సామూహికంగా ప్రతిధ్వనించిన ‘జై తెలంగాణ’ నినాదం ఓ అద్భుతమైన ప్రజాస్వామిక ఆకాంక్షను ఫలవంతం చేసింది. అణగారిన గుండెల్లో గూడు కట్టిన విషాదం కేసీఆర్ నాయకత్వంలో ఉద్యమ ఖడ్గంగా మారి బానిస సంకెళ్లను తెంచుకున్నది. స్వరాష్ట్ర సాధనే లక్ష్యంగా మహత్తర పోరాటాన్ని సుదీర్ఘంగా సాగించి చివరికి గమ్యాన్ని ముద్దాడిన చరిత్ర కేసీఆర్ సొంతం. ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించేదాకా మడమ తిప్పని మొండితనం కేసీఆర్‌ది.
ఉద్యమాన్ని కొత్త పుంతలు తొక్కించే ఎత్తుగడలు, ప్రత్యర్థులను కూడా మెప్పించగల నేర్పరితనం ఆయన సొంతం. లక్ష్యానికి అడ్డుగా ఉన్న వారిని తరిమికొట్టారు. ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నెగ్గాలో తెలిసిన వ్యక్తి కేసీఆర్. ప్రజలకు కేసీఆర్‌పై విశ్వాసం ఉన్నది. కేసీఆర్‌కు ప్రజలపై నమ్మకం ఉన్నది. అందుకే, అరువై ఏండ్ల కల అయిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాకారమైంది. ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ ఇప్పుడు పాతికేండ్ల ప్రాయంలోకి అడుగుపెడుతూ రజతోత్సవ సంబురాలకు సన్నాహమైంది. ఈ నెల 27న వరంగల్‌లో జరుపుకొంటున్న బీఆర్ఎస్ రజతోత్సవం ‘ఆర్మూర్ సభ పంతం-ఆంధ్ర పాలన అంతం’ నినాదంతో చేసిన గర్జనను గుర్తుచేస్తున్నది. అంతేకాదు, ఉద్యమ చివరి దశలో ‘తెలంగాణ వస్తే జైత్రయాత్ర.. లేదంటే శవయాత్ర’ అని సింహంలా గర్జించిన కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షను యాది చేస్తున్నది. అరవై ఏండ్ల కల స్వరాష్ర్టాన్ని సాధించిన మహత్తర ఘట్టం, పదేండ్ల కేసీఆర్ పాలనాదక్షత వరకు ఈ పాతికేండ్లలో ఎన్నో వెలుగూ చీకటి, ఆటుపోట్లు కోణాలు దాగి ఉన్నాయి. ఉమ్మడి పాలకుల దాడులు, కుట్రలు కుయుక్తులు, పార్టీని చీల్చాలని ఆంధ్ర పాలకుల వెన్నుపోటు రాజకీయాలు, కేసీఆర్‌ను లక్ష్యం చేస్తూ దుష్ప్రచారం, భరించలేని నిందలు, జాతీయ పార్టీలు అదే పనిగా చేసిన మోసాలు, బీఆర్ఎస్ను కిందా మీద చేసిన ఆర్థిక ఇబ్బందుల వంటి చిక్కులు అన్నీ ఇన్నీ కావు.
