పోయినసారి 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ సరిగా ఇటువంటి స్థితే కనిపించింది. ‘అర్బన్ టాక్’ అనే పేరిట వినిపించేది అంతా ఇక బీఆర్ఎస్ ఓటమి ఖాయమని అప్పుడు తీర్మానించి వేసింది. కాంగ్రెస్ వారు పోలింగ్ కన్నా ముందే సంబురాలు చేసుకుంటూ పదవుల పంపకాలు కూడా మొదలుపెట్టారు. తీరా ఫలితాలు వెలువడినపుడు బీఆర్ఎస్ సీట్లు 63 (2014) నుంచి 88కి పెరిగాయి. ‘అర్బన్ టాక్’ అనబడేది ఎంత నిరాధారమైనదో, కాంగ్రెస్ వారు ఎట్లా వాస్తవాలకు దూరమై పగటి కలల్లో జీవిస్తున్నారో ఆ విధంగా తెలియవచ్చింది. విషయమేమంటే, ‘అర్బన్ టాక్’ అవాస్తవిక స్వభావం ఇప్పటికీ మారలేదు.
అర్బన్ టాక్ అనేది ఏమిటి? ఆ పనిచేసేది ఎవరు? ఈ మాటలు మనకు ప్రధానంగా హైదరాబాద్‌లో వినిపిస్తాయి. ఈ మాటలు మాట్లాడేది వివిధ అసంతృప్త వర్గాలు. ఇందులోకి అధికారం కోరుకునే ప్రతిపక్షాలు, అంతులేని కోరికలు కోరుతుండే ఉద్యోగులు, సమస్యలు తీరని విద్యార్థులు, యువకులు, నిరుద్యోగులు, పౌర సమస్యలు ఎదుర్కొంటున్నవారు, ప్రజల గురించి ఆలోచిస్తున్నామనుకునే జర్నలిస్టులు, నిరంతర ఉద్యమజీవులు, నిత్య అసమ్మతివాదులు, కొందరు రచయితలు, కళాకారులు, సినిసిజమే తమ లక్షణంగా ఉండే మేధావులు, చపలచిత్తమే స్వభావంగా ఉండే పట్టణజీవులు, నలుగురు చెప్పింది విని ప్రభావితం కావటం తప్ప స్వయంగా ఆలోచించలేనివారు వగైరా ఈ తరగతిలోకి వస్తారు.
2018లో వీరి అర్బన్ టాక్ ఎంత బలంగా తయారైందంటే, బీఆర్ఎస్ ఓటమి ఇక తప్పదనుకున్నారు వీరు అందరూ. విచిత్రమేమంటే చివరికి మొత్తంగా తెలంగాణలోనే కాదు, ఇదే హైదరాబాద్ నగరంలోనూ బీఆర్ఎస్ బలం 2014 కన్న దాదాపు మూడు రెట్లు పెరగగా కాంగ్రెస్, బీజేపీ రెండూ దారుణంగా దెబ్బతిన్నాయి. అర్బన్ టాక్‌పై ఆధారపడి పేకమేడలు కట్టుకున్నవారికి నోట మాట రాలేదు. ఇటువంటి అనుభవం ఎదురై కూడా ఇప్పుడు మరొకసారి వారు అదే అవాస్తవిక అంచనాలతో ఇసుక గూళ్లు కడుతున్నారు. ఇంకా గమనించదగినదేమంటే, అదే అర్బన్ టాక్ కూడా బీఆర్ఎస్కు 2018లో ఉండినంత వ్యతిరేకంగా అయినా ఇప్పుడు లేదు. నగరంలో జరుగుతున్న గణనీయమైన అభివృద్ధి, పెరుగుతున్న ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, వేగవంతమైన పౌర సదుపాయాల వృద్ధితో ప్రభుత్వం పట్ల సానుకూలత పెరుగుతున్నది. ఈ కారణంగా, పైన పేర్కొన్న వివిధ అర్బన్టాక్ తరగతులు తమ విమర్శను మానుకుంటున్నాయి. లేదా బాగా తగ్గించుకుంటున్నాయి. ప్రభుత్వంపై విశ్వాసాన్ని పెంచుకుంటున్నాయి.
