ఆశయాల సాధనల బతుకు పోరులో
గమ్యం నిను చూసి వెక్కిరించినా
చీకటి మేఘాలెన్ని అడ్డొచ్చినా
ప్రకాశించే భానుడివై.. పయోధరములను
చీల్చుకొని వెలుగురవ్వలై దూసుకెళ్లు…
కళ్ళలో కన్నీటి సుడులెన్ని తిరుగుతున్నా
మనసంతా బాధలతో నిండి
మహా సముద్రమై ఉప్పొంగుతున్నా
గుండెలోని నాలుగు పొరలను నావలా మార్చుకొని
మహా దమనులను చట్టువముగా చేసుకొని
జీవిత సాగరంలో తీరం వైపు పరుగెత్తు…
ఓటమి గావుకేకలు చెవిలో శబ్దాలను మోగిస్తున్నా
గడుస్తున్న కాలం సవాల్లెన్నో విసురుతున్నా
కాలానికి కళ్లెం వేసి, నీ దరికి చేర్చుకో
ఓటమి కేకలను, గెలుపు గీతాలుగా మలచుకో
నువ్వో శిల్పివై రాతి గుండెపై
విజయపు అక్షరాలను లిఖించుకో
ఆ పదాలన్నీ వెన్నెల కుసుమాలై కురుస్తాయి
తరతరాల జాతికి ఆదర్శమై నిలుస్తాయి…
తెగి పడుతున్న ఆశల స్వప్నాలను ఒడిసి పట్టుకొని
బాణంలా ఎక్కుపెట్టి లక్ష్యాన్ని ఛేదించు
చేజారిపోయిన ఆశయాల కాలచక్రాన్ని అందుకొని
హృదయ గవాక్షం నిండా నింపుకో
మనసు మల్లెతీగలపై మమకారపు పూలు పూయించు
రెక్కలొచ్చిన పక్షివై ఎగురుతూ
గగనంలోని తారలను ముద్దాడు…
కలను చెదరనీయకు, అడుగును తడబడనీయకు
దుఃఖాన్ని చీల్చుకుంటూ, నిశీధిని రాల్చుకుంటూ
ఎదలో ధైర్యమనే ప్రమిదలను వెలిగించుకుంటూ
విశాలమైన విశ్వంలో వెలుగు పూదోటలు పూయిస్తూ
ఘనమైన చరిత్రను లిఖించుకో
విజయ దరహాసాల చిరునవ్వువై మిగిలిపో…!
అశోక్ గోనె
94413 17361