అది, 2001.. ఉద్యమంలో కేసీఆర్ వెంట నడిచినవారంతా పేద వర్గాలకు చెందిన వారు, వామపక్ష భావజాలం ఉన్నవారు. కానీ, ఏ ధనవంతుడూ బీఆర్ఎస్కు అండగా నిలవలేదు. ఒకానొక సమయంలో పార్టీ సభలు పెట్టడానికి కూడా ఒక దశలో నయా పైసలేని పరిస్థితులు. ఇదే సమయంలో ఉమ్మడి పాలకుల ఘీంకారాలకు భయపడి బీఆర్ఎస్కు అండగా నిలిచేవారు కరువయ్యారు. ఈ దశలో 2002 ఫిబ్రవరిలో హైదరాబాద్ కార్పొరేషన్లో బీఆర్ఎస్ ఓడిపోయి పార్టీ పరిస్థితి మరింత చిన్నాభిన్నమైంది. ప్రథమ వార్షికోత్సవం జరపాలంటే కూడా ఏ మాత్రం సహకరించని ఆర్థిక పరిస్థితి. అయితే ఎలాంటి ఆర్థిక, రాజకీయ వనరులు లేకపోయినా వెనుకడుగు వేయని కేసీఆర్‌కు ప్రజాస్పందనే పెట్టుబడి అయింది. ప్రజా మద్దతునే ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారు. కేసీఆర్ ఇచ్చిన ఏ పిలుపుకైనా ప్రజలు తండోపతండాలుగా కదిలివచ్చారు. ఇలా ఏ సభకైనా లక్షల మంది హాజరయ్యారంటే ప్రజల గుండెల్లో ఆయనకున్న అభిమానం ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ప్రతి ప్లీనరీ బహిరంగ సభ విజయం వెనుక కేసీఆర్ పడ్డ కఠోర శ్రమ, కష్టం మాటల్లో చెప్పలేం.
వరంగల్ జైత్రయాత్ర పేరుతో 2003లో జరిగిన పార్టీ ద్వితీయ వార్షికోత్సవ సభకు యోధాను యోధులైన పలువురు జాతీయ నాయకులు రావడం ఆ సభ ప్రత్యేకత. ఒక్క మాటలో చెప్పాలంటే ఏటా జరిగే ప్లీనరీలు, బహిరంగ సభలను కేసీఆర్ బీఆర్ఎస్కు ఆయువుపట్టుగా భావించేవారు. ఆ ఏడాదిలో చేసిన కార్యక్రమాలను, తదుపరి ఏడాదిలో చేయబోయే కార్యక్రమాలను ప్రజలకు విడమర్చి చెప్పడానికి పార్టీ వార్షికోత్సవ బహిరంగ సభలను ఆయన సరైన వేదికగా భావిస్తారు. అందుకే ఆయన ఏటా పార్టీ వార్షికోత్సవ సభ నిర్వహణపై ఎక్కువ దృష్టి సారిస్తారు. అందులో భాగంగానే వరంగల్‌లో ఈ నెల 27న జరుగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ ఏర్పాట్లపైనా కేసీఆర్ పూర్తిస్థాయిలో దృష్టిసారించారు. ప్రతిష్టాత్మకంగా చేస్తున్న ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
వరంగల్ సభ కేసీఆర్ ప్రభుత్వ హయాం లో అమలుచేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను మరోసారి ప్రజలకు గుర్తుచేయనున్నది. అదే సమయంలో గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఓడించడానికి జాతీయపార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు పన్నిన కుట్రలు, కుతంత్రాలనూ ఎండగట్టనున్నది. చివరగా నేనో విషయాన్ని ప్రస్తావించదలచుకున్నాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో టీఆర్ఎస్ ఆవిర్భావ చివరి సభ నా నియోజకవర్గమైన ఆర్మూర్‌లో జరిగింది. ఆ సందర్భంగా అన్ని గోడల మీద ‘ఆర్మూర్ సభ పంతం- తెలంగాణ సొంతం- ఆంధ్రా పాలన అంతం’ అనే నినాదాన్ని ప్రముఖంగా రాశాం. ఆ మరుసటి ఏడాదే ఆంధ్రా పాలన అంతమై తెలంగాణ కల సాకారమైంది. అదేవిధంగా వరంగల్ సభ కూడా ‘కాంగ్రెస్ దుష్ట పాలన అంతం’ చేయాలనే సందేశం ఇస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
(వ్యాసకర్త: ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే)
-ఆశన్నగారి జీవన్‌రెడ్డి