సామాజికాభివృద్ధిని వ్యవస్థీకృతం చేస్తే అది ఆర్థికాభివృద్ధికి సంబంధించిన మొత్తం ప్రక్రియను నిలదొక్కుకొనేలా చేస్తుంది. ఏ సంక్షేమ రాజ్యానికైనా ప్రధాన లక్ష్యం విద్య, ఆరోగ్యం, పోషణ, తాగు, సాగునీరు, వ్యవసాయం తదితర సామాజిక మౌలిక సదుపాయాలను మెరుగుపర్చడం. ఇది సంక్షేమ రాజ్య వ్యవస్థలో కీలకమైనది. వర్తమాన భారతదేశంలో దార్శనికతతో, సృజనాత్మకతతో ఇట్లాంటి బృహత్తరమైనటువంటి సామాజికాభివృద్ధితో కూడిన సంక్షేమ, అభివృద్ధి పాలనను ప్రజలకు అందిస్తున్న ఏకైక పాలకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఈ తొమ్మిదిన్నరేండ్లలో సీఎం కేసీఆర్ అలుపెరుగని పోరాటం చేస్తూ తెలంగాణ రాష్ర్టాన్ని దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దారు. కరోనా కాలంలోనూ దేశమంతా పాలనా, అభివృద్ధి పనుల్లో స్తబ్ధుగా ఉన్న సమయంలో తెలంగాణలో మాత్రం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిన వైనం వేనోళ్ల కొనియాడబడ్డాయి.
‘ధనం మూలం ఇదం జగత్’ అనే నానుడి నిష్ఠూరంగా ఉన్నా సమాజం నడవాలంటే ఆర్థిక వ్యవహారాలతోనే సాధ్యం అవుతుంది. ఈ సూక్ష్మాన్ని గ్రహించిన సృజనాత్మక పాలకుడైన సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సాధననే కాకుండా ‘బంగారు తెలంగాణ’ సాధకుడయ్యారు. రాష్ట్రం ఏర్పడేనాటికి అస్తవ్యస్తంగా ఉన్న తెలంగాణలో తన ప్రజలను రక్షించుకోవాలని సీఎం కేసీఆర్ బలమైన యుద్ధాన్ని చేశారు. దానికోసం మొదటగా ‘మిషన్ కాకతీయ’, ‘మిషన్ భగీరథ’లతో సాగునీరు, తాగునీరులను అందించేలా చూసి ప్రజల దాహార్తిని తీర్చారు. సాగునీటి ప్రాజెక్టులు, రిజర్వాయర్లతో భూగర్భ జలాలను పెంచి వ్యవసాయాన్ని స్థిరీకరించారు. ఇలాంటి బృహత్తర కార్యక్రమాల వెనుక అద్భుతమైన ఆర్థిక ప్రగతి దాగున్నదన్నది మేధావులకూ అర్థం కాని విషయం. ఒక్కొక్కటిగా అన్ని సమస్యలకు శాశ్వతంగా చరమగీతం పాడుతూ సీఎం కేసీఆర్ తెలంగాణ గ్రామాల్లో పరోక్ష ఉపాధిని పెంచారు. తద్వారా గ్రామీణ ఆర్థికవ్యవస్థకు బలమైన పునాదులు వేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు, ఏర్పడిన తర్వాత పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే ఈ విషయాలు ప్రతి ఒక్కరికీ అవగతమవుతాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో ఓ వైపు బలమైన ఆర్థికవ్యవస్థను ఏర్పాటు చేసుకుంటూ మానవ వికాసానికి మూలమైన విద్యకు, జీవన సంతోషానికి అవసరమయ్యే ఆరోగ్యానికి ఎనలేని ప్రాధాన్యం కల్పిస్తున్నారు.
సహజ వనరుల పరిరక్షణ, సమర్థంగా వాటి వినియోగంపై సీఎం కేసీఆర్ పట్టుసడలని పోరాటం చేశారు. అతిపిన్న వయస్కురాలైన తెలంగాణకు అనేక విజయాలను సాధించిపెట్టారు. అనంతరం మానవ వనరులపై దృష్టిసారించారు. దేశ నిర్మాణానికి, ఆర్థికవ్యవస్థ వృద్ధికి మానవ వనరులే అత్యంత కీలకమైనవని సీఎం కేసీఆర్ బలంగా విశ్వసించారు. విద్యావంతులు, నైపుణ్యం కలవారు, ఆరోగ్యవంతులైన శ్రామికులతోనే వ్యవస్థాగత అభివృద్ధి, మెరుగైన ఫలితాలు సాధ్యమవుతాయని భావించి తెలంగాణ రాష్ట్రంలో విద్య, వైద్య ఆరోగ్యాలపై తనదైన శైలితో అభివృద్ధి యుద్ధం చేస్తున్నారు. దశాబ్దాల తన పాలనా అనుభవాన్ని రంగరించి, తనదైన సృజనాత్మకతతో అద్భుతమైన పథకాలు ప్రవేశపెట్టి విజయవంతం చేస్తున్నారు.
‘దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే రూపుదిద్దుకుంటుంది’ అన్న విద్యావేత్త ప్రొఫెసర్ కొఠారి వ్యాఖ్యలను నిజం చేస్తూ సీఎం కేసీఆర్ మన విద్యావ్యవస్థను దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు కంకణం కట్టుకున్నారు. నాణ్యమైన విద్యావిధానం, ఇంగ్లిష్ మీడియంలో బోధన, సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం, ఏకరూప దుస్తులు, పుస్తకాలను ఉచితంగా సమకూర్చడం, పౌష్ఠికాహారం వంటి విద్యాభివృద్ధి పథకాలను రాష్ట్ర ప్రభుత్వం సమర్థంగా అమలుచేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల నమోదు పెరిగింది. పెద్ద సంఖ్యలో డ్రాపౌట్లు తగ్గడం అభినందనీయం. దేశంలోకెల్లా అత్యధిక గురుకుల విద్యాలయాలు కలిగిన ఏకైక రాష్ట్రం మన తెలంగాణ. రాష్ట్రవ్యాప్తంగా 998 గురుకుల పాఠశాలలలో 5,99,537 మంది విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యాబోధన జరుగుతున్నది. గురుకులాల్లో చదివే ప్రతి విద్యార్థిపై ఏటా రూ.1,25,000 ప్రభుత్వం వెచ్చిస్తున్నది. ‘మన ఊరు-మన బడి’ పథకం విద్యావ్యవస్థ రూపురేఖలను మారుస్తున్నది. రాష్ట్రంలోని పాఠశాలలను దశలవారీగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం రూ.7,289 కోట్లు కేటాయించింది.
రాష్ట్ర ఐటీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు నిరంతర కృషి, పట్టుదలతో రాష్ట్రంలో కనీవినీ ఎరుగని రీతిలో ఆధునిక విద్య పేద విద్యార్థులకు అందుబాటులోకి వచ్చింది. మంత్రి కేటీఆర్ భవిష్యత్తు దీపాలను వెలిగిస్తున్నారు. ఆయన చిత్తశుద్ధితో రాష్ట్రంలో ఐటీ విద్య కొత్త పుంతలు తొక్కుతున్నది. ప్రపంచవ్యాప్తంగా అగ్రగామిగా ఉన్న ఐటీ పరిశ్రమలన్నీ తెలంగాణకు వచ్చేశాయి. ఉన్నత విద్య, వృత్తివిద్యలో అనేక సంస్కరణలతో విద్యావిధానాన్ని తీర్చిదిద్దుతున్నారు. తెలంగాణ బిడ్డలు ప్రతిభ ఉన్పప్పటికీ ఉన్నత విద్యకు దూరం కావద్దని సీఎం కేసీఆర్ బడుగు, బలహీన, వెనుకబడిన అల్ప సంఖ్యాక వర్గాలతో పాటు ఈబీసీలకూ విదేశీ విద్యను అందుబాటులోకి వచ్చేలా ‘విదేశీ విద్యా పథకం’ను అమలుచేస్తున్నారు.
కేటీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో సాంకేతిక విద్య ఊపందుకున్నది. ఓవైపు సాంకేతిక కళాశాలలకు కొత్త భవనాలు, ఇతర మౌలిక వసతులు కల్పిస్తూనే 17 పాలిటెక్నిక్ కళాశాలలను ప్రారంభించారు. సిరిసిల్ల, వనపర్తిలో జేఎన్టీయూలను స్థాపించింది. మానవీయ పాలనకు మారుపేరైన సీఎం కేసీఆర్ ప్రభుత్వం దివ్యాంగులకు స్కాలర్షిప్లను అందిస్తున్నది. వారికోసం రెసిడెన్షియల్ స్కూళ్లు, రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలు, షెల్టర్ హోంలు, హాస్టళ్లను ఏర్పాటుచేసి వారి విద్యాభివృద్ధికి దేశంలో ఎక్కడాలేనివిధంగా పనిచేస్తుండటం సకలజనులూ హర్షించదగిన విషయం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ప్రతి నియోజకవర్గానికి ఒకటి చొప్పున హాస్టళ్లు ఏర్పాటుచేయడం హర్షణీయం.
‘కలలు కనండి.. నిజం చేసుకోండి’ అని విద్యార్థులకు, యువతకు చెప్పిన భారతరత్న డాక్టర్ అబ్దుల్ కలాం మాటలను అక్షరబద్ధీకరిస్తున్నది కేసీఆర్ ప్రభుత్వం. రైతుబంధు, రైతు బీమా, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రతి పథకమూ పరోక్షంగా తెలంగాణ విద్యావ్యవస్థను పటిష్ఠం చేసేవే. తెలంగాణలోని ఏ ప్రభుత్వ విద్యాసంస్థలో చేరిన విద్యార్థులైనా ఆరోగ్యంగా, పుష్టిగా ఉండేందుకు ‘ముఖ్యమంత్రి అల్పాహారం’, ‘మిడ్ డే మీల్స్’ లాంటి ఎన్నో కార్యక్రమాలు ఉపయోగపడుతున్నాయి. మన బంగారు భవిష్యత్తు నిర్మించడం కోసం ఎన్నో త్యాగాలు చేస్తూ, ఎందరికో ఆసరా కల్పిస్తూ తెలంగాణను దేశంలో అగ్రపథాన నిలుపుతున్న సీఎం కేసీఆర్ను మూడోసారి ముఖ్యమంత్రిని చేయడం మన బాధ్యత, మన కర్తవ్యం.
(వ్యాసకర్త: బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు)
– గెల్లు శ్రీనివాస్ యాదవ్ 96768 67333