Kaleswaram Project | జూలై 15న తెలంగాణ ట్రాన్స్‌కోలో చీఫ్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న కె.రఘు, జూలై 16న కేంద్ర జల వనరుల మంత్రి సలహాదారు వెదిరె శ్రీరాం కాళేశ్వరం విచారణ కమిషన్ ముందు పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చినట్టు పత్రికల్లో వార్తలు వచ్చాయి. ఆ వార్తల ప్రకారం.. వారు కమిషన్‌కు కొత్త విషయాలు ఏమీ చెప్పినట్టు కనబడలేదు. 2017 నుంచి జేఏసీ ముసుగులో చేసిన వాదనలే రఘు, రెండు నెలల కింద ఒక తెలుగు దినపత్రికలో రాసిన అంశాలనే వెదిరె శ్రీరాం కమిషన్ ముందు ప్రస్తావించినట్టు అవగతం అవుతున్నది. వారు ప్రధానంగా ప్రస్తావించిన అంశాలు నాలుగు.
వాటిలో 1.తుమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత ఉన్నా.. లేదని కేంద్ర జల సంఘం లేఖ రాసినట్టు తప్పుడు అన్వయం చేసి కాళేశ్వరం ప్రాజెక్టును తెరపైకి తెచ్చారు. 2.తుమ్మిడిహట్టి వద్ద 152 మీటర్ల ఎఫ్ఆర్ఎల్ వద్ద బ్యారేజీ నిర్మిస్తే గ్రావిటీ ద్వారా నీరు ఎల్లంపల్లికి చేరేవి. అయితే 152 మీటర్ల ఎత్తుకు మహారాష్ట్ర ఒప్పుకోవడం లేదన్న కారణం చూపి బ్యారేజీ నిర్మాణస్థలాన్ని మేడిగడ్డకు మార్చారు. దీంతో ఏటా వేల కోట్ల రూపాయలు కరెంటు బిల్లుల రూపంలో రాష్ట్రంపై ఆర్థిక భారాన్ని మోపారు. 3.డీపీఆర్ లేకుండానే ప్రాజెక్టు పనులకు టెండర్లు పిలిచారు. 4.బ్యారేజీల నిర్మాణంలో ప్లానింగ్ లోపాలు, డిజైన్‌లో లోపాలు, నాణ్యతా లోపాలు, నిర్వహణ లోపాలు ఉన్నాయని నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ నిర్ధారించింది.
ఈ అంశాలన్నిటికీ గతంలోనే అనేక సార్లు వివరణలు ఇచ్చినప్పటికీ వారు మళ్లీ మళ్లీ పాత చింతకాయ పచ్చడినే వడ్డిస్తూ ఉన్నారు. పదే పదే అబద్ధాలు ప్రచారం చేస్తే అవే నిజాలై పోతాయన్న గోబెల్స్ సిద్ధాంతాన్ని వారు బలంగా నమ్ముతున్నారని అనుకోవాల్సి వస్తున్నది. వారు ప్రస్తావించిన అంశాలను ఒక్కొక్కటి సంక్షిప్తంగా విశ్లేషిద్దాం. రాసిన విషయాలనే మళ్లీ రాయడం నాకూ విసుగ్గా అనిపిస్తున్నప్పటికీ రాయక తప్పడం లేదు.
తుమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యతకు సంబంధించి కేంద్ర జల సంఘం కాళేశ్వరం ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్‌కు రాసిన లేఖలు రెండున్నాయి. మొదటిది 2015 ఫిబ్రవరి 18న రాసిన లేఖ. రెండవది 2015 మార్చి 4న రాసినది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పంపిన ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టు డీపీఆర్‌ని కేంద్ర జల సంఘంలోని హైడ్రాలజీ డైరెక్టరేట్ వారు పరిశీలించి తుమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యతపై తమ పరిశీలనలను, సూచనలను చేశారు. 2015 ఫిబ్రవరి 18న ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్‌కు కేంద్ర జల సంఘం రాసిన లేఖలోని పేరా 2లో.. ‘నది పర్యావరణ పరిరక్షణ కోసం వదలాల్సిన నీరు పోనూ తుమ్మిడిహట్టి వద్ద నికరంగా లభ్యమయ్యే 160 టీఎంసీల నీటిని ప్రాజెక్టు అవసరాల కోసం వినియోగించే అవకాశం ఉండకపోవచ్చ’ని ఉంది.
