శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ॥
ఉ. తొండము నేకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్
మెండుగ మ్రోయుగజ్జెలును మెల్లని చూపులు మందహాసమున్
కొండొక గుజ్జురూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయై
యుండెడి పార్వతీ తనయ యోయి గణాధిప నీకు మ్రొక్కెదన్
చం. తొలుత నవిఘ్నమస్తనుచు ధూర్జటి నందన నీకు మ్రొక్కెదన్
ఫలితము సేయుమయ్య నిను ప్రార్థన జేసెద నేకదంత నా
వలపటి చేతి ఘంటమున వాక్కున నెప్పుడు బాయకుండు మీ
తలపున నిన్ను వేడెదను దైవగణాధిప లోకనాయకా
క. తలచితినే గణనాథుని! తలచితినే విఘ్నపతిని దలచిన పనిగా!
దలచితినే హేరంబుని! దలచితి నా విఘ్నములను తొలగించుటకున్
క. అటుకులు కొబ్బరి పలుకులు! చిటి బెల్లము నానబ్రాలు చెరకురసంబున్
నిటలాక్షు నగ్ర సుతునకు! పటుతరముగ విందు చేసి ప్రార్థింతు మదిన్!
వినాయకుని మట్టి ప్రతిమ, పసుపు, కుంకుమ, గంధం, అక్షతలు, బియ్యం, రెండు దీపపు కుందులు, వత్తులు, అగరువత్తులు, కర్పూరం, కొబ్బరికాయలు, కలశం, ఆచమన పాత్రలు (గ్లాసులు), మూడు ఉద్ధరిణులు (చెంచాలు), ఆచమనానికి ఒక పళ్లెం, 21 రకాల పత్రి, నైవేద్యానికి పండ్లు, వివిధ రకాల పూలు, తమలపాకులు, వక్కలు సిద్ధంగా ఉంచుకోవాలి.
పంచామృతం ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార కలిపి చేసుకోవాలి.
పసుపుముద్దతో వినాయకుడిని చేయాలి. ఒక పీటమీద కొద్దిగా బియ్యం పరచి, పూర్ణకుంభం (వెండి లేదా రాగి లేదా యథాశక్తి చెంబు)లో కొత్త బియ్యం వేసి, వినాయకుని విగ్రహం పెట్టి అలంకరించండి. మామిడాకులు, వివిధ రకాల ఆకులు, లేతగడ్డి ఆకులు, పూలు, పండ్లతో పాలవెల్లి అలంకరించాలి. గొడుగు పెట్టాలి.
వస్ర్తాలు పత్తితో చేయవచ్చు. యజ్ఞోపవీతం పత్తితో చేయవచ్చు.
మహా నైవేద్యం- నేతితో చేసిన 12 రకాల వంటకాలు. వీలు కాకపోతే శక్తిమేరకు రకరకాల పిండివంటలు చేయవచ్చు. తర్వాత ఒక గ్లాసులో మంచినీళ్లు పోసుకొని, అందులో ఓ పుష్పం, ఉద్ధరిణి (చెంచా) ఉంచుకోవాలి.