బీఆర్ఎస్ ప్రభుత్వం వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేసిన సమయంలో రాష్ట్రంలోని వీఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించింది. 20,555 మందిని రెగ్యులరైజ్ చేస్తూ 2023 జూలై, ఆగస్టులలో జీవోలు 81, 85లను జారీచేసింది. ఉద్యోగార్హతల ఆధారంగా జూనియర్ అసిస్టెంట్లుగా, రికార్డ్ అసిస్టెంట్లుగా, ఆఫీస్ సబార్డినేట్లుగా వివిధ శాఖల్లో నియమించింది. అయితే, 20,555 మందిలో 3,797 మంది ప్రభుత్వ రిటైర్మెంట్ వయసైన 61 ఏండ్లకు పైబడి ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించింది. మిగతా 16,758 మందిని రెగ్యులరైజ్ చేసింది. దీంతో 3,797 మందిని ఏం చేయాలనే అంశంపై ఐదుగురు ఐఏఎస్‌లతో కూడిన కమిటీతో అధ్యయనం చేయించింది. కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు వారికి ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఆ మేరకు సర్టిఫికెట్ల పరిశీలన కూడా పూర్తిచేసి, వివరాలను సీసీఎల్ఏకు సమర్పించారు. వారి కుటుంబ సభ్యుల నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు కూడా తీసుకున్నారు. అయితే కొందరు కోర్టును ఆశ్రయించడంతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. కొంత కాలానికి పిటిషన్‌ను ఉపసంహరించుకోవడంతో లైన్ క్లియర్ అయింది. అయితే, అదే సమయంలో అసెంబ్లీ ఎన్నికలు రావడంతో నియామక పత్రాలు ఇవ్వడం సాధ్యం కాలేదు.
ఎన్నికల తర్వాత కాంగెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో ఉద్యోగాలు వస్తాయని 3,797 వీఆర్ఎల వారసులు ఆశపడ్డారు. జీవోలు వచ్చి ఇప్పటికి 20 నెలలు గడిచిపోయినా నియామక పత్రాలు అందలేదు. సీఎం రేవంత్‌రెడ్డి, రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు.. ఇలా అందరికీ వినతి పత్రాలు ఇచ్చినా సమస్య పరిష్కారం కాలేదు.
వాస్తవానికి ఈ 3,797 మంది వీఆర్ఏల వారసులు దాదాపు 14-15 ఏండ్లుగా అనధికారికంగా తమ తండ్రుల స్థానంలో విధులు నిర్వహిస్తున్నారు. అంతేకాదు, గతంలో సర్టిఫికెట్ల పరిశీలన సమయంలో కుటుంబ సభ్యుల నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ అడిగారు. దీంతో ఉద్యోగం తమకే వస్తుందనే నమ్మకంతో 3,797 మంది వారసులం మా కుటుంబ సభ్యులతో ఆస్తి పంపకాల్లో తక్కువ వాటా తీసుకోవాల్సి వచ్చింది. ఆస్తులు లేనివారు ఎంతో కొంతకు ఒప్పందాలు చేసుకున్నారు. దీంతోపాటు మా తల్లిదండ్రులను పోషించే బాధ్యతను కూడా పంచుకున్నాం. అయితే, ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకపోడంతో వారసులందరూ అప్పులు తెచ్చి కుటుంబ సభ్యులతో సెటిల్మెంట్ పూర్తి చేసుకున్నారు. ఇప్పటికే 61 ఏండ్లకు పైబడిన వీఆర్ఏల్లో 400 మంది వరకు మరణించారు. తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక దాదాపు 100 మంది వారసులు కూడా చనిపోయారు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మా విద్యార్హతల ఆధారంగా నియామక పత్రాలు ఇవ్వాలని కోరుతున్నాం. కొత్తగా ఏర్పాటు చేయబోయే గ్రామ రెవెన్యూ అధికారుల పోస్టింగ్‌లలో అవకాశం ఉన్నవారికి సర్దుబాటు చేయాలని విజ్ఞప్తి చేస్తు న్నాం. 3,797 వీఆర్ఏలలో అత్యధికంగా దళిత, బడుగు బలహీన, అణగారిన వర్గాలకు చెందినవారే ఉన్నా రు. ఇప్పటికైనా మా కుటుంబాలలో వెలుగులు నింపాలని కోరుతున్నాం.
– వీఆర్ఏ, జేఏసీ నాయకుడు, రాజన్న సిరిసిల్ల జిల్లా
-కోరెం రమేశ్ పటేల్