తెలంగాణ రానే రాదన్నారు. ఒకవేళ వచ్చినా రాష్ట్రంగా మనుగడ సాధించలేదన్నారు. ఉద్యమకారుడి చేతిలో రాష్ట్రం ఉంటే రోజూ దొమ్మీలు, దోపిడీలే అన్నారు. కరెంటు లేక రాష్ట్రం చిమ్మచీకట్లలో మగ్గిపోతుందన్నారు. ఆర్థికంగా దివాళా తీస్తుందని జోస్యం చెప్పారు. పెట్టుబడిదారులు ముందుకురారని చెప్పారు. అభివృద్ధి ఆగిపోతుందన్నారు. అవినీతిలో కూరుకుపోతుందన్నారు. నిరుద్యోగం పెచ్చరిల్లి అశాంతికి తెలంగాణ నెలవుగా మారుతుందన్నారు. కానీ, వీటన్నింటిని తెలంగాణ పటాపంచలు చేసింది.
రాదనుకున్న తెలంగాణలో అసాధ్యం అనుకున్న అభివృద్ధిని చేసి చూపించారు ముఖ్యమంత్రి కేసీఆర్. చిమ్మచీకట్లో ఉన్న రాష్ర్టాన్ని వెలుగు వైపు నడిపించారు. విద్యుదుత్పత్తి, పంపిణీలో దేశంలోనే ఒక రోల్ మాడల్‌గా నిలిపారు. శాంతిభద్రతల పరిరక్షణలో దేశంలోనే నంబర్‌వన్‌గా తెలంగాణ ఆవిర్భవించేలా చేశారు. పెట్టుబడుల వరద పారిస్తున్నారు. రికార్డు స్థాయి లో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలను సృష్టించి నిరుద్యోగుల ఆశలను నిజం చేశారు. పారదర్శకతకు పెద్దపీట వేస్తూ.. అన్నదాతకు అండగా నిలుస్తూ.. రైతు రాష్ట్రంగా నిలిపి శభాష్ తెలంగాణ అనిపించేలా చేశారు. దేశంలో ఏ మూలకు వెళ్లినా నేను తెలంగాణోన్నని గర్వంగా చెప్పుకొనేలా చేశారు.
ఇల్లలకగానే పండుగ కాదు. రాష్ట్రం తెచ్చుకోవడంతోనే పనైపోలేదు. సాధించుకున్న రాష్ర్టాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకెళ్లడం ముఖ్యం. ఇగో కేసీఆర్ ఏం చేసిండంటే ఇవన్నీ చేసిండు. తెలంగాణ ఇప్పుడు దశాబ్ది ఉత్సవాలను జరుపుకొన్నది. కొంతమందికి ఇప్పుడు దశాబ్ది వేడుకలు ఎందుకని అనుమానపడ్డారు. ఎందుకు చేసుకున్నామంటే… ఎట్లా ఉన్న మనం ఎట్లయ్యామో ప్రపంచానికి చెప్పుకోవడానికి. మనకు మనం వెయ్యేండ్ల వైపు పరుగులు తీయడానికి ఈ వేడుకలు జరుపుకొన్నాం. ఒక ఆత్మస్థయిర్యం నింపుకోవడానికి ఈ వేడుకలు. ఇల్లు కట్టుకుంటున్నపుడు పునాదులు బలంగా ఉండాలి. రాష్ర్టానికి ఈ పదేండ్ల పాలన పునాది వంటిది. కేసీఆర్ వంటి నేత ముఖ్యమంత్రిగా ఉండటంతో రాష్ర్టానికి బలమైన పునాదులు పడ్డట్టే.
నేను ఈ మాటలను వట్టిగా చెప్తలేను.
కేసీఆర్ ఏదైనా చేయాలనుకుంటే రాత్రింబవళ్లు నిద్రపోరు. తన ఆలోచనలన్నింటిని రంగరిస్తారు. ఫలితాన్ని రాబడ్తారు. ఇది కార్యసాధకుడి లక్షణం. రాష్ట్రం ఏర్పడకముందటి ముచ్చట. 2009 మే నెలలో ఒకరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ సంగారెడ్డి అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి బయల్దేరారు.
