పదేండ్ల పాటు హుందాతనానికి మారుపేరుగా నిలిచిన రాష్ట్ర శాసనసభ మొన్నటి బడ్జెట్ సెషన్ జరిగిన తీరును చూసి యావత్ తెలంగాణ నివ్వెరబోయింది. సాక్షాత్తూ సభా నాయకుడే వెకిలి చేష్టలతో, కురచ మాటలతో తెలంగాణ అసెంబ్లీ ప్రతిష్టను దిగజార్చగా, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సభా మర్యాదను మంటగలిపారు.
నిజానికి పదేండ్ల తర్వాత ప్రజలు దయతలిస్తే బొటాబొటి ఓట్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌కు ఇచ్చిన మాటను నిలబెట్టుకుని తెలంగాణ ప్రజలకు దగ్గరయ్యే అవకాశం గత ఏడెనిమిది నెలలుగా ఉండింది. దశాబ్ద కాలంలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన మంచిపనులను కొనసాగిస్తూ, ఏదైనా లోటుపాట్లు జరిగి ఉంటే వాటి ని సరిదిద్దుతూ.. నూతన విధానాలు, ప్రాజెక్టులు ప్రవేశపెడుతూ పాలనపై తనదైన మార్క్ వేసే బ్రహ్మాండమైన అవకాశాన్ని తన అవగాహనారాహిత్యం, అవకతవక నిర్ణయాలు, ఒంటెత్తు పోకడలు, కక్షపూరిత ప్రవర్తనతో చేజార్చుకున్నారు రేవంత్ రెడ్డి.
మార్పు మార్పు అంటూ ఊదరగొట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలి పూర్తిస్థాయి బడ్జెట్ మీద ప్రజలకు భారీ ఆశలేమీ లేకపోయినా కనీసం గుణాత్మకంగా ఏదైనా మార్పు ఉంటుందేమోనని ఎదురుచూసినవారికి ఈ బడ్జెట్ నిరాశే మిగిల్చింది. ఎంతసేపూ కేసీఆర్ మీద అక్కసుతో తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చే చౌకబారు ఎత్తుగడలనే కాంగ్రెస్ ప్రభు త్వం, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నమ్ముకున్నట్టు సభలో వారి ప్రవర్తన నిరూపించింది.
ఈసారి చాలామంది తెలంగాణవాదులకు నచ్చింది బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రసంగం. ఆయన సారథ్యంలో గుప్పెడు మంది బీఆర్ఎస్ నాయకులు పాండవుల్లాగా సభలో చర్చను డామినేట్ చేశారు. ముఖ్యంగా రోజురోజుకూ పదునెక్కుతున్న కేటీఆర్ నాయకత్వశైలి ఈ సమావేశాల్లో స్పష్టంగా కనిపించింది. సభలో ఎప్పటికప్పుడు అటు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి లాంటి సీనియర్లను, ఇటు అనిల్ జాదవ్, పాడి కౌశిక్‌రెడ్డి, డాక్టర్ సంజయ్ వంటి నూతన ఎమ్మెల్యేలనూ సమన్వయపరిచిన తీరు, మహిళా నాయకుల మీద అధికారపక్షపు వెకిలి దాడిని తిప్పికొట్టిన విధానం రాటుదేలుతున్న కేటీఆర్ నాయకత్వశైలికి గీటురాయిగా నిలిచింది. రేవంత్ రెడ్డి ‘తాతలు తండ్రుల వారసత్వం’ అని ఒక వ్యాఖ్య చేస్తే వెంటనే కేటీఆర్ లేచి ‘రాహుల్‌గాంధీ, రాజీవ్‌గాంధీ గురించేనా మీ వ్యాఖ్యలు’ అంటూ జవాబివ్వడం ప్రజలను ఆకట్టుకున్నది.
ద్రవ్య వినిమయ బిల్లుపై అసెంబ్లీలో జరిగిన చర్చలో కేటీఆర్ తన విశ్వరూపం ప్రదర్శించారం టే అతిశయోక్తి కాబోదు. బడ్జెట్లోని డొల్లతనాన్ని ఎత్తిచూపుతూ, రేవంత్ ప్రభుత్వం తీసుకుంటు న్న అవకతవక నిర్ణయాలను కేటీఆర్ తూర్పారబట్టారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు కేసీఆర్ ఫోబియా పట్టుకున్నదని, ఆయన ఆనవాళ్లు చెరపడం వారి వల్ల కాదని స్పష్టం చేశారు. ‘కాళేశ్వరం మొదలుకొని, పాలమూరు, సీతారామ ప్రాజెక్టుల వరకు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, గురుకుల బడి నుంచి యాదాద్రి గుడి వరకు, నిరంతర విద్యుత్తు నుంచి మెడికల్ వైద్య విప్లవం వరకు, చివరికి మీరు కూర్చున్న సచివాలయ సౌధపు రాజసంలో ఉన్న కేసీఆర్‌ను.. ఎక్కడ చెరిపేస్తారు? ఎలా చెరిపేస్తారు?’ అంటూ కేటీఆర్ సంధించిన శరపరంపర కాంగ్రెస్ సర్కారును ఉక్కిరిబిక్కిరి చేసింది.
