ప్రస్తుత పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో వివిధ పార్టీల ఎంపీలు కేంద్రానికి సంధిస్తున్న ప్రశ్నలకు వస్తున్న జవాబులు.. బయటపడుతున్న నిజాల మీద దేశ వ్యాప్తంగా చర్చ జరగాల్సిన అవసరం ఉన్నది. దేశాన్ని విశ్వ గురువుగా నిలుపుతామంటున్న కేంద్రానివి ఒట్టి మాటలేనని ప్రజలకు తెలియాలి. సమాఖ్య స్ఫూర్తి, రాష్ర్టాల హక్కులు, బీజేపీయేతర రాష్ర్టాలపై కేంద్ర ప్రభుత్వ పక్షపాత వైఖరి ఏమిటో యావత్తు దేశం తెలుసుకోవాలి.
మొదటి నుంచి తెలంగాణ అంటే చులకన భావంతో ఉన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరోసారి అలాగే వ్యవహరించారు. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ అడిగిన ప్రశ్నకు భాషతో సంబంధం లేకపోయినా ఆయన మాట్లాడిన హిందీ బాగా లేదని నిండు సభలో మంత్రి అవహేళనగా మాట్లాడారు. కానీ సదరు సభ్యుడు అడిగిన రూపాయి పతనం గురించి సరైన సమాధానం ఇవ్వకుండా దాటవేశారు. గతంలో తెలంగాణ లో ఓ జిల్లా కలెక్టర్‌ను రేషన్ షాపులో ప్రధాని ఫొటో ఎందుకు లేదని అడిగి ఇదే మంత్రి అభాసుపాలయ్యారు. ఆమె తన స్థాయిని మ రచి పార్టీ కార్యకర్తలా మాట్లాడారనే విమర్శలు ఆనాడు దేశ వ్యాప్తంగా వ్యక్తమయ్యాయి.
గిరిజనులకు రిజర్వేషన్ల పెంపుపై కేంద్రం స్పష్టమైన వైఖరి తెలుపడం లేదు. చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి అర్జున్ ముండా స్పందిస్తూ.. సుప్రీంకోర్టులో కేసుల పరిష్కారం తర్వాతే తెలంగాణలో గిరిజనులకు రిజర్వేషన్ల పెంపుపై నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. రిజర్వేషన్లపై తమ వైఖరేమిటో స్పష్టంగా చెప్పకుండా కేంద్రం ఈ విషయంలో దాటవేసే ధోరణి అవలంబించి ంది! దేశ సరిహద్దులో చైనా గ్రామాలు ఉన్నాయని, అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ వద్ద రోడ్ల నిర్మాణం జరుగుతున్నట్లు తాజా శాటిలైట్ చిత్రాల్లో వెల్లడైనప్పటికీ, అలాంటిదేమీ లేదని కేంద్ర రక్షణశాఖ మంత్రి చెప్పడం వాస్త వ దూరమే. సరిహద్దుల్లో చొరబాట్లు జరుగుతున్నా, కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. సరిహద్దు పరిస్థితిపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పార్లమెంట్లో తెలిపిన వివరాలు పూర్తిగా అసంపూర్ణంగా ఉన్నాయి. దేశ భద్రతపై కేంద్ర ప్రభుత్వ ఉదాసీన వైఖరిని గతం లో తెలంగాణ సీఎం కేసీఆర్ అనేకసార్లు ప్రశ్నించిన విషయం తెలిసిందే.
దేశ ఆర్థిక వ్యవస్థపై కేంద్రం అసత్యాలు ప్రచారం చేస్తున్నదని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘దేశ ఆర్థిక వ్యవస్థ ఇట్లే ఉంట దా? ఇప్పుడు నిజమైన పప్పు’ ఎవరు?’ అని ఆమె ప్రశ్నించారు. నేల చూపులు చూస్తున్న ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దాలని ఆర్థిక మంత్రికి సూచించారు. ఎస్ఎస్వో గణాంకాల ప్రకారం అక్టోబర్‌లో దేశ పారిశ్రామిక ఉత్పత్తి 5.6 శాతంగా నమోదైంది. ఇది 26 నెలల కనిష్ఠానికి పరిమితం కావడం ఆందోళనకరం. మరోవైపు రూపాయి శరవేగంగా పతనమవుతున్న ది. దీన్ని నిలువరించడానికి రిజర్వ్ బ్యాంక్ 2022 ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య కాలంలో 33.42 కోట్ల డాలర్లను విక్రయించిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల లోక్‌సభలో ప్రకటించిన తర్వాత కరెన్సీ విలువ మరింత పడిపోవడం గమనార్హం.
