మేఘాల తీరు చూసి వాన ఎంతసేపు కురుస్తుందో పల్లెలోని సామాన్యుడు కూడా చెప్పగలడు. ఒక్క మెతుకు చూస్తే అన్నం ఎంత ఉడికిందో తెలుస్తుంది. ఇవన్నీ ప్రకృతి సహజమైన కార్యాలు కనుక ఎప్పటికీ మారవు. కానీ, రాజకీయాలు అట్లా ఉండవు. ఊహించలేని విషయాలు కండ్లముందు జరుగుతాయి. క్షణక్షణం మారగలిగిన ప్రజ్ఞ ఉన్న మనిషిని బట్టి అవి సామాన్యులు తెలుసుకోలేని విధంగా రోజురోజుకు మారుతూ ఉంటాయి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అటువంటి అనూహ్య పరిస్థితి నెలకొంది.
రెండుసార్లు గెలిచిన ఉద్యమ పార్టీ నాయకుడు ముఖ్యమంత్రి పదవిని చేపట్టి, అర్ధ శతాబ్దం అష్టకష్టాలు పడ్డ ప్రజలను ఎంతో సమర్థవంతంగా పరిపాలించి, రాష్ర్టాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. అయితే డా.జయశంకర్ సార్ చెప్పినట్టు ‘తెలంగాణ వంటి సుసంపన్న రాష్ర్టాన్ని వలస పాలకులు అంత త్వరగా వదులుకోరు. అయితే మళ్లీ ఉమ్మడి రాష్ట్రం చేయడానికి ప్రయత్నిస్తారు. లేకపోతే ఈ రాష్ట్ర ప్రగతికి అడ్డుపడి, సర్వనాశనం చేయటానికైనా వెనుకాడరు’ అన్న ఆయన మాటలు ఇప్పుడు గుర్తుతెచ్చుకోవాలి.
కేవలం తొమ్మిదిన్నరేండ్లలో అనూహ్య ప్రగతి సాధించిన తెలంగాణ రాష్ర్టాన్ని ఏ వలస పాలకుడు, ఏ ఆంధ్రా పార్టీ వదలదని చాలా సంఘటనలు చెప్పాయి. విడిపోయాక కూడా తెలంగాణ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం, జనసేన, ఆఖరికి రాజకీయ అనుభవం లేని కేఏ పాల్, షర్మిల వంటివారు కూడా తమ పార్టీలని ఇక్కడే స్థాపించాలని చూడటం గమనిస్తే వీరందరూ తెలంగాణ ప్రజలని ఎంత తక్కువగా పరిగణిస్తారో అర్థమవుతుంది. జాతీయ పార్టీ కాంగ్రెస్ తోక పుచ్చుకొని 2018 ఎన్నికల్లో టీడీపీ ఇక్కడ మళ్లీ తన బలం పెంచుకోవాలని ప్రయత్నించి బొక్కబోర్లా పడింది. ఇక ఆంధ్రా ప్రాంతంలో దూషణ సత్కారాలు, అవహేళనలు ఎదుర్కొంటున్న పవన్ కల్యాణ్ బీజేపీ జేబులో దూరి ఇక్కడా పాగా వేయాలని సాహసం చేశారు.
ఆఖరికి ఆయన పార్టీ తరఫున తాజా ఎన్నికల్లో పోటీ చేసిన 8 మంది అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోవడమే కాదు, ఏ ఒక్కరికీ బర్రెలక్కకు వచ్చినన్ని ఓట్లు కూడా రాకపోవడంలో ఆశ్చర్యమేముంది? ఆత్మగౌరవం కలిగిన వారు ఎవరైనా అయితే, తట్టాబుట్టా సర్దుకొనేవారే. ఎప్పుడు, ఎక్కడ ఉంటారో ఎవరికీ తెలియదు, కనుక ఈయనతో తెలంగాణకు ప్రమాదం లేదు. ఇక రాజన్న బిడ్డ మెట్టినింటిలో తెలంగాణ అత్తగారి దగ్గర తన పాచికలు పారక, ఇక్కడ తనని నమ్మి రోడ్ల మీదకు వచ్చిన వారినందరినీ నట్టేట్లో ముంచి, జెండా పీకేసి, పుట్టినింటికి తరలిపోయారు. అక్కడ అన్నతో యుద్ధానికి అమ్మతో కలిసి సిద్ధమయ్యారు. కనుక, ఈపై పార్టీల వారెవరికీ తెలంగాణలో లాభమూ లేదు, నష్టమూ లేదు!
