భారతరత్న బాబాసాహెబ్ భీంరావ్ అంబేద్కర్ మరణించిన ఆరున్నర దశాబ్దాల తర్వాత ఆయన కలలు కన్న నవభారత నిర్మాణానికి తొలిసారి అడుగులు పడుతున్నాయి. ఎన్నో నిద్ర లేని రాత్రులతో తన మేధస్సును కరిగించిన అంబేద్కర్ సబ్బండ వర్గాల అభివృద్ధి కోసం రచించిన భారత రాజ్యాంగ లక్ష్యాలను, ఫెడరల్ విధానాలను గత ఏడున్నర దశాబ్దాలుగా గాలికి ఒదిలేశారు భారత పాలకులు. రాజ్యాంగ నిర్మాత జీవించి ఉన్న రోజుల్లోనే ఆర్టికల్ 3 స్ఫూర్తిని మంటగలిపారు.
ఫజల్ అలీ కమీషన్ నివేదికపై అంబేద్కర్ పలు అభ్యంతరాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తను స్వయంగా కేంద్ర న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పటికీ.. బీసీల స్థితిగతులను అధ్యయనం చేసి వారి అభ్యున్నతికి సూచనలు చేయటానికి బీసీ కమీషన్‌ను ఆర్టికల్ 340 ప్రకారం నియమించుకోలేని నిస్సహాయ స్థితిలో.. తన పదవికి రాజీనామా చేశారు. భారత రాజ్యాంగంపై అంబేద్కర్ చేసిన సంతకం తడి ఆరకముందే మొదలైన రాజ్యాంగ ఉల్లంఘనలు, రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నమైన విధానాలను నేటికీ యథేచ్ఛగా అమలు చేస్తూనే ఉన్నారు.
పాలించే పార్టీ, ఫ్రంట్ ఏదైనా, ప్రధాని ఎవరైనా రాజ్యాంగాన్ని ఒక వెదురుబద్దగానే భావించి తమ స్వప్రయోజనాలకు అనుగుణంగా ఇష్టం వచ్చిన రీతిలో పలు సవరణలు చేర్చి, రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడుస్తూ ప్రజలపై వాతలు పెట్టారు. వక్రభాష్యం చెప్తూ ప్రజాస్వామ్య విలువలను కాలరాచారు. వివిధ భాషలు, మతాలు, కులాలతో, భిన్న సంస్కృతులతో జీవిస్తున్న ప్రజల ఆకాంక్షలను పరిగణనలోకి తీసుకోకుండా ‘వన్ ఇండియా-వన్ నేషన్’ అంటూ కాలం చెల్లిన విశ్వాసాలను ప్రజలపై రుద్దుతూ నియంతృత్వ పోకడలను అనుసరిస్తున్న పాలకులను మనం చూస్తున్నాం. రాజ్యాంగం ద్వారా రాష్ర్టాలకు లభించిన హక్కులను ఉల్లంఘిస్తూ ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా పాలన కొనసాగుతున్నది. పార్టీల, నాయకుల స్వప్రయోజనాలకు అనుగుణంగా రాజ్యాంగాన్ని సవరించటం కాకుండా ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా మారిన ప్రస్తుత పరిస్థితులకు తగినట్లుగా రాజ్యాంగ సవరణలు ఉండాలి. ప్రజలే కేంద్రబిందువుగా, ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా పాలన సాగించే ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడాల్సిన అవసరం ఉంది. సరిగ్గా ఈ ఆలోచనల్లోంచే తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితిగా పరిణామం చెందింది.