ఇకపోతే 2015 మార్చి 4న రాసిన లేఖలోని పేరా 3, Combined Yield Series అనే సబ్ హెడ్డింగ్ కింద పేరా 12లో తుమ్మిడిహట్టి వద్ద 75 శాతం విశ్వసనీయతతో లభ్యమయ్యే నీరు 165 టీఎంసీలని పేర్కొంటూనే, అందులో పై రాష్ర్టాలు భవిష్యత్తులో వాడుకునే 63 టీఎంసీలు కలిసి ఉన్నాయని, ఈ 63 టీఎంసీలు ఇప్పుడు కిందకి వస్తున్నాయని, కానీ భవిష్యత్తులో రాకపోవచ్చని స్పష్టంగా పేర్కొన్నది.
ఈ మాటలు రాస్తూ ప్రాజెక్టు అధికారులకు తుమ్మిడిహట్టి వద్ద తరలించగలిగే నీటి పరిమాణాన్ని పున:పరిశీలించాలని సూచన చేసింది. తుమ్మిడిహట్టి వద్ద లభ్యమయ్యే నీటి పరిమాణం తగ్గిపోతుందన్న సూచన అందులో ఉన్నది. కాబట్టి భవిష్యత్తులో నికరంగా లభ్యమయ్యే నీరు 165- 63 = 102 టీఎంసీలని స్పష్టం అవుతున్నది. ఇందులో పర్యావరణ ప్రవాహాలు 25 శాతం తీసేస్తే మిగిలేవి 80 టీఎంసీలు. ఇది తుమ్మిడిహట్టి బ్యారేజీని 152 మీటర్ల ఎఫ్ఆర్ఎల్ వద్ద నిర్మించినప్పుడు మాత్రమే సాధ్యం అవుతుంది. మహారాష్ట్ర 148 మీటర్ల కంటే ఒక్క ఇంచు ఎక్కువకు కూడా ఒప్పుకొనే ప్రసక్తి లేదని అనేక సందర్భాల్లో ప్రకటించింది. 148 మీటర్ల ఎఫ్ఆర్ఎల్ వద్ద 4 మీటర్ల డ్రైవింగ్ హెడ్ తగ్గిపోతుంది. కనుక గ్రావిటీ కాలువలోకి మళ్లించగలిగే నీటి పరిమాణం మరింత తగ్గుతుందని విశ్లేషిస్తే.. ఇది పచ్చి అబద్దం, తప్పుడు అన్వయమని అంటున్నారు ఈ ఇద్దరు మేధావులు.
ఏపీ ప్రభుత్వం తమతో సంప్రదించకుండా, తమ అంగీకారం లేకుండా ఏకపక్షంగా ప్రాజెక్టు కంట్రోల్ లెవెల్స్, ఇతర సాంకేతిక అంశాలను నిర్ధారించుకొని ముందుకు సాగుతున్నదని, ఈ ఖర్చు అంతా వృథా అవుతుందని అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్.. ఏపీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి ఘాటైన లేఖ రాసిన సంగతి అందరికీ ఎరుకే.
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు మహారాష్ట్ర నుంచి అనుమతి సాధించడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని కమిషన్ ముందు వెదిరె ఆరోపించారు. ఇంతకంటే పచ్చి అబద్ధం మరొకటి ఉండదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాగానే మహారాష్ట్ర ప్రభుత్వంతో ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టు అనుమతుల కోసం కేసీఆర్ సర్కార్ సంప్రదింపులు ప్రారంభించింది. అప్పటికి ఇంకా మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉన్నది. ఆనాటి తెలంగాణ సాగునీటి మంత్రి హరీష్‌రావు ముంబై వెళ్లి మహారాష్ట్ర జల వనరుల మంత్రి ముష్రిఫ్‌ను కలిశారు. ఆయన తమ ప్రభుత్వపు పాత వైఖరినే వెల్లడించారు. అయితే కొద్ది నెలల్లో రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగబోతున్నాయి కనుక ఈ తరుణంలో ఈ అంశంపై ఏ చర్చలకూ ఆస్కారం లేదని, ఎన్నికల తర్వాత ఏర్పడే కొత్త ప్రభుత్వంతో చర్చించాలని నిజాయితీగానే చెప్పారు. చేసేదేమీ లేక ఎన్నికలు ముగిసి, కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యేదాకా వేచి ఉండక తప్పలేదు. మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైంది. అప్పుడు ఆ రాష్ట్రంలో మన తెలంగాణ బిడ్డ చెన్నమనేని విద్యాసాగర్ రావు గవర్నర్‌గా ఉన్నారు.
