్మకు శిఖరంగా, పాలపిట్టలుగా దర్శనమిస్తున్నారని ఎంతో హృద్యంగా ఈ డాక్యుమెంటరీ సమకాలీన ప్రగతితో సమన్వ యం చేస్తూ కీర్తించింది. ఇలా పదం, వ్యాఖ్యానం, దృశ్యం, సంగీతం ఒకదానితో ఒకటి మమేకమై తెలంగాణా భావోద్విగ్నత అంతస్సూత్రంగా కొనసాగిన ఈ డాక్యుమెంటరీ ఏ అంతర్జాతీయ డాక్యుమెంటరీకి తక్కువ కానంత ఉన్నత ప్రమాణాలతో రూపొందింది.
అసాధ్యం అనుకున్న తెలంగాణా ఆవిర్భవించి దశాబ్దకాలం పూర్తి చేసుకున్న ప్రస్తుత తరుణం నాటికి తెలంగాణా అభివృద్ధి, సంక్షేమ రంగాలలో అనూహ్య ప్రగతిని సాధించడమే కాక, దేశానికే ఆదర్శంగా నిలిచే స్థాయికి వెళ్లింది. ఆర్థిక ప్రగతికి కొలమానమైన తలసరి ఆదాయంలో దేశంలోనే నెంబర్‌వన్ స్థానాన్ని సాధించి అమరవీరులు కన్నకలలను సాకారం చేసింది.
యంగ్ రాష్ట్రం… ఎన్నో కలలు… మరెన్నో సవా ళ్ళు… ఇంకెన్నో ప్రతిబంధకాలు… అన్నిటినీ అధిగమించి తెలంగాణా సతత హరితంగా, సుజల సుఫలంగా, సమాచార సాంకేతికంగా, వైద్య ఆరోగ్య విద్యాపరంగా, సాంస్కృతిక, సాహిత్య, కళారంగాలపరంగా, సుపరిపాలనలో అనన్యసామాన్యమైన పురోగతిని సాధించింది.
ఈ సాధన వెనుక ప్రతీక్షణం స్ఫూర్తిగా నిలిచింది తెలంగాణా పోరాటమే! ఈ విజయాల వెనుక ప్రతీ నిమిషం ప్రేరణను ఇచ్చింది తెలంగాణా పోరాట వీరులే!! అనే భావనను సున్నితంగా, సునిశితంగా, ఉద్వేగభరితంగా ఈ డాక్యుమెంటరీ అందించింది.
సాధారణంగా డాక్యుమెంటరీలు, రియలిస్టిక్ కథనాలతో దానికి సంబంధించిన ఛాయాచిత్రాలతో విజువల్ ఫుటేజ్‌తో ఉండడం సహజమే, ఈ డాక్యుమెంటరీ కూడా అదే సూత్రాన్ని పాటించింది అయితే దీనిలోని రచన, వ్యాఖ్యానం హృదయాన్ని తట్టిలేపుతూ, తెలంగాణ మట్టి తత్వాన్ని మరొక్కసారి ప్రేక్షకులందరికీ జ్ఞప్తి చేస్తుంది. తెలంగాణ ఆత్మతత్వాన్ని, పోరాటపటిమను, త్యాగనిరతిని గుర్తుచేస్తుంది. ఈ డాక్యుమెంటరీలోని అక్షరాల నిండా కవితాత్మకత, సాహితీ కావ్య ప్రాతిపదిక ఉండడం, ఈ డాక్యుమెంటరీ దృశ్యపరంగా ఆసాంతం వాస్తవికతని, భావాలపరంగా ఆర్ద్రతని, అక్షరాలలో ఆత్మీయతని మూటగట్టుకొని చూసిన, విన్నవారందరిలో ఒకసారి కంటతడి పెట్టించే లాగా, మరోసారి కర్తవ్యోన్ముఖులను చేసేలా ఉండడం విశేషం. సాధారణంగా ఒక సన్నివేశం ప్రేక్షకులని ప్రభావితం చేయడం సహజమే! అయితే దీనిలోని దృశ్యాలు, వ్యాఖ్యానం ప్రేక్షకులని కాలయంత్రంలో వెనక్కి తీసుకెళ్లి ఎక్కడో అట్టడుగున గుండెపొరల్లో దాగి ఉన్న భావాలను, స్మృతులను తట్టి లేపడం, ప్రభావితం చేయడం మాత్రం ఈ డాక్యుమెంటరీ ద్వారా సాధ్యమైంది. ఈ డాక్యుమెంటరీకి సందర్భోచిత గ్రాఫిక్స్, స్క్రిప్ట్, విజువల్ ఈస్తటిక్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ నాలుగు స్థంభాలుగా నిలిచి దీనిని ఎంతో హృద్యమైన, ఆత్మీయమైన సమకాలీన చారిత్రక రికార్డుగా నిలిపాయి. పదికాలాల పాటు పదిలం చేసుకోదగిన రికార్డుగా దీనిని మలచడమేకాక, తన గళాన్ని, కలాన్ని అందించి దీనికి జవజీవాలను అందించిన శాసనమండలి సభ్యులు దేశపతి శ్రీనివాస్, సాంకేతిక సహకారం అందించిన శ్రీ పూర్ణచందర్ బాదావత్, ఇతర సాంకేతిక నిపుణుల కృషికి శనార్తులు చెప్పకుండా ఉండలేం. మొత్తం మీద ఈ 10 నిమిషాల డాక్యుమెంటరీ తెలంగాణా ప్రస్థానంపై విహంగ వీక్షణంలా కనిపించినా, 10 పూర్తిస్థాయి కథాచిత్రాలకు కావలసినంత ముడిసరుకును ఎమోషనల్‌గా అందించిందనడంలో సందేహం లేదు!