ప్రభుత్వాలు మారినప్పుడల్లా పథకాల పేర్లు మార్చడం పాలకులకు పరిపాటి. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఆ రాజకీయ ఆనవాయితీ కొనసాగుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో తనదైన ముద్ర కోసం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ సర్కార్ తీసుకొచ్చిన పలు పథకాల పేర్లను మార్చివేసింది. అయితే కేవలం పేరు మార్పుతోనే పాలకులు అనుకున్న లబ్ధి చేకూరుతుందా? లేదా పేరు మార్పుతో పేదల బతుకులకు అదనపు ప్రయోజనం ఏమైనా చేకూరుతుందా? అనేది ఆలోచించాలి.
కేసీఆర్ అమలుచేసిన రైతుబంధు, ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, పల్లె ప్రగతి, హరితహారం వంటి విప్లవాత్మక పథకాలకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. వీటిలో కొన్ని పథకాలు దేశవ్యాప్తంగా చర్చకు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం, పలు రాష్ర్టాలు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ తరహా విధానాలను అనుసరిస్తున్నాయి. అయితే, మన రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ హయాం నాటి పథకాల పేర్లను మార్చింది. రైతుబంధు ‘రైతు భరోసా’గా, పల్లె ప్రగతి ‘స్వచ్ఛదనంపచ్చదనం’గా, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పథకం ‘ఇందిరమ్మ ఇండ్లు’గా, ఆసరా పింఛన్లు ‘చేయూత’గా రూపాంతరం చెందాయి.
పేర్లు మార్చడం ప్రభుత్వం పరిపాలనా విధానం కావచ్చు. అయితే ఆ మార్చే పేరు ప్రజాప్రయోజనాన్ని మరింత ఇనుమడింపజేయాలి. కానీ, రాజకీయ ప్రాధాన్యం పొందడం కోసం మాత్రమే మార్చినట్లుగా ఉంటే ప్రజలు హర్షించరు. ఒక సంక్షేమ పథకం వెనుక లబ్ధిదారులు, నిధులు, అర్హతలు, అమలు విధానం, ఫలితాలు ఉంటాయి. అందువల్ల పేరు మార్చే ముందు ఆ ప్రభుత్వం పరిశీలించాల్సింది పథకం ఎవరి పేరు మీద ఉన్నదనేది కాదు. ప్రజలకు ఆ పథకం ఎంతవరకు మేలు చేకూరుస్తున్నది? ఇకపై మరింత మేలు చేకూరాలంటే ఏంచేయాలి? అనే కోణంలో కసరత్తులు చేయాలి. ఇలాంటి సందర్భంలోనే కేసీఆర్ వ్యవహరించిన తీరును ఇక్కడ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉన్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకాన్ని కొనసాగిస్తామని, అందులో కొర్రీలు పెట్టబోమని, అది మంచి పథకమని కేసీఆర్ శాసనసభా వేదికగా ప్రకటించారు.
రాజకీయంగా ప్రత్యర్థి ప్రభుత్వంలో ప్రారంభమైన పథకమైనప్పటికీ ప్రజలకు ఉపయోగపడుతున్నదనే కారణంతో ఆ పథకాన్ని కొనసాగించాలన్న నిర్ణయం తీసుకోవడం కేసీఆర్ రాజకీయ పరిణతికి నిదర్శనం. వైఎస్ఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఫీజు రీయింబర్స్మెంట్, 108’ లాంటి పథకాలను రద్దు చేయకుండా కేసీఆర్ వాటిని యథావిధిగా కొనసాగించారనే విషయాన్ని ఇక్కడ గమనించాలి. ప్రజాప్రయోజనం ముందు రాజకీయ ప్రయోజనమైనా, ఏ ప్రయోజనమైనా చిన్నదైపోవాలన్న సందేశం కేసీఆర్ నిర్ణయంలో ఇమిడి ఉన్నది.
ఆసరా పెన్షన్ ఒక రాజకీయ నినాదం కాదు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, ఇతర బలహీనవర్గాలకు సామాజిక భద్రత కల్పించే సంక్షేమ వ్యవస్థ. ఇప్పుడు అది ‘చేయూత’ పేరుతో కొనసాగుతున్నది. బీఆర్ఎస్ హయాంలో ప్రవేశపెట్టిన ఈ పథకం పేరు ఇప్పుడు మారింది కానీ పథకం మాత్రం అంతరించిపోలేదు. ఇక్కడే అసలు విషయం ఉన్నది. పేరు మార్చడం తప్పు కాదు. పేరు మార్పే ప్రభుత్వ లక్ష్యమైతే ముమ్మాటికీ తప్పు. కొత్త పేరు పెట్టాలనుకుంటే పెట్టుకోవచ్చు. కానీ దానితో పాటు పథకంలో మరింత ప్రయోజనం చేకూర్చే అంశాలు జోడించాలి. లబ్ధిదారుల సంఖ్య పెరుగాలి. అర్హతల విషయంలో పారదర్శకత పాటించాలి. నిధులు సకాలంలో విడుదల చేయాలి. లబ్ధిదారుడి చేతికి ప్రయోజనం చేరే వ్యవస్థ మరింత పటిష్టం కావాలి. అప్పుడే పథకానికి పేరు మార్చినందుకు సార్థకత ఏర్పడుతుంది.