తొలుత హరీష్‌రావు మహారాష్ట్ర సాగునీటి మంత్రి గిరీష్ మహాజన్‌తో చర్చించడానికి ముంబై, నాగ్‌పూర్‌కు వెళ్లారు. ఆయనతో పాటు నేనూ వెళ్లాను. తుమ్మిడిహట్టి బ్యారేజీ ఎఫ్‌ఆర్‌ఎల్‌పై మహారాష్ట్రను ఒప్పించే ప్రయత్నం చేశారు. అయితే.. ‘ఇది నా స్థాయిలో తీసుకునే నిర్ణయం కాదు, ముఖ్యమంత్రుల స్థాయిలో జరగాల్సిన నిర్ణయం’ అని గిరీష్ మహాజన్ సెలవిచ్చారు. అదే సమయంలో తెలంగాణ సాగునీటి సలహాదారు దివంగత ఆర్.విద్యాసాగర్ రావు కూడా ఇంజినీర్ల స్థాయిలో ఈ అంశంపై విస్తృతంగా చర్చించారు.
ఈ చర్చల్లో కూడా వారు తమ పాత వైఖరిని సడలించలేదు. 2015 ఫిబ్రవరి 17న కేసీఆర్ తన పుట్టిన రోజు వేడుకలను కూడా వదిలేసి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌తో చర్చలకు ముంబై వెళ్లారు. ఆ సమావేశం గవర్నర్ నివాసంలో ఆయన సమక్షంలోనే జరిగింది. ఆ సమావేశంలో పాల్గొనడానికి కూడా మంత్రి హరీష్‌రావుతో పాటు నేను కూడా వెళ్లాను. తుమ్మిడిహట్టి వద్ద 152 మీటర్ల ఎఫ్ఆర్ఎల్ వద్ద బ్యారేజీ నిర్మాణానికి ఆమోదం తెలపాలని కేసీఆర్ అభ్యర్థించారు. ముంపునకు గురవుతున్న భూములకు మహారాష్ట్ర నిర్ధారించిన పరిహారాన్ని చెల్లిస్తామని అన్నారు.
జవాబుగా ఫడ్నవీస్ స్పష్టంగా అన్నమాట ఏమిటంటే.. ‘కేంద్రంలో కాంగ్రెస్, మహారాష్ట్రలో కాంగ్రెస్, ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే మహారాష్ట్ర ప్రభుత్వం 152 మీటర్ల ఎత్తుకు బ్యారేజీ నిర్మాణానికి అనుమతించలేదు. ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఉద్యమించి అరెస్ట్ అయిన నేను అనుమతి ఎట్లా ఇస్తాను? బ్యారేజీ ఎత్తును 4 మీటర్లు తగ్గించి, 148 మీటర్ల వద్ద కట్టుకోండి. గోదావరి అవార్డు ప్రకారం మీరు ఎన్ని నీళ్లు తీసుకుపోయినా మాకు అభ్యంతరం లేదు’ అని.