మరి ఇప్పుడు ఎవరు తమ భవిష్యత్తు గురించి ఆలోచించుకోవాలి. ప్రజాస్వామ్యంలో ప్రజలు శాశ్వతం, నాయకులు అశాశ్వతం. ఈ కఠోర సత్యాన్ని గుర్తించనివారు రాజకీయాల్లో ఎక్కువకాలం మనలేరు. కానీ, ప్రజాభిమానాన్ని చూరగొన్నవారే ఎక్కువ ప్రభావం చూపగలరు. 2014 దాకా స్థానిక పార్టీ అనేది అధికారంలో లేక అష్టకష్టాలు పడ్డ తెలంగాణ ప్రజలకు అప్పటి టీఆర్ఎస్, ఇప్పటి బీఆర్ఎస్ అండగా నిలిచి రక్షించింది. అసలు పాలన అంటే ఏమిటో రుచి చూపించింది. ప్రజాపాలన పేరుతో తమ స్వార్థం చూసుకుంటూ, అవినీతితో అంటకాగుతూ ప్రజలను గాలికి వదిలేయటం కాదనీ, వారి అవసరాలను క్షుణ్నంగా గమనించి వారు అడగకముందే సహాయం చేయటమనీ రాజకీయాల్లోనే ఒక కొత్త పంథాను దేశానికి నిర్దేశించింది. నిజానికి రెండు జాతీయ పార్టీల 75 ఏండ్ల అవకతవకల పాలనలో విసిగిపోయిన ప్రజలు ఇతర రాష్ర్టాల్లో కూడా తమ తమ ప్రాంతీయ పార్టీలకే పట్టం కడుతున్నారు. అదే జరగాలి కూడా!
ఇక ఇప్పుడు తమకు తామే విస్తుపోయేంతగా అనూహ్యంగా, అసందర్భంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి రెండు కష్టాలు దురదృష్టంగా మారాయి. ఒకటి- ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాల గురించి అవగాహనారాహిత్యం, రెండు- పాలనా అనుభవరాహిత్యం. అటు ప్రజల అవసరాల గురించి అవగాహన లేక, ఇటు రాష్ట్ర పాలన ఎలా ప్రణాళికాబద్ధంగా ఉంటుందో తెలియక అలవిగాని పథకాలు ఇస్తామని ఎన్నికల్లో హామీలు ఇచ్చేశారు. అధికారంలోకి వచ్చాక గానీ సమస్య తెలిసిరాలేదు. ఇక మాట నిలబెట్టుకోలేక పథకాల గురించి అడిగిన ప్రజలను దుర్భాషలాడుతున్నారు.
ఇక్కడ ఆ పార్టీలో ఇప్పుడిప్పుడే చేరి, ఇంకో పదో, ఇరవై ఏండ్లో రాజకీయాల్లో ఉండాలని ఆశించే ఈ తరం నాయకులు, వారి కార్యకర్తలు పై పరిస్థితిని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నిజమైన ప్రమాదం వీరికే పొంచి ఉంది. ఇది వరకు పడ్డట్టే ఈ కాంగ్రెస్ పార్టీ పాలనలో అంతులేని కష్టాలు పడే ప్రజలు ఐదేండ్ల తర్వాత బయటపడతారు. అనుభవాన్ని తలచుకొని మళ్లీ స్థానిక పార్టీని తలకెత్తుకుంటారు.
అప్పుడేమవుతుంది? ఐదేండ్లు ప్రజాగ్రహాన్ని చూసిన ఈ కాంగ్రెస్ నాయకులకు, వారి అనుయాయులకి ఇంక రాజకీయ భవిష్యత్తు ఉండదు. లేదా ఇప్పటి ముఖ్యమంత్రితో సహా అందరూ బీజేపీలోకి దూకినా ఆ పార్టీకి కూడా తెలంగాణలో స్థానం ఉండదు. ప్రస్తుతం ఆ రెండు పార్టీలూ బలంగా కనిపించినా, క్రమంగా తెరమరుగు అవుతాయి. ఇంకొక విషయం ముఖ్యంగా ఆలోచించవలసింది ఉన్నది. ఒకే వ్యక్తి, నాయకుడి మీద ఆధారపడ్డ పార్టీలు ఆ నాయకుడితోనే అంతరిస్తాయి, ఇప్పుడు తెలుగుదేశం లాగా. కనుక ప్రస్తుతం కాంగ్రెస్, బీజేపీలో ఉన్న ఈ తరం రాజకీయ నాయకులు తమ భవిష్యత్తు గురించి బాగా ఆలోచించుకొని అడుగేయాలి. ప్రజలను తక్కువగా అంచనా వేయవద్దు. వారి అభిమానాన్ని సంపాదించకపోతే 2014లో రాష్ర్టాన్ని ఏర్పరచినా కూడా కాంగ్రెస్ ఎదుర్కొన్న పరాభవాన్ని గుర్తుంచుకోవాలి. నాయకులకి ధనబలం, అంగబలం కంటే ప్రజా బలం ముఖ్యం. ప్రజా బలం నశించినప్పుడు అంగ బలం మిగలదు, ధన బలం పని చేయదు. జాగ్రత్త! జై తెలంగాణ!!
కనకదుర్గ దంటు
89772 43484