UGC | ప్రస్తుతం అమలులో ఉన్న ఉప కులపతుల నియామక నిబంధనల ప్రకారం సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్రంలోని ఉపకులపతుల నియామకం కోసం ఒక సెర్చ్ కమిటీని నియమిస్తుంది. ఇది మూడు పేర్లను ఆ రాష్ట్రంలోని కులపతికి పంపుతుంది. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు అధికార రీత్యా ఆ రాష్ట్ర గవర్నర్ కులపతిగా వ్యవహరిస్తారు. చాన్స్‌లర్ అయిన గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించి ఆ తరువాత తుది పేరును ఎంపిక చేస్తారు.
వీసీల నియామకం విషయంలో కేంద్రం తాజాగా రూపొందించిన ప్రతిపాదనలు అగ్నికి ఆజ్యం పోసినట్టుగా ఉన్నాయి. వీసీల నియామక ప్రక్రియ పూర్తిగా గవర్నర్ల చేతిలోకి వెళ్లిపోయింది. ప్రతిపాదిత నూతన యూజీసీ చట్టం ప్రకారం ఇకపై ఉపకులపతులుగా పరిశ్రమల అధిపతులను, ప్రభుత్వ ఉద్యోగులను, బయటి వ్యక్తులను నియమించవచ్చు. ప్రస్తుతం ఉపకులపతుల పదవీకాలం మూడేండ్లు ఉండగా దాన్ని ఐదు సంవత్సరాలకు పెంచాలని నూతన యూజీసీ ప్రతిపాదన సూచిస్తున్నది.
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నతవిద్య కోసం ప్రతి సంవత్సరం 4,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నది. ఇంత చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలతో సంబంధం లేకుండా వీసీలను కేంద్రం నియమించాలని ప్రతిపాదించడం సమాఖ్య సూత్రానికి విరుద్ధం. యూజీసీ డ్రాఫ్ట్ రెగ్యులేషన్‌లోని ప్రతిపాదన ప్రకారం ఉన్నత విద్యాసంస్థల్లో 3 వేల మంది విద్యార్థులు ఉంటేనే గ్రేడింగులు ఇస్తామని, ఉన్నత గ్రేడ్లు సంపాదించలేని విశ్వవిద్యాలయాలకు ప్రోత్సాహకం ఉండదన్న ప్రతిపాదన సరైనది కాదు. దీనిని కూడా బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకిస్తున్నాయి.
ఈ అంశం ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు, డీమ్డ్ విశ్వవిద్యాలయాలకు మేలు కలిగిస్తుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలోని బీఏ, బీకాం, బీఎస్సీ లాంటి కోర్సుల్లో ప్రవేశానికి ఎంట్రన్స్ నిర్వహించాలనే ప్రతిపాదనను పునఃపరిశీలించాలి. ఈ ప్రతిపాదన అమలైతే చాలామంది పేద విద్యార్థులు ఉన్నతవిద్యకు దూరమయ్యే అవకాశం ఉన్నది. ప్రతిపాదిత యూజీసీ చట్టం ప్రకారం ఆన్లైన్ కరస్పాండెంట్ కోర్సులకు అనుమతులు ఇవ్వకూడదని కేంద్రం అభిప్రాయపడుతున్నది. దీనివలన లక్షల మంది విద్యార్థులకు నష్టం కలుగుతుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ యూజీసీ రెగ్యులేషన్స్ 2025లోని అంశాల పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తంచేశారు. ఈ నిర్ణయం సమాఖ్య స్ఫూర్తికి పూర్తి విరుద్ధమని చెప్పారు. కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధి బృందం ఫిబ్రవరి 6న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కలిసి ఈ అంశంపై ఒక వినతిపత్రం సమర్పించింది. విశ్వవిద్యాలయాల ఉపకులపతుల నియామకం ఎటువంటి అనుమానాలకు ఆస్కారం లేకుం డా పారదర్శకంగా జరగాలనీ, ఇప్పుడు ప్రవేశపెట్టదలిచిన ప్రతిపాదనల వలన దళిత, గిరిజన, బలహీన వర్గాలకు అన్యాయం జరిగే అవకాశం ఉన్నదన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలను కాదని కేంద్ర ప్రభు త్వం నియమించే గవర్నర్లకు వీసీల నియామకాన్ని అప్పజెప్ప డం సమంజసం కాదు. దీనిపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచించాలి. ఈ విషయంపై రాష్ర్టాలతో విస్తృత చర్చలు జరి పి సమస్యకు ఒక ఆమోదయోగ్యమైన సమాధానం కనుగొంటుందని ఆశిద్దాం.
-పి.మోహన్‌రావు
99495 95509