నాటి మహారాష్ట్ర గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్‌రావు సమక్షంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నమాటలు ఇవి. ఇక వారితో సంప్రదింపులు అంటే కాలయాపన తప్ప మరేమీ ఉండదని కేసీఆర్ నిర్ధారణకు వచ్చారు. చర్చలు విఫలమైంది తెలంగాణ ప్రభుత్వ ప్రయత్న లోపం వల్ల కాదు, మహారాష్ట్ర ప్రభుత్వ మొండి వైఖరి వల్లనే. మహారాష్ట్ర సర్కార్ వైఖరి వల్లే చర్చలు ముందుకు సాగలేదు. అనంతరం 2015 మార్చి 4న తుమ్మిడిహట్టి వద్ద భవిష్యత్తులో నీటి లభ్యత అనుమానాస్పదమేనని కేంద్ర జల సంఘం లేఖ రాసిన తర్వాత ఇక మహారాష్ట్రతో ఎఫ్ఆర్ఎల్, ముంపు పంచాయతీ పరిష్కారమైనా ప్రాజెక్టు సాఫల్యతకు అవసరమైన నీటి లభ్యతనే ప్రశ్నార్థకం అయినప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి? ప్రాజెక్టు సాఫల్యత కోసం ప్రత్యామ్నాయం వెదకాల్సి వచ్చింది.
ఆ వెదుకులాటలో దొరికిందే మేడిగడ్డ. ఇది 1990వ దశకంలో గోదావరి జలాల వినియోగంపై ప్రముఖ ఇంజినీర్, ఐక్యరాజ్య సమితి సలహాదారు దివంగత టి.హనుమంతరావు స్టెప్ ల్యాడర్ టెక్నాలజీలో భాగంగా ప్రతిపాదించిన ఏడు వరుస బ్యారేజీల్లో ఒకటైన సూరారం బ్యారేజీ స్థలమే. 152 మీటర్ల వద్ద తుమ్మిడిహట్టి బ్యారేజీని తీవ్రంగా వ్యతిరేకించిన ఫడ్నవీస్ ప్రభుత్వం ప్రాజెక్టును రీ- ఇంజినీరింగ్ చేసిన తర్వాత సానుకూలంగా స్పందించింది. రెండు రాష్ర్టాల మధ్య చరిత్రాత్మకమైన ఒప్పందంపై సంతకాలు కూడా చేసింది దేవేంద్ర ఫడ్నవీస్ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం.
ప్రాజెక్టు సాఫల్యతకు తుమ్మిడిహట్టి వద్ద భవిష్యత్తులో నికర జలాలు లభ్యం కావని చెప్పిన కేంద్ర జల సంఘం, మేడిగడ్డ వద్ద 284 టీఎంసీల నికర జలాలు ఉన్నాయని చెప్పింది. మేడిగడ్డ స్థలం ఎంపిక నీటి లభ్యత దృష్ట్యా సరైనదేనని కేంద్ర జల సంఘం ధ్రువీకరించింది. నాగార్జునసాగర్ నిర్మించినప్పుడు ఎగువన ప్రాజెక్టులు లేవు కాబట్టి, నీరు ధారాళంగా ప్రాజెక్టుకు చేరుకునేవి. కర్ణాటక తమ వాటా వినియోగం కోసం ఆల్మట్టి, నారాయణపూర్ డ్యాంలను, మరికొన్ని బ్యారేజీలను నిర్మించడంతో నాగార్జునసాగర్‌కు నీటి ప్రవాహాలు గణనీయంగా తగ్గిపోయాయి.
శ్రీరాంసాగర్ పరిస్థితి కూడా అదే. కాబట్టి భవిష్యత్తులో తుమ్మిడిహట్టికి అదే గతి పట్టబోతున్నదన్న హెచ్చరిక కేంద్ర జల సంఘం రాసిన లేఖలో ఉన్నది. ఆ హెచ్చరికను అన్వయించుకోవడం ఈ ఇద్దరు మేధావులకు తప్పుగా కనబడుతున్నది. కేంద్ర జల సంఘం రాసిన లేఖలు రహస్య పత్రాలు కావు. 2018లోనే తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం ప్రచురించిన ‘తెలంగాణ జీవధార కాళేశ్వరం ప్రాజెక్టు’ అనే పుస్తకంలో అనుబంధంగా చేర్చారు. ప్రజలందరూ వాటిని చదివారు. అయినా పాత చింతకాయ పచ్చడినే వీరు మళ్లీ మళ్లీ వడ్డించడమంటే తెలంగాణ ప్రజల విజ్ఞతను పరిహసించే సాహసం చేస్తున్నారనే అనుకోవాలి.
(ఇంకా ఉంది)
– (వ్యాసకర్త: తెలంగాణ జల వనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్)
– వి.ప్రకాష్