చరిత్ర నిర్మాణంలో పాల్గొననివారు మొదట చేయాలనుకునే పని చరిత్రను చెరిపేయాలనుకోవడం. అది కుదరని పక్షంలో దానిని వక్రీకరించడం. ఇప్పుడు తెలంగాణలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చేస్తున్న పనులివే. పట్టుబట్టి మరీ తెలంగాణ తల్లి రూపురేఖలను మార్చే దుస్సాహసానికి పూనుకున్నది రేవంత్ ప్రభుత్వం. ఈ దుర్ఘటన ఎంతోమంది తెలంగాణవాదులను బాధించింది.
MLC Kavitha | ఒక జాతి ప్రజలు తమ మూలాలను, పరంపరను తలచుకోవడం ఒక సహజ, స్వాభావిక స్పందన. తమ నేలకు ఒక మూర్తిమత్వ ప్రకటన చేసుకొని గౌరవించుకోవడం ప్రపంచవ్యాప్తంగా అనేక సంస్కృతుల్లో ఉన్నది. మన దేశంలోనూ భారత స్వాతంత్య్రోద్యమ కాలంలో తొలిసారిగా 1870 కాలంలో బంకించంద్ర ఛటర్జీ వందేమాతరం అని తల్లికి నమస్సులను అర్పిస్తే తర్వాత 1905 కాలంలో అబనీంద్రనాథ్ వంటి చిత్రకారులు భరతమాతకు రూపాన్నిచ్చే ప్రయత్నం చేశారు. అనంతరం హరిద్వార్‌లో 1983లో స్వామి సత్యమిత్రానంద్ గిరి అనే స్వామిజీ భరతమాత గుడి కట్టగా దానిని అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రారంభించారు. కిరీటంతో కొలువుదీరిన భరతమాత సమృద్ధికి, సంస్కృతికి నిరంతర స్ఫూర్తిగా నిలుస్తుంది. అలాగే తెలుగు తల్లి కూడా ఏర్పాటైంది. తమిళ తాయి, కన్నడాంబె (కర్ణాటక మాతె) ఇలా ఏ తల్లి అయినా స్థానిక కట్ట్టూబొట్టుతో, ఆభరణాలతో, అక్కడి ప్రజలు ఆరాధించే దేవతలను పోలే ఉన్నరని మనం గుర్తుంచుకోవాలి. తల్లులు సర్వాలంకార భూషితులు. ఇది సమృద్ధికి గుర్తు.
తెలంగాణ తల్లి ఈ మట్టి నిర్మించుకున్న ఆశల సౌధానికి, ఆత్మగౌరవ రూపానికి మూర్తిమత్వ ప్రకటన. తెలంగాణ తల్లి భావన కాదు. 1950లలోనే ‘నా తెలంగాణ తల్లి.. వల్లి’ అని ఈ నేలను తల్లితో పోల్చారు దాశరథి. 1947 ప్రాంతం లో వెంకట్రామారావు ‘నా తల్లి తెలగాణరా.. లేని నందనోద్యానమ్మురా’ అని ఈ నేల సమైక్య పాలనలో ఇక్కడి నేల అడుగడుగునా విస్మరణలకు గురైన సందర్భంలో ఎగసిన తెలంగాణ బిడ్డల పునరుత్థాన కేతనంగా తెలంగాణ తల్లి విగ్రహ రూపంలో నిలిచింది. ఇక్కడి సంస్కృతి ప్రతి సందర్భంలో అవమానాలకు గురవుతుంటే ఈ బిడ్డలు చేసుకున్న ధిక్కార ప్రకటన తెలంగాణ తల్లి. తెలంగాణ మలిదశ పోరు మొదలైన తర్వాత తెలంగాణ బిడ్డలు తమ న్యాయమైన వాటా కోసం కొట్లాడుతున్నా మరొకవైపు సాంస్కృతిక ఆధిపత్యం మాత్రం నిరాటంకంగా కొనసాగేది. పాలన, అధికార భాష, మీడియా, సంస్కృతి, పండుగలు ఇలా ప్రతి రంగంలోనూ తెలంగాణ సంస్కృతి అణచివేతను, విస్మరణను ఎదుర్కొన్నది. ఒకే తెలుగు తల్లి పిల్లలమనే భావోద్వేగపు కపట సమాధానాలు ఈ ప్రజల ఆకలికి, ఆత్మగౌరవానికి సమాధానం చెప్పలేకపోయాయి. పిడికిళ్లెత్తిన బిడ్డల నినాదాల నడుమ అవతరించింది తెలంగాణ తల్లి.
