వాషింగ్టన్, ఏప్రిల్ 16 : ఇజ్రాయెల్, లెబనాన్ దేశాలు 10 రోజుల పాటు కాల్పుల విరమణకు అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం వెల్లడించారు. గత కొన్ని వారాలుగా రెండు దేశాల సరిహద్దుల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్న క్రమంలో ఇది అరుదైన దౌత్య పురోగతిగా ఆయన అభివర్ణించారు. అటు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో, ఇటు లెబనాన్ అధ్యక్షుడు జోసఫ్ ఆన్‌తో అద్భుతమైన సంభాషణలు జరిగినట్టు ట్రంప్ తెలిపారు. ‘కాల్పుల విరమణ 5 పీఎం ఈఎస్టీ (3.30 ఏఎం, ఐఎస్టీ)కి ప్రారంభమవుతుంది’ అని ఆయన ట్రూత్ సోషల్‌లో పేర్కొన్నారు. ‘ప్రపంచ వ్యాప్తంగా 9 యుద్ధాలను పరిష్కరించడం నాకు దక్కిన గౌరవం. ఇది 10వది. దీనిని కూడా విజయవంతం చేద్దాం’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇజ్రాయెల్, లెబనాన్‌కు చెందిన ప్రతినిధులు ఈ వారం మొదట్లో వాషింగ్టన్లో సమావేశమయ్యారని, ఇలా ఇద్దరూ సమావేశం కావడం 34 ఏండ్లలో ఇదే తొలిసారని ఆయన చెప్పారు. ఈ చర్చల్లో యూఎస్ విదేశాంగ మంత్రి రూబియో కూడా పాల్గొన్నారని ట్రంప్ వెల్లడించారు.
శాంతి ఒప్పందానికి ఒప్పుకోకపోతే అనంతర పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఇరాన్‌ను అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ మరోసారి హెచ్చరించారు. ‘ఇరాన్ విద్యుత్ మౌలిక సదుపాయాలపై దాడి చేయడానికి అమెరికా సిద్ధంగా ఉంది.’ అని పేర్కొన్నారు. ‘ఇరాన్ కనుక తెలివితక్కువ నిర్ణయం తీసుకుంటే దాని మౌలిక సదుపాయాలు, విద్యుత్తు, ఇంధన రంగాలపై దిగ్బంధనం, బాంబుల వర్షం కురుస్తుంది’ అని హెగ్సెత్ తెలిపారు. ‘మీకు చెప్పేదేమిటంటే.. మేము మిమ్మల్ని గమనిస్తున్నాం. మీరు ఏ మిలిటరీ ఆస్తులను తరలిస్తున్నారో మాకు తెలుసు’ అని అన్నారు. తాము మునుపటి కన్నా పూర్తి శక్తిమంతంగా, సన్నద్ధతతో వస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఇరాన్ కనుక శాంతి ఒప్పందానికి సుముఖత చూపకపోతే తాము అనుకున్నంత కాలం హొర్ముజ్ జలసంధిని దిగ్బంధించగలమని ఆయన హెచ్చరించారు.
ఇరాన్‌ను ఆర్థికంగా మరింత ఇబ్బంది పెట్టడానికి అమెరికా మరో షాకింగ్ నిర్ణయం తీసుకుంది. చమురు రవాణాకు ఇచ్చిన మినహాయింపులకు ఫుల్స్టాప్ పెట్టి ఇరాన్, రష్యా చమురు ఎగుమతులపై మళ్లీ ఆంక్షలు విధించాలని నిర్ణయించింది. రష్యా, ఇరాన్ చమురు కొనుగోలుకు అమెరికా మార్చిలో ఇచ్చిన మినహాయింపులను పొడిగించరాదని నిర్ణయించింది. ఇటీవల పశ్చిమాసియాలో ఏర్పడిన యుద్ధ సంక్షోభంతో చమురు ధరలను నియత్రించడానికి, చమురుకు కొరత ఏర్పడకుండా ఉండటానికి గతంలో రష్యా, ఇరాన్ దేశాలపై విధించిన ఆంక్షలను అమెరికా సడలించి, ఈ దేశాల నుంచి చమురు కొనుగోలు చేసుకోవడానికి భారత్ సహా పలు దేశాలకు అనుమతి ఇచ్చింది.
తాజాగా, యూఎస్ ఆర్థిక మంత్రి స్కాట్ బెస్సెంట్ మీడియాతో మాట్లాడుతూ ఇరాన్‌కు చెందిన చమురు నౌకల నుంచి కొనుగోలుకు గడువు ఈ వారంతో ముగుస్తుందని చెప్పారు. అలాగే రష్యా చమురుకు తాత్కాలికంగా మంజూరు చేసిన ఆంక్షల ఎత్తివేత గడువు కూడా ఈ వారంతో ముగిసిపోతుందని తెలిపారు. ఇరాన్, రష్యాల చమురు సరఫరాపై అమెరికా తాత్కాలికంగా ఎత్తివేసిన ఆంక్షల వల్ల భారత్ బాగా లబ్ధి పొందింది. కాగా, ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత భారత్‌కు చెందిన శుద్ధి కర్మాగారాలు సుమారు 30 మిలియన్ బ్యారెళ్ల చమురు కోసం రష్యాకు ఆర్డర్ పెట్టాయి. అలాగే ఇరాన్ నుంచి కూడా ఏడేండ్ల తర్వాత భారత్ చమురును దిగుమతి చేసుకుంది. కనీసం రెండు సూపర్ ట్యాంకర్లు అక్కడి నుంచి భారత్ ఓడరేవులకు సరుకును చేరవేశాయి. సుమారు 4 మిలియన్ బ్యారెళ్ల చమురును ఇరాన్ నుంచి భారత్ దిగుమతి చేసుకుంది.
విదేశాల్లో స్తంభింపజేసిన 100 బిలియన్ డాలర్ల (రూ.9.3లక్షల కోట్లు) ఆస్తుల్ని విడుదల చేయాలని సుదీర్ఘ కాలంగా ఇరాన్ చేస్తున్న డిమాండ్.. అమెరికాతో రెండో దశ చర్చల్లో ప్రధాన అంశంగా మారింది. ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు కొన్ని దశాబ్దాలుగా అమల్లో ఉన్నందున.. చమురు ఎగుమతుల ద్వారా ఆ దేశానికి వస్తున్న ఆదాయానికి గండిపడుతున్నది. ఆంక్షల కారణంగా చైనాలో 20 బిలియన్ డాలర్లు, ఇండియాలో 7 బిలియన్ డాలర్లు, ఇరాక్‌లో 6 బిలియన్ డాలర్ల ఇరాన్ ఆస్తులు స్తంభింపజేశారని ‘అల్ జజీరా’ వార్తా కథనం పేర్కొన్నది. విదేశీ బ్యాంకుల్లో పేరుకుపోయిన 100 బిలియన్ డాలర్ల ఆస్తులను విడుదల చేయాలని ఇరాన్ గత కొంతకాలంగా కోరుతున్నది. ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు 1979 నుంచి అమలవుతున్నాయి. దీని వల్ల విదేశాల్లో స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తుల విలువ ఎంతన్నది అధికారికంగా తెలియదు. సుమారుగా 100 బిలియన్ డాలర్లు ఉంటుందని ఓ అంచనా. ఇది ఆ దేశ జీడీపీలో నాలుగో వంతు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.