ఆస్ట్రేలియా, మెల్బోర్న్ సిటీలోని ‘డాండినాంగ్ క్రికెట్ క్లబ్’కు నా కొడుకు నిఖిల్‌రెడ్డిని ప్రతిరోజూ క్రికెట్ ప్రాక్టీస్‌కు తీసుకువెళ్తుంటాను. అయితే అక్కడికే తన కొడుకును కూడా క్రికెట్ ప్రాక్టీస్ కోసం తీసుకువచ్చే మన తెలుగు బిడ్డ, ఆంధ్రా మిత్రుడు దినేష్ నాయుడుతో జరిగిన చర్చను వ్యాసరూపంలో మీ ముందుకు తీసుకువస్తున్నా.
2009, నవంబర్ 29న కేసీఆర్ చేపట్టిన ‘దీక్షా దివస్’ తర్వాత తెలంగాణ అగ్నిగుండమైంది. తెలంగాణ రాష్ట్రం కోసం శ్రీకాంతాచారి లాంటి ఎందరో విద్యార్థులు అమరులయ్యారు. తర్వాత నిద్రలేచిన కాంగ్రెస్ డిసెంబర్ 9న అప్పటి కేంద్ర హోం మంత్రి చిదంబరం చేత ‘తెలంగాణ ప్రక్రియ మొదలైంది’ అంటూ ప్రకటన చేయించింది. ఆ తర్వాత తెలంగాణ వ్యాప్తంగా ఇలా సంబురాలు మొదలయ్యాయో లేదో… ఆంధ్రా నాయకుల వరుస రాజీనామాలతో వచ్చిన తెలంగాణ వాపస్ పోయింది. అప్పుడు ఇదే దినేష్ నాయుడు ‘ఇదీ మా ఆంధ్రా సత్తా… తెలంగాణ ఇక రాదు’ అంటూ అవహేళన చేశాడు. ‘కాలమే అన్నింటికీ సమాధానం చెప్తుంది, తెలంగాణ తప్పకుండా వస్తుంది, తెలంగాణ కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టిన కేసీఆర్ తెలంగాణ తెచ్చేదాన్క వెనుకడుగు వేయడంటూ’ దినేష్ నాయుడికి ఛాలెంజ్ విసిరాను. ఛాలెంజ్ విసరడమే కాదు, తెలంగాణ ఉద్యమకారుడిగా 2010లో ఆస్ట్రేలియా ఎంపీలు, మంత్రులతో ‘ప్రత్యేక తెలంగాణ’ ఇవ్వాలంటూ శ్రీకృష్ణ కమిటీకి లేఖ కూడా రాయించాను. అప్పుడు కూడా ఇదే దినేష్ నాయుడు ‘అయ్యో పాపం నాగేందర్! తెలంగాణ కోసం ఎంత కష్టపడుతున్నావో…’ అంటూ సానుభూతి చూపించాడు. ఆ సానుభూతిలోనూ హేళన నాకు కొట్టొచ్చిన్టట్టు కనిపించేది.
2014 జూన్ 2న తెలంగాణ రావడం, అతను మళ్లీ నన్ను కలువడం యాదృచ్ఛికంగా జరిగిపోయాయి. కానీ నేను దినేష్‌ను ఒక్క మాట కూడా అన్లేదు. ఫలానా రోజు నన్ను హేళన చేశాడు కదా అని నేను అతన్ని చులకనగా చూడలేదు. అది మన తెలంగాణ నైజం కూడా కాదు. ‘తెలంగాణ వచ్చింది, ఐపోయింది. తెలుగు బిడ్డలుగా మనం కలిసే ఉందాం దినేష్ భాయ్’ అంటూ అలయ్ బలయ్ తీసుకున్నా. తను కూడా చాలా హప్పీగా షేక్‌హ్యాండ్ ఇచ్చి కంగ్రాచ్యులేషన్స్ చెప్పాడు.
ఇటీవల హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో ‘బీఆర్ఎస్’ పార్టీ సమావేశం జరగడం, ఆ పార్టీలోకి ఆంధ్రా నాయకులు తోట చంద్రశేఖర్, రావెలతో పాటు ప్రముఖ ఆంధ్రా నాయకులను కేసీఆర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడాన్ని దినేష్ నాయుడు సమర్థిస్తూ నాతో తన ఆవేదనను ఇలా పంచుకున్నాడు.
‘తెలంగాణ ఉద్యమకాలం నుంచి నేను కేసీఆర్‌ను చూస్తున్నాను. కానీ, నాకిప్పుడనిపిస్తున్నది కేసీఆర్ ఒక్క తెలంగాణకు మాత్రమే పరిమితం కావాల్సిన నాయకుడు కాదు, ఆయన నాయకత్వం దేశానికి అవసరం. అందుకే కదా మొన్న హైదరాబాద్ తెలంగాణ భవన్లో జరిగిన సమావేశంలో మా ఆంధ్రా ప్రజలు ఈలలు వేస్తూ హర్షధ్వానాలు వ్యక్తం చేశారు’.
