హర్యానా, మహారాష్ట్ర,ఢిల్లీ రాష్ర్టాల్లో అధికారాన్ని చేజిక్కించుకున్న బీజేపీ ఈ ఏడాది పూర్వార్ధంలోపే జరుగనున్న ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలపై కన్నువేసింది. అసోంలో సొంతంగా, పుదుచ్చేరి సంకీర్ణంగా బీజేపీ అధికారంలో ఉన్నది. అయితే, తమిళనాడు, కేరళలో బీజేపీ గెలుపు సమీప భవిష్యత్తులో సాధ్యమయ్యే పరిస్థితులు లేవు. ఇక గంపెడాశలు పెట్టుకున్న బెంగాల్ ఎన్నికల్లో విజయం సాధించి ఉత్తర ఈశాన్య భారతం మీద సంపూర్ణంగా పట్టు బిగించాలని సర్వశక్తులను ఒడ్డుతున్నది. మరోవైపు గత 15 ఏండ్లుగా వరుస విజయాలు సాధిస్తున్న తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ అస్త్రశస్ర్త్ర్తాలు సమకూర్చుకొని ‘సై’ అంటూ సమరభేరి మోగిస్తున్నారు. ప్రాంతీయ అస్తిత్వానికి, కేంద్ర ఆధిపత్య విధానానికి మధ్య నువ్వా నేనా? అన్నట్టు జరుగనున్న రాజకీయ సమరానికి వంగభూమి వేదిక కానున్నది.
మన దేశ ఉత్తర, ఈశాన్య రాష్ర్టాలకు మధ్య వారధిగా ఉన్న బెంగాల్ రాష్ట్రం.. దేశ రక్షణ పరంగా కూడా అత్యంత కీలకమైనది. 2,217 కిలోమీటర్ల పొడవు, ఆరు జిల్లాలు, 46 అసెంబ్లీ నియోజకవర్గాలు గల బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతం ఉన్నది. ఉత్తరాన కేవలం 130 కిలోమీటర్ల దూరంలో చైనా నిర్మాణాలు చేపడుతున్న చుంబిలోయ, ఆ పక్కనే భూటాన్ దేశం, పడమర నేపాల్, తూర్పున బంగ్లాదేశ్, మధ్యలో కేవలం 22 కి.మీ కుంచించుకుపోయి చికెన్ నెక్‌గా పిలుస్తున్న భారత భూభాగం ఉన్నాయి. మరోవైపు వాతావరణ భౌగోళిక ప్రతికూల పరిస్థితులు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతమంతా నిరంతరం నిఘా, భద్రతలో ఉంటుంది. వామపక్ష తీవ్రవాదం, ప్రత్యేక గూర్ఖాలాండ్ ఉద్యమం బంగ్లాదేశీయులు, బర్మా రోహింగ్యాల చొరబాట్లు, వంటి వరుస సమస్యలు దీర్ఘకాలంగా బెంగాల్‌ను కుదిపేస్తున్నాయి. మరోవైపు బంగ్లాదేశ్‌లో కొత్తగా కొలువుతీరిన మహ్మద్ యూనస్ ప్రభుత్వం భారత్ పట్ల శత్రువైఖరి ఆవలంబిస్తూ పాకిస్థాన్‌తో కలిసి నడుస్తున్నది. ఈ రెండు దేశాలు రాజేస్తున్న భారత వ్యతిరేక విద్వేషానలం ప్రపంచ టీ 20 క్రికెట్ పోటీలదాకా ప్రసరించింది. ఈ సంక్షోభ సందర్భంలో జరుగుతున్న బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర సమస్యల కంటే దేశ సమస్యలే ప్రధానంగా చర్చకు ఎన్నికల సమరం వేళ వస్తున్నాయి.
దేశ రాజధాని నుండి ఈశాన్య రాష్ర్టాల వరకు బీజేపీ నిర్మిస్తున్న రాజకీయాధికార రహదారికి బెంగాల్ ఒక్కటే అడ్డంకిగా మారింది. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న కొన్ని ఇతర రాష్ర్టాల్లో మాదిరిగా పొత్తు కుదుర్చుకొని పాగా వేద్దామనుకుంటున్న బీజేపీ పప్పులు బెంగాల్లో ఉడకడం లేదు. బీజేపీ అంటేనే భగ్గుమనే మమత..మోదీ ప్రయోగిస్తున్న సామ, దాన, భేద, దండోపాయాలకు చిక్కడం లేదు.
గత ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన సువేందు అధికారి, మిహిర్ గోస్వామి వంటి దిగ్గజ నేతలను చేర్చుకొని బీజేపీ కొంత లబ్ధి పొందినప్పటికీ అవేవీ మమత జైత్రయాత్రను అడ్డుకోలేకపోయాయి. జగదీప్ ధన్కడ్ వంటి కరడుగట్టిన సంఘ్ పరివార్ నేతను బెంగాల్ గవర్నర్‌గా నియమించి అనునిత్యం సతాయించినా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఏ మాత్రం తలొగ్గలేదు. అంతేకాకుండా కేంద్రంపై ఒంటరి పోరాటం కొనసాగించారు.
