శతాబ్ద కాలంలో జరగని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఒక దశాబ్ద కాలంలో జరగడం తెలంగాణ రాష్ట్రం సాధించిన ఘనవిజయం. సమాజంలో సగభాగమైన బీసీలకు రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని సంక్షేమ పథకాలలో సమభాగం లభిస్తున్నది. సంక్షేమం కోసం ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి పైసా బహుజన వర్గాలను నిలబెట్టడానికి, వారి జీవన ప్రమాణాలను పెంచడానికే దోహదపడుతుంది. బహుజనుల కోసం పరితపించి, వారికి అండగా నిలిచిన ముఖ్యమంత్రి దేశంలో కేసీఆర్ ఒక్కరే. బీసీలకు ఇంతగా చేసిన ముఖ్యమంత్రి మరొకరు లేరు.
దేశాన్ని ఏలిన పాలకులు ఏ పార్టీ వారయినా బీసీలకు చేసింది శూన్యమనే చెప్పాలి. ఈ దేశం దివాలా తీయడానికి ప్రధానకారణం సగం జనాభాగా వున్న బీసీలను విస్మరించటమేనన్నది చెరగని సత్యం. దీనిని గుర్తించిన కేసీఆర్ బీసీల జీవన ప్రమాణాలు పెంచడానికి కృషిచేస్తున్నారు. తెలంగాణలో అది సత్ఫలితాలిస్తున్నది. గతంలో ఉమ్మడి ఏపీలో ఆత్మహత్యలు చేసుకున్న విశ్వకర్మలు, పద్మశాలీల సంఖ్య వేలల్లోనే ఉంది. తెలంగాణ రాష్ట్రం అవతరణ తర్వాత.. ఈ సమస్య పరిష్కారానికి కేసీఆర్ దీర్ఘకాలిక ప్రణాళికలు అమలు పరిచారు. గొల్లకురుమ వృత్తిదారులను, గీత కార్మికులను, చేనేత కార్మికులను ఆదుకున్నారు. దీనిని మరింత విస్తరిస్తూ, ఇంకా కులవృత్తులనే నమ్ముకుని జీవిస్తున్న విశ్వబ్రాహ్మణ, నాయీ బ్రాహ్మణ, రజక, కుమ్మరి, మేదరి వంటి కులాల వారిని ఆదుకునేందుకు లక్షరూపాయలు అందించే కార్యక్రమానికి కేసీఆర్ శ్రీకారం చుట్టారు. ఈ నిర్ణయం కులవృత్తిదారులకు ఆసరాగా నిలుస్తుంది. వారి జీవన ప్రమాణాలు పెరగడానికి కావలసిన బాటలు పడతాయి. వందేండ్ల కాలంలో ఏ పాలకుడూ చేయని పనిని తెలంగాణ వచ్చాక పదేండ్లలో కేసీఆర్ చేసి చూపించారు.
వృత్తిదారులకు ఆర్థిక సహాయం అందించే కార్యక్రమాన్నితీసుకోవడంతో బీఆర్ఎస్ బహుజనుల రక్షణ సమితిగా నిలిచిందని బీసీ వర్గీయులంటున్నారు. ఇది ఒక రకంగా నిశ్శబ్ద విప్లవం. సమాజంలోని అన్ని వర్గాలు ఆత్మగౌరవంతో నిలువాలన్న దార్శనిక ఆలోచనతోనే ఈ పనికి తెలంగాణ ప్రభుత్వం పూనుకుంది. కేబినెట్ సబ్ కమిటీ దీనిపై మరింత లోతుగా అధ్యయనం చేసి రూపొందించబోయే విధివిధానాలు, ఆయా కులవృత్తిదారులను లక్షాధికారులుగా మార్చేలా ఉంటాయని బీసీలు భావిస్తున్నారు. లబ్ధిదారులు కూడా వినూత్నంగా ఆలోచించి, తమ భవిష్యత్తుకు మంచి మార్గం వేసుకోవాలి. ఉదాహరణకు పది ఇరవై మంది ఒకే వృత్తిదారులు ఒక దగ్గర జమ అయితే అది పెద్ద మూలధనంగా మారుతుంది. ఒక ఊళ్ళో వడ్రంగి పని చేసేవాళ్ళు యాభై మంది ఒక దగ్గర జమ అయితే యాభైలక్షల రూపాయలుగా మారుతుంది. ఉమ్మడిగా వీరంతా కలిసి పెద్ద కార్పెంటరీ యూనిట్‌ని పెట్టవచ్చు. దాని ద్వారా ఆ మునిసిపల్ పరిధి లేక నియోజకవర్గ జిల్లా పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు బల్లలు, టేబుళ్ళు, కుర్చీలు తయారు చేసి సరఫరా చేయవచ్చు. అప్పుడు ఆ యూనిట్ ఆదాయం లక్షల నుంచి కోట్లకు మారే అవకాశం ఉంటుంది. ఇది సామూహికంగా కలిసికట్టుగా చేయవలసిన పని.
