తెలుగునాట ఎందరో వాగ్గేయకారులున్నారు. మధ్యయుగాల నుంచి జీవన్ముక్తిని అన్వేషిస్తూ పాటలు పాడిన భక్త కవులున్నారు. ఒక్కొక్కరిది ఒక్కో శైలి, ఒక్కో చారిత్రక సందర్భం. ఆధునిక యుగంలో ప్రజల కోసం కైగట్టి పాడిన వారెందరో ప్రపంచ ప్రసిద్ధి చెందారు. అమెరికన్ ప్రజా వాగ్గేయకారుడు బాబ్డిలాన్తో పోల్చతగ్గ ఏకైక ప్రజా వాగ్గేయకారుడు గోరటి వెంకన్న. ప్రజల కష్టాల్ని, ఆనందాల్ని, హింసల్ని, దుఃఖాన్ని, కన్నీటిని, పీడల్ని కళ్లకు కట్టినట్టు అద్భుతంగా పట్టుకొని సమాజం ముందుంచుతారు. వివక్షను, అన్యాయాల్ని, ఆధిపత్యాన్ని, అణచివేతను, ధైర్యంగా గొంతెత్తి పాడి ప్రజల తరఫున ఒక పొలికేకగా, ఆర్తగీతిగా మారిపోతాడు. గోరటి వెంకన్న పాట వినని తెలుగువాడు, పాటలు లేని వేదికలు లేవంటే అతిశయోక్తి కాదు.
గోరటి వెంకన్న పాట వింటే… బతుకు మీద ఒక ఆశ జనిస్తుంది. మృత్యువుకు చేరువలో ఉన్న ఒక వృద్ధుడిలో జీవితేచ్ఛను రగిలిస్తుంది. ఒక రైతు హృదయం తూనీగలా ఉప్పొంగుతుంది. ఒక సగటు మనిషికి పాట ఒక ఆయుధంలా మారుతుంది. బాధాసర్పదష్టులకు గుండెనిబ్బరాన్ని ఇస్తుంది. సత్యాన్వేషకులకు ఒక కొత్త దారి కనబడుతుంది. పల్లెలు సంబురం చేసుకుంటాయి. పక్షులు వేలకు వేలు ఆకాశంలో ఎగిరినట్టు అతని పాట చిత్రభ్రమలకు గురిచేస్తుంది. జీవితాన్ని మరింత మధురఫలంగా మారుస్తుంది. గోరటి వెంకన్న పాట వింటే దుఃఖనదులు పొంగుకొస్తాయి. గల్లి చిన్నదెట్లయిందోనన్న ప్రశ్న మొదలవుతుంది. ప్రశ్నలు పుంఖానుపుంఖాలుగా పుట్టుకొచ్చి వ్యవస్థను కుళ్లబొడుస్తాయి. పల్లెలు ఎందుకు కన్నీరు పెడుతున్నాయి? సమస్త వృత్తుల జీవన సౌందర్యం, పనిముట్లు ఎట్లా ఆగమైపోయినాయో! పాట తేటతెల్లంజేసి నిద్రాణంగా ఉన్న మెదళ్లను తట్టిలేపుతుంది. గ్లోబలైజేషన్ ఆక్టోపస్లా విస్తరించినాక పల్లెలు, పల్లెల జీవనం విధ్వంసానికి గురయ్యాయి. గోరటి వెంకన్న ఈ ధ్వంస రచనను చూసి దుఃఖించి, వేదనకు గురై ‘పల్లె కన్నీరు పెడుతుందో కనిపించిన కుట్రల’ అంటూ అద్భుతంగా రాసి ప్రజలను ఆలోచింపజేసి పాలకులకు సవాలు విసిరిండు.
వెంకన్న పాటలు ఎరిక్ క్లాప్టన్ను, ట్రేసీచాప్మన్ను, బాబ్ డిలాన్ను గుర్తుకుతెచ్చి పాలమూరు నేల నుంచి విశ్వగీతాన్ని విన్పిస్తున్నట్లుంటుంది. పాలమూరు దుఃఖాన్ని ప్రపంచ దుఃఖంగా మార్చి ప్రపంచంలో వేదన, దుఃఖం ఒక్కటేనంటూ విశ్వగీతికలు అల్లుతాడు. వీరి పాటలు వింటూ మనల్ని మనం మరిచిపోతాం, మనలో పాట అంతరాంతరాల్లో ప్రవహిస్తుంది. పాట సిరలు ధమనుల్లోకి చొరబడి నిన్ను ద్రవీభూతుణ్ని చేస్తుంది. జ్వరపీడితుణ్ని చేస్తుంది. మనలో ఇంకిపోయిన మనిషి జాడను పట్టుకొస్తుంది. మన జీవన లాలసను సున్నితంగా మీటుతుంది. వెంకన్న పాట నిస్సారమైన బతుకులకు ఆశను చిగుర్చి సారవంతం చేస్తుంది!