ఇదిట్లా ఉంచి అర్థం చేసుకోవలసిన ముఖ్యమైన విషయం ఒక్కటున్నది. అసలు 2018లోనైనా పైతరహా అర్బన్ టాక్ ఎందువల్ల విఫలమైనట్టు? బీఆర్ఎస్ ఓడిపోకపోవటం సరికదా సీట్లు 2014 కన్న ఎందుకు పెరిగినట్లు? తక్కిన తెలంగాణలో సరే, చివరికి ఈ అర్బన్ టాక్ వినిపించే హైదరాబాద్‌లోనూ ఎందుకట్లా జరిగినట్టు? ఇది అర్థం కావాలంటే మనకు ముందు హైదరాబాద్ నగరం అర్థం కావాలి. నగర జనాభాలో అర్బన్ టాక్ మనుషులకు మించిన సంఖ్యలో దిగువ మధ్యతరగతి వారు, పేదలు, తెలంగాణ జిల్లాల నుంచి వచ్చి పనిపాటలు చేసుకునేవారు ఉంటారు. వారికి జీవితం తప్ప రాజకీయాలు అవసరం లేదు. వారు అర్బన్ టాక్ వర్గం వలె నోరున్నవారు, సోషల్ మీడియా జీవులు, మేధావులు కారు. తమలో తాము మాట్లాడుకోవటం మినహా అర్బన్ టాక్ తరగతిలోకి రారు. వీరిలో అత్యధికులకు 2014-18 మధ్యకాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన, కేసీఆర్ నాయకత్వం బాగా నచ్చాయి. దురదృష్టవశాత్తు అర్బన్ టాక్‌లో నిమగ్నులై అదే సర్వస్వమని మురిసిపోయేవారికి ఈ తరగతులు అసలు దృష్టికి రావు. వారి అభిప్రాయాలు లెక్కించదగినవిగానూ తోచవు. అంతకన్న దారుణం ఏమంటే, తమవంటి అభిప్రాయాలే వారికీ ఉంటాయని, ఈ అర్బన్ టాక్ వర్గంలోని సోకాల్డ్ మేధావులు భావిస్తుంటారు. ఇంగ్లీషులో చెప్పాలంటే ‘దే ఆర్ టేకెన్ ఫర్ గ్రాంటెడ్’ అన్నమాట. దానితో, ప్రజలు ఇట్లా అనుకుంటున్నారు, అట్లా అనుకుంటున్నారు అని వాళ్ల పక్షాన తామే ప్రకటనలు చేస్తారు. 2018లో అట్లా చేసే దెబ్బతిన్నారు. విశేషం ఏమంటే హైదరాబాద్ నగరవాసుల గురించే కాదు, మొత్తం తెలంగాణ ప్రజల పక్షాన కూడా ఆ విధమైన ప్రకటనలు తామే చేశారు.
ఇందుకు రుజువుగా 2018 నుంచి మరొక ఉదాహరణ చూడండి. ఆ ఎన్నికల పోలింగుకు అయిదారు రోజుల ముందు నేను, ఇద్దరు మిత్రులు కలిసి సగం తెలంగాణ తిరిగాము. వారిద్దరు బీఆర్ఎస్కు బద్ధ వ్యతిరేకులు. ఆ పార్టీ ఓడిపోతుంది, కాంగ్రెస్ గెలుపు ఖాయమన్నది వారి ప్రగాఢమైన నమ్మకం. ఇద్దరూ అర్బన్ టాక్ సభ్యులు. మా పర్యటన జానారెడ్డి నియోజకవర్గం నుంచి మొదలైంది. అది పూర్తయ్యేసరికి, ఆయన ఓడిపోతున్నారనే అభిప్రాయానికి వచ్చేశారు వారు. ఇద్దరి మొహాలలో దిగులు ఆవరించింది. నేనేమీ మాట్లాడలేదు. మూడు రోజులు గడిచేసరికి వారు తమంతట తాము ఒక నోట్ తయారుచేసి నాకొక కాపీ ఇచ్చారు. అందులో బీఆర్ఎస్కు 80కి పైగా సీట్లు వస్తాయని ఉంది. వారు ఇప్పటికీ అర్బన్ టాక్ సభ్యులే. అందుకు తమ కారణాలేవో తమకున్నాయి. కానీ, వారి స్వరాలలో, వ్యాఖ్యలలో అప్పటి తీవ్రత లేదు. ఇప్పుడు అర్థమనస్క సభ్యులన్న మాట. 2014-18 మధ్యనే జరిగిన అభివృద్ధి, ఆ తర్వాత ఐదేండ్లలో మరింత జరిగి ఉంటుందని, ప్రజలను మరింత మెప్పించి ఉంటుందనే విషయం గ్రహించలేనివారు కాదు వారు.
కనుక, నగరాలలో అర్బన్ టాక్ పరిధి, ప్రభావం అన్నవే 2018 కన్న ఇప్పటికి స్పష్టంగా తగ్గాయి. ఈ పరిధికి బయటి తెలంగాణ పరిస్థితి గురించి అయితే చెప్పనక్కరలేదు. అర్బన్ టాక్ రణగొణధ్వనులను గడిచి నేలకు చెవి ఆనించి వినగలవారికి, వినదలచిన వారికి అర్థమయ్యే తెలంగాణ పరిస్థితి ఇది.
ఇందుకు సమాంతరంగా నాయకత్వ ప్రశ్న ఒకటున్నది. రాష్ర్టాన్ని నడపగల ఒక నాయకునిగా కేసీఆర్‌తో ఇతర పార్టీల నాయకులను పోల్చి చూస్తున్న ప్రజలకు అసలు వారెవ్వరూ ఆయనతో పోల్చగల వారి వలెనే కనిపించటం లేదు. నాయకత్వ బలం, ప్రసంగ ధాటి, విశ్వసనీయత, విషయ పరిజ్ఞానం, మెప్పించగల లక్షణం, పథకాలలో నవీనత, పరిపాలనా సామర్థ్యం, తలపెట్టినవి సాధించటం, అమలుపరచటం, ధీశాలితనం- ఇట్లా ఏ విషయంలో చూసినా ఆయనకు సాటిరాగల నాయకులెవ్వరూ ప్రజలకు ఇతర పార్టీలలో ఇప్పటికీ కానరావటం లేదు. నిజానికి ఈ మాటను ప్రతిపక్షాల వారు, విమర్శకులు సైతం జనాంతికంగా అంగీకరిస్తున్నారు.
టంకశాల అశోక్