తెలంగాణలో ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న వేళ అన్ని పార్టీల నేతలు ప్రచారంలో నువ్వా నేనా అన్నట్టు జోరు మీద గడప గడపకూ తిరుగుతున్నారు. అయితే, ప్రజల ఆదరణ మాత్రం బీఆర్ఎస్కే ఉందని పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. నిరుడు, ఈ ఏడాది ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో రాష్ర్టానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు తెలంగాణకు తెచ్చిన నిధులు మాత్రం గుండుసున్నా, ఏనాడూ తెలంగాణకు రావాల్సిన నిధులపై, నీటి వాటాలపై వారు కేంద్రంతో కొట్లాడింది.. మాట్లాడింది లేదు. కానీ తగుదునమ్మా అంటూ రాష్ర్టానికి చెందిన కేంద్ర మంత్రులు, ఆ రెండు పార్టీల ఎంపీలు, మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ ఉత్తరకుమార ప్రగల్భాలు పలుకుతున్నారు.
తొమ్మిదిన్నరేండ్ల కేసీఆర్ పాలనలో మున్సిపాలిటీలను వేల కోట్లతో అభివృద్ధి చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం రెండేండ్లుగా తట్ట మట్టి తీసింది లేదు. జరిగిన అభివృద్ధిని నిర్వహణ కూడా చేయించలేని స్థితిలో ఉన్నది. ప్రజలకు మంచి చేయాలి అనుకున్నప్పుడు పరిష్కార మార్గాలు తెలుస్తాయి. కానీ కాంగ్రెస్ నైజం ఒక్కటే.. ‘దోచుకోవాలి.. దాచుకోవాలి.. కాంట్రాక్టర్లను కమీషన్ల పేరుతో వేధించాలి.’ బీఆర్ఎస్లో గెలిచిన కౌన్సిలర్లు, చైర్మన్లకు బిల్లులు రాకుండా రేవంత్ సర్కార్ ఇబ్బందులకు గురిచేస్తున్నది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఫలితాలు వన్ సైడ్ వస్తే ఎన్నికైన ప్రజాప్రతినిధులు తమ గళంతో కాంగ్రెస్, బీజేపీతో కొట్లాడి మున్సిపాల్టీలను అభివృద్ధి చేస్తారు.
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులను బరిలో నిలబెట్టినా బీఆర్ఎస్ అభ్యర్థులే నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ వారి కష్టనష్టాల్లో అండగా నిలుస్తూ ధైర్యం నింపుతుండడంతో వారు ఏ ఇంటికి వెళ్లినా ఓటర్లు నీరాజనాలు పలుకుతున్నారు. రోజురోజుకూ ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో కాంగ్రెస్, బీజేపీ నేతలు భయపడుతూ అలవికాని హామీలు ఇచ్చి ‘నోటుతో ఓటు’ కొనాలని చూస్తున్నారు. విద్యావంతులు, మేధావులు అభివృద్ధి, సంక్షేమంపై అవగాహనతో ఉన్నారు. ప్రజలను చైతన్యపరుస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిని, ఈ రెండేండ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన విధ్వంసాన్ని ప్రజలు బేరీజు వేసుకుంటున్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీలు అమలు కాలేదని ఓటు అడగడానికి వచ్చిన అధికార పార్టీ ప్రజాప్రతినిధులను ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. ఇలాంటి ఘటనలను నిత్యం చూస్తున్నాం.
సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు.. అధికార కాంగ్రెస్కు గట్టి సమాధానం చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ అంతకన్నా రెట్టింపు స్థాయిలో ఫలితాలు సాధించేందుకు సిద్ధమైంది. మున్సిపల్ ఎన్నికల్లో అడ్డదారిలో అయినా గెలువాలని అధికారాన్ని అడ్డుపెట్టుకొని ముందుకు పోతున్న కాంగ్రెస్కు బూత్ స్థాయిలో ఓటు బ్యాంక్ మందగిస్తున్నది. మెజారిటీ స్థానాల్లో గులాబీ జెండా ఎగురడం ఖాయం.
-మిద్దె సురేశ్
9701209355