గోరటి వెంకన్న పాటలు వింటే సంచారులు, బైరాగులు, సిద్ధులు, నాథ్లు, జంగమ దేవరలు, అచల సాంప్రదాయులు, బౌద్ధ సాధకులు, శ్రమణులు, భక్తకవులు అందరూ స్మరణకొస్తారు. కబీరు, బుద్ధుడు, పోతులూరి వీరబ్రహ్మం, దున్న ఇద్దాసు లాంటి వైతాళికులు కళ్లముందు కదలాడుతారు. వారి వారసత్వమంతా పుణికిపుచ్చుకుని పాటను అపురూప దృశ్యకావ్యంగా, ఒక గొప్ప ప్రదర్శనగా, సాంప్రదాయ జీవన లక్షణంగా చూపి మనల్ని కరిగిస్తాడు, కలవరపెడతాడు, ముగ్ధుల్ని చేస్తాడు, మురిపిస్తాడు. జీవితంలోని అనేక పార్శాల్ని తట్టుకుంటూపోతాడు.
గోరటి వెంకన్న పాటల జడివానలో తడిసిముగ్ధులైనవారు కోట్లల్లో. ఏ ప్రాంతం వారైనా వెంకన్న పాటని హత్తుకుంటారు. వెంకన్న పాటల నదిలో దూకి ఈదులాడుతారు. ‘నిర్వికారి యొక్క చిరునవ్వు వెన్నెల’ ‘సెరువు ఊరి సెంద్రవంక’ లాంటి ప్రాకృతిక సౌందర్యంలో పడి కొట్టుకుపోతాం.
‘గాలి పెదవుల తాకి వెదురు గానాలు- నీలిమబ్బుల జూసి నెమలి నాట్యాలు వద్ది మద్దెల మీద వల్లంకి తాళాలు- ఆటపాటల దరువు కడలి తొలి గురువు’ ‘వల్లంకి తాళం’ కవితలో అడవిలో రుతు సంచారం, ప్రకృతి విన్యాసాలు, ఆటలు, పాటలు స్థావర జంగమమంతా శివుని విబూదిలా కనిపించే చిత్రాలను అడవిలో చూపుతాడు, అడవే తొలిగురువు అని చాటింపు వేస్తాడు.
గోరటి వెంకన్నలా పల్లెల్ని, పల్లెల సోయగాల్ని, వాటిలో జీవన తాత్వికతను పట్టుకున్న కవిని మనం చూడగలమా! నల్లతుమ్మలు, ఇసుక తెన్నెలు, గువ్వగూడులు, కానుగ నీడలు, మోదుగు మొగ్గలు, పానాదులు, చెరువులు, చెలుకలు, గునుగుపూలు, నీడలు, మొండిగోడలు, పరుపు బండలు, పైరగాలులు, తీతువు పిట్టలు, తిప్పతీగలు ఈ కవి హృదయంలో చొరబడి పరమాద్భుత కవితా వస్తువులుగా వెలిగిపోతాయి. ఏ ఇతివృత్తాన్ని తీసుకున్నా లోతుగా అన్వేషించుకుంటూ, అద్భుత పదచిత్రాలు అల్లుకుంటూ పోతాడు. మంత్రముగ్ధులు కావడం, నిశ్చేష్టులుగా మారిపోవడం ప్రేక్షకుల వంతవుతుంది. వీరి సత్యాన్వేషణకు, కొనగోటిపై కవితలను అల్లే నైపుణ్యానికి అబ్బురమనిపిస్తుంది.
వెన్నెల మీద ఎన్ని పాటలు రాలేదు, ఎందరు కవులు యుగళగీతాలు రాయలేదు. కానీ, గోరటి వెంకన్న చూసిన తీరు తెలుగు సాహిత్యంలోనే కాదు, ప్రపంచ సాహిత్యంలోనూ మరెవ్వరూ చూడలేదు. ‘ఏటి తెప్పల నీదె పడవల పయనించు బంటి సుక్కల తోడి వెంటబడి కేళించు- నీలంపు మెత్తని నింగి తివాసిపై పసుపు లేత రంగు పరద ముసుగేసుకుని’- అంటూ వెన్నెలను అనేక పదచిత్రాలతో వర్ణిస్తుంటే ప్రబంధ కవులకే ఈర్ష్య కలుగకమానదు. ఏ కవియైనా సరే వర్ణనల సోయగాలకు పరమానందభరితుడు కాక తప్పదు. అంతటితో ఆగక ‘రబయించి శయనించు వెన్నెల- రేయి మలిజాములో నవ్వు వెన్నెల’ అంటాడు.