ప్రజాధనంతో అమలయ్యే సంక్షేమ పథకాలకు ఒక ప్రభుత్వం ఒక పేరు, మరో ప్రభుత్వం మరో పేరు పెట్టడం వల్ల అయోమయానికి గురయ్యేది చివరకు లబ్ధిదారుడే. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పథకాల పేరు మారినప్పుడల్లా కొత్త దరఖాస్తులు, కొత్త నిబంధనలు వచ్చాయేమోనన్న అనుమానాలు ప్రజల్లో తలెత్తుతాయి. ఆయా పథకాల ప్రయోజనం పొందేందుకు ప్రజ లు అధికారుల చుట్టూ, కార్యాలయాల చుట్టూ తిరుగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే పథకాల పేర్లకు నిరంతరత్వం కంటే..పథకాల ప్రయోజనాలకు నిరంతరత్వం ముఖ్యం. ఒక ప్రభు త్వం ప్రారంభించిన పథకం ప్రజలకు ఉపయోగపడుతుంటే తదుపరి ప్రభుత్వం దానిని కొనసాగించాలి, మరింత మెరుగుపరచాలి. అవసరమైతే లోపాలను సరిదిద్దాలి. పునర్వ్యవస్థీకరించాలి. కానీ కేవలం ఆయా పథకాలకు గత ప్రభుత్వ ము ద్రను చెరిపివేయాలనే ఉద్దేశంతో దాని రూపురేఖ లు మార్చ డం సంకుచిత్వం, అల్పజీవుల మనస్త త్వం. ప్రజా పరిపాలనకు సరైన దిశ కూడా కాదు.
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల విషయంలోనూ ఇదే సూత్రం వర్తిస్తుంది. వాటి భవిష్యత్తుపై రాజకీయ ప్రచారాల కంటే ప్రభుత్వం వాటిని ఎంత సమర్థవంతంగా అమలు చేస్తున్నది? లబ్ధిదారులకు సాయం ఎంత వేగంగా అందుతున్నది? పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా నిధులు, అర్హతలు, అమలు విధానంలో ఏ మార్పులు అవసరం? అనేదే అసలు చర్చ కావాలి.
ప్రభుత్వాలు పథకాలకు పేర్లు మార్చకూడదని చెప్పడం కూడా సమంజసం కాదు. కొత్త ప్రభుత్వం తన విధానాలకు అనుగుణంగా పథకాలను పునర్వ్యవస్థీకరించుకోవచ్చు. కానీ ఆ మార్పు కాగితాలపై కనిపించే మార్పుగా కాకుం డా..ప్రజల జీవితాల్లో కనిపించే మార్పుగా ఉం డాలి. రైతుబంధు ‘రైతు భరోసా’గా మారితే రైతు కు భరోసా పెరుగాలి.
ఆసరా ‘చేయూత’గా మారితే వృద్ధుడి చేతికి అందే చేయూత బలపడాలి. ‘డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ‘ఇందిరమ్మ ఇండ్లు’గా మారితే మరింతమంది నిరుపేదలకు సొంత గూడు దక్కాలి. పేరు కొత్తదైయితే సరిపోదు..దాని ఫలితం అంతకంటే కొత్తగా ఉండాలి.
పేర్లలో పోటీ కాదు.. పనితీరులో పోటీ ఉండాలి. ఎవరి హయాంలో ఎన్ని పథకాలకు పేర్లు మార్చారన్నది ప్రజల తక్షణ అవసరం కాదు. ఎవరి హయాంలో ఎంతమంది పేదలకు భరోసా లభించింది? ఎంతమంది రైతుల జీవితాల్లో స్థిరత్వం వచ్చింది? ఎంతమంది ఆడబిడ్డల కుటుంబాలకు అండ లభించింది? ఎంతమంది వృద్ధులకు గౌరవప్రదమైన జీవితం దక్కింది? అనేదే ముఖ్యం. అదే ప్రజలు వేసే ఆఖరి లెక్క. ప్రభుత్వాలు మారడం ప్రజాస్వామ్య సహజ ప్రక్రియ. విధానాలు మారడం కూడా సహజమే. కానీ సంక్షేమానికి రాజకీయ రంగు పులమడం మాత్రం ప్రజాస్వామ్య పరిపక్వత కాదు. గత ప్రభుత్వం చేసిన మంచి పనిని కొనసాగించడం ఓటమి కాదు..అది ప్రజల పట్ల ప్రభుత్వ బాధ్య త. కొత్త పథకాన్ని తీసుకురావడం గొప్పతనం కా దు..అది ప్రజల జీవితాలను మార్చినప్పుడే దా నికి గొప్పతనం, విలువ. పేర్లు ఎవరివైనా కావ చ్చు. ప్రభుత్వాలు ఏవైనా కావచ్చు. పథకాలపై ‘ముద్ర’లు మారవచ్చు. కానీ ఆ పథకాలపై ప్రజ ల హక్కు మాత్రం మారకూడదు. పథకాల అసలు చిరునామా ప్రభుత్వం కాదు..ప్రజలే!