తెలంగాణ ప్రభుత్వం ప్రచారం కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నదని ఇష్టమొచ్చినట్లు మాట్లాడే బీజేపీ నేతలు.. కేంద్ర ప్రభు త్వం చేసిన ప్రచార ఖర్చును చూస్తే ముక్కున వేలేసుకోక తప్పదు. తెలంగాణ ప్రభుత్వం 2014 నుంచి 2018 వరకు ప్రకటనల కోసం ఖర్చు చేసింది కేవలం రూ.300 కోట్లే. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రూ.6,509.56 కోట్లు ప్రకటనల కోసం వెచ్చించింది. ప్రింట్ మీడియాకు రూ.3,248.77 కోట్లు, ఎలక్ట్రానిక్ మీడియాకు రూ.3,260.79 కోట్ల ప్రకటనలు ఇచ్చినట్లు సీపీఎం ఎంపీ సెల్వరసు అడిగిన ప్రశ్నకు కేంద్ర సమాచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ రాత పూర్వకంగా సమాధానమిచ్చారు. ఈ సంవత్సరంలో డిసెంబర్ 7 నాటికే కేంద్రం రూ.168.8 కోట్లు ప్రకటనలకు వెచ్చించడం గమనార్హం.
జాతీయ స్థాయి అంశాలు ఇలా ఉంటే పలువురు ఎంపీలు అడిగిన ప్రశ్నలకు కేంద్రం ఇచ్చిన సమాధానాలు తెలంగాణ వృద్ధిని ధ్రువీకరిస్తున్నాయి. తెలంగాణలో ఇటీవల 8 మెడికల్ కాలేజీల ఏర్పాటుతో సీట్ల సంఖ్య పెరిగి, విద్యార్థులకు ప్రయోజనం చేకూరిందని కేంద్రం వెల్లడించింది. గత మూడేండ్లలో దేశ వ్యాప్తంగా నీట్‌కు హాజరైన విద్యార్థుల సంఖ్య, ఎంబీబీఎస్, పీజీ సీట్ల పెరుగుదల, ఖాళీల వివరాలను అందజేయాలని బీఆర్ఎస్ ఎంపీ కె.కేశవరావు రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. దీనికి కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సమాధానం ఇచ్చింది. దేశ వ్యాప్తంగా ఏటా ఎంబీబీఎస్ (యూజీ), పీజీ సీట్ల సంఖ్య పెరుగుతున్నదని, 2021-22తో పోలిస్తే ఈ ఏడాది 4,012 సీట్లు పెరిగాయని, ఇందులో 1,150 సీట్లు (దాదాపు 30 శాతం) తెలంగాణలో పెరిగాయని కేంద్రం తెలిపింది.
తెలంగాణ దేశానికి ధాన్యాగారంగా మారుతున్నదని, గత ఐదేండ్లలో వరి సాగు 85 శాతం పెరిగిందని పార్లమెంట్లో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ధ్రువీకరించారు. వరి సాగు తెలంగాణలో బాగా పెరిగిం ది, ఉప్పుడు బియ్యం ఎక్కువగా సేకరించాలని బీఆర్ఎస్ ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరినప్పుడు.. మీ దగ్గర అంత పంట ఎక్కడిది? మీరు తప్పుడు లెక్కలు చెబుతున్నారు. శాస్త్రీయంగా సర్వే చేయలేదు’ అని విమర్శలు చేసిన కేంద్ర పెద్దలు.. ఇప్పుడు పార్లమెంట్ సాక్షిగా తెలంగాణలో ఎక్కువ వరి పంట పడిందని లెంపలేసుకొని ఒప్పుకున్నట్లే కదా! ఒక్క వరి పంటనే గాక, ఇతర ఆహార పంటల సాగు విస్తీర్ణం కూడా ఐదేండ్లలో 45 శాతం పెరిగిందని కేంద్రమే సర్టిఫికెట్ ఇచ్చింది.
వ్యవసాయ, సాగునీటి రంగంలో తెలంగాణ ముందంజ సీఎం కేసీఆర్ దార్శనికత వల్లే కదా సాధ్యమైంది. దేశంలో గుణాత్మక మార్పు కోసం నడుం కట్టిన తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇటీవల ఢిల్లీలో పార్టీ జాతీయ కార్యాలయాన్ని ప్రారంభిం చి బీజేపీపై సమర శంఖం పూరించారు. భవిష్యత్‌లో ఆ పార్టీ ఆటలు ఇక సాగబోవు!
-బచ్చు శ్రీనివాస్ , 93483 11117