‘పశువుకొక చింత, కసాయికొక చింత- ధర్మునకొక చింత, కర్మునకొక చింత నాకు నా చింత తనకు తన చింత’ అని అంటుంది అక్క మహాదేవి. అట్లాగే అక్క మహాదేవి బసవేశ్వరుడి అనుభవమంటపంలో చేరి చెన్నమల్లికార్జుణ్ని వలచి చెప్పిన వచనాలను గుర్తుకుతెస్తాడు వెంకన్న. అచల సాంప్రదాయ భక్తకవులను, పాల్కుర్కి సోమనాథుని స్ఫురణకు తెస్తాడు. అవధూత కాశన్న, అచలముని జేజయ్య, హరయోగి చెన్నదాసు, చెంచు మల్లయ్య ఆధ్యాత్మిక గుబాళింపు తన పాటల్లో ప్రవహింపజేస్తాడు.
‘వల్లంకి తాళం’ కవితా సంకలనానికి 2021లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఆలసెంద్రవంక, ఏకునాదంమోత, పూసినపున్నమి, రేల పాటలు వీరి ఇతర రచనలు. ఇవే గాక తెలంగాణ ఉద్యమంలో ఉద్యమ సారథి స్ఫూర్తిని రగిలించే ఎన్నో పాటలు రాశారు. తెలంగాణ వచ్చాక జలవనరులు, అభివృద్ధి ఫలాలు, తెలంగాణ అస్తిత్వం వల్ల ప్రజల భావోద్వేగాలపై ‘రాములోరి సీతమ్మో సీతమ్మోరి రామయ్యో’ అంటూ అద్భుత గేయం రాశారు.
రాష్ట్ర రాజధానిలో బాబా సాహెబ్ అంబేద్కర్ 152 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసినప్పుడు ‘బోధి నీడలో కొలువయిన ఓ ముని- వీధివీధిలో నీ వెలుగే ఆమని’ అంటూ అద్భుతమైన పాట రాసి వారి వ్యక్తిత్వాన్ని, దార్శనికతను పాటలో స్ఫురింపజేశారు. ఈ పాటలు వినకపోతే జీవితంలోని ఒక అద్భుతమైన రాగరంజితమైన పార్శం కోల్పోయే వారమని అనుకునేవారు లక్షల్లో ఉంటారు.
పాట ఎంకన్న హృదయంలో, ఇతరుల హృదయాల్లో గుడి కట్టుకుంటుంది. వీరు సామాజిక తాత్విక, ప్రాకృతిక పాటలే గాక సినీగేయ రచయితగానూ ఎన్నో సినిమాలకు పాటలు రాశారు. కుబుసం (పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల) మొదలుకొని శ్రీరాములయ్య, వేగుచుక్కలు, బతుకమ్మ, బందూక్, మల్లేశం, దొరసాని, షరతులు వర్తిస్తాయి, శీష్మహల్, అన్నదాత సుఖీభవ, మేమ్ ఫేమస్, ఎన్కౌంటర్, ఈసారైనా, నగరం నిద్రపోతున్న వేళ తదితర సినిమాలకు రచయితగా, నటుడిగా తన కళావైదుష్యాన్ని అందించారు.
గోరటి వెంకన్నలో పాట ప్రాణవాయులీనమై తుంది కానీ, కవిత్వంలో కూడా ఎవరు చిత్రిక పట్ట లేని ఇమాజినేషన్స్, నుడికారాలు, భావుకత్వం ఆయన పండిస్తారు. ‘నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు- నా యిచ్చయే గాక నాకేటి వెరపు?.. మాయమయ్యెదను నా మధురగానమున’ అని దేవులపల్లి కృష్ణశాస్త్రి రాసినట్టు… గుర్రం జాషువా పద్య వైదుష్యాన్ని అమితంగా ఇష్టపడే గోరటి వెం కన్న కవిత్వం నిండా ఆకలి మంటలు, అన్నార్థుల దుఃఖాలు, పల్లె విరాట్ చిత్రికలు వినీల నిర్మల కళిందసుతా నవనాట్య సంపదల్ గుభాళిస్తాయి. గుర్రం జాషువా గారన్నట్టు విశ్వనరుడు తెలు గునేల మీద జోల పట్టుకుని తిరిగే కవన బైరాగి గోరటి వెంకన్న.
– (వ్యాసకర్త: ప్రముఖ కవి, చరిత్ర పరిశోధకులు)
డాక్టర్ తుమ్మల దేవరాజ్ 89857 42274