తమ మూలాలు మదిన తలస్తూ బిడ్డలంతా కూడి తల్లికి రూపమిచ్చిన అపురూప సందర్భం అది. తెలంగాణ తల్లి రూపురేఖలపై, ఆహార్యం, అలంకారాలపై విస్తృత చర్చ జరగాలన్న కేసీఆర్ ఆలోచనల మేరకు వారి నేతృత్వంలోనే తెలంగాణ భవన్లో నాలుగు రోజుల పాటు వందలాది మేధావులు, కవులు, కళాకారుల మేధోమథనం జరిగింది. అనేక చర్చోపచర్చల అనంతరం వారి సూచనల మేరకు నిర్మల్ కళాకారుడు బీవీఆర్ చారి విగ్రహానికి తుది రూపకల్పన చేశారు. తెలంగాణ నేతన్నలు నేసే పట్టుచీర ధరించింది తల్లి. ఒక చేతిలో తెలంగాణ సంస్కృతికి గుర్తుగా బతుకమ్మ, మరో చేతిలో తెలంగాణ మెట్ట పంటలైన జొన్న, మక్కజొన్న కంకులు. అలాగే ఇక్కడి మహిళలు ధరించే కంటె, హారం, వడ్డాణం, మెట్టెలు తల్లి ధరించింది. కృష్ణానది పరీవాహక ప్రదేశంలో దొరికిన కోహినూర్ వజ్రం కిరీటంలో చేరింది. వడ్డాణంలో జాకొ బ్ వజ్రం ఒదిగింది. మొత్తంగా తెలంగాణ తల్లి ఈ నేలకు ప్రతిరూపంగా కొలువైంది. విగ్రహ ఆవిష్కరణకు నగరమంతా ముస్తాబైంది. ఒక పండుగ వాతావరణం నెలకొన్నది. ‘వడిసెల చేపట్టి వడివడిగ తిప్పుతూ/ వలస పక్షుల పీడ వదిలి పోవంగ/ రావమ్మ రావమ్మ తెలంగాణ తల్లి’ అంటూ హోర్డింగ్‌లు వెలిశాయి.
సమైక్య పాలనలో ఇక్కడి నేల అడుగడుగునా విస్మరణలకు గురైన సందర్భంలో ఎగసిన తెలంగాణ బిడ్డల పునరుత్థాన కేతనంగా తెలంగాణ తల్లి విగ్రహ రూపంలో నిలిచింది. ఇక్కడి సంస్కృతి ప్రతి సందర్భంలో అవమానాలకు గురవుతుంటే ఈ బిడ్డలు చేసుకున్న ధిక్కార ప్రకటన తెలంగాణ తల్లి.
తెలంగాణ వాదుల భారీ ఊరేగింపు నడుమ 2007 నవంబర్ 15న ఉద్యమ రథసారథి కేసీఆర్ బంజారాహిల్స్‌లోని తెలంగాణ భవన్లో తొలి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అది మొదలు పల్లె పల్లెనా తెలంగాణ వాదులు తెలంగాణ తల్లి విగ్రహాలు ప్రతిష్ఠించుకున్నారు. ఇదొక చారిత్రక అవసరం. ఎలా అయితే స్వాతంత్య్ర ఉద్యమకాలంలో భరతమాత భావన భారతీయులనొక్కటి చేసిందో, ఎలా అయితే 1942 కాలంలో ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలోని ఆంధ్రులు తెలుగు తల్లి భావనతో తమిళులతో ఉన్న తేడాను తమకు తాము స్పష్టపరచుకున్నారో ఇదీ అంతే. ఇదొక అస్తిత్వ ప్రకటన.
మరోవైపు తెలంగాణకే సొంతమైన మట్టివాసనల పరిమళం బతుకమ్మను ఇపుడు విగ్రహం నుంచి తొలగించడం హేయమైన చర్య. ఇది ఇక్కడి ఆడబిడ్డల సాంస్కృతిక వారసత్వాన్ని కనుమరుగు చేయడమే. ఆ లోటును కాంగ్రెస్ హస్తం ఎప్పటికీ భర్తీ చేయలేదు. మరో పక్క తెలుగు తల్లి చేతిలోని పూర్ణకుంభం స్థానికత్వానికి గుర్తే కదా. మరి తెలంగాణ తల్లెందుకు తన ఆనవాళ్లను కోల్పోవాలి. ప్రతీకలను తీసుకునేది ఒక ప్రాంతంలోని ఉన్నత విలువలను, ఆంశాలను గొప్పగా బయటి ప్రపంచానికి చూపేందుకు కదా.
ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న వారు ఏ మార్పు చేసినా ప్రజలు స్వాగతిస్తారనుకోవద్దు. ఉద్యమకాలంలో ఏర్పరచుకున్న భావనలను, ప్రతీకలను మార్చాలనుకోవడం ఉద్యమ స్ఫూర్తికి ద్రోహం చేయడమే అవుతుంది. తెలంగాణ తల్లిని ఇక్కడి ఉద్యమం ఏర్పర్చుకున్నది. ఇది కాల నిర్ణయం. రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చెప్తున్నదే ‘కేసీఆర్ ఆనవాళ్లు తుడిచేస్తా’ అని. ఆయనకు అంశాలవారీగా కారణాలు అనవసరం. తనకు స్థానం లేని చరిత్రలో ఇంకెవరూ ఉండకూడదని ఆయన ఉద్దేశం. ఇంకా చెప్పాలంటే అసలా ఉద్యమ చరిత్రే కనిపించొద్దన్నది ఆయన లక్ష్యం కావొచ్చు. ఆయన అర్థం చేసుకోవలసింది తెలంగాణ ఉద్యమం ఎప్పటిదో, ఎవరో చెప్తే విన్న కథ కాదు. మన కండ్ల ముందు జరిగిన చారిత్రక సత్యం. ఇవ్వాళ తెలంగాణలో నూటికి తొంభై తొమ్మిది మందికి రేవంత్ రెడ్డి కన్నా గొప్ప ఉద్యమ నేపథ్యం ఉన్నది. కాబట్టి తెలంగాణ సోయి ఎవరో ఏమారిస్తే దారితప్పేది కాదు.
చరిత్రను బట్టీ కొట్టినవాడు కాదు మేధావి. చరిత్రను సృష్టించిన వాడిని మేధావి అంటారు. ఆ యుగస్రష్ఠ కేసీఆర్. పాలకులు రావొచ్చు, పోవచ్చు. కానీ, కేసీఆర్ ఈ రాష్ర్టాన్ని సాధించారు. ఇవ్వాళ రాష్ట్ర అధికార చిహ్నంలోంచి చార్మినార్, కాకతీయ తోరణాలను రాచరిక ఆనవాళ్లని చెప్పి తొలగించే ప్రయత్నం విడ్డూరం. మరి తొలి ప్రధాని నెహ్రూ నుంచి రాజీవ్‌గాంధీ దాకా ఎర్రకోట మీద జెండా ఎలా ఎగిరేశారు? అసలు ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతున్నారో ఆయనకైనా అర్థం అవుతున్నదా? ఇప్పటికే గత ప్రభుత్వం ఏర్పరిచిన డాక్టర్ అంబేద్కర్ మహా విగ్రహానికి నివాళులర్పించకపోవడం వంటి అల్ప చేష్టలు, పలు సందర్భాల్లో ఆయన ఉపయోగిస్తున్న భాష ముఖ్యమంత్రి స్థానాన్ని దిగజార్చుతున్నాయి. చెప్పినవి చేయలేక దృష్టి మరల్చే పని పెట్టుకున్నారు. లేకపోతే గతంలో తెలుగు తల్లి చౌరాస్తాగా ఉన్నచోట ఇప్పుడు తెలంగాణ తల్లి నిలవడం కదా న్యాయం. అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహం ఎలా పెడతారు? అమరజ్యోతి దగ్గర ఉండాల్సింది ఏ తెలంగాణ తల్లికైతే అమరులు ప్రణమిల్లి తమ ప్రాణాలు అర్పించారో ఆ తల్లి విగ్రహం కదా. జనం మధ్యలో ఉండాల్సిన తెలంగాణ తల్లిని సచివాలయం కంచెల లోపల పెట్టడం సామాన్యులకు దూరం చేయడం కాదా?
ఉప్పెన లాంటి ప్రజా ఉద్యమం ఇక్కడ ఎగసిపడుతుంటే పరాయి పార్టీల పంచన బతికిన వారికి ఇప్పుడు తెలంగాణ తల్లి గుర్తుకురావడమే విడ్డూరం. ఇక్కడి విద్యార్థులు, యువకులు ప్రాణాలు బలిపెడుతుంటే సమైక్య పాలకులకు మద్దతుగా తుపాకులు పట్టినవారి చేతిలో తెలంగాణ తల్లి రూపుదిద్దుకోవడమూ విషాదమే. చరిత్ర చదివితే ఏమొస్తుందని ఆర్ట్స్ కోర్సులు ఎత్తేసిన చంద్రబాబు వారసత్వమా ఇది? తెలుగు తల్లి ముందు తెలంగాణ తల్లిని తగ్గించి చూపే కుత్సితమా ఇది? లేక తన హృదయంలో లేని తెలంగాణ తల్లిని తెలంగాణ ప్రజల మనసుల్లోంచి కూడా చెరిపేసే కుట్రనా? కనీసం నోటి నిండా జై తెలంగాణ అని పలకలేని ఈ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ తల్లి మాకెందుకు? ఊరూరా వలస పాలకులను సవాలు చేస్తూ ఉద్యమస్ఫూర్తి నింపిన మా తెలంగాణ తల్లి మాకుండగా.
– (వ్యాసకర్త: శాసనమండలి సభ్యురాలు)
– కల్వకుంట్ల కవిత