ఉమ్మడి రాష్ట్ర పాలనలో తెలంగాణ గ్రామాలు పెంటదిబ్బలు, కంపచెట్లతో నిండి ఉండేవి. బురద, కంపు వాసనతో మురికి కాల్వలు దర్శనమిచ్చేవి. చినుకు పడితే చిత్తడి అనేవిధంగా వర్షం వస్తే రోడ్ల మీద నడిచే పరిస్థితి ఉండేది కాదు. కానీ తెలంగాణ స్వరాష్ట్రంగా ఏర్పడిన తర్వాత బంగారు తెలంగాణగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామజ్యోతి కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు.
‘గ్రామజ్యోతి’ కార్యక్రమంతో ‘పరిశుభ్రతకు ఆనవాళ్లు పచ్చదనాల లోగిళ్లు మన తెలంగాణ పల్లెలు’ అన్న చందంగా గ్రామాలు అందంగా తీర్చిదిద్దబడ్డా యి. అనంతరం పల్లె, పట్టణ ప్రగతితో మౌలిక వసతు లు మరింత మెరుగుపడ్డాయి. ఈ బృహత్తర కార్యక్రమంతో తెలంగాణ పల్లెలు జాతీయస్థాయిలో 92 అవార్డులు గెలుచుకున్నాయి.
‘గ్రామ సీమలే అభివృద్ధికి పట్టుకొమ్మలనీ’ సీఎం కేసీఆర్ విశ్వాసం. అందుకే గ్రామాలన్నింటిని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ‘పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి’ పేరుతో గ్రామాలు, పట్టణాల సమూల మార్పునకు శ్రీకారం చుట్టారు. పక్కా ప్రణాళికతో 33 జిల్లాలు, 12,769 గ్రామాలు, 141 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 21 రకాల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి నడుం బిగించారు. వీటిలో వివిధ పనుల నిర్వహణ కోసం 1,24,837 ప్రదేశాలను గుర్తించి 1,09, 784 చోట్ల పనులు పూర్తిచేశారు. పిచ్చి మొక్కలు, సర్కారు తుమ్మల తొలగింపు, పారిశుధ్య కార్యక్రమాలతో పాటు నిరుపయోగంగా ఉన్న 16,380 బావులు, 9,886 బోరుబావులను పూడ్చివేశారు. గుంతల రోడ్లు, పల్లపు ప్రాంతాలను గుర్తించి పూడ్చటం, అపరిశుభ్రంగా ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలను శుభ్రం చేయడం, శ్మశాన వాటికలను మెరుగుపరచడం, అవసరమైనచోట కొత్తగా వైకుంఠధామాలు నిర్మించ డం తదితర పనులు పూర్తిచేశారు.
రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో పరిశుభ్రతను పెంపొందించేదుకు, చెత్త సేకరణకు ట్రాక్టర్, ట్రాలీలను ఏర్పా టుచేశారు. పచ్చదనాన్ని పెంపొందించడానికి నర్సరీలు ఏర్పాటు చేయడంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా 19,472 పల్లె ప్రకృతివనాలను 13,657 ఎకరాల్లో ఏర్పాటు చేసింది. 7 కోట్ల 14 లక్షల మొక్కలను వివిధ గ్రామపంచాయతీల పరిధిలో నాటారు. సేకరించిన చెత్తను పడవేయడానికి డంపింగ్యార్డులనిర్మాణాన్ని ప్రభుత్వం చిత్తశుద్ధితో చేపట్టింది. గ్రామాల్లో కోతుల బెడదను నివారించడం కోసం 1063 ఎకరాలో మంకి ఫుడ్‌కోర్టులను ఏర్పా టుచేసింది.
తెలంగాణ రాష్ట్రంలోని నగరా లు, పట్టణాలను ఒక మాడల్‌గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టారు. సీఎం ఆదేశాలతో ఐటీ, మున్సిపల్ శాఖమంత్రి కేటీఆర్ సమన్వయంతో పట్టణ ప్రగతిని తెలంగాణ రాష్ట్రంలోని 141 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఘనంగా నిర్వహించారు. పట్టణ ప్రగతిలో విద్యుత్తు సమస్య పరిష్కారం, పరిసరాల పరిశుభ్రత, గుంతల పూడ్చివేత, మురికి కాల్వల శుభ్రత, పార్కులు, ప్లే గ్రౌండ్ల అభివృద్ధి వంటి కార్యక్రమాలను విజయవంతంగా చేపట్టారు.
గడిచిన తొమ్మిదేండ్లలో హైదరాబాద్ నగర సమగ్ర పట్టణాభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇచ్చింది. స్ట్రాటజిక్ రోడ్డు డెవలప్మెంట్ ప్రోగ్రాం (ఎస్ఆర్డీపీ)లో భాగంగా 32 ఫ్లై ఓవర్లు, 47 కి.మీ. లింకు రోడ్డులు, 22 అడుగుల ఓవర్ బ్రిడ్జిలను నిర్మించింది. వీటితో పాటు సీఆర్ఎంపీ ద్వారా 812 కి.మీ. ప్రధాన రహదారుల నిర్వహణ విజయవంతంగా జరుగుతున్నది. స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రాం (ఎస్ఎన్డీపీ) కింద రూ.985.45 కోట్లతో నగరం, దాని పరిసర ప్రాంతాల్లో వరద ప్రభావాన్ని తగ్గించడానికి ఓపెన్ నాలాలను విస్తరించింది.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత మురికి నీళ్లల్లో బట్టలుతికి రజకులు అనారోగ్యాలకు గురికాకుండా ప్రప్రథమంగా బెంగళూరు తరహాలో 8 చోట్ల ఆధునిక ధోబీఘాట్ల నిర్మాణానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలోని141 మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో వందశాతం సబ్సిడీతో ఆధునిక ధోబీఘాట్ల నిర్మాణానికి ఒక్కోదానికి రూ.2 కోట్లు వెచ్చించారు.
ప్రతి పట్టణంలోని ప్రధాన రహదారులు, వీధుల్లో 14,01,159 ఎల్ఈడీ వీధి దీపాలను ఏర్పాటుచేసి పట్టణ ప్రాంతాల్లో వెలుగులు విరజిమ్మేలా అభివృద్ధి చేసింది. వీటితో పాటు పట్టణ ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం 398 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేసింది. పారిశుధ్య, మౌలిక వసతుల మెరుగుదల వల్ల తెలంగాణ రాష్ట్రం జాతీయస్థాయి స్వచ్ఛ సర్వేక్షన్ 2021లో 12 అవార్డులు, స్వచ్ఛ సర్వేక్షన్ 2022లో 26 అవార్డులను సాధించి జాతీయస్థాయిలో కొత్త చరిత్రను లిఖించుకున్నది.
(వ్యాసకర్త : ఎంబీసీ జాతీయ కన్వీనర్)