పత్రికా విలేకరిగా ఉన్న నేను ఆయన ఇంటర్వ్యూ కోసం.. క్షేత్రస్థాయిలో ఎన్నికల పరిశీలన కోసం ఆయనతో కలిసి హెలికాప్టర్లో వెళ్లాను. మెదక్ జిల్లాలోని రామాయంపేట తదితర నియోజకవర్గాల ప్రచారం ముగించుకొని చివరికి సంగారెడ్డికి చేరుకున్నాం.
ఆ సమయంలో మెదక్ జిల్లాలోని అత్యంత వెనుకబాటుకు గురైన ఆందోల్, సంగారెడ్డి ప్రాంతాలకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత నీళ్లు ఇవ్వడంపై మా ఇద్దరి మధ్య చర్చ జరిగింది. మంజీరా నది వట్టిపోయిన తీరును మేం హెలికాప్టర్ నుంచి చూశాం. ఒక్కసారి కాదు.. ఒక రెండు మూడుసార్లు హెలికాఫ్టర్ నడుపుతున్న పైలెట్‌తో ఆ నది చుట్టూ చక్కర్లు కొట్టించారు. నీళ్లు లేని వైనంపై తన ఆవేదన వ్యక్తం చేశారు. నారాయణ్‌ఖేడ్, జహీరాబాద్, ఆందోల్ ప్రాంతాలకు నీళ్లు తరలించడం చాలా కష్టమని అప్పటి సీఎం, మంత్రులు చెప్తున్నారని, సముద్ర మట్టానికి అత్యంత ఎత్తులో ఈ ప్రాంతం ఉండటంతో నిర్లక్ష్యానికి గురవుతున్నదని, కానీ, మనసు పెట్టి పని చేస్తే ఇక్కడికి కూడా నీళ్లు ఇవ్వవచ్చని చెప్పారు.
అంతేకాదు, తెలంగాణ వస్తది. వచ్చిన తర్వాత ఈ ప్రాంతానికి గోదావరి నీళ్లు వస్తాయని బల్లగుద్ది చెప్పారు. తెలంగాణ వచ్చింది. ఇప్పుడు సంగమేశ్వర-బసవేశ్వర ప్రాజెక్టు పనులను కేసీఆర్ ప్రారంభించారు. ఏడాదిగా శరవేగంగా పనులు జరుగుతున్నాయి. సముద్ర మట్టానికి 664.50 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ ప్రాంతానికి నీళ్లు ఇచ్చే భగీరథ ప్రయత్నం నిరాటంకంగా జరుగుతున్నది.
2009లోనే పాలమూరు నుంచి ఎంపీగా పోటీచేసిన కేసీఆర్.. ఎన్నికలు అయిన వెంటనే.. ఫలితాలు కూడా ప్రకటించకముందే పాలమూరుకు నీళ్లు ఇచ్చే ప్రణాళికను ముందేసుకున్నారు. ఇప్పుడు పాలమూరు-రంగారెడ్డి పథకం ఒక కొలిక్కి వచ్చింది. అతి త్వరలోనే దీని ఫలితాలు ప్రజలకు అందబోతున్నాయి. ఒక్క ఇవే కాదు, తెలంగాణలో ఇప్పుడు అమలవుతున్న అనేక పథకాలు కేసీఆర్ మేధోమథనం నుంచి వచ్చినవే. తెలంగాణ ఉద్యమ సమయంలో అనేక సందర్భాల్లో కేసీఆర్ తన మదిలోని ప్రణాళికలను ప్రజలకు చెప్పేవారు. అప్పట్లో అసలు తెలంగాణ వస్తుందో, రాదో తెలియదు కానీ.. కేసీఆర్ ఏదేదో చేస్తడట అంటూ నాటి అధికార, ప్రధాన ప్రతిపక్షాల వారు మాట్లాడేవారు.ఎవరెన్ని అవహేళనలు చేసినా.. ఎన్ని విధాలుగా మాట్లాడినా కేసీఆర్ తాను చెప్తూనే ఉండేవారు. కేవలం చెప్పడంతోనే కేసీఆర్ సరిపెట్టలేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆచరించి చూపించారు. దటీజ్ కేసీఆర్. కలలు కనడమే కాదు, వాటిని సాకారం చేసుకోవడం ఎలాగో తెలిసినవారు కేసీఆర్.