భారత స్వాతంత్య్ర అమృతోత్సవాలను ఎంతో ఆర్భాటంగా జరుపుకొంటున్న పాలకులు స్వాతంత్య్ర ఫలాలు దేశంలోని కోట్లాది మందికి నేటికీ అందలేదనే వాస్తవాన్ని గమనించాలి. స్వాతంత్య్రం సిద్ధించినప్పుడు కేవలం 35 కోట్ల జనాభా ఉండగా, ప్రస్తుతం ఇది 140 కోట్లకు చేరింది. పెరిగిన జనాభా అవసరాలకు అనుగుణంగా వనరుల వినియోగం జరగటం లేదు. ఏ పార్టీ కేంద్రంలో పాలన సాగించినా వారికి వనరుల వినియోగం పట్ల సరైన విజన్ లేకపోవడం వలన ఎన్ని దశాబ్దాలైనా ఈ దేశం ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలోనే కొనసాగుతున్నది. మన తర్వాత ఏడాదికి విముక్తి పొందిన చైనా అన్ని రంగాలలో అగ్రరాజ్యాలతో పోటీ పడుతూ దూసుకెళ్తున్నది. ప్రపంచ దేశాలను చైనా ఉత్పత్తులతో ముంచేస్తున్నది.
భారతదేశంలో సహజ వనరులకు, ప్రకృతి సంపదకు కొదవేమీ లేదు. ఈ దేశంలోని భూమిలో 60 శాతం వ్యవసాయానికి యోగ్యమైనది. దీంట్లో కేవలం 40 శాతం భూమికి మాత్రమే సాగునీటి వసతి ఉన్నది. ఎన్నో జీవనదులతోపాటు వందలాదిగా ఉపనదులు, వాగులు ఈ దేశమంతా ప్రవహిస్తున్నాయి. కానీ గంగ, బ్రహ్మపుత్ర, గోదావరి, కావేరి, మహానదుల జలాలు వేల టీఎంసీలు ఏటా సముద్రంలో కలుస్తూనే ఉన్నాయి. దేశంలోని విద్యుత్ ఉత్పాదన విషయం గమనిస్తే స్థాపిత సామర్థ్యంలో సగం కూడా వినియోగించుకునే పరిస్థితి లేదు. వ్యవసాయంలో సమృద్ధి సాధించామని ఒకవైపు మన పాలకులు గొప్పలు చెప్పుకొంటున్నా, మరోవైపు కోట్లాది భారతీయులు ఆకలితో, పోషకాహారలోపంతో బాధపడుతున్నారని ‘ప్రపంచ ఆకలి సూచీ’ గణాంకాలతో సహా వెల్లడిస్తున్నది.
వ్యవసాయంలో స్వయం పోషకమైనప్పుడు పెద్ద ఎత్తున గోధుమలు, వంటనూనెలు, పప్పుధాన్యాలు ఎందుకు దిగుమతి చేసుకుంటున్నారో కేంద్రప్రభుత్వంలోని పెద్దలే చెప్పాలి. ఈ దేశంలోని ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లకు ఒక స్థిరమైన వ్యవసాయ విధానంగానీ, జల విధానంగానీ లేవు. వారి దశాబ్దాల పాలనలో ఏనాడూ ఈ ప్రధాన అంశాలపై లోతైన అవగాహనను ఏర్పరచుకోవడానికి, జాతీయ విధానాల రూపకల్పనకు కృషి చేసిన దాఖలాలు లేవు. గత ఏడున్నర దశాబ్దాల స్వతంత్ర పాలనలో మొక్కుబడిగా అనుసరిస్తున్న విధానాల వలన అధికారిక గణాంకాల ప్రకారమే దేశ జనాభాలో 27.5 శాతం మంది దారిద్య్రరేఖకు దిగువన ఉన్నారు.