‘హైదరాదాబాద్ను అభివృద్ధి చేసింది ‘నేను’, హైదరాదాబాద్ను ప్రపంచపటంలో పెట్టింది ‘నేను’… ఇలా ‘నేను’ అనే పదం లేకుండా ఏ మాట మాట్లాడని చంద్రబాబు ఐదేండ్లు ముఖ్యమంత్రిగా ఉన్నా కనీసం రాజధానిని కూడా ఏర్పాటుచేయలేకపోయాడు. ‘అమరావతి’ పేరిట ఆంధ్రా ప్రజలను మభ్యపెట్టాడు. అందుకే ప్రత్యామ్నాయంగా ఆంధ్రా ప్రజలు ఒకసారి జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్సీపీకి అవకాశం ఇచ్చారు. జగన్ అధికారంలోకి వచ్చి కూడా సుమారు నాలుగేండ్లు పూర్తవుతుంది. అతను కూడా ఆంధ్రా ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదు. ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు ఏర్పాటు చేస్తానంటూ ప్రజలను నట్టేట ముంచుతున్నాడు. పోటీ పరీక్షల్లో ‘ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదీ?’ అని ప్రశ్న అడిగితే కూడా విద్యార్థులు జవాబు చెప్పే పరిస్థితుల్లో కూడా లేరు. ఎప్పటి వలె ఆంధ్ర, కోస్తా, రాయలసీమ ప్రాంతాల ప్రజలు కులాల కంపులో కొట్టుమిట్టాడుతున్నారు. అభివృద్ధి అనే పదం ఆంధ్రులకు దూరమై ఏండ్లు గడుస్తున్నది. ఇక దేశవ్యాప్తంగా నరేంద్ర మోదీ పాలనను సుమారు తొమ్మిదేండ్లుగా చూస్తూనే ఉన్నాం. ఆయన పాలనలో మత విద్వేషాలు, మత ఘర్షణలు తప్ప దేశానికి ఒరిగిందేమీ లేదు. దేశాన్ని ఏండ్ల తరబడి పాలించిన కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం లేకనే ప్రజలు బీజేపీకి పట్టం గట్టారే తప్ప బీజేపీ ఏదో చేస్తుందని ఆశతో కాదు. కానీ ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని కూడా బీజేపీ ఉపయోగించుకోలేకపోయింది. పేద ప్రజల పొట్ట కొట్టే కార్పొరేట్ యాజమాన్యాలు కడుపు నింపుతున్నది. రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటూ నరేంద్ర మోదీ రైతు వ్యతిరేకి అని నిరూపించుకున్నారు.
ఈ క్రమంలో.. కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా మరో జాతీయ పార్టీ ఆవశ్యకత ఏర్పడింది. దాన్ని గమనించిన కేసీఆర్ ‘తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్)ని, భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)గా రూపాంతరం చేయడాన్ని నేను మనస్ఫూర్తిగా సమర్థిస్తున్నాను. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వల్పకాలంలోనే తెలంగాణను దేశానికి మాడల్‌గా తీర్చిదిద్దారు. ఆయనకు సుదీర్ఘకాలం పాటు ఉద్యమం చేసిన అనుభవం కూడా ఉన్నది. అందుకే ఆయన దేశానికి ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నారు. తెలంగాణ ఉద్యమకాలం నుంచి నేను కేసీఆర్‌ను చూస్తున్నాను. కానీ, నాకిప్పుడనిపిస్తున్నది కేసీఆర్ ఒక్క తెలంగాణకు మాత్రమే పరిమితం కావాల్సిన నాయకుడు కాదు, ఆయన నాయకత్వం దేశానికి అవసరం. అందుకే కదా మొన్న హైదరాబాద్ తెలంగాణ భవన్లో జరిగిన సమావేశంలో మా ఆంధ్రా ప్రజలు ఈలలు వేస్తూ హర్షధ్వానాలు వ్యక్తం చేశారు. ఒక్క ఆంధ్రాలోనే కాదు, మిగతా రాష్ర్టాల్లో కూడా బీఆర్ఎస్ తన ప్రభావం కచ్చితంగా చూపెడుతుంది. ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న దేశానికి బీఆర్ఎస్ అవసరం తప్పకుండా ఉన్నది’ అంటూ ఉద్వేగంగా దినేష్ మాట్లాడటం నాకు ఆనందాన్నిచ్చింది.
దినేష్ నాయుడు ఇంకేమన్నాడో తెలుసా…? ‘నాగేందర్ భాయ్ అవసరం ఉంటే బీఆర్ఎస్ను సమర్థిస్తూ ఇప్పుడు కూడా ఆస్ట్రేలియా ఎంపీలతో, మంత్రులతో.. ‘మీ దేశంలో బీఆర్ఎస్ను బలపర్చడంటూ భారత ప్రజలకు లేఖ రాపిద్దాం’.. అన్నాడు.(వ్యాసకర్త: బీఆర్ఎస్ అధ్యక్షులు, ఆస్ట్రేలియా)
-కాసర్ల నాగేందర్‌రెడ్డి