పార్టీల బలాబలాలు జయాపజయాల విషయానికొస్తే 2011 నుండి మమతా బెనర్జీదే పైచేయి. చుట్టూ బీజేపీ, కాంగ్రెస్, కమ్యూనిస్టులు మోహరించినా బెంగాల్ ప్రజలు మమతకు పట్టం కడుతున్నారు. యువజన కాంగ్రెస్ కార్యకర్తగా రాజకీయం ప్రస్థానం ప్రారంభించిన విద్యాధికురాలు మమత 29 ఏండ్ల ప్రాయంలోనే 1984 లోక్‌సభ ఎన్నికల్లో కమ్యూనిస్టు దిగ్గజం సోమనాథ్ చటర్జీని ఓడించి సంచలనం సృష్టించారు. 1998లో కాంగ్రెస్‌ను వీడి సొంతంగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేశారు. ఏడుసార్లు లోక్‌సభ సభ్యురాలుగా, నాలుగుసార్లు కేంద్ర మంత్రిగా పనిచేసిన మమత.. బెంగాల్లో 34 ఏండ్ల సుదీర్ఘ కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని 2011 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించి అనితర సాధ్యమైన సంచలనం సృష్టించారు. 294 స్థానాలున్న బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ వరుసగా మూడుసార్లు 184 (2011), 211 (2016), 215 (2021) భారీ ఆధిక్యంతో హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేయడం విశేషం.
బీజేపీ పూర్వరూపమైన భారతీయ జనసంఘ్‌ను 1951లో స్థాపించిన శ్యామాప్రసాద్ ముఖర్జీ బెంగాల్‌కు చెందిన వాడే అయినా ఆ రాష్ట్రంలో తొలుత జనసంఘ్ కానీ, ఆ తర్వాత పేరు మార్చుకొని 1980లో ఏర్పడ్డ బీజేపీ కానీ అసెంబ్లీలో 65 ఏండ్ల పాటు సున్నా లేదా ఒకటో రెండో సీట్ల ప్రాతినిధ్యానికే పరిమితమయ్యాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బెంగాల్‌లోని 42 సీట్లకు గాను బీజేపీ 18 స్థానాలు గెలిచి తొలిసారిగా గణనీయ విజయం సాధించింది. అంతకుముందు 2016 అసెంబ్లీ ఎన్నికల్లో మూడు సీట్లకే పరిమితమైన బీజేపీ ఆ లోక్‌సభ ఎన్నికల్లో 121 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆధిక్యత సాధించింది. అదే జోరులో 2021 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుపై ఆశలు పెట్టుకున్న ఆ పార్టీ కేవలం 77 సీట్లకే పరిమితమైంది. 2011లో లెఫ్ట్ ఫ్రంట్ అధికారం కోల్పోయాక ఐదేండ్లపాటు రెండు ప్రధాన జాతీయ పార్టీలకు తృణమూల్ కాంగ్రెస్ తురుపు ముక్క. కానీ ఈ పదేండ్లలో కొరకరాని కొయ్యగా మారింది. గత లోక్‌సభ ఎన్నికల్లో ఆరు సీట్లు తగ్గి 12కే పరిమితమైన బీజేపీ అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా 90 చోట్ల మాత్రమే ఆధిక్యత కనపరిచింది. తృణమూల్ కాంగ్రెస్ 192 చోట్ల పైచేయి సాధించింది.
పొత్తులతో పోటీ చేసిన జాతీయ పార్టీలు కాంగ్రెస్, సీపీఐఎం, సీపీఐ పరిస్థితి ఇండిపెండెంట్ లకన్నా అధ్వానంగా తయారైంది. మధ్యలో రెండేండ్ల్లు మినహాయిస్తే స్వాతంత్య్రం వచ్చినది మొదలుకొని, 1977 వరకు బెంగాల్లో కాంగ్రెస్‌దే హవా. ఆ తర్వాత పీఠం ఎక్కి 34 ఏండ్లు వరుసగా పరిపాలించిన లెఫ్ట్ పార్టీలకు ఎదురేలేదు. ఏడాదిన్నర క్రితం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క సీటును గెలిచినా రాష్ట్రవ్యాప్తంగా కేవలం 11 సెగ్మెంట్లలోనే ఆధిక్యంలో ఉన్నది. సీపీఐఎం ఆధిక్యం ఒక్కచోట మాత్రమే. దాదాపు 60 ఏండ్లకు పైగా బెంగాల్‌ను పరిపాలించిన ఈ జాతీయ పార్టీలు ఒక్కటై జట్టు కట్టినా అసెంబ్లీలో అదృశ్యమైపోవడం గమనార్హం. దశాబ్ద కాలంగా కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు బలం కోల్పోతున్నాయని అనడానికి ఎన్నికల ఫలితాలే నిదర్శనం. బెంగాల్లో కాంగ్రెస్, కమ్యూనిస్టుల ఓటర్లు బీజేపీ వైపు మోహరించినా మమత బలం మాత్రం చెక్కు చెదరకుండా యథాతథంగా కొనసాగుతున్నది. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ.. కేంద్ర ప్రభుత్వ అధికారం అండతో.. తృణమూల్ కాంగ్రెస్‌తో వచ్చే ఎన్నికల్లో తలపడుతున్నది. మోదీ విధానాలకు వ్యతిరేకంగా బలంగా గొంతు వినిపిస్తున్న వారిలో మమతా బెనర్జీ ముందు వరుసలో ఉన్నారు. ఇక వెల్లడవుతున్న సర్వేలు చెప్పిందే నిజమై, అసెంబ్లీ ఎన్నికల్లో మమత పార్టీ విజయ కేతనం ఎగురవేస్తే దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పులు సంభవించే అవకాశం ఉన్నది. బెంగాల్ ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఆ ఫలితాలు దేశ రాజకీయ పరిణామాలను ప్రభావితం చేస్తాయనేదితెలియాలంటే కొంతకాలం వేచిచూడాలి.డా.
-అయాచితం శ్రీధర్
9849893238