రెండవ పంచవర్ష ప్రణాళిక నుంచి నేటి వరకు పారిశ్రామిక ప్రగతిపైనే దృష్టి పెడుతున్నామని ప్రతి ఏటా బడ్జెట్లలో కేంద్రప్రభుత్వం చెప్తూ, ‘మేకిన్ ఇండియా’ అంటూ దశదిశలా దద్దరిల్లేలా నినాదాలిస్తున్నా సాధించింది పెద్దగా ఏమీ లేదనే చెప్పాలి. దేవుళ్ల బొమ్మల దగ్గరి నుంచి పతంగిల దారం వరకూ చిన్న చిన్న వస్తువులను కూడా చైనా నుంచే దిగుమతి చేసుకుంటున్నాం. ప్రతి ప్రణాళికలోనూ ‘ఆర్థిక స్వావలంబన సాధించడమే’ లక్ష్యంగా దశాబ్దాలుగా పేర్కొంటున్న పాలకులు ఆచరణలో ఆ దిశగా చేసిందేమీ లేదు.
ఈ దేశానికి స్వాతంత్య్రం లభించినపుడు ‘కేవలం రాజకీయ స్వాతంత్య్రం మాత్రమే లభించింది, ఆర్థిక స్వాతంత్య్రం ఇంకా రావలసే ఉంది’ అని పెద్దలు వ్యాఖ్యానించారు. ఈ దేశాన్ని ఇన్నేళ్లు పాలించిన జాతీయ పార్టీల అసమర్థ విధానాల వలన ఈ నాటికీ ‘ఆర్థిక స్వావలంబన’ ప్రజలకు అందని ద్రాక్ష గానే మిగిలిపోయింది. ఫలితంగానే పేదరికం, నిరుద్యోగం, అనారోగ్యం, అశాంతి. బీజేపీ, కాంగ్రెస్ రాజకీయాలను ఎన్నికల చుట్టూ తిప్పుతూ ప్రజల ఆశలూ, ఆకాంక్షలను కేవలం హామీలు, పార్టీ మేనిఫెస్టోలకు పరిమితం చేస్తున్నాయి. ఫలితంగా ఏ పార్టీ గెలిచినా మరే పార్టీ ఓడినా ప్రతి ఎన్నికల్లోనూ ఓడిపోతున్నది మాత్రం ప్రజలే!
21వ శతాబ్దపు యువత 2014 ఎన్నికల్లో నరేంద్రమోదీపై ఎన్నో ఆశలు పెట్టుకొన్నది.దీనికి కారణం ‘గుజరాత్ మాడల్’ అంటూ జరగని అభివృద్ధిని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో హైప్ చేసి చూపించడమే! ఈ సోషల్ మీడియా ప్రచారాన్ని నమ్మి యువత బీజేపీని కేంద్రంలో అధికారంలోకి తెచ్చారు. కాంగ్రెస్ అసమర్థత కారణంగా రెండోసారి కూడా మోదీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. గత ఎనిమిదేండ్ల పాలనలో బీజేపీ ప్రజల ఆశలపై నీళ్లు చల్లిందే తప్ప సాధించిందేమి లేదు. ఏ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చినా, ఏ నాయకుడు ప్రధాని అయినా పాలన మాత్రం ఒక మూస పద్ధతిలోనే సాగుతున్నది. ఈ పరిస్థితి మారాలని కేసీఆర్ భావిస్తున్నారు. ‘రాజకీయాలంటే ఓట్లు-సీట్లు కాదు. సకల రంగాలలో ప్రపంచ దేశాలతో అభివృద్ధిలో పోటీ పడే విధంగా పాలసీలను రూపొందించి అమలు చేయడం, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే విధానాలను అవలంబించడం, ప్రజల జీవన ప్రమాణాలను పెంచడం’ అని కేసీఆర్ ప్రకటించారు.
మౌలికమైన ఈ రాజకీయ ఆర్థికాంశాలపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలని కేసీఆర్ అంటున్నారు. బీజేపీనో లేదా కాంగ్రెస్‌నో ఓడించడానికో, గెలిపించడానికో భారత రాష్ట్ర సమితిని పెట్టడం లేదని, నాలుగైదు పార్టీలతో ఫ్రంట్ కట్టడానికో లేదా విలీనం చేసుకొని ఎన్నికల్లో సత్తా చాటడానికో కాదని కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ దేశ ప్రజలకు ప్రత్యామ్నాయ రాజకీయాలను అందించాలి.. తద్వారా సరికొత్త రాజకీయ సంస్కృతికి తెర తీయాలనేది కేసీఆర్ సంకల్పం.