రాజకీయులు ప్రజలు, తమ ప్రాంతం గురించి ఆలోచించడం సహజం. మన దేశం, ఉమ్మడి రాష్ట్రంలో అనేక మంది హేమాహేమీల్లాంటి నేతలున్నారు. ఉద్యమకారులు, గొప్ప రాజనీతిజ్ఞులు, పరిపాలనాదక్షత ఉన్నవారిని కూడా మనం చూశాం. ఈ అన్ని లక్షణాలు ఒకే వ్యక్తిలో కాకుండా వేర్వేరు నేతల్లో కనిపించేవి. కానీ, ప్రజలను ప్రేమించడం, ప్రాంతాన్ని ప్రేమించడం చాలా అరుదు. రాజనీతిజ్ఞత, పరిపాలనాదక్షత, ఉద్యమాలు చేయడం, పోరాట చరిత్ర వంటివన్నీ కలిగి ఉన్న అరుదైన, విలక్షణ నేత కేసీఆర్ మాత్రమే. సమకాలీన రాజకీయాల్లో కేసీఆర్ వంటి నేత లేరనడంలో అతిశయోక్తి లేదు తెలంగాణను కేసీఆర్ ఆకళింపు చేసుకున్నంతగా మరెవ్వరూ చేసుకోలేకపోతున్నారు. కేసీఆర్ తెలంగాణను ప్రేమిస్తరు. తెలంగాణనే శ్వాసిస్తరు. కేసీఆర్‌తో మాట్లాడిన ఏ సందర్భంలోనైనా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, కొత్తగా ఏం చేద్దాం, ఎలా చేద్దాం, రాష్ట్రంలో ఏం జరుగుతున్నది. దేశంలో ఏం జరుగుతోందన్న చర్చనే ఎక్కువగా ఉంటుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే తెలంగాణ కోసం పనిచేసే హోల్‌టైం వర్కర్ కేసీఆర్. సుదీర్ఘంగా ఆయనను దగ్గరగా చూసి ఈ మాట చెప్తున్న. రాష్ట్రంలో ఇప్పుడున్న ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీల్లో ఈ తరహా నేత ఎవ్వరూ లేరు. 40 ఏం డ్లకు పైగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న కేసీఆర్ పూర్తిస్థాయి రాజకీయ నాయకుడు. పార్ట్‌టైం నేత కాదు, రాష్ట్రపతిగా పనిచేసిన ప్రణబ్ ముఖర్జీ తన పుస్తకం ‘ది కొయలిషన్ ఇయర్స్’ పుస్తకంలో కేసీఆర్ వ్యక్తిత్వం గురించి రాశారు. 2004లో యూపీ ఏ క్యాబినెట్ కూర్పు జరుగుతున్నపుడు భాగస్వా మ్య పక్షాల నుంచి తమకు కావాల్సిన మంత్రిత్వ శాఖల గురించి అనేక డిమాండ్లు వచ్చాయని, కానీ, కేసీఆర్ మాత్రం తన లక్ష్యం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన అని, తనకు మంత్రి పదవులపై పెద్దగా ఆసక్తిలేదని, ఎలాగైనా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి మాత్రం పట్టించుకోవాలని, తన డిమాండ్ అదొక్కటే అంటూ చెప్పారని గుర్తుచేసుకున్నారు. కేసీఆర్‌లో ఉన్న నిస్వార్థానికి ఇంతకన్నా పెద్ద తార్కాణం ఇంకేం కావాలి? అందుకే తెలంగాణ ఆత్మకు ప్రతిరూపం కేసీఆర్.
-ఓరుగంటి సతీశ్
80080 06667