అరచేతిలో వైకుంఠం చూపెట్టి అధికారంలోకి వచ్చి, వందరోజుల్లో ఇస్తామన్న ఒక్క కొత్త పథక మూ ఇవ్వకపోగా ఉల్టా రైతుబంధు లాంటి ఇదివరకున్న స్కీములనే ఎత్తివేసిన కాంగ్రెస్ ప్రభుత్వపు మోసాన్ని కూలంకషంగా వివరించిన కేటీఆర్ ‘అన్నవస్ర్తాల కోసం పోతే ఉన్న వస్ర్తాలు పోయినట్టు అయ్యింద’ని అన్నారు. ఉద్యోగాలు ఇవ్వక నిరుద్యోగులను, రైతు భరోసా ఇవ్వక రైతన్నలను, పథకాలు రద్దుచేసి నేతన్నలను.. ఆర్టీసీ ఉద్యోగుల నుంచి ఆటో డ్రైవర్ల వరకు, మహిళల నుంచి పండు ముదుసలి వరకు నమ్మి ఓటేసిన ప్రతీ ఒక్కరినీ మోసం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదని విమర్శించారు.
అచ్చ తెలుగులో మాట్లాడుతూ, మధ్యలో తెలంగాణ కవులు రాసిన కవితలు, గేయాలను సందర్భోచితంగా ఉటంకిస్తూ, అధికార పక్షానికి కేటీఆర్ మూడు చెరువుల నీళ్లు తాగించారు. ‘ఎన్నికల ముందు రజినీకాంత్, ఎన్నికలైపోయాక గజినీకాంత్, గ్యారంటీలకు టాటా, లంకె బిందెల వేట, ఓట్లకు ముందు అభయహస్తం, ఓట్లు పడ్డాక శూన్య హస్తం’ అంటూ ప్రాసలతో, పంచ్‌లతో సాగిన కేటీఆర్ ప్రసంగం, అవసరమై న చోట గణాంకాలతో సోదాహరణంగా ప్రభుత్వ అంకెల గారడీని ఎండగట్టింది.
కాంగ్రెస్ వచ్చాక నేతన్నల దైన్యం గురించి వివరిస్తూ అలిశెట్టి ప్రభాకర్ రాసిన ‘బతుకు దారాలు, దారులు తొలిగిపోయినయ్.. ముగ్గులు, మగ్గాలు మూగబోయినయ్.. ఇల్లిల్లు దాటి, సిరిసిల్ల దాటి తొందరగా వెళ్లిపోవే తల్లి దసరా’ అనే కవితను కేటీఆర్ చదివి వినిపించారు.
మార్పు తెస్తామని తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ ఎట్లా మోసం చేసిందో వివరిస్తూ.. ‘మార్పు మార్పు అనుచు పలుమార్లు మార్చి మార్చి ఏమార్చి పిలిచిన మాత్రాన మార్పు వచ్చునా తత్వమందు. గోమారిని పేరు మార్చి సుకుమారి అని ముద్దుగ కోరికమేర పిలిచినా గోవుల నెత్తురు పీల్చకుండునా?’ అంటూ కవి పల్లా దుర్గయ్య పద్యాన్ని కోట్ చేసి ఆకట్టుకున్నారు.
తొలిరోజు హరీశ్‌రావు, మరుసటి రోజు జగదీశ్‌రెడ్డి, మూడోరోజు సబితా ఇంద్రారెడ్డి, నాలుగో రోజు కేటీఆర్.. ఇలా ఒక్కోరోజు ఒక్కో బీఆర్ఎస్ నాయకుడు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఒక బలమైన ప్రతిపక్షం ఉంటే ప్రభుత్వానికి ముకుతాడు ఎలా వేయొచ్చో చూపించారు.
సభలో బీఆర్ఎస్ నాయకులు చేసిన ఎదురుదాడికి కకావికలైన అధికార పార్టీ జవాబు చెప్పలేక చౌకబారు మాటలకు, బూతులకు, బెదిరింపులకు తెగబడింది. సీనియర్ మహిళా శాసనసభ్యులైన సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిల మీద ఏకంగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అక్కసుతో చేసిన వ్యాఖ్యల మీద సభలోనే కాక రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఒక విధంగా చర్చల్లో బీఆర్ఎస్ పైచేయి సాధించడా న్ని జీర్ణించుకోలేకనే కాంగ్రెస్ నాయకత్వం మహి ళా నేతలపై దుర్మార్గపు దాడి చేసిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. చేసిన తప్పును సమర్థించుకోవడానికి రేవంత్ ప్రభుత్వం పడరాని పాట్లు పడ్డా ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందనేది మీడియా, రాజకీయ రంగాల్లో ఇప్పు డు జరుగుతున్న చర్చ.
-దిలీప్ కొణతం