తెలంగాణ అంతటా గులాబీ గుబాళిస్తున్నది. తెలంగాణ తరహాలోనే భారతదేశం గులాబీ కంచుకోట కావాలె అన్న రీతిలో ‘భారత రాష్ట్ర సమితి’ ఆత్మీయ సమ్మేళనాలు సాగుతున్నాయి. దీంతో గులాబీ శ్రేణులతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో సంబురం, సందడి నెలకొన్నది. ఉద్యమానికి ఊపిరిపోసిన గులాబీ జెండా ఇది.
తెలంగాణ ప్రజలకు దారి చూపిన నేస్తం ఇది. ఉద్యమ రక్తం నుంచి ఉద్భవించిన అద్భు తం ఇది. పేదల బతుకుల్లో వెలుగులు పంచిన ఆత్మబంధువు ఇది. సరికొత్త పథకాలకు నడక నేర్పిన సృజనశీలి ఇది. వందకోట్ల మంది ఆశల సౌధం ఇది. సంక్షేమ భారతానికి దారిచూపే మార్గం ఇది. నిరంకుశ, నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా పోరాడుతున్న పార్టీ ఇది. దానికి ఆయుష్షు పోసి సాదుకుందాం. అడుగడుగునా అండగా నిలబడుదామంటూ గులాబీదండు శపథాలతో ఆత్మీయ సమ్మేళనాలకు హాజరవుతున్నది.
బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్, ఐటీ శాఖమంత్రి కేటీఆర్‌లు నింపిన స్ఫూర్తితో గులాబీ దండు గుండెలు నిండుగా మారాయి. ఆత్మీయ సమ్మేళనాలకు తరలివస్తున్న కార్యకర్తలు, అభిమానుల్లో ఉత్సాహం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. ఈ ఆత్మీయ సమ్మేళనాలు విపక్షాలకు కంటగింపుగా మారాయి. నాయకులు, కార్యకర్తల మధ్య అడుగడుగునా ఆత్మీయ పలకరింపులు, అందరినోటా కేసీఆర్ పాలనపై ప్రశంసల జల్లు కురుస్తున్నది. సుహృద్భావ వాతావరణంలో జరుగుతున్న సమ్మేళనాలకు ప్రజలు నీరాజనాలు పడుతుండటం గమనార్హం. తొమ్మిదిన్నరేండ్లుగా ప్రజారంజక పాలన అందిస్తున్న కేసీఆర్ మార్గనిర్దేశనంతో కార్యకర్తలు, నాయకులలో కొత్త జోష్ కనిపిస్తున్నది. ఈ ఆత్మీయ సమ్మేళనాలు ముచ్చటగా మూడోసారి కూడా బీఆర్ఎస్ పార్టీదే అధికారం అని తెలియజేస్తున్నాయి.
వచ్చే శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయమే లక్ష్యంగా తామంతా కార్యోన్ముఖులమవుతామనే సంకల్పంతో కార్యకర్తలు ఉత్సాహంగా ముందుకు కదలడానికి సమ్మేళనాలు పురిగొల్పాయి. క్లీన్‌స్వీప్ చేసి మరోమారు గులాబీ గుబాళింపును అందించాలన్న కేసీఆర్ సంకల్పం పార్టీ శ్రేణుల్లో ఆత్మస్థయిర్యాన్ని కలిగిస్తున్నది. ఆత్మీయ సమ్మేళనాలకు స్వచ్ఛందంగా తరలివస్తున్న ప్రజానీకం తొమ్మిదిన్నరేండ్ల కేసీఆర్ పాలనను మననం చేసుకుంటూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. రాజకీయంగా ఎదుర్కొనలేని విపక్షాలన్నీ కుమ్మక్కై ముఖ్యమంత్రి కేసీఆర్‌ను, బీఆర్ఎస్ పార్టీని అణగదొక్కడానికి చేసే కుట్రల గురించి ప్రజలు ప్రస్తావిస్తూ విపక్షాల వైఖరిని ఎండగడుతున్నారు. ఈ ఆత్మీయ సమ్మేళనాలలో ఇది ప్రత్యేకంగా ప్రజలను ఆకర్షిస్తున్నది.
అధికారపక్షం, విపక్షాల పనితీరును ప్రజలు నిశితంగా పరిశీలిస్తున్నారనడానికి వారు వ్యక్తంచేస్తున్న అభిప్రాయాలే తార్కాణం. దేశం యావత్ తెలంగాణ వైపు చూసేవిధంగా కేసీఆర్ పాలన కొత్త చరిత్రను రాసుకుంటూ ముందుకు సాగుతున్నదని ప్రజలు నిర్మొహమాటంగా తమ తమ భావాలను వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి సంక్షోభ సమయంలోనైనా పేదల బతుక్కి ఢోకాలేదన్న భరోసా ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ఉందని ప్రజలు సగర్వంగా చెప్పడం పోరాట యోధుని పాలనకు దక్కిన గౌరవమనే చెప్పాలి.