వ్యక్తిగతంగా కూడా ప్రభుత్వం ఇచ్చిన లక్ష రూపాయలతో ఆయా కులవృత్తులకు సంబంధించిన ఆధునిక యంత్రాలను కొనుక్కుని నిలదొక్కుకోవచ్చును. ఇందు కు గ్రామస్థాయిలో వృత్తిదారుల సహకార ఫెడరేషన్లు ఏర్పాటు చేసుకుంటే మరింత లాభదాయకంగా ఉంటుంది. వృత్తిదారులు తయారు చేసే వస్తువులకు మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలోనేకాక దేశవ్యాప్తంగా కూడా వారి నైపుణ్యాన్ని బట్టి గిరాకీని సృష్టించుకోవచ్చు. రాష్ట్రప్రభుత్వం ఇచ్చే లక్ష రూపాయల సహాయాన్ని ఎలా వినియోగించాలి, గరిష్ఠంగా ఫలితాలను ఎలా రాబట్టాలి అన్నదానిపై కూడా విస్తృత స్థాయిలో వృత్తిదారులు, కులసంఘాల పెద్దలు చర్చించాలి. తమ తమ కులాల్లో ఉన్న ఆలోచనాపరులు, వృత్తిపనుల అభివృద్ధి కోసం పరిశోధన చేస్తున్న వారితో మాట్లాడాలి. వచ్చిన ప్రతిపాదనల ను క్యాబినెట్ సబ్‌కమిటీకి వెంటనే తెలియజేస్తే మరిన్ని మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.
వృత్తిదారులకు చేయబోయే ఈ సాయం ఖర్చుగా కాకుండా వారి అభ్యున్నతికి పెడుతున్న పెట్టుబడిగానే భావించి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పనికి పూనుకున్నారు. కేసీఆర్ ఏ పని చేసినా లోతుల్లోకి పోయి ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. దానికి ఇది తాజా ఉదాహరణ.
తెలంగాణ ప్రభుత్వం బీసీల కోసం తీసుకున్న నిర్ణయాలు బహుజనుల జీవితాల్లో మార్పులకు సంకేతాలుగా నిలుస్తాయి. దళితబంధు లాగా, బహుజనులకు చేసే ఈ సహాయం కూడా మార్పునకు దోహదపడుతుంది. బీసీల జీవన ప్రమాణాలు పెరగటమంటే సమాజంలో సగభాగం సుస్థిరమైన దశకు ఎదగటమే. బీసీల ను ఆత్మగౌరవంతో, స్వతంత్రంగా తమ సొంతకాళ్ళపై నిలబడే స్థాయికి తీసుకొచ్చేలా కృషి చేయటమంటే మహాత్మా జ్యోతిభాఫూలే ఆలోచనలకు ఆచరణాత్మక రూపం ఇవ్వటం అవుతుంది. ఆ పనిని కేసీఆర్ తెలంగాణలో మొదలు పెట్టారు. ఇది దేశమంతా విస్తరించాలి. బహుజనుల అభ్యున్నతే ఈ దేశ అభ్యున్నతిగా నిలుస్తుంది. బహుజన హితాయ బహుజన సుఖాయ అన్న తాత్వికతతో మన దేశం ముందుకు పోవాలి.
జూలూరు గౌరీశంకర్
94401 69896