మౌలికమైన ఈ రాజకీయ ఆర్థికాంశాలపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలని కేసీఆర్ అంటున్నారు. బీజేపీనో లేదా కాంగ్రెస్‌నో ఓడించడానికో, గెలిపించడానికో భారత రాష్ట్ర సమితిని పెట్టడం లేదని, నాలుగైదు పార్టీలతో ఫ్రంట్ కట్టడానికో లేదా విలీనం చేసుకొని ఎన్నికల్లో సత్తా చాటడానికో కాదని కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ దేశ ప్రజలకు ప్రత్యామ్నాయ రాజకీయాలను అందించాలి.. తద్వారా సరికొత్త రాజకీయ సంస్కృతికి తెర తీయాలనేది కేసీఆర్ సంకల్పం. పిడికెడు మందితో మొదలైన తెలంగాణ రాష్ట్ర సమితి నేడు 65 లక్షలకు పైగా సభ్యులతో భారత రాష్ట్ర సమితిగా అవతరించింది. రాబోయే రోజుల్లో కోట్లాది మందితో దేశ రాజకీయాలను సమూలంగా మార్చే దిశగా ముందుకు సాగుతుంది. ప్రజలు ప్రత్యామ్నాయ రాజకీయాలను ఆహ్వానిస్తున్నారు. రెండు ప్రధాన జాతీయ పార్టీలతో విసుగు చెందారు. గుజరాత్ మాడల్లోని డొల్లతనాన్ని, తెలంగాణ మాడల్లోని అభివృద్ధి-సంక్షేమ ప్రగతిని అర్థం చేసుకుంటున్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతుబంధు వంటి అనేక అంశాల్లో తెలంగాణ యావత్తు దేశానికే రోల్ మాడల్ గా మారింది. బీఆర్ఎస్ బలం దేశ ప్రజల మనోభావాల్లో ఉంది, కేసీఆర్ నాయకత్వ ప్రతిభలో, అనుసరించే విధానాల్లో ఉంది. ఇప్పటికే వీటిని టీఆర్ఎస్ రుజువు చేసింది.
దేశంలోని ఇతర నాయకులకు భిన్నంగా కేసీఆర్ ఆలోచనా ధోరణి, వ్యవహార శైలి ఉంటుందనేది జగమెరిగిన సత్యం. ఈ లక్షణాలే ఆయనను ఒక దార్శనికునిగా, అనితర సాధ్యమైన విజేతగా, ఆధ్యాత్మిక నాయకునిగా నిలిపాయి. కేసీఆర్‌తో సుదీర్ఘ కాలం కలిసి నడిచిన అనుభవం నుంచి నేను గ్రహించింది ఏమిటంటే, ఆయన తన లక్ష్యాలకు అనుగుణంగా అవసరమైన ఎత్తుగడలను అనుసరిస్తూ, గమ్యాన్ని చేరుకునే దాకా, ఎన్ని ఆటుపోట్లనైనా సమర్థవంతంగా ఎదుర్కొంటూ ముందుకు సాగుతారే తప్ప ఎక్కడా, ఎప్పుడూ విశ్రమించరు.
భారత సమాజానికి అవసరమైన ఎంతో సాహసోపేత నిర్ణయాన్ని తీసుకుని ముందుకు సాగుతున్న మహానాయకునితో మనమూ కలిసి నడుద్దాం, నవ భారతాన్నినిర్మించుదాం.
(వ్యాసకర్త: రాజకీయ విశ్లేషకులు)
వి.ప్రకాశ్