కేసీఆర్… ఒక విజయవంతమైన ఉద్యమ రూపకర్త మాత్రమే కాదు, ప్రజా హృదయాలను చూరగొన్న మహా నాయకుడు కూడా. వెనుకబడిన తెలంగాణ రాష్ర్టాన్ని సుమారు తొమ్మిదేండ్లుగా ప్రగతిపథంలో నడుపుతూ దేశంలోనే అత్యుత్తమ పాలనాదక్షుడిగా నిరూపించుకున్నారు. గ్రామీణ వాతావరణంలో పుట్టి పెరిగిన ముఖ్యమంత్రి కేసీఆర్కు గ్రామీణ వ్యవస్థపై, గ్రామీణాభివృద్ధిపై స్పష్టమైన అవగాహన ఉన్నది.
కేసీఆర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటిరోజు నుంచే ఆయన గ్రామాలపై దృష్టిసారించారు. తెలంగాణ వ్యవసాయాధారిత రాష్ట్రం. కానీ, ఉమ్మడి పాలనలో అధోగతి పాలైంది. గ్రామీణాభివృద్ధికి వ్యవసాయమే ప్రధాన వనరు అని కేసీఆర్కు తెలుసు. కాబట్టి, ఆయన నీటి ఆధారంగా రాష్ట్రంలో జరుగుతున్న వ్యవసాయంపై దృష్టి సారించారు. దేశంలో నెహ్రూ తర్వాత భారీ ప్రాజెక్టులకు రూపకల్పన చేసిన మహానాయకుడు కేసీఆర్. కాళేశ్వరం పేరుతో ఒక భారీ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి, అనతికాలంలోనే పూర్తి చేశారు. రాష్ట్రంలో అన్ని కాలాల్లోనూ పుష్కలంగా వ్యవసాయానికి అవసరమైన నీరుండేలా చర్యలు చేపట్టారు. భూగర్భ జలాలను కూడా రైతులు సమర్థవంతంగా వినియోగించుకోవడానికి వీలు గా 24 గంటల ఉచిత నాణ్యమైన కరెంటును అందుబాటులోకి తెచ్చారు.
రైతులకు పెట్టుబడి సాయం పేర ‘రైతుబంధు’ పథకాన్ని ప్రారంభించి ఏటా ఎకరానికి రెండు దఫాలుగా రూ.10వేలు అందజేస్తున్నారు. ఈ పథకం మూలంగా రాష్ట్రంలోని చిన్న, సన్నకారు రైతులు తమ వ్యవసాయ కార్యకలాపాలను నిశ్చింతగా కొనసాగిస్తున్నారు. విత్తనాలు, ఎరువులు, నాట్ల సమయంలో కూలీల ఖర్చుల కోసం రైతులు వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరిగే అవసరం లేకుండా పోయింది.
వలస కార్మికుల జిల్లాగా పాలమూరుకు పేరు. ఇక్కడి రైతులు జిల్లాలో ఉపాధి లేక పొట్ట చేత పట్టుకుని ముంబయి, సూరత్ వంటి ప్రాంతాలకు వలసపోయి దినసరి కూలీలుగా బతుకు వెళ్లదీసేవారు. ఇప్పుడు వారంతా వాపస్ వచ్చి, తమ సొంత పొలాల్లో వ్యవసాయం చేసుకుంటు న్నారు. ఒకప్పుడు వ్యవసాయంలో నష్టాలే తప్ప లాభాలు లేవు. పంటలు పండక, అప్పులు తీర్చలేక రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. సీఎం కేసీఆర్ దూరదృష్టితో రైతులకు ఇప్పుడు మంచి రోజులు వచ్చాయి.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు ఎరువుల కోసం రైతులు దుకాణాల ముందు పడిగాపులు కాసేవారు. కానీ నేడు తెలంగాణలో ఆ పరిస్థితి లేదు. రైతులు అన్ని సమయాల్లో పుష్కలంగా ఎరువులు, మందులను పొందగలుగుతున్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇంతటి సౌకర్యం ఏనాడూ లభించలేదు. తెలంగాణలో రైతులకు ప్రభుత్వం నుంచి లభిస్తున్న ప్రోత్సాహకాలను గమనించిన కర్ణాటక, మహారాష్ట్ర వంటి సరిహద్దు రాష్ర్టాల రైతులు తమ గ్రామాలను తెలంగాణలో కలపాలని కోరుకుంటున్నారు.
ఇవన్నీ చూసిన కేసీఆర్కు తెలంగాణ బిడ్డగా తెలంగాణ రుణం తీర్చుకోడంతో పాటు, ఒక భారతీయుడిగా భరతమాత రుణాన్ని కూడా తీర్చుకోవాలనే కోరిక కలిగింది. పుష్కలంగా ప్రకృతి వనరులు కలిగి రత్నగర్భ అయిన భారత దేశానికి ఈ దౌర్భాగ్యమేమిటి? ఏమీ లేని చైనా మన కండ్లముందే కేవలం ఏడు దశాబ్దాల్లో ఎంతో అభివృద్ధి సాధించి, అమెరికాకు దీటుగా నిలబడితే, మనకేమిటీ కర్మ? అని కేసీఆర్ పరితపించిపోయారు. ఈ దేశానికి పట్టిన దౌర్భాగ్యమల్లా సరైన దిశానిర్దేశం చేయగల నాయకత్వం లేకపోవడమేనని గ్రహించారు. ఇందుకుగాను తన మానస పుత్రిక అయిన టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా రూపాంతరం చేశారు. భారత్ రాష్ట్ర సమితి ఆవిర్భావమే ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ అనే నినాదంతో జరిగింది. ఆ పార్టీ ఆవిర్భావం రైతాంగానికి ఉషోదయం. భారత రైతాంగం కలలు సాకారమయ్యే శుభతరుణం. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే తెలంగాణ పథకాలన్నీ దేశమంతా విస్తరిస్తాయి. ఆ శుభతరుణం కోసం దేశ రైతాంగమంతా ఎదురుచూస్తున్నది.
(వ్యాసకర్త: చైర్మన్, తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్)
-కోలేటి దామోదర్
98491 44406