ఎవరి కోసమైతే ఉద్భవించిందో వారిపట్ల బాధ్యతను, విశ్వాసాన్ని కనబరచకపోతే ఏ పార్టీకీమనుగడ ఉండదు. ప్రజా విశ్వాసమే పార్టీలకు ఊపిరి. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో ఉద్యమం ప్రారంభించిన బీఆర్ఎస్కు తెలంగాణ ప్రజలు అండగా నిలుస్తూనే ఉన్నారనడానికి ఆత్మీయ సమ్మేళనాలు అద్దం పడుతున్నాయి. గత ప్రభుత్వాలు, కేసీఆర్ పాలనకు మధ్య స్పష్టమైన తేడా కనిపిస్తున్నదని, ఇదే తమను గ్రామాల్లో కాలరెగరేసుకుని తిరిగేవిధంగా మార్చిందంటూ గులాబీ శ్రేణులు గుండెలు నిండుగా చెప్తున్నాయి. విద్యుత్ విషయంలో కేసీఆర్ ముందుచూపుతో తీసుకున్న నిర్ణయాలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. 24 గంటల పాటు నిరంతర కరెంటు ఇవ్వడాన్ని వారు గొప్పగా కీర్తిస్తున్నారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవిస్తే చీకట్లు పరుచుకుంటాయన్న విమర్శలను పసలేనివిగా నిరూపించడంలో కేసీఆర్ సర్కార్ ప్రవేశపెట్టిన నూతన పారిశ్రామిక విధానంపై ప్రజల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ‘రైతుబంధు’, ‘రైతుబీమా’, ‘దళితబంధు’, ‘మిషన్ కాకతీయ’, ‘మిషన్ భగీరథ’, ‘కల్యాణలక్ష్మి’, ‘షాదీముబారక్’, ‘ఆసరా పింఛన్ల వంటి పథకాలు పేదలకు చేరడం వల్లనే గ్రామాల్లో గులాబీ జెండాకు ఆదరణ లభిస్తున్నదనే విషయం స్పష్టం. ఏ పథకమైనా పేదలకు చేరాలంటే ప్రభుత్వానికి, పార్టీకి మధ్య సమన్వయం ఉండాలి. బీజేపీ, కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీలకు, ప్రభుత్వానికి విడివిడిగా సారథులు ఉంటారు. పార్టీ, ప్రభుత్వం మధ్య సమన్వయం లేనిపక్షంలో ప్రజా సమస్యల పరిష్కారంలో గందరగోళం తలెత్తుతుంది. దశాబ్దాల తరబడి దేశంలో ఇదేతరహా అయోమయం కొనసాగింది. బీఆర్ఎస్ పార్టీ ఇందుకు భిన్నం. పార్టీ, ప్రభుత్వ పగ్గాలు ఒక్కరి చేతుల్లోనే ఉండటం వల్ల సానుకూల ఫలితాలు వచ్చాయి.
గతాన్ని సమీక్షించుకుంటూ, వర్తమానాన్ని విశ్లేషించుకుంటూ, భవిష్యత్తును నిర్దేశించుకునే లక్ష్యంగా సమ్మేళనాలు జరగడం విశేషం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను మళ్లీ ఎన్నికల ముందు మాత్రమే నేతలకు గుర్తుకురావటమన్నది గతమంతా చూపిన చరిత్ర. దానికి తొమ్మిదిన్నరేండ్ల పాలనలో కేసీఆర్ పుల్ స్టాప్ పెట్టారు. ఎన్నికల హామీలను నెరవేర్చడమే కాక, ఇవ్వని హామీలనూ ఎన్నో పథకాలను అమలుచేశారు. చెప్పింది చేయటమే తన పరిపాలన అజెండాగా నిర్దేశించుకుని ఆ దిశగా అడుగులు వేసి ప్రజల హృదయాల్లో నిలిచిన కేసీఆర్‌కు ప్రజలు నీరాజనం పడుతున్నారని చెప్పడానికి ఆత్మీయ సమ్మేళనాలే ప్రత్యక్ష సాక్ష్యం. ప్రజలే కేంద్రంగా, వారి సమస్యలే ఇతివృత్తంగా పనిచేస్తున్న కేసీఆర్‌ను ఈ తెలంగాణ సమాజం ఎన్నడూ వదులుకోదనడానికి సమ్మేళనాలే నిదర్శనం. ప్రజాభిమానమే ఓట్లుగా మారి హ్యాట్రిక్ సాధించి కేసీఆర్ నూతన అధ్యాయానికి శ్రీకారం చుడతారనడంలో సందేహం లేదు.
(వ్యాసకర్త: రాష్ట్ర పోలీసు గృహ నిర్మాణ సంస్థ చైర్మన్)
కోలేటి